Tuesday, December 30, 2008

మరణవాంగ్మూలం

ఆకాశం భూమీ కలిసే పూట శబరీ గోదారీ కలిసేచోట
సంజెరంగుల్లో కమ్ముకున్న
విషాదపు జీర
చరమాంకంలో ఒకానొక గ్రామం
ఆ పక్కన
శిధిలమైన కొయ్య పడవ
కన్నతల్లి ముందు మోకరిల్లి
మరణవాంగ్మూలం వింటున్నాను
నది అలలపై ప్రతిబింబం
తలారి ముఖంలోని గాంభీర్యం
దూరాన
టూరింగ్ టాకీస్ నుంచి
ఆఖరి సన్నివేశపు ఆవేదన
ఇచ్చోటనే
కొంచెం ఇప్పసారా
కొద్దిగా కొమ్ముబూరా
ఇచ్చోటనే
చలువ పందిళ్లు
పొగాకు బేళ్లు
ఇచ్చోటనే
గలగల ఘల్లుమన్న
రేలారేలా పరవళ్లు
మరియూ ఇచ్చోటనే కదా
ఏడేడు తరాలు
ఎనకటెనకటి పాటలు
అనాది రాగాలు
ఆది పురాణాలు
విల్లంబులు ఎద్దుకొమ్ములు
తునికి చుట్ట పరిమళాల
గుప్పుగుప్పు గాలి గిరికీలు
తరతరాల పాదముద్రలు
హృదయాలు శిలాజాలు
పాయం బొజ్జిగాడు
లాస్ట్ ఆఫ్ ది కోయాస్
పెరిగి పెద్దయి
అలెక్స్ హేలీ అవుతాడా
ఆనకట్ట వెనుక ఆశ్రు జలధిలో
సీతమ్మ ముక్కుపుడక
వెతుకుతాడా
లేక అంతర్ధానపు అంచున వేలాడి
రామా పితికస్ వలె
ఆంత్రోపాలజీ పాఠమవుతాడా
పురాతన జనసమాధి
జన సంస్క­ృతి జల సమాధి
చెరిపేసిన పాటలు
మునిగిపోయిన మానవుని జాడలు
ఊరి మధ్య రావిచెట్టుకు
అమాయకంగా వేలాడుతున్న
కబోది పక్షులు
చివరకు మిగిలినది
ఛాతీ మీద చల్లుకున్న
పిడికెడు నల్లరేగడి
రామయ తండ్రీ
నీ అరణ్యాన్ని
ఆవాసాన్ని ఆవరణాన్ని
లేడి పిల్లల్నీ అడవి బిడ్డల్నీ
నీ పాదాలు ముద్దాడే పాపికొండల్నీ
రేపోమాపో
రెవెన్యూ రికార్డుల నుంచి తొలగిస్తారు
రామా
ఇలా రా
నా పక్కన కూర్చో
నాతో కలిసి
ఈ మట్టి మరణవాంగ్మూలం విను
దమ్మక్క పెడుతున్న శాపనార్ధాలు విను
వినరా విను!
సీలేరు ఒడ్డున విరుగుతున్న విల్లు
ఫెట ఫెటేల్ ధ్వానాల్ విను!
వినరా విను!

- అరుణ్‌సాగర్

ఆంధ్రజ్యోతి నుండి..
.

No comments: