పొద్దుగాల్నే మా కడుప దొక్కినవ్ బిడ్డా
నీ కడుపు సల్లంగుండ
ఒక్క ఘడియ మా బత్కుల్ని సూత్తెనే
కండ్లల్ల నీల్లు పెట్టుకుంటివి
అరువైయేండ్ల గోస ఎట్టుంటదో ఎర్కైందా బిడ్డా
కడుపు కాలెటోళ్ల కతలన్ని ఒక్కటే నాయినా..
మాది జర్రంత ఎక్కువ బిడ్డా !
వచ్చెటోడు.. పోయెటోడు
నిక్కినోడు.. నీల్గినోడు
బద్మాష్ బడివెగాండ్లదే రాజ్జెమైపాయె..
ఇగురాలు తెల్వంగనే తెల్లారదు బిడ్డా..
ఇమానంగ పని చేస్తనని ఒట్టేయాలె
అవమానాలు.. పరాసికాలకు మా గడ్డ
పతా అయినందుకేమో నాయినా..
అనుమానం ఆకిట్ల సింత సెట్టాయె కొడుకా!
నీల్లు లేని బాయిల్ల కండ్లు కశికలాయె
సిరిసిల్లను జూసే సిన్నబుచ్చుకుంటివి
నల్గొండను జూసి తట్టుకుంటవా బిడ్డ?
ఒక్కో జిల్లది ఒక్కో గోస కాదు నాయినా
బొందల గడ్డలయితున్న బొగ్గు బాయిలు
కూలి కైకిలికి చీమల బారోలె
ఎలబారుతున్న పాలమూరు..
అటు కాటికి పోక.. ఇటు పేటకు రాక
కానల్ల కానెటోడు లేక
పురుగు పుట్రల కన్న అన్నేలమయితున్న
అడివి బిడ్డలొక దిక్కు..
మూతిమీన మీసమొత్తె సాలు
మాయమైతడో.. మాయజేత్తరో
ఏ గత్తరకు దేంట్ల తేలుతరోనని
దినాలు లెక్కపెట్టుకుంటున్న అవ్వయ్యలు..
బతుకు ప్లాస్టిక్ పూల బతుకమ్మాయె..
తంగెల్లకు బదులు జిల్లెళ్లు పూయబట్టె
వానరాక.. పానం పోక
చావు బత్కుల మధ్య డముకుల మోత
చెప్పుకుంటె మానం పోతది
చెప్పకుంటె పాణం పోతదన్నట్టు
నువ్వన్నట్టే ... !
ఇజ్జతున్నోళ్లం బిడ్డా..
కొట్లాడి.. కొట్లాడి యాష్టొత్తంది కొడుకా..
మేం గౌరవమిచ్చినోనికి పాణమిత్తం బిడ్డా
ఇగ నీ ఇట్టం..!
ఏం జేత్తవో.. ఎట్ల జేత్తవో
నియ్యతుంటేనే బర్కతుంటది బిడ్డా
ఇది అరువైయేండ్ల తండ్లాట
సావు బద్కుల అష్టచెమ్మాట
తప్పు చెయ్యకు బిడ్డా
తల్లి నోట శాపనార్థాలు తినకు
ఇమానంగ గీ గడ్డకు మేలు చేస్తె
మా కష్టాలన్నీ తీరుత్తె
నిన్ను కండ్లల్ల పెట్టుకుంటం బిడ్డా !
మా తెలంగాణంత పండుగ జేస్కున్న రోజు
దేవునింట్ల నీ బొమ్మ పెట్టుకుంటం కొడుకా!
లేకుంటె ......... ??!
(చిరంజీవి సిరిసిల్ల పర్యటనకు స్పందనగా..)
.
No comments:
Post a Comment