Wednesday, October 01, 2008

ముంబాయి హైదరాబాదులకు పోలికా..? -నవీన్ ఆచారి


29 సెప్టెంబరు 2008 నాటి వార్త దినపత్రిక సంపాదక పేజీ లోని తుర్లపాటి కుటుంబరావు గారి వ్యాసానికి స్పందనగా ఇది రాస్తున్నాను. ముంబయి లో జరుగుతున్న సంఘటనల్ని ఏకరువు పెట్టిన రచయిత హైదరాబాదు ను దానితో పోల్చే ప్రయత్నం చేశారు. (వారి వ్యాసాన్ని ఇక్కడ జతపరుస్తున్నాను.)

రెండొదశ తెలంగాణ ఉద్యమం మొదలైన దగ్గర్నించి లక్షలాది మందితో సభలు సమావేశాలు హైదరాబాదులో అనేకం జరిగాయి. ఐతే వీటిలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. నిజంగా తెలంగాణ ఉద్యమానికి ముంబయి లో జరిగేదానికి పోలికలు ఉండి ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. సినీ హీరోల అభిమానులే రోడ్ల మీద భాహాభాహికి దిగుతున్న సందర్భాలున్నాయి. ఓక ప్రభంజనం లాంటి ఉద్యమాల్లో కూడా ఈ ఎనిమిదేళ్లలో ఎక్కడా కనీసం ఒక చిన్న హింసాత్మక సంఘటన ఐనా జరుగక పోవడం నిజంగా తెలంగాణ ఉద్యమం ఎంత బలమైన సామజిక, రాజకీయ, ఆర్థిక కారణాలతో ఏర్పడ్డదో తెలియజేస్తుంది. హైదరాబాదులో తెలంగాణ ప్రజలు మాత్రమే ఉండాలని తెలంగాణ ఉద్యమం చెప్పలేదు. తెలంగాణ ఉద్యమకార్యకర్తల ఉద్దేశ్యం కూడా ఇది కాదు. ఎంతో మంది సమైక్యవాదులు, ఆంధ్రా ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలు హైదరాభాదు లో ఉన్నప్పటికీ వారిపట్ల ఎప్పుడూ ఎవరూ అమర్యాదగా ప్రవర్తించకపోవడాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. లక్షలాది మంది ఆంధ్రా సోదరులు తెలంగాణ ప్రాంతం లో తెలంగాణ వారితో కలిసిమెలిసి ఉంటున్నారు. ఎప్పుడూ ఎక్కడైనా ఎవరిపైనైనా దాడులు గానీ జరగలేదే. లగడపాటి వంటి ప్రజాప్రథినిది పదే పదే దమ్ముంటే రండి అని సవాళ్లు మానుకుని విషయాన్ని పరిష్కారం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యాలే కాని సవాళ్లతోనే సమధానాలు దొరుకుతాయనుకున్నాడు కాబట్టే ఇటు తెరాస వారు కూడా అంతే దీటుగా స్పందించారు. ఈ చాలెంజ్ లను మొదలు పెట్టింది లగడపాటి రాజగోపాల్ గారేనన్నది ఎవరికీ తెలియనిది కాదు. తాను నిజామాబాదులోనే ఉన్నా దమ్ముంటే రమ్మన్న లగడపాటిని హైదరాబాదు లో అడుగుపెట్టనివ్వమన్నారు తెరాస వారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణమం కానప్పటికి సహజమైన ప్రతిస్పందనే.

నిజామాబాద్ సంఘటన హైదరాబాదు కు చేరడం కొత్తేమి కాదు. ఇలా రాష్ట్రం లో జరిగిన సంఘటనలు రాజధానికి చేరిన సంధర్బాలు కోకొల్లలు. మొదటి ఎస్సార్సీ సమైక్య రాష్ట్రానికి అనుకూలం అని తప్పుడు ప్రచారంచేసే లగడపాటి ని గాంధేయవాది అనడాన్ని కుటుంబరావుగారు పునరాలోచించాలి.

నిజామాబాదు లో ఎంపీ కారు తెలంగాణ ఉద్యమకారుల పైకి దుసుకువెళ్లిందని ఆనాటి కొన్ని పేపర్లలో వచ్చింది. కొన్ని పేపర్లలో దానికి దగ్గరగా ఉన్న ఫొటో లు కూడా ప్రచురించబడ్డాయి. ఐతే కొన్ని పత్రికలను మినహాయిస్తే చాలా వరకు మీడియా ఏదినిజం అన్నదాని పట్ల మౌనంగానే ఉంది. లగడపాటి కారు తనది కాదు అంటున్నాడు. అది లగడపాటి కారే అంటున్నాడు గాయపడ్డ చిన్నారెడ్డి. ఐతే ఎవరిని నమ్మాలి అన్న విషయం పక్కనపెడితే అది లగడపాటి వాహనం కాదు అని ఏ ఒక్క పత్రిక కూడా రాయకపోవడం గమనార్హం. కుటుంబరావు గారు చెపినట్టు ఆ సంఘటన జరుగగానే పోలీసులు కేసుపెట్టి సదరు డ్రైవర్ని అరెస్టుచేసి ఉంటే విషయం ఇక్కడివరకూ వచ్చేదీ కాదు. అది లగడపాటి కారు కాకపోతే కాన్వాయ్ లోని ఏ వాహనమో పోలీసులు చెప్పాలికాదా. ఎందుకు చెప్పరు. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ పోలీసులున్నారు. ఇదంతా రహస్యం కాదు. టీవీల్లో మనం ప్రత్యక్షంగా చూశాం. పోలీసుల మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలో విజ్ఞులైన ప్రజలకు తెలుసు.

ఇదంతా టీవీల ద్వారా చూసిన లక్షలాదిమందిలో ఓ పది పదిహేను మంది యువకులు ల్యాంకో ఆఫీసు అద్దాలు పగులగొట్టారు. ఇది అవాంఛనీయమే. దాంట్లొ సంశయం లేదు. ఐతే దాని నేపథ్యాన్ని, దానికి దారితీసిన సంఘటనలను మరిచి కేవలం ఈ ఘటననే భూతద్దం లోంచి చూడడం సరి కాదు. నిజామాబాదు లో మొహం చాటేసిన పోలీసులు హైదరాబదులో ల్యాంకో అద్దలు పగిలితే మాత్రం ఆఘమేఘాల మీద కదిలి వచ్చారు. ఎవరూ తప్పించుకోలేరని, అరెస్ట్ చేస్తామని మీడియా ముందు ప్రకటించి చెప్పినట్టుగానే ల్యాంకో అద్దాలు పగులగొట్టిన వారిపై హత్యాయత్నం కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఐతే దీనికి మూల కారణమైన నిజామాబాదు లో మాత్రం ఎలాంటి డ్రైవరును అరెస్టు చేయలేదు. వాహనం సీజూ కాలేదు. హైదరాబాదు లో ల్యాంకో పై దాడిని అడ్డుకోవడం లో విఫలమయ్యారని సంబందిత పోలీసు అధికారిని బదిలీ చేయడం ఈ సంఘటనకో కొసమెరుపు. ఇదండీ ప్రజాస్వామ్యం.

No comments: