మావ్వ దిగుట్లె దీపం గాదు
ఆకాశం గొంగట్ల ఆగమైన పొద్దు
నేలమ్మ కొంగున అంగిట బట్టిన ఆకలి
ఒక్కొక్క పువ్వుగాదు
వెయ్యేసి పూలేసినా
ఒక్క జాము నిండని సందమామ మా అవ్వ
సేతికి సెమటకు తీరని తెల్లారని గోస
రోట్లె తల్కాయ బెట్టి రోకటికి
ఎదురొడ్డిన తాలుగింజ బతుకు కోడికూత
పొద్దులన్ని అవ్వ కండ్లల్లనే కాపేస్తయి
సుక్క పొద్దుల్ని ఆకిలూడ్సి
అలుకు జల్లి లేపేది
అడివిల ఆవొర్రది
ఇంటికాడ ల్యాగొర్రది
గుర్తింపు లేని గులాపుది మా అవ్వ
బువ్వ వుడుక లేదని.. మెత్తగైందని
రాయొచ్చిందని.. యెంటికొచ్చిందని
కూలేది.. నాలేది.. పనేది.. పాటేదని
అయ్య కోపాల కొలిమిలబడి
ఎన్నిసార్లు బస్మమై పుట్టిందో...
మా అందరికి మావ్వ వండిన కుండ వాల్సిన మంచమే
నాగేటి సాల్లల్ల యిత్తునమై
మొలిసే మొలకంతా మా అవ్వే
మోకాటి బంటి మడుగుల
పొద్దంగినా నడుమెత్తని నాటై.. కలుపై
దిగే పచ్చని పైరంతా మా అవ్వే
పారబట్టి ఒడ్లు సెక్కినట్లు రాగాలు సెక్కి
పల్లెకు పాటలూదిందంతా మా అవ్వే
అవ్వ పనిల దిగితే సెమట తోడిన సెలిమయ్యేది
పొయిల సల్లారని పిడికె నిప్పయేది
నేనవ్వ కడుపును నడికట్టోలె సుట్టుకున్న
వెచ్చటి యాదులే లేవు
సేగబారి కాయలు గాసిన మా అవ్వ
సేతిల పాలబువ్వ దిన్న సందమామ
సంగతులే యెరుకలే..
పాలకేడ్సిన ఆకలి, సత్తుగిన్నెల రాత్రి బువ్వ కాన్నే
సల్లారిన యాదులు సద్దుమనగలే..
అవ్వ పక్కల ఆవులించి ఆడుకున్న పొద్దులే లేవు
పలిగిన దప్పు మీది దరువు మా అవ్వ
బూమికి కాత పూత పంట ఫలం నేర్పి
తోలుకు తొండమై దప్పై చెప్పైన సెమటల్ల
సేదకు నోచని నాదము
ఆసామి, అయ్య సేతుల్ల
తాడును తప్పించుకునే బొంగురం తండ్లాట
భూమాతకు చాతిచ్చి బువ్వ బెట్టినా
నాగలికి దూరం జేసిన నారాజులు
దుక్కాల్ని దున్నిపోసుకున్న తొక్కుడుబండ
మూటిడువని చరిత్రల ముల్లె
కొంగు నడుముకు సుట్టి కొడవలెత్తిన సవాల్ మావ్వ
గీ లోకములున్న అక్షరాలు పాడువడ
మావ్వ తిరుగాడిన అంచులకే రాకపాయె
-జూపాక సుభద్ర
(తెలంగాణలో తల్లిని అవ్వ అంటము)
No comments:
Post a Comment