ఆ సంఘటన అందరి హృదయాల్ని కలచి వేసింది. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవలసిన అవకాశాలు ప్రజలకంటే పాలకులకే ఎక్కువగా ఉన్నాయి. కానీ దాన్ని కూడా వదులుకుంటున్నారు. ఇలా జనం చీమల్లా ట్యాంక్‌బండ్ మీదకు కదలిరావటం ఇదే మొదటిసారి కాదు. ప్రతి బతుకమ్మ పండుగకు, వినాయక నిమజ్జనం సమయంలో ఆబాల గోపాలం కదలి ట్యాంక్‌బండ్ మీదకు రావడం జరిగేదే. కానీ, ఆ సందర్భంలో మాత్రం ఆ జనం మొఖాలపై నవ్వులు, కేరింతలు, ఉత్సాహాలు చూసేవాళ్లం. పోలీసులు కూడా కనపడేవారు. కానీ వారు లాఠీలను చూసి మురిసి పోయిందానికన్నా ప్రజల మధ్యన ఉండి, ప్రజల సంతోషాలతో లీనమౌతూ, తాము కూడా ఉన్నామని ప్రజలకు చెబుతూ ఉండేవారు. ప్రజలు ఈ 25 ఏళ్ల కాలంలో ట్యాంక్‌బండ్‌పై ఒక్క విగ్రహాన్ని కూడా ముట్టుకోలేదు. అది హైదరాబాద్ ప్రజల సంప్రదాయాన్ని, సహనాన్ని, నాగరికతను ప్రతిఫలించింది.
అకస్మాత్తుగా మిలియన్ మార్చ్ ఎందుకు ప్రజల ఆలోచనల్ని మార్చింది? సంతోషాలకు బదులుగా ఆ సమయంలో కక్షలు ఎందుకు రేగాయి? ప్రజల మనోభావాల్లో ఎందుకు ఈ మార్పు వచ్చింది? దీని వెనుక ‘రాజముద్ర’ కనపడుతున్నది. ప్రజలను ట్యాంక్‌బండ్‌కు రానివ్వకూడదని, జేఏసీ ఇచ్చిన పిలుపును విచ్ఛిన్నం చేయాలని, తెలంగాణ ప్రజల మనోభావాలు కనపడ కుండా చేయాలన్న ఎత్తుగడ పాలకులది. కేంద్రం మన్ననలను పొందాలన్న తహతహ రాష్ట్ర ప్రభు త్వానికి ఉంది. చిదంబరం మెప్పు పొంది అధికార పీఠంలో మరో మెట్టు ఎక్కా లన్న తపన ప్రభుత్వంలో ఉన్నట్లుగా కనిపించింది.
మార్చి 10వ తేదీన పిల్లల పరీక్షను తమ బలంతో రాయించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రజాబలంకన్నా అధికార బలం ఎక్కువని నిరూపించాలనుకున్నారు. ప్రజాస్వామిక ప్రభుత్వాలు అధికారంతో నడవవు. పోలీసుల పహారాలో పాలన ఎంతకాలమో సాగదు.
ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజల ఆకాంక్షను కాదనలేదు. ఈనాడు ప్రజలు తమ పిల్లలు చదువుకోవాలని, తమ పిల్లలు మానవ సంపదగా తయారు కావాలని, తమ ఆర్థిక ఎదుగుదలకు చేయూత నివ్వాలని ప్రజలు కాంక్షిస్తున్నారు. దాన్ని గమనించే బహుశా టీఆర్‌ఎస్, జేఏసీ తమ కార్యక్రమంలో మార్పులు చేసుకుని పిల్లల పరీక్షలకు అవకాశం కూడా కల్పించడం జరిగింది.
ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. ఉద్యమం చేసే నిర్వాహకులు ఒప్పుకున్నారు. పిల్లల్లో టెన్షన్ తగ్గిందని ఆనందించాను. ఇంటికొచ్చే సరికి టెలిఫోన్ కాల్స్ వచ్చాయి. సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ నుంచి వచ్చిన వందల మందిని అరెస్టు చేశారని చెప్పారు. నన్ను ఎందుకు మాట్లాడరని కొందరు అడిగారు. సహనం వహించండి! అరెస్టులు చేయరని చెప్పాను.
9వ తేదీ రాత్రి నేను కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాను. రాత్రి 12 గంటల సమయంలో అడుగడుగునా తనిఖీలు చేయటం కళ్లారా చూశాను. అది ఒక్కచోటనే కాదు, పదిచోట్ల నా కారును నిలువెల్లా సోదా చేయడం జరిగింది. నా కారునే కాదు మొత్తం తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
తెల్లవారగానే మార్చి 10న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వాకింగ్‌కు వెళ్లాను. పరీక్షల రోజున కూడా విశ్వవిద్యాలయం చుట్టూ అవే ముళ్లకంచెలున్నాయి. పరీక్షలు సాఫీగా జరగాలని పిల్లల్లో భయోత్పాతం పోవాలని ఎంత ప్రయత్నం చేసినా ఈ భయంకర పరిస్థితి తప్పలేదు. ఇంటర్ పిల్లలు ఎన్నో ఇబ్బందులుపడ్డారు. కొందరు ఇంటర్ పిల్లల్ని కూడా అరెస్ట్ చేశారు. తల్లిదండ్రులను కూడా అనుమతించడం లేదని కొందరు ఫోన్లు చేశారు. ఏది కాకూడదని తలచానో అదే జరిగింది. పిల్లలు పరీక్ష రాశారు. కానీ 10 వేల పైచిలుకు విద్యార్థులు పరీక్ష రాయలేక పోయారు. పరీక్షకు ఒత్తిళ్లమధ్య హాజరైన విద్యార్థి ఏం రాయగలుగుతారో నాకు తెలుసు. ఏదో పరీక్షలు జరిపామని ప్రభుత్వానికి సంతోషమా? జేఏసీ, టీఆర్‌ఎస్ ప్రోగ్రాంలను జరగనీయకుండా ఆపగలిగామని అహంభావమా? పరీక్షలు ఎవరి కోసం? ప్రభుత్వ గౌరవం కోసమా? పిల్లల భవిష్యత్తుకా? పిల్లలు పరీక్షలు రాసి వచ్చామన్న సంతోషాన్ని చూడాలా? లేక పోలీసుల ప్రవర్తనతో వారి మొఖాల మీద అసహనం చూడాలా?
ఇంటర్ పరీక్ష అయిపోయింది. మధ్నాహ్నం 1 గంట నుంచి ట్యాంక్‌బండ్‌పై రెండవ అధ్యాయం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సాధన పరీక్ష మొదలైంది. ఆ సమయంలో నేనప్పుడు ఒక నవోదయ స్కూల్లో ఉన్నాను. పరీక్షకు ఎలా ప్రిపేర్ కావాలి! ఎంత ప్రశాంతంగా ఉండాలో వారికి చెబుతున్నాను. ఇంకోపక్క పిల్లలు పరుగెత్తుకుంటూ ట్యాంక్ బండ్ వైపుకు వస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ ప్రదర్శనలు జరుగు తున్నాయి. ప్రదర్శనలు చూసి తల్లిదండ్రుల సాయంతో ట్యాంక్‌బండ్ ఎక్కారు. పిల్లలు జమగూడితే వారి వెంబడి నడిచాను. ఒక్కొక్కరూ తమ బాధలను చెప్పుకుంటున్నారు. అవి వినుకుంటూ వారిని సముదా యించుకుంటూ ట్యాంక్‌బండ్‌పై ఆ మూల నుంచి ఈ మూలకు తిరిగాను. ఒక విద్యార్థి ఆత్మహత్యాప్రయత్నం చేసుకున్నాడని ఆ లేఖను చూపించి కొందరు విలపించారు.
విద్యార్థులను ఏం అనకండని పోలీసులను వేడుకున్నాను. దాని తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికొచ్చి టీవీ చూశాక మనస్తాపం చెందాను. ప్రజలకు, రాజకీయ పార్టీలకు మధ్య అగాధం ఏర్పడిందని అనిపించింది. రాజకీయ పార్టీలు విధినిర్వహణలో విఫలమయ్యాయి. అవి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ పౌరజీవనాన్ని కాపాడాలి. ఇలాంటి సంఘటనల నుంచి, ఇలాంటి క్షేత్రాల నుంచి రాజకీయ పార్టీలను దూరంగా ఉంచితే ఏం జరుగుతుందో అదే జరిగింది. ప్రభుత్వం డీజీపీతో సంప్రదించేకన్నా రాజకీయ పార్టీలతో సంప్రదిస్తే బాగుండేది. రాజకీయ పార్టీలు పౌరజీవనాన్ని కాపాడగలుగుతాయి. దానికి ప్రత్యామ్నాయం పోలీసులు కాదని ట్యాంక్‌బండ్‌పై జరిగిన ఘటనలు మరొకసారి తేల్చిచెప్పాయి. ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడుకోవటం కోసం భావితరానికి స్వేచ్ఛా వాతావరణం కల్పించటం కోసం ట్యాంక్ బండ్ సంఘటనపైన ఒక సమగ్ర విచారణ జరిపించండని కోరుతున్నాను. ఇది దోషులను పట్టుకోవడం కోసం కాదు ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడటం కోసం ఆ పని చేయాలి. ఆ విగ్రహాలను పడగొట్టింది కొందరు వ్యక్తులు మాత్రమే. వారు కావాలని వాటిని పడగొట్టలేదు.
ప్రజాస్వామిక భావాలను చెదరగొట్టింది ప్రభుత్వమే. చెదిరి పోయిన ఆలోచనల నుంచి తలెత్తే ఆగ్రహానికి ఎవరూ ఎదురు నిలవలేరు. సహనం బద్దలైతే సంభవించేది ఉపద్రవాలే. సరిగ్గా అదే జరిగింది. ఇందుకు మూలాలు ఇకనైనా ఆలోచిస్తారా?
చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు
Sakshi Daily 26th March 2011.
No comments:
Post a Comment