Wednesday, August 27, 2008
ఉద్యమాల ఉత్తర తెలంగాణ! - ఇనగంటి వెంకట్రావు
పోరాటాలకు ప్రసిద్ధి చెందింది తెలంగాణ. అందులోనూ ఉత్త ర తెలంగాణాది ఇటీవలి పోరాటాల చరిత్ర. నాలుగయిదేళ్ళ క్రితం వరకు అక్కడ పాగావేసింది వామపక్ష తీవ్రవా దం. చీమ చిటుక్కుమన్నా భయపడే వాతావరణం. ప్రభుత్వ అణచివేత తీవ్రతరం కావడం వల్ల కాని, ఉద్యమ వ్యూహాలలో వచ్చిన మార్పుల వల్ల కాని, పీపుల్స్‌వార్ - మావోయిస్టుల కార్యకలాపాలు క్రమంగా ఇటు కృష్ణను దాటి నల్లమలకు, అటు గోదావరిని దాటి చత్తీస్‌గఢ్‌కు తరలివెళ్ళాయి. కొంతకాలం స్తబ్దత. అలాంటి వాతావ రణంలో ఉత్తరాంధ్రను బలంగా ఆకర్షించినఉద్యమం ప్రత్యేక తెలం గాణ. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన ఈ ఉద్యమం తెలంగాణ అంతటికీ చెందినదే అయినప్పటికీ, దాని కేం ద్రీకరణ, కార్యాచరణ మాత్రం ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలోనే! కడచిన అయిదారేళ్ళుగా ఆ ప్రాంతపు రాజకీయ కార్యకలాపాలను, ప్రభుత్వ వ్యతిరేకతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది, విలీనం చేసుకుంటున్నది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. అందుకే ఆయా ఎన్నికలపై సయితం దాని ప్రభావం బలంగా వుండడం! అలా కడచిన అయిదారేళ్ళుగా అది సమైక్య రాష్ట్ర రాజకీయాలను, ఎన్నికల వ్యూహాలను సయితం కొంతవరకు ప్రభావితం చేస్తున్నది. వీటన్నిటికీ తోడు ఇప్పుడు మరో రకమైన ఉద్యమాలకు ఉత్తర తెలంగాణా వేదికగా మారింది. అన్ని పార్టీలకూ ఇప్పుడు అది ఒక కార్యక్షేత్రం, కదన రంగం. మొదట బీడీ కట్టలపై పుర్రె గుర్తు ముద్రణకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన ఉద్యమం ఆ ప్రాంతాన్ని కొంతకాలం కుదిపేసింది. ఆనాటి పుర్రెగుర్తు వ్యతిరేక ఉద్యమంలో రాజకీయ పార్టీల పాత్ర ఎంత వుందో, రాజకీయాలకు అతీతంగా బీడీ కార్మిక సంఘాలు, కార్మికుల పాత్రకూడ అంతే ఉంది. ముఖ్యంగా మహి ళలు. అందుకే ఆనాటి ఆ ఉద్యమం సెగ ఢిల్లీని తాకడం! అప్పటికీ ఇప్పటికీ- మరి ఈ మూడు నాలుగు నెలల విరామ కాలంలో బీడీ కార్మికుల జీవితాలలో ఎంతటి గుణాత్మక మార్పులు సంభవించా యో లేదా వారికి కల్పించిన ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు ఎలాంటివో తెలియదు కాని మళ్ళీ ఆ సమస్య తెరమీదికి వచ్చింది. జూన్ ఒకటి నుంచి పుర్రెగుర్తు ముద్రణ ప్రారంభం కానున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీనితో బీడీ కార్మికులలో అలజడి! రాజకీయ పార్టీలలో సయితం కదలిక! మరోసారి మరో ఉద్యమానికి ఊతం. ఈ సమస్యపై ఇప్పటికే తెలంగాణా రాష్ట్ర సమితి ఆ ప్రాంతంలో ధర్నాలు, బంద్‌లకు దిగితే, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం అఖిలపక్ష లేదా అఖిల ప్రతిపక్ష ఉద్యమానికి సమాయత్తం అవుతున్నది. మరోవైపు మరింత ఉధృతంగా సాగుతున్న మరో ఉద్యమం- మహారాష్ట్ర గోదావరి నదిపై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకం గా! దీనిపై కడచిన రెండేళ్ళుగా అసెంబ్లీ లోపల, వెలుపల చర్చోప చర్చలు, అడపాదడపా ఆందోళనలు సాగినా-ఈ ఉద్యమం ఉగ్రరూ పం దాల్చిందిమాత్రం కడచిన రెండు మూడు వారాలలోనే! విశేషం ఏమిటంటే రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంకూడ దీనిపై కేంద్రానికి ఫిర్యా దుచేయడం, సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అయినా ఫలి తం శూన్యం. ప్రభుత్వ ఉదాసీనత కారణంగానో ఏమో కాని, అంతిమంగా బాబ్లీ వ్యతిరేక ఉద్యమ నాయకత్వం తెలుగుదేశం చేతులలోకి వెళ్ళింది. సమైక్యవాద పార్టీగా చతికిలపడిన తెలుగుదేశానికి తెలంగాణ ప్రాంత సమస్యలపై పోరాడే హక్కు, శక్తి ఎక్కడివన్నది టి.ఆర్.ఎస్., కాంగ్రెస్‌ల అంచనా కావచ్చు. టి.ఆర్.ఎస్. అయితే 2009 ఎన్నికలకు సన్నాహంగా పూర్తిగా పార్టీ పునాదులను గట్టిపర చుకునే, విస్తృతపరుచుకునే పనిలో నిమగ్నమయింది. కాంగ్రెసుకేమో అధికార పార్టీకి సాధారణంగా వుండే అశక్తత. పైగా తీరిక తక్కువ. ప్రధాన ప్రతిపక్షం ఎప్పటికప్పుడు చేపట్టే ఆం దోళన కార్యక్రమాలకు దీటుగా రాజకీయంగా ప్రతిస్పందించడం తప్ప ఏ దశలోనూ అది స్వయంగా చొరవ చూపలేకపోయింది. ఆ శాఖ మంత్రిదే ఇటు ప్రభుత్వ ప్రతినిధిగా, అటు పార్టీ ప్రతినిధిగా ద్విపాత్రాభినయం! అధికార పార్టీగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు కేంద్ర ప్రభుత్వాన్ని తగిన మోతాదులో కాంగ్రెసు కదిలించలేకపోయింది. ఆఖరుకు మధుయాష్కి వంటి కాంగ్రెసు నేతలు చూపిన చొరవనుకూడ సొంత సంకుచిత రాజకీయకోణంలో చూసిందే కాని సకాలంలో సద్వినియోగం చేసుకోలేకపోయింది. పైగా పరిమాణం లో అల్మట్టితో ముడిపెట్టి, బాబ్లీని చిన్న సమస్యగా చూపెట్టి, తెలుగుదేశంపై రాజకీయఎదురుదాడికి ప్రయత్నించింది. పొరుగు రాష్ట్ర మైన మహారాష్ట్రలో, అటు కేంద్రంలో కాంగ్రెసు పార్టీయే అధికారం లో వుండడం ఆ పార్టీకి ఒక అవకాశం! అలా గే ఒక ఇబ్బంది! వీటన్నింటి పర్యవసానమే కాంగ్రెసు ఈ సమస్యపై వెనుకబడడం! ఆలస్యంగా అంతర్మథనంతో మేల్కొనడం! ఇటు ప్రత్యేక తెలంగాణ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితితో పోటీపడలేక, అటు తెలం గాణ ప్రాంత సమస్యలపై ప్రధాన ప్రతిపక్షం తో వేగలేక అది క్రమంగా బలహీనపడుతున్నదన్న భావన. ఈ విషయాన్ని ఇతరులే కాదు, కాంగ్రెసు నేతలే స్వయంగా అంగీక రించడం, ఆందోళన వెలిబుచ్చడం ఇటీవలి పరిణామం. జి.వెంకటస్వామి, వి.హనుమం తరావు, వి.పురుషోత్తమరెడ్డివంటి నేతలయి తే అదేపనిగా హెచ్చరికలు జారీచేస్తున్నారు. వీరిలో కొందరు ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు కూడ చేస్తున్నారు. ఇదంతా పెద్ద గుదిబండ వలె తయారై ఏదో ఒకటి చేయక తప్పనిపరిస్థితిలోకి కాంగ్రెసును నెట్టిం ది. అందుకే శనివారం ఉత్తర తెలంగాణ నేతలతో పి.సి.సి. భేటీని ఏర్పాటుచేయడం, బంద్‌కు ఆగమేఘాలమీద పిలుపు ఇవ్వడం! కాంగ్రెసు బంద్ పిలుపులోని ఒక ప్రత్యేకత- బాబ్లీ విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాసరావు దేశ్‌ముఖ్ ఢిల్లీలో చేసిన ప్రకటనకు నిరసన తెలుపడం! నిన్నటివరకు ప్రాంతీయం అనుకున్న బాబ్లీ సమస్య కాస్తా, విలాసరావు ప్రకటనతో తీవ్రస్థాయి అంతర్రాష్ట్ర సమస్యగా మారింది. మన రాష్ట్రానికి పోటీగా అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లి ప్రధానిని కలవడమే కాదు, అసలు కేంద్ర జలవనరుల మంత్రి సయిఫుద్దీన్ సోజ్ బాబ్లీ నిర్మాణాన్ని ఆపవలసిందిగా తమకు లేఖ రాయడాన్నే విలాసరావు ఏకంగా ప్రశ్నించారు. కేంద్రం లేఖను ఖాతరు చేయబోమని, సుప్రీంకోర్టు ఆదేశాలు వస్తే అప్పు డు ఆలోచిస్తామనికూడ ఆయన స్పష్టంచేశారు. ఇందులో ధ్వనిస్తు న్న ధిక్కారధోరణి స్పష్టం! ఒకేపార్టీ అధికారంలో వున్నా- కేంద్ర- రాష్ట్ర సంబంధాలు వికటించే పరిస్థితులు ఉత్పన్నం కావడం దేశం లో కొత్త చర్చకు దారితీసింది. చివరకు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు-లేఖలు, సలహాలతో సరిపెట్టకుండా ఆర్టికల్ 256 కింద మహారాష్ట్రకు కేంద్రం ఆదేశాలు ఇవ్వాలని, అప్పటికీ మాట వినకపోతే, ఆర్టికల్ 356 ప్రయోగించాలనే స్థాయి వరకు వెళ్ళారు. కేంద్రం ఆదేశాలు వినకపోవడం అంటే సమాఖ్య స్ఫూర్తికి విఘా తం కలిగించడం, రాజ్యాంగోల్లంఘనకు పాల్పడడం! అంటే అప్పు డు ఆర్టికల్ 356కింద రాష్ట్రపతి పాలన విధించక తప్పని పరిస్థితులు ఏర్పడినట్టు! కాంగ్రెసు నాయకులు కొందరు సయితం ఇలాంటిదే ఇంకో రకమైన డిమాండ్‌ను ముందుకు తెస్తున్నారు. అది ముఖ్య మంత్రి విలాసరావును మార్చాలనడం! అంటే రాష్ట్రపతి పాలన వర కు వెళ్ళకుండా- ముఖ్యమంత్రిని మార్చడం ద్వారా ఘర్షణను నివా రించాలని! అదీ జరిగే పనికాదు కాని, అంతర్రాష్ట్ర జల వివాదాల లో మనరాష్ట్రం ఎన్నడూ ఎదుర్కోనంత తీవ్ర సవాలును ఈ సమ స్యపై ఇప్పుడు ఎదుర్కొంటున్నది. ఇప్పటివరకు కృష్ణ ప్రాజెక్టులదే వివాదం అనుకుంటే ఇప్పుడు గోదావ రికీ ఆ సమస్య విస్తరించింది. ఇలాంటి పరిస్థితులలో వ్యూహాత్మకం గా కాంగ్రెసు నిర్వహిస్తున్న బంద్- ఈ వారం పది రోజులలో ఉత్తర తెలంగాణ లో జరుగుతున్న బంద్‌లలో మూడవ ది. ఇప్పటికే మహారాష్ట్ర పోలీసుల లాఠీచార్జికి వ్యతిరేకంగా తెలుగుదేశం ఒకసా రి బంద్ జరిపింది. దానికి కాంగ్రెసుతో సహా అన్ని పార్టీలూ మద్దతు ఇచ్చాయి. శుక్రవారం నాడు పుర్రెగుర్తు సమస్యపై బీడీ కార్మికులకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర సమితి బంద్ జరిపింది. ఇప్పుడు శనివారం నాడు ఆ వంతు కాంగ్రెసుకు వచ్చింది. ఇక తెలుగుదేశం- ఈనెల 24న శ్రీరామసాగర్ ప్రాజెక్టు వద్ద మహా ధర్నాకు సంకల్పించింది. ఈ ధర్నాలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ భాగస్వాములు. ఇటు బాబ్లీపైన కాని, అటు బీడీ కార్మికుల సమస్యపై కాని- తెలుగుదేశం తో వామపక్షాలు రెండూ చేయి చేయి కలిపి పోరాడుతున్నాయి. బి.జె.పి.తో సహా మిగతా పార్టీలది మాత్రం ఎవరిదారి వారిది. ఇది వరకే ఒకసారి సరిహద్దు వద్ద మహారాష్ట్ర పోలీసుల లాఠీ దెబ్బలు చవిచూసిన బి.జె.పి. సొంతంగానే ఉద్యమాలు నడుపుతున్నది. ఆ పార్టీ నేత ఇంద్రసేనారెడ్డి తలపెట్టిన నిరవధిక నిరశన దీక్ష ఇందులో ఒక భాగం. రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలతో ముడిపడిన అంతర్రా ష్ట్ర జలాల వివాదంలో అన్ని పార్టీల అభిప్రాయం, అంతిమ లక్ష్యం ఒకటే అయినా ఆందోళనలు మాత్రం వేరుగా వుండడం ఇతరులకు కొంత అలుసు అవుతున్నది. అంతిమంగా ఫలితాలు ఎలా వున్నా, బంద్‌లు, ఆందోళనల రూపంలో తెలంగాణ ప్రాంత సమస్యలపై కొత్తరకం పోరుకు కొత్తగా తెర లేచిందనిపిస్తున్నది. ఇందులో తెలు గుదేశానిది ముఖ్యమైన పాత్ర. ఒకవైపు తెలంగాణ సెంటిమెంట్, మరోవైపు తెలంగాణ ప్రాంత సమస్యలు. ఇదంతా రాజకీయం అని పూర్తిగా కొట్టిపారవేయలేని స్థితి. అందరూ కలిసి రాష్ట్ర శాశ్వత ప్రయోజనాలు కాపాడుకోవలసిన విధిలేని స్థితి! బాబ్లీపై రాష్ట్రంలో ఇంత రాద్ధాంతం జరుగుతున్నా, పార్టీలు ఎం త హైరానా పడినా, ఫలితం ఏమిటో కనుచూపు మేరలో కానరావ డంలేదు. ఈ పరిస్థితికికారణం ప్రధానంగా మహారాష్ట్ర ప్రదర్శిస్తు న్న మొండి వైఖరి. అదే విధంగా- కేంద్రం అనుసరిస్తున్న మెతక వైఖరి! సమస్య దానంతట అదే పరిష్కారమవుతుందని ఎదురు చూస్తున్న కేంద్రం కనీసం రిఫరీ పాత్రను కూడ పోషించలేకపోతు న్నది. అందుకే రాష్ట్రంలో ఆందోళనలు రోజురోజుకీ ఉధృతమవుతున్నాయే తప్ప ఉపశమించడంలేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే జరుగుతుందనుకుంటున్న నష్టం, మిన్నకుండి పోవడం వల్ల అంత కంటె ముందే జరిగిపోతున్నది. కేంద్రం దాటవేత ధోరణిని అనుసరి స్తున్న ఈ పరిస్థితిలో, ఇక అందరూ ఎదురు చూస్తున్నది సుప్రీంకోర్టులో ఏమి తేలుతుందనేది! బాబ్లీ విషయంలో ఆంధ్ర అభ్యంతరాలు ఏమిటో స్పష్టం. అస లు బాబ్లీ నిర్మాణం జరుగుతున్న స్థలమే ఆంధ్రకు చెందిందనేది ఒక టి. ఇంతకు ముందే ఆంధ్రప్రదేశ్ పరిహారం చెల్లించింది కాబట్టి ఆ స్థలంపై ఆంధ్రకు హక్కు ఏర్పడిందనేది దీనిలోని సారాంశం. బాబ్లీ నిర్మాణం వల్ల శ్రీరామసాగర్ ప్రాజెక్టు నిర్వీర్యం అవుతుందనేది మరొకటి! ఒక ప్రాజెక్టు జలాశయంలో మరొక ప్రాజెక్టు ఎలా కడతారనేది ఆందోళన కలిగించగల మరొక ప్రశ్న. ఈ ప్రాజెక్టు వల్ల శ్రీరా మ్ సాగర్ రిజర్వాయరులోని నీరు కొన్ని సందర్భాలలో వెనుకకు మళ్ళుతుందని, బాబ్లీలోకి వెళ్ళిపోతుందనేది ఆంధ్రప్రదేశ్ భయం. ఇందుకు అనుగుణంగా వెనుకకు తెరుచుకునే వీలుగల గేట్లను బాబ్లీలో అమర్చడం జరుగుతున్నదట. ఇవన్నీ వినడానికే భయాం దోళనలు కలిగించగల అంశాలు. బాబ్లీ కేవలం బరాజ్ అని, ఆనకట్ట కాదని, దానిలో భారీగా నీటి నిల్వ ఎలా సాధ్యమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి వాదిస్తున్నారు. అందుకు బదులుగా ఆంధ్రప్రదేశ్ కూడ దీటయిన వాదమే చేస్తున్నది. డెల్టా జిల్లాలలో ప్రకాశం బరా జ్, ధవళేశ్వరం బరాజ్‌ల కింద లక్షలాది ఎకరాలు సాగవుతున్న పుడు, బాబ్లీ కింద ఎందుకు సాధ్యం కాదనేది ఆంధ్ర వాదం. సమ స్య ఇంత తీవ్రంగా వున్నప్పుడు, న్యాయం దిగువ రాష్ట్రమయిన ఆంధ్ర వైపు వుందన్నప్పుడు- కేంద్రమే పూనుకుని ఇరు రాష్ట్రాల మధ్య రాజీ కుదిర్చితే అది ఒక పద్ధతిగా వుండేది! అలా జరగలేదు. అందుకే ఇప్పుడు ఇది ఇంత జటిలంగా మారడం! అందరికీ ఇప్పు డు సుప్రీంకోర్టే శరణ్యం అయింది. అక్కడ చివరకు ఏమి జరిగినా, ఒక్క విషయమయితే స్పష్టం. సమైక్య పోరాటాలతో తప్ప ఇతరత్రా ఏదీ సాధించుకోజాలమన్న నీతిని బాబ్లీ ఉదంతం మరోసారి మన కు గుర్తు చేస్తున్నది. అదే విధంగా- అత్యంత కీలక సందర్భాలలో మన ప్రజాస్వామ్య ప్రక్రియ ఎంత నిశ్చేతనంగా, నిస్సహాయంగా మిగిలిపోతున్నదో అర్థం అవుతున్నది. ఇదంతా ఆందోళన కలిగిం చగల ఒక పరిణామం. మార్గదర్శకత్వ లేమి మనకు పట్టిన అసలైన దౌర్భాగ్యాలలో ఒకటి. -ఇనగంటి వెంకట్రావు (andhra jyothy 4-20-2007)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment