కూలిన విగ్రహాలను చూసి ఆగ్రహంతో శివాలూగుతున్న సీమాంధ్ర నాయకులుగానీ, సాహిత్యకారులుగానీ 55 ఏండ్ల నుంచి ఏడుస్తున్న ‘తెలంగాణ తల్లి’ కన్నీళ్లు తుడిసిండ్రా అని అడుగుతున్నం. నోరులేని విగ్రహాలు ఏంజేసినయని అమాయకంగా అడుగుతున్నరు. ఆ విగ్రహాలేంజెయ్యలే. మా స్ఫూర్తి ప్రదాతలుండాల్సిన స్థలాన్ని కబ్జాచేసిండ్రు. ఖాళీ చేస్తలేరు. ఇది సాంస్కృతిక విషాదం అని వగచేముందు, ఆరు వందల మంది తెలంగాణ బిడ్డలు పాణాల్తీసుకున్నా ఎందుకు కనికరం చూపలేదన్నది గుర్తు చేసుకోవాలి. మరికొందరు చీకటిరోజు అంటున్నరు. అరవై ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజలు చీకట్లనే బతుకుతున్నరు. అయినా అదెన్నడు ఆళ్లకు కనబడలే.
శ్రీకాంతాచారి, యాదయ్య, వేణుగోపాలరెడ్డి, పోలీసు కిష్టయ్య సహా వందల సంఖ్యలో తెలంగాణ బిడ్డలు బతుకులు బలిపెడితే సంతాపం కూడా ప్రకటించలేదు. ఇది ‘దుర్మార్గ చర్య’ అంటూ రాష్ట్ర మంత్రులు మూకుమ్మడిగా ప్రకటన చేస్తరు! హైదరాబాద్ గల్లిగల్లిల ఇనుప కంచెలు, బార్బ్‌డ్ వైర్లతో రోడ్లన్నీ అష్ట దిగ్బంధం చేసి అడ్డుకోవడం దుర్మార్గ చర్య కాదా? నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలన్నింటిని మిలటరీకి అప్పచెప్పి, బార్డర్లో మాదిరిగా కాపలా కాయించి కనీసం ద్విచక్ర వాహనాలు కూడా కదలకుండా చేయడం దుర్మార్గం కాదా?
విగ్రహ విధ్వంసం తెలంగాణవాదుల మూర్ఖత్వానికి నిదర్శనం అని సీమాంధ్రులు గగ్గోలు పెడుతుండ్రు! ఇచ్చిన మాటకు కట్టుబడకుండా, తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైతదని ప్రకటించిన 24 గంటల్లోనే రాజీనామా డ్రామాలతో అలజడి సృష్టించి నోటికాడి బుక్కని కాలదన్నింది ఎవరు? ఇన్నిచేసి, ఇప్పుడు ఉద్యమంలో హింస చోటుచేసుకుందని వగల ఏడుపు ఏడుస్తుండ్రు! 2009 డిసెంబర్ 9 నుంచి 23 వరకూ సీమాంధ్రలో తగలబెట్టిన దాంతో పోలిస్తే, తెలంగాణలో జరుగుతున్నది లెక్కలోకే రాదు.
తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేకుండా, కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టుకుండ్రు. మరి తెలంగాణ కోసం కొసదనుక కొట్లాడిన జమలాపురం కేశవరావు, కొమురం భీం విగ్రహాలు ఎందుకు లేవు? ప్రథమాంధ్ర సంస్కర్త కందుకూరి వీరేశలింగం అంటరు! ఆయన్ని మించిన ప్రథమ సంస్కర్త వనపర్తి రాజేశ్వరరావు అని, ఆధారాలతో సహా సురవరం ప్రతాపరెడ్డి నిరూపించిండు. ఆయన ప్రతిమ ఎందుకు లేదు? మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యం ‘యయాతి చరిత్ర’ రాసి, తెలుగు భాషకు హారాన్ని అందించిన పొన్నగంటి తెలగనార్యునికి ట్యాంక్‌బండ్‌పై తావెందుకు లేదు? ‘భాష’ను దేశీ మార్గం పట్టించి, సామాన్యుల ‘సంభాషణ’లకు కావ్యగౌరవం కల్పించిన పాల్కురికి సోమనాథుడు ఎక్కడా కనిపించడెందుకు? సీమాం ధ్రుడు సీఆర్ రెడ్డికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విశ్వవ్యాప్త కీర్తి తీసుకొచ్చిన వైస్‌చాన్సలర్ అలీ యావర్‌జంగ్‌ని ఎందుకు విస్మరించిండ్రు?
తెలంగాణ మహిళల్లో చైతన్యం తీసుకొచ్చిన టీఎన్ సదాలక్ష్మి, జే ఈశ్వరీబాయి, సంగెం లక్ష్మీబాయి, సుగ్రా హుమాయూన్ మీర్జా, చాకలి ఐలమ్మ, మహాలఖా బాయిల విగ్రహాలు ఎక్కడని ప్రశ్నిస్తున్నం. నాటి ప్రభువులను గడగడలాడించిన తెలంగాణ రాబిన్‌హుడ్ సర్వాయి పాపన్న, తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి ప్రాణమిచ్చిన దొడ్డి కొమరయ్య, బ్రిటిష్ రెసిడెన్సీపై ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసిన తుర్రెబాజ్‌ఖాన్, గాయాల్ని గేయాలుగా మార్చిన సుద్దాల హనుమంతు, తెలంగాణ ఆర్తికి ప్రతీకలు కొత్వాలు వెంకటరామారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి కృష్ణమాచార్య, రావి నారాయణరెడ్డి, బత్తిని మొగిలయ్యగౌడ్, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డివంటి వారిని సీమాంధ్రుల పాలన పూర్తిగా విస్మరించింది. వారిని స్మరించుకోవాల్సిన సమయం ఆసన్నమయింది.
అన్ని రంగాలకు చెందిన సీమాంధ్రులంతా ఒక్కటై, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి కంకణం కట్టుకున్నరు. అందుకే, తెలంగాణ ఉద్యమంలోకి నక్సలైట్లు, సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డారని దుష్ర్పచారం చేస్తున్నరు. నిజానికి ‘మిలియన్ మార్చ్’ను శాంతియుతంగా జరుపుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చివుంటే, ప్రజల్లో భావోద్వేగాలు తీవ్రమయ్యేవి కావు. అనుమతి నిరాకరించిన ఫలితంగా ఉద్రిక్తతలు చోటుచేసుకుని విగ్రహాల విధ్వంసానికి తోవతీసింది. ప్రణాళికాబద్ధంగా విగ్రహాల కూల్చివేత సాగివుంటే, 1969 ఉద్యమంలో 369 మందిని బలితీసుకున్న కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం మిగిలేదా?
సంగిశెట్టి శ్రీనివాస్ తెలంగాణ హిస్టరీ సొసైటీ
Sakshi Daily, 26th March 2011.
Saturday, March 26, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment