నాలుగు దశాబ్దాల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ నెరవేరాలంటే ప్రత్యేక రాష్ట్ర శక్తులన్నీ బిజెపిని సమర్థించక తప్పని పరిస్థితి. చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా విధానాన్ని ఆమోదించి అమలు చేస్తున్న బిజెపి 2009లో కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటు ఖాయం.
తెలంగాణ ఉప ఎన్నికలు రాష్ట్రంలో ఎన్నడూ లేనంత రాజకీయ ఆసక్తిని, ఒత్తిడిని సృష్టించాయి. ఫలితాల అనంతరం కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితికి, ఆమాటకొస్తే కెసిఆర్‌కు తప్ప ఎవరి కీ ఆసక్తి లేనప్పటికీ తెలంగాణ ఉప ఎన్నికలు రావడం దురదృష్టకరం. ఫలితాలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాయి. తెలంగాణవాదం తన గుత్త సొత్తు అన్నట్లుగా భావించి ఎన్నికలు తేవడంద్వారా మరింత బలోపేతం అవుదామని తెరాస ఎమ్మెల్ల్యేలు, ఎంపీలు రాజీనామా చేయడం వ్యూహాత్మక, చారిత్రక తప్పిదం.
ఉప ఎన్నికల ఫలితాలలో ఇటు కాంగ్రెస్‌కు అటు టిడిపికి తెలంగాణలో తాత్కాలిక రాజకీయ స్థానం లభించింది. ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఫలితాలు అధికార పార్టీకి కొంత అనుకూలంగానే వస్తాయి. తెరాస తర్వాత కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి అదొక కారణం. సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ తెలంగాణ అనుకూల వ్యక్తులు, శక్తులను కలుపుకొని పోవడంలో తెరాస విఫలమైంది. కరీంనగర్ ఎన్నికలో మాదిరిగా తెలంగాణ మేధావులు, కళాకారులు, తెరాసకు మద్దతుగా పనిచేయలేక మౌనంగా ఉండిపోయారు. తెరాస అధినేత కెసిఆర్ ఒంటెత్తు పోకడ, అహంకారం, నిరంకుశ అతిశయంతో కూడిన విధానాలు, ఏకపక్ష నిర్ణయాలు ప్రజల్లో అసంతృప్తిని రగిలించాయి.
ప్రజలు తెలివితో ఇచ్చిన తీర్పుతో ఒక్క కెసిఆరే కాదు, ఇటు అధికార పక్ష నేత వై.ఎస్.ఆర్, అటు ప్రతిపక్ష నేత చంద్రబాబుకూడా గ్రహించాల్సింది చాలావుంది. మొత్తం మీద ఉపఎన్నికల్లో ఎవరూ గెలిచినట్లుకాదు. అలాగని ఎవరూ ఓడినట్లు కాదు. ఎన్నికలను ఒకే ఒక అంశం ప్రభావితం చేయడం అనేది అరుదైన సందర్భాల్లో మాత్రమే సాధ్యం. 1977లో ఎమర్జెన్సీ వ్యతిరేకత, 1989లో బోఫోర్స్ కుంభకోణాల మాదిరిగా ఈ ఎన్నికలను తెలంగాణ సెంటిమెంటు ప్రభావితం చేయలేకపోయింది. అధిక ధరలు, అవినీతి, అస్తవ్యస్థ పాలన వంటి వివిధ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు పరిగణనలోకి తీసుకోవడంతో ఫలితాలు భిన్నంగా వచ్చాయి.
ఎమ్మెల్లేల పనితీరును కూడా ఓటర్లు బేరీజు వేశారు. తెరాస ఈ అంశాలను పట్టించుకోకపోవడంతో భారీ మూల్యమే చెల్లించాల్సివచ్చింది. సరిగ్గా ఇదే అం శంలో టిడిపి, కాంగ్రెస్‌లు పైచేయి సాధించాయి. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదంటూ టిడిపి, కాంగ్రెస్‌లు తెలంగాణకు అనుకూలమేనన్న సంకేతాలతో ప్రజల్లో అయోమయాన్ని కలిగించడానికి ప్రయత్నించారు. ఈ మేరకు ఆ రెండు పార్టీలు నిజాయితీగా వ్యవహరించలేకపోయాయి. ముఖ్యమంత్రి వై.ఎస్. ఈ ఉప ఎన్నికలను తన ప్రతిష్ఠకు సవాల్‌గా భావించారు.స్వతహాగా సమైక్యవాది, తెలంగాణ వ్యతిరేకి అయిన వై ఎస్ ఈ గెలుపుతో తన వైఖరిని మరింత స్పష్టంగా బహిరంగపర్చవచ్చు. అధిష్ఠానం కూడా ఆయని కచ్చితమైన అభిప్రాయాలను వ్యతిరేకించక పోవచ్చు. ఆయన నిర్ణయాలను వీటో చేయకపోవచ్చు.
భవిష్యత్తులో కూడా ఆయన మాటే నెగ్గవచ్చు. ఈ పరిణామాలన్నీ తెలంగాణకు ప్రమాదకర సంకేతాలను అందించేవే. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే ఒకింత గందరగోళ పరిస్థితులల్లోనే ఆ పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. తెలంగాణలో తన కంటే ఎక్కువ బలమున్న కాంగ్రెస్, తెరాసలను ఎదుర్కోక తప్పని పరిస్థితి. ఇది పార్టీ అస్తిత్వానికే పరీక్ష. కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై పార్టీ అధినేత చంద్రబాబు దృష్టి సారించి అదేపనిగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డా రు. ఈ విషయంలో తెరాస విఫలమయింది. దాంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా టిడిపి దక్కించుకోగలిగింది. తెరాస అధినేత కెసిఆర్ నాయకత్వ వైఫల్యం, వ్యూహాత్మక తప్పిదాల వల్లే ఉపఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలయిం ది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరి అధికారాలను అనుభవించిన తర్వాత తమకు పదవులు గడ్డిపోచలతో సమానమన్న, త్యాగాల పునాదుల మీద తమ పార్టీ ఏర్పడిందన్న వాదనలో పసతగ్గింది. ఉద్యమాన్ని కొనసాగించకుండా లాబీయింగ్ అంటూ ఢిల్లీలో కూర్చుని తెలంగాణ ఏర్పాటుకు డెడ్‌లైన్లు విధించుకుంటూ పోవడంతో ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. పార్టీని, ఉద్యమాన్ని సంస్థాగతంగా పటిష్టం చేయకుం డా, తెలంగాణ ప్రజల రోజువారీ సమస్యలపై పోరాటం చేయకుండా ఢిల్లీలో కూర్చుని రాష్ట్రం తెస్తామని బీరాలు పలుకుతుంటే ఇక్కడ పార్టీ పునాదులు కదిలిపోయాయి. నిజాం పాలనను కెసిఆర్ పొగడడంతో ప్రజల మనోభావా లు దెబ్బ తిన్నాయి.
తెలంగాణను కాంగ్రెస్ మోసం చేసింది, ద్రోహం చేసిందంటూ తీవ్ర విమర్శలు గుప్పించిన కెసిర్, తన దాడులు ముఖ్యమంత్రి వైఎస్ పై ఎక్కు పెట్టడం గమనార్హం. తెలంగాణ ఇవ్వడం- ఇవ్వకపోవడం ముఖ్యమంత్రి చేతిలో లేదని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా చేతిలో ఉందని తెలిసి కూడా కెసిఆర్ సోనియాను విమర్శించలేదు. దీంతో తన అజెం డా ఏమిటో కెసిఆర్ చెప్పకనే చెప్పారు. ఆయన తిరిగి సోని యా పంచన చేరే అవకాశం ఉందనేది ప్రజలకు అర్థమైంది. ఇటువంటి అస్పష్ట వైఖరులే ఇటు కెసిఆర్-అటు తెరాస పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోయేలా చేశాయి.
తెలంగాణకు కట్టుబడి ఉన్నామని జాతీయ స్థాయిలో తీర్మా నం చేసిన బిజెపి ఉప ఎన్నికలను అప్రధానమైనవిగానే భావించింది. (ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా జాతీయ స్థాయిలో తీర్మానం చేసి పార్లమెంటులో మాట్లాడిన ఏకైక పెద్ద పార్టీ బిజెపినే నన్నది మరచిపోకూడదు). రాజీనామాలు చేసి ఎన్నికలు రుద్ది, ఎన్నికలు తెలంగాణకు రెఫరెండం అనడాన్ని పార్టీ వ్యతిరేకించింది. 2009 ఎన్నికలపై దృష్టిసారించిన బిజెపి వ్యూహాత్మకంగానే ఉప ఎన్నికల్లో సీరియస్‌గా పాల్గొనలేదు. సార్వత్రిక ఎన్నికలపై జరుగుతున్న కసరత్తును ఆటంకపరచరాదని పార్టీ నేతలు భావించారు. అయితే తెలంగాణ వాదానికి కట్టుబడే ఉన్నామని చెప్పడానికి ఒక్క ముషీరాబాద్‌లో మాత్రమే ఆ పార్టీ పోటీ చేసింది.
తెలంగాణ అనుకూల ఓట్లు చీలిపోగూడదనే మిగిలినచోట్ల పోటీచేయకుండా ఒక్క ముషీరాబాద్‌లోనే బరిలోకి దిగితన సత్తాచాటింది. అధికార పక్ష అంగ, ఆర్థబలాన్ని హోరాహోరీ పోరాడింది. బిజెపి బలంగా ఉందనడానికి ముషీరాబాద్‌లో పొందిన ఓట్లే నిదర్శనం. నైతికంగా చూసినట్లయితే ఇక్కడ బిజెపి ఓడినా గెల్చినట్లే. ఈ నేపథ్యంలో తెలంగాణ విషయంలో చిత్తశుద్ధి ఉన్న పార్టీ లూ, వ్యక్తులు, శక్తులు అన్నీ ఆశయ సాధన కోసం ఏకంకాక తప్పదు. ఇప్పటికే జాతీయ స్థాయిలో తిరుగులేని విధంగా బలోపేతమైన బిజెపి పక్కా ప్రణాళికతో 2009 ఎన్నికలకు సన్నద్ధమవుతోంది.
యుపిఏ ప్రజా వ్యతిరేక పాలనతో విసిగి పోయిన ప్రజలు వివిధ రాష్ట్రాలలో బిజెపికి పట్టం కడుతున్నా రు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరి అద్వానీ ప్రధాని కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో మూడు చిన్న రాష్ట్రాలను ఏర్పాటుచేసిన ఘనత గల ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఖాయమనేది ప్రజల విశ్వాసం. సార్వత్రిక ఎన్నికలే తెలంగాణకు కీలకంకాబోతున్నాయి. నాలు గు దశాబ్దాల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ నెరవేరాలంటే ప్రత్యేక రాష్ట్ర అనుకూల శక్తులన్నీ కేంద్రంలో బలంగా ఉన్న బిజెపిని సమర్థించక తప్పని పరిస్థితి. చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా విధానాన్ని ఆమోదించి అమలు చేస్తున్న బిజెపి 2009 లో కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటు ఖాయం.
ఉప ఎన్నికలలలో ఏ పార్టీకి మెజారిటీ సీట్లు రాకపోవడాన్ని విశ్లేషిస్తే రాష్ట్రంలో కూడా సంకీర్ణ రాజకీయ శకం ఆరంభమవుతుందా అనే అభిప్రాయం కలుగక మానదు. రాబోయే కాలం లో కొత్త పార్టీలు వస్తున్నాయనే వదంతులు విస్తృతంగా ఉన్న సమయంలో ఉప ఎన్నికల ఫలితాలు ఈ అభిప్రాయాన్ని మరింత దృఢతరం చేశాయి. వచ్చే ఎన్నికలలో హంగ్ అసెంబ్లీ తప్పదని చెబుతున్న నేపథ్యంలో బిజెపి కీలక శక్తిగా ఎదుగుతుందనేది పరిస్థితులను బట్టి అర్థమవుతున్న వాస్తవం.
(వ్యాసకర్త బిజెపి రాష్ట్రశాఖ అధ్యక్షులు) ANdhra jyothy (6-18-2008)
Wednesday, August 27, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment