ఔను కామ్రేడ్స్.దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది. ఒకటా రెండా.. నూటపదకొండు సమస్యలచిక్కుముడుల మధ్య చిక్కుపడిన దారపు ఉండలా ఉంది. దరిద్రంగా ఉంది. రైతులు నాగేటి చాళ్ళలో మృత్యుసేద్యం చేస్తున్నారు. పేదలు పేదలుగానే, ధనికులు మరింత ధనికులుగానే... ఉన్నో డు ఉన్నతికి,లేనోడు అధఃపాతాళానికి పోతానే ఉన్నారు. నిజమే కామ్రేడ్స్...కమ్యూనిస్టుపార్టీ పుట్టి దశాబ్దాలు గడిచిపోయినా, ఏదీరాలేదు. ఏదీపోలేదు. సోషలిజం వీధుల్లో మూర్ఛనలు పోతూనే ఉన్నది. వరల్డ్‌బ్యాంక్ తోలుబొమ్మలాటలో ఏలికలు తైతక్కలాడుతూనే ఉన్నారు. కొంత నెత్తుటి తర్పణా జరిగింది. కొన్నివేలమంది వీరులూ మరణించారు.
ప్రపంచం కదలని మెదలని నిశ్చలతలోనూ లేదు. అది ప్రవహిస్తూనే ఉంది. ప్రపంచకార్మికులు ఏకం కానేలేదు. పెట్టుబడిదారీ కోటగోడలు కూలిపోనూ లేదు. సామ్రాజ్యవాదం బలహీనమైన లింకూ తెగిపోలేదు.నిరామయ ప్రపంచం. ఒక బందగీ... ఒక దొడ్డి కొమరయ్య, ఒక చాకలి ఐలమ్మా, ఒక వీరుడు మరణించాడు. వేనవేల వీరు లూ ప్రభవించారు. ఒక తెలంగాణ నెత్తురోడింది. కానీ అది ఓడిపోయింది. అదొక అంతర్గత వలసయింది. ఔను నిజం కామ్రేడ్స్. దేశం క్లిష్టపరిస్థితుల్లోనే ఉంది. ఏదీ మారలేదు. తెలంగాణలోనూ సవాలక్ష సమస్యలున్నాయి. అనేకానేక సమస్యలతో సతమతం అవుతోంది. ఔను నిజమే కదా! కేసీఆర్‌కు ఆ సమస్యలు పట్టవు. ఆయనకు కావలసింది ఒక్కటే కదా! తెలంగాణ. అది సమస్యలున్న తెలం గాణ అయినా సరే ఆయనకొక తెలంగాణ కావాలె.
నిజమే. ఆయన కమ్యూనిస్టు కాదు గదా! నూటొక్క సమస్యలతో సతమతమయ్యే కామ్రేడ్ కాదు గదా! తెలంగాణల ఏమి జరుగుతున్న దో ఆయనకెందుకు? ఆయనకు మంచిదో, చెడ్డదో, లంగదో, దొంగదో? తెలంగాణ కావాలె. జై తెలంగాణ అందామంటే కుడి ఎడమల కమ్యూనిస్టులకూ సవాలక్ష సమస్యలాయె. తెలంగాణ అందామంటే విశాలాంధ్ర ఏమయిపాయె. అలవాటయిన ప్రాణం కదా. కార్యక్షేత్రం తెలంగాణాయె. నెత్తురుడొల్లాడింది తెలంగాణలనేనాయె. దేశమంతటా భాషా ప్రయుక్త రాష్ట్రాలు రెండో మూడో.. అయిదో అయినా పర్వాలేదు. కానీ ఇక్కడ మాత్రం కాకూడదు కదా! ఎందుకంటే తెలంగాణల ఒక మజా ఉంది. హైదరాబాద్‌ల కూడా ఒక మజా ఉంది. బిర్యానీలాంటి భూములు. రియల్ ఎస్టేట్.కళ్ళముందర రంగారెడ్డి కబ్జా అయింది. చూస్తూ ఉండగానే హైదరాబాద్ తెలంగాణకు మాత్రం పరాయిదైపోయింది.
నిజమే. ఆయన కమ్యూనిస్టు కాదు గదా! నూటొక్క సమస్యలతో సతమతమయ్యే కామ్రేడ్ కాదు గదా! తెలంగాణల ఏమి జరుగుతున్న దో ఆయనకెందుకు? ఆయనకు మంచిదో, చెడ్డదో, లంగదో, దొంగదో? తెలంగాణ కావాలె. జై తెలంగాణ అందామంటే కుడి ఎడమల కమ్యూనిస్టులకూ సవాలక్ష సమస్యలాయె. తెలంగాణ అందామంటే విశాలాంధ్ర ఏమయిపాయె. అలవాటయిన ప్రాణం కదా. కార్యక్షేత్రం తెలంగాణాయె. నెత్తురుడొల్లాడింది తెలంగాణలనేనాయె. దేశమంతటా భాషా ప్రయుక్త రాష్ట్రాలు రెండో మూడో.. అయిదో అయినా పర్వాలేదు. కానీ ఇక్కడ మాత్రం కాకూడదు కదా! ఎందుకంటే తెలంగాణల ఒక మజా ఉంది. హైదరాబాద్‌ల కూడా ఒక మజా ఉంది. బిర్యానీలాంటి భూములు. రియల్ ఎస్టేట్.కళ్ళముందర రంగారెడ్డి కబ్జా అయింది. చూస్తూ ఉండగానే హైదరాబాద్ తెలంగాణకు మాత్రం పరాయిదైపోయింది.
భాషలేదు, యాసలేదు. మొత్తానికి కూలిపోయిన ఇరానీ హోటల్లో, విస్తరించిన రోడ్డుపక్క కుంచించుకుపోయిన అడ్డాల్లో తెలంగాణ ఆత్మ ఇరుక్కుపోయింది. అదే మజా. మాల్స్ మజా. ఫ్రెష్‌ల మజా. జీవీకేలూ, జీ ఎమ్మార్‌లూ, దర్శినీ లూ, మెస్‌లూ... ఆంధ్రభోజనం దొరకబడును. ఇడ్లీలు, దోసెలు, కర్రీపాయింట్లు... అంతా అమ్మబడును, కొనబడును. అమ్ముడుపోయి ఆగమైపోయింది తెలంగాణ. ఎవరి ఊరిలో వాడు పరాయి కావడం, ఎవడిభాష వాడి ఊరిలో అర్ధం కాకపోవడం, బిక్కుబిక్కుమంటూ ఒదిగి మూలకు ముడుచుకుపోవడం గదా అస లు తెలంగాణ సమస్య. ఏలికలెవరైనా, పాలితులు ఎవరైనా, పాలకులు ఎవరైనా తెలంగాణ మాట చెల్లని స్థితి కదా భాషాప్రయుక్తరాష్ట్రమంటే.
భాష ఆదాన ప్రదానాలు... ఒక ప్రాంతపు భాషను (యాసకూడా) పూర్తిగా కునారిల్లజేయడమే కదా విలీ నం అంటే. కాడిమోసం చేసింది.కాడెద్దు మోసం చేసింది. చెయ్యిచ్చింది కాంగ్రెస్. చెన్నారెడ్డి, మదన్ మోహన్, మల్లికార్జున్... ఎవరి పేరయితేనేం? తెలంగాణ నలభై ఏళ్ళకిందట దగాపడింది.చివరికి ఇవ్వాళ్ళ కాకా అదే పని చేస్తున్నడు. ఉప్పునూతలా, ఎమ్మెస్సార్, చిన్నారెడ్డి,జీవన్‌రెడ్డి... తెలంగాణ ఒక ప్రయోగశాల. ఒక ఓటు, రెండు రాష్ట్రాలన్న బీజేపీ ఒకసారి ధోకా ఇచ్చింది. ఇప్పుడు ఇక కండ్లు తెరిచింది. మా... కాదు కాదు మూర్క్సిస్టులు, 'నో' డెమోక్రసీలు సరే సరి. కానీ కామ్రేడ్స్...తెలంగాణ అంటున్న మీకు మాత్రం దేశంలోనూ, తెలంగాణలోనూ ఉన్న అనేక సమస్యలు గుర్తుకొస్తాయి. కానీ, ఆగమైన తెలంగాణ గుర్తుకురాదు.
పోలవరం కడ్తుంటే పోతున్న గిరిజన ప్రాంతాలు గుర్తురావు.పోతిరెడ్డి పాడు గుర్తుకురాదు. 610 జీవో అమలు కాకపోవడమూ గుర్తుకురాదు. సకల రక్షణల ఉల్లంఘనలూ గుర్తుకురావు.యాభై సంవత్సరాల దగా పోరాటానికి ఒక అంశమూ కాదు. ఎందుకు కామ్రేడ్స్ మొహమాటాలు. తెలంగాణ మీకోసం నెత్తురు ధారవోసిన నేల. కమ్యూనిజం కోసం కదనరంగాన దూకి నైజాం బూజు వదిలించిన నేల. మీ తుపాకులకు భుజమిచ్చిన నేల. ఊరూరా ఎర్రని స్థూపాలతో, వాడవాడనా తమ ప్రాణాలను పూచిక పుల్లల్లా అర్పించిన అమరవీరుల నేల. చరిత్రను శ్వాసించిన నేల. చరిత్రను శాసించిన నేల. కానీ... అది తల్లడిల్లుతున్నది. మూడువేల గ్రామాల్లో ఎర్రజెండాలెగరవేసి,నేలను విముక్తం చేసిన ఈ తెలంగాణప్రజలకు ఇదేమి దరిద్రం.
దేశమంతటా లేని నదీజలాల మళ్ళింపు, వనరుల మళ్ళింపు,భాష యాసలమీద, సంస్కృతిమీద పెత్తనం, ఉద్యోగాలు దొరకని వైనం. స్తన్యం దక్కని శిశువు తెలంగాణ. అవును కామ్రేడ్స్... దేశానికి సమస్యలున్నాయి. తెలంగాణకు అదనంగా అదనపు సమస్యలున్నాయి. అన్నింటికీ ఎర్రజెండాలెత్తి కదనరంగంలోకి దూకి, వీధులు ఎరుపెక్కించే కామ్రేడ్స్... ఈ ఒక్క తెలంగాణ కోసం మాత్రం అటుగాని, ఇటుగాని సందిగ్ధం ఏలకలిగినో చెప్పగలరా? పోరాడకుం డా తెలంగాణలో చోద్యం చూస్తామనడం న్యాయమా? పోరాడేవాళ్ళకు తెలంగాణ ఒక్కటే... పోరాట వారసత్వమూ ఒక్కటే. కానీ... మీరే అటు ఇటుగాని హృదయముతోనీ...కమ్యూనిస్టులుగా... తగునా? తెలంగాణకోసం పోరాడితే పోయేదేమిటో?
- అల్లం నారాయణ, సీనియర్ పాత్రికేయులు (published in Andhra Jyothy)
No comments:
Post a Comment