నీ విజన్ గ్రేట్
హైద్రాబాద్ చుట్టూ అల్లుకున్న నీ అభిమానం గ్రేట్
మరి ఇప్పుడు నీ విదేశీగానంలో ఎన్ని గణాంకాలో
హైద్రాబాద్ అదబ్‌నీ
ఆత్మీయ హస్తాన్నీ అందుకోలేకపోయావ్
ఈ రంగుల గుల్‌దస్తాలో యిమడలేకపోయావ్
బాగె ఆమ్ పూలవనంలో పురుగులు చొరబడ్డాయా?
ఇక్కడి ఆబెహవాలో ఇంత కాలుష్యమెప్పుడూ లేదు
విశ్వాసం నిండిన యిక్కడి గాలిలో
విదేశీ బక్వాస్ నింపకు
అమ్మపాలు అమృతమౌతాయని తెలుసు
విషమై ద్వేషమై కుదరనిరోగమౌతుందని ఎవరికి తెలుసు?
ద్వేషం నాష్తా అయిన వాడికి
దోస్తానా రుచి ఏం తెలుసు
ఇక్కడి ఒక్క ఇరానీచాయ్ చుట్టూ
ఎన్ని స్నేహ సౌరభాలు
ఒక్క బిర్యానీ మనసునిండా
ఎంత బిరాదరీ ఘుమఘుమలు
ఆకాశం గుండెలు తాకే ఖవ్వాలీ
లుకమనీయ కవితా సాయంత్రాలూ..
షామె గజల్లూ.. భజనలూ
భాయీచారాలూ..
వేదనలు వైరుధ్యాలెన్నున్నా
అనుబంధాల నగరం హైద్రాబాద్
రంగుల హరివిల్లు యీ యిల్లు
మక్దూమ్ మల్లెపందిరి కింద
మంట పెట్టేవాడికి
మనసు మమకారాల
మాటేమి తెలుసు?
ఇక్కడి జీవధారలు
తరలించుకు పోయిన పైరేట్లెవ్వరు?
సహజ సంపన్న తెలంగాణ తల్లిని
చింపిరి గుడ్డల్లో నిలిపిన
వంచనా శిల్పులెవరు?
ప్రాణాన్ని మించిన
ఆమె అభిమానాన్ని అవహేళన చేసిందెవ్వరు?
నీవు తిన్నింటి వాసాలు లెక్కపెట్టవు
తగల బెడతావుద్వేషమే మాకు విదేశీయం
దోపిడీ యిక్కడ బహిషారం
ఇంకా కమర్షియల్ కాంప్లెక్స్‌ల కాళ్ల కింద నలగని
ఈ గరీబ్ గల్లీల్లో గలత్ నడకలు నడవకు..
గందగీ నింపకు
దోస్తానా దారుల్లో వేర్పాటు ముళ్ల కంచెలు నాటకు
మనసున్న నగరమిది
మొహబ్బత్‌కి దునియాఁ యిది
ఇక్కడి చౌరస్తాలో నిలబడి ధృతరాష్ట్రుని చేతులు చాచకు
నువ్వెన్ని గొళ్ళాలు పెట్టినా
ఖులాదిల్ కా దర్వాజా మాది
ఆమ్ ఆద్మీ ఆత్మీయ సౌందర్యం హైద్రాబాద్
వేదనలు వైరుధ్యాలెన్నున్నా
వైవిధ్యాల హరివిల్లు యీ యిల్లు
ఇంత అందమైన ఆత్మీయ నగరంలో
అభివృద్ధికి అందని అన్‌టచెబుల్స్ ఎందరో
ఈ కూడళ్ళు ఆకలికళ్ళ నెగళ్ళు
చాచిన హస్తాలు యిక్కడి రస్తాలు
మూసీనది తీరం బురదలో కూరుకుపోతున్న బతుకులు
రాత్రుళ్ళు యీ నగరం ఫుట్‌పాత్‌ల మీద
ఆకలి ఆరేసిన అస్థిపంజరాలు
బడుగుల ప్రత్యేక బలివితర్దులు ఎన్నెన్నో భోలక్‌పూర్‌లు
బడుగు బతుకుల యీ బడబాగ్ని కడుపులో దాచుకుని
బంజారా గుదిబండను మోస్తున్న అమ్మ హైద్రాబాద్
అందరి ఆషియానా హైద్రాబాద్
అయ్యా! మళ్ళీ చెపుతున్నా
మఖ్దూమ్ చల్లని మల్లె పందిరికింద మంట పెట్టకు
తెలంగాణా తగ్దీర్‌తో ఆడుకోకు
తెలంగాణా కోపాన్ని తట్టి లేపకు
ఈ రతనాల వీణ తీగలు తెంచకు
రక్తగీతమై అంతా రాజుకొంటుంది
ఇక్కడ యీ బోనాల వీధుల్లో..
ఈద్ ముబారక్ ఇఫ్తార్ విందుల్లో
భోలాల, దిల్ వాలాల మనసుల్లో
వేరు బంధాల బీజాలు నాటకు
తెలంగాణా తెరువుకు రాకు
ఇక్కడి బతుకుల తెర్లు చేయకు
అన్నీ అమ్ముకొని సొమ్ము చేసుకునే వాడు
అమ్మను కూడా నమ్మడు కదా
అవును - తెలంగాణ తెర్లయింది
దొంగలు పడ్డ యిల్లయింది
తెలంగాణావాడు - నీకు దివానాగాడు
చీల్చడమే తప్ప కూర్చడం రాదు కొందరికి
హైద్రాబాద్ అందమంతా
ఆమ్‌ఆద్మీ ఆత్మీయతలో ఉంది
నీ నవ్వుల షార్ప్ వెపన్‌తో
అనుబంధాల అంతస్సూత్రాలు తెంచకు
హైద్రాబాద్ నీకు అతిపెద్ద ఆర్ధిక మండలి కదా
నీవేమైనా కొనగల వేమో కాని
తెలంగాణకి వెల కట్టలేవు
అబద్ధాల మీద ఆయుధాల మీద బతికేవాడు
అమెరికా వాడైనా అనంతపురం మనిఫైనా
మనిషి రక్తం రుచి మరిగిన వాడే కదా
విదేశీయం ఆహా!
ఇది ఎన్నికల ఎత్తుగడ అని లైట్‌గా తోసేయకు
నీ మనసు కక్కిన నిజమిది
నీ నరాల్లో పారే నైజమిది
ఆదాబ్ హైద్రాబాద్
అనురాగాల హైద్రాబాద్
వేదనలు వైరుధ్యాలెన్నున్నా
అనుబంధాల నగరం హైద్రాబాద్
-ఆంధ్రజ్యోతి సౌజన్యంతో
1 comment:
అద్భుతమైన కవిత. పవర్ ఫుల్ ఎక్స్ ప్రె షన్.
కదిలేలా కదిలించేలా గుండెల్ని మందిన్చేలా వుంది.
ఈ కవితను నేను ఆంధ్ర జ్యోతిలో చూసినప్పుడే పదిలపరచు కున్నాను.
మీరు కవితను యదాతధంగా మీ బ్లాగులో పెట్టడం కాకుండా మీ స్పందనను కూడా జోడించి వుంటే ఇంకా బాగుండేది.
Post a Comment