కేంద్రం పెంచిన వంటగ్యాస్ ధరను ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నాటకీయంగా తగ్గించారు. శుక్రవారం ప్రతిపక్షాలు తలపెట్టిన బంద్ ఇక కొద్ది గంటల్లో ప్రారంభమవుతుందనగా గుంటూరులో జరిగిన ఒక సభలో ఆయన ఈ తగ్గింపు ప్రకటన చేయడం విశేషం. పెట్రోలు లీటరుకు అయిదు రూపాయలు, డీజిల్ మూడు రూపాయలు, వంట గ్యాస్ సిలిండర్ యాభై రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మీడియాలో ఎంత ప్రచారం లభించిందో, వంట గ్యాస్ ధర తగ్గించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయానికీ మీడి యా అంతే ప్రాధాన్యం ఇచ్చింది.
పెట్రో, డీజిల్ ధరల పెంపు సయితం భారీగానే వున్నా, గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి యాభై రూపాయలు పెంచడం మధ్య తరగతికి మరీ భారంగా అనిపించింది. ఇది ఇంటింటా మహిళలలో చర్చనీయాంశం అయింది. అందుకే ధరల సెగ తక్షణమే ప్రభుత్వాలకు తాకడం! ఇంత వేగంగా వంట గ్యాస్ ధర తగ్గడం మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు పెద్ద రిలీఫ్! ఆ మేరకు ముఖ్యమంత్రి రాజకీయంగా తెలివయిన నిర్ణయం తీసుకున్నట్టే! కాకపోతే పెట్రోలు, డీజిల్ ధరల మంట అలాగే కొనసాగుతున్నది. దాని దుష్ప్రభావం రాబోయే వారాలలో ప్రజలపై మరింతగా పడడం తథ్యం.
ముఖ్యంగా డీజిల్ ధర పెంపు రవాణాపై అదనపు భారం గా పరిణమిస్తుంది. ఫలితంగా అన్నిరకాల వస్తువుల ధర లు పెరుగుదల. ఇప్పటికే ధరలు ఆకాశాన్ని అంటాయని, ద్రవ్యోల్బణం అదుపు తప్పిందని ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. పెట్రో ధరలతో ద్రవ్యోల్బణం మరింత రెక్కలు విచ్చుకునే ప్రమాదం పొంచి వుంది. యు.పి.ఎ. పాలనలో మొదటి నాలుగేళ్ళూ అంతా సవ్యంగానే వుందని, మన్మోహన్-చిదంబరం ద్వయం మార్గదర్శకత్వంలో దేశ ఆర్థిక వ్యవ స్థ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వికసిస్తున్నదన్న ఆనందోత్సాహాలు కాస్తా ఇటీవలి కాలంలో ఆవిరి అవుతున్న సూచనలు.
ఎన్నికల ఏడాదిలో ఇది కాంగ్రెస్ పార్టీకి ఎదురీత వంటిది. అందుకే కాబోలు, పెట్రో వస్తువుల ధర ల పెంపుపై ప్రధాని ఏకంగా జాతి నుద్దేశించి టి.వి. ప్రసం గం చేయడం! పెంపు ఎంత అనివార్యమైందో వివరించడం! కేంద్ర నిర్ణయాలకు విరుగుడుగా రాష్ట్ర స్థాయిలో మాత్రం రాజశేఖరరెడ్డి నష్ట నివారణ చర్యలను వెంటనే చేపట్టారు. పెంచిన గ్యాస్ ధరను భరించినట్టే, ఎంతో కొంత పెట్రోలు, డీజిల్ ధరలను కూడ తగ్గిస్తారేమో చూడాలి! ఎందుకంటె, ప్రతిపక్షాలు ఇప్పటికే రకరకాల ఆందోళనలు చేపట్టాయి. రాష్ట్రవ్యాప్త బంద్‌కు శుక్రవారం పిలుపు ఇచ్చా యి.
ధరల పెరుగుదల విషయంలో అధికార పార్టీకి ఎవ రూ సానుభూతి చూపరు. అదీకాక,కాంగ్రెస్ పార్టీకి దేశం లో ఇక మిగిలిన పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే! రాబో యే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ఫలితాలు- కేంద్రంలో కాంగ్రె స్ భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. ఆయా రాష్ట్రాలలో వరుసగా ఎన్నికలు ఓడిపోతున్న నిరాశాజనక పరిస్థితులలో మొన్నటి తెలంగాణ ఉప ఎన్నికల విజయాలు కాంగ్రెస్ పార్టీకి - ఎడారిలో ఒయాసిస్సు వంటివి. కర్ణాటకలో ఓడిపోయిన దిగులుకు ఇది ఒకింత వూరడింపు. ఉప ఎన్నికల ఫలితాలతో రాజశేఖరరెడ్డి ప్రతిష్ఠ రాష్ట్రంలో ఏమో కాని, కాంగ్రెస్ పార్టీలో మాత్రం అమాంతం పెరిగిపోయింది.
ఆపార్టీ నావకు చుక్కాని ఇప్పుడు ఆయనే! ఉప ఎన్నికల విజయాలతో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ధైర్యం ఇనుమడించింది. తన మార్గం సరయినదేనన్న నమ్మకం పెరిగింది. తన వ్యూహాలు ఫలిస్తాయన్న ఆశాభావం రెట్టింపు అయింది. మొన్నటి ఓటును ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి వ్యతిరేక ఓటుగా కంటె, తమ ప్రభుత్వ అనుకూల ఓటుగానే ఎక్కువగా పరిగణిస్తున్నారు. అదే ఆయన ఉత్సాహం! ఇదే బాటలో ముందుకు వెడితే ఎన్నికల నాటికి మరిన్ని మంచి ఫలితాలు సాధించగలమన్న నమ్మకం! వంటగ్యాస్ ధర తగ్గించడం కూడ ప్రతికూల ప్రభావాలను అదుపు చేసే ప్రక్రియలో భాగమే!
ఇదంతా ఎన్నికల సమయంలో ఎవరయినా చేసే పనే కాని రాజశేఖరరెడ్డి- పథకాల రూపంలో కాని, ఇతర రూపాలలో కాని అందిస్తున్న సహాయం మిగతా ప్రభుత్వాల కంటె భిన్నం. వాటిలో వూహించలేనంత భారీతనం, అదే సమయంలో నిర్ణయాలలో వేగం. తాయిలాలు అనండి, ఓట్ల కోసం వేస్తున్న ఎర అనండి, వ్యక్తుల పరంగా, కుటుంబాల పరంగా ఇంత భారీగా పరోక్ష, ప్రత్యక్ష సహాయాలు అందిస్తున్న ప్రభుత్వాలు తక్కువ. ప్రభుత్వ సహాయాలతోటే ఆయన ఆగిపోవడం లేదు. పోల్ మేనేజ్‌మెంట్‌లో సయితం అదే వేగం, అదే నైపుణ్యం, అదే భారీతనం!
రాజశేఖరరెడ్డి పోల్ మేనేజ్‌మెంట్‌లోని ప్రత్యేకత- మూడో కంటికి తెలియకుండా ముందస్తుగా జరిగిపోయే ఏర్పాట్లు! ప్రీ ఫైనల్ పరుగు పోటీలుగా పరిగణన పొందిన తెలంగాణ ఉప ఎన్నికలు కాంగ్రెస్‌తో పాటు, తెలుగుదేశం పార్టీకీ వూపిరి పోశాయి. తెలుగుదేశం పార్టీ ఆదినుంచీ ఈ ఎన్నికలలో తగినంత ప్రభావం చూపగలదని అనుకుంటున్నదే కాని సీట్ల పరంగా కాని, ఓట్ల పరంగా అది ఇంత ప్రాబల్యం ప్రదర్శించగలదని, ఇంతటి గట్టి ప్రత్యర్థిగా నిలబడగలదని చాలామంది అనుకోలేదు. అది గెలిచింది నాలుగు అసెంబ్లీ స్థానాలే అయినా, వాటితోపాటు వరంగల్ లోక్‌సభ స్థానాన్ని కూడ గెలుచుకోవడం దాని ప్రతిష్ఠను పెంచింది.
బహుశ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలవరపెట్టిన అంశం కూడ ఇదే కావచ్చు! ఎందుకంటె, తీవ్రస్థాయిలో జరిగిన ముక్కోణపు పోటీలో వరంగల్ వంటి ప్రతిష్ఠాత్మక స్థానాన్ని గెలుచుకోవడం అంటే చిన్న విషయం ఏమీ కాదు. మొత్తానికి ఇప్పటికే మండుటెండలో మీకోసం యాత్రను మూడవ వంతు ముగించుకున్న దశలో- తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ఇది కొండంత బలం. ఇప్పుడు తెలుగుదేశం నేతలు 2009 ఎన్నికలను గురించి ఉత్సాహంగా ఆలోచనలు చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతం ఇదివరకే అనేక ప్రయోగాలకు వేదిక అయింది. వాటిలో అధికం 1969 నుంచీ కాంగ్రెస్ పార్టీ చేసినవే.
ఇప్పుడు బహుశ తెలుగుదేశం వంతు. మరి దాని ప్రయోగాలు ఏ రూపంలో వుంటాయో చూడాలి! అయితే, విజయాలను గురించి ఎవరెన్ని గొప్పలు చెప్పుకుని పొంగిపోయినా, ఈ ఉప ఎన్నికలలో బయటపడిన వాస్తవం ఒకటి వుంది. అది- ఏ ఒక్క పార్టీ కూడ- తనంత తానుగా పోటీచేసి తెలంగాణలో ఎన్నికలు గెలవలేని పరిస్థితి. ఇది నిజానికి కొత్తదేమీ కాదు. ఇదివరలో వున్న పరిస్థితే! ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, ప్రతి కుటుంబానికి పదివేలో, పాతికవేలో ప్రయోజనాల వంటివి కల్పించినా కాంగ్రెస్ తనంత తానుగా మెజారిటీ స్థానాలు గెలుచుకోలేదన్న విషయం ఉప ఎన్నికలలో ధృవపడింది.
అదేవిధంగా కాంగ్రెస్‌కు ప్రబల ప్రత్యర్థిగా, అధికారానికి ప్రత్యామ్నాయంగా పరిగణన పొందుతున్న తెలుగుదేశం పార్టీకీ అలాంటి అవకాశం కనిపించడం లేదు. ఇక టి.ఆర్.ఎస్! తెలంగాణయే తాను, తానే తెలంగాణ అని భావించే తెలంగాణ రాష్ట్ర సమితికీ అలాంటి అవకాశాలు మృగ్యం. కాని ఈ ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అతి పెద్ద పార్టీగా- ఏడు స్థానాలను గెలుచుకున్న వాస్తవాన్ని విస్మరించకూడదు. పెద్ద పార్టీగా రుజువు చేసుకుని కూడ ఆ పార్టీ ఓటమి భారంతో కుంగిపోతున్నది. అదేవిధంగా ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు కూడ! కరీంనగర్‌లో 15 వేల ఓట్ల మెజారిటీతో మూడోసారి నెగ్గి కూడ ఆయనకు శిరోభారం తప్పలేదు.
ఆదినుంచీ అంచనాల బరువు ఎక్కువై తెలంగాణ ఉప ఎన్నికలలో టి.ఆర్.ఎస్. దెబ్బతిన్నది. ఆ మేరకు కాంగ్రెస్, తెలుగుదేశం లాభపడ్డాయి. వచ్చిన ఫలితాలతో సంబరపడ్డాయి. ఉప ఎన్నికల ఫలితాల తీరు చూసి తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఎంతగా దిమ్మెరపోయారో, రాజకీయేతర తెలంగాణావాదులూ అంతే దిమ్మెరపోయారు. కాకపోతే వారందరికీ ఒకటే వూరట! కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండూ కూడ- తెలంగాణ పేరు చెప్పుకునే ఈ మాత్రం సీట్లయినా గెలుచుకోగలిగాయని! తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు తెలంగాణ విషయంలో ఏదో ఒకటి తేల్చి చెప్పాలని ఆ పార్టీలను వారు డిమాండ్ చేస్తున్నారు.
కాని వీరికి ఉన్నంత తొందర ఆ పార్టీలకు ఎందుకు వుంటుంది! ఎన్నికల ప్రచారంలో కేవలం ఆత్మరక్షణ నినాదంగా తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకున్న ఆ పార్టీలు, తమకు ఆధిపత్యం తెచ్చిపెట్టిన రాజకీయ ఎత్తుగడలనే నమ్ముకుని ఆచితూచి ముందుకు సాగే అవకాశాలు అధికం. పైగా ఆగస్టులో చిరంజీవి కొత్త పార్టీ రానున్న సమయంలో అవి అసలే తొందరపడవు. ఆయన పార్టీ పెట్టి తెలంగాణపై ఏమి తేలుస్తారో, ఆయన పార్టీ పట్ల ఆయా ప్రాంతాల ప్రజలు ఏవిధంగా స్పందిస్తారో చూసుకుని కాని ప్రధాన పార్టీలు ఒక అంచనాకు, ఒక అభిప్రాయానికి రావు. అదేవిధంగా చిరంజీవికి కూడ మొన్నటి ఉప ఎన్నికల ఫలితాలు చేసిన కొత్త ఉపదేశం ఏదీ లేదు.
ఇప్పటికీ తెలంగాణపై ఇదమిత్థంగా ఏదీ నిర్ణయించుకోలేని స్థితి. ప్రీ ఫైనల్ అన్న పేరుకు తగ్గట్టుగానే ఈ ఉప ఎన్నికలు నిజంగానే రాబోయే ఎన్నికల ఫైనల్‌కు గట్టి హెచ్చరికలే చేశాయి. చంద్రశేఖరరావును ఉప ఎన్నికలు మానసికంగా గట్టిగానే దెబ్బతీశాయి. రెండు రోజులపాటు ఆయన బయటకు రాకపోవడంలోనే ఆ విషయం స్పష్టం. ఆ తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చిన తర్వాత ఆయనే ఆ విషయం స్వయం గా చెప్పుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేయడం అన్నది కేవలం నైతికం, లాంఛనప్రాయం.
వ్యక్తులు కేంద్రబిందువులుగా నడిచే ఏ పార్టీలోనయినా అధినేతలు రాజీనామా చేయడం కుదిరేపని కాదు. కష్టమో, నష్టమో ఆ బంధం విడేది కాదు. పార్టీ కార్యవర్గం చంద్రశేఖరరావు రాజీనామాను తిరస్కరించడం, వారి అభిమతానికి తలవొగ్గి ఆయన పార్టీ పగ్గాలు చేపట్టడం- ఇదంతా వూహించిన పరిణామమే. అధినేత కాని, పార్టీ కాని షాక్ నుంచి తేరుకుని తిరిగి క్రియాశీలం కావడానికి సహజంగా ఎక్కడయినా జరిగే తంతే ఇది! ఇదివరకు ఇతర పార్టీలలో జరిగిందే ఇప్పుడు టి.ఆర్.ఎస్.లోనూ జరిగింది.
కాకపోతే- ప్రత్యర్థి పక్షాలు ఎన్ని టక్కుటమార విద్యలు చేసినా, వాటినన్నిటినీ తోసిరాజని ప్రజలు ఉప్పెనలా వచ్చి తమకు ఎందుకు ఓటు వేయలేదన్న బాధ మాత్రం అధినేతను, ఆ పార్టీలోని ఇతర నేతలనూ వేధిస్తున్నది, వెంటాడుతున్నది. తెలంగాణలో ఏకపక్ష రాజకీయం కుదరదన్న వాస్తవం తేలిపోవడం ఆ పార్టీకి చేదు అనుభవం. అయితే, తెలంగాణ రాజకీయ సమీకరణలను బేరీజు వేసుకుంటే, ఆయనకు మరొక పార్టీ అవసరం ఎంత వుందో ఇతరులకూ ఆయన అవసరం అంతే వుందన్నది స్పష్టం. 30 శాతానికి పైగా ఓట్లు సంపాదించుకున్న పార్టీని కాదని ఏ ప్రధాన పార్టీ అయినా అధికార పీఠం కోసం ఎలా అర్రులు చాచగలదు!
Andhra jyothy (6-7-2008)
Wednesday, August 27, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment