Tuesday, December 30, 2008

మరణవాంగ్మూలం

ఆకాశం భూమీ కలిసే పూట శబరీ గోదారీ కలిసేచోట
సంజెరంగుల్లో కమ్ముకున్న
విషాదపు జీర
చరమాంకంలో ఒకానొక గ్రామం
ఆ పక్కన
శిధిలమైన కొయ్య పడవ
కన్నతల్లి ముందు మోకరిల్లి
మరణవాంగ్మూలం వింటున్నాను
నది అలలపై ప్రతిబింబం
తలారి ముఖంలోని గాంభీర్యం
దూరాన
టూరింగ్ టాకీస్ నుంచి
ఆఖరి సన్నివేశపు ఆవేదన
ఇచ్చోటనే
కొంచెం ఇప్పసారా
కొద్దిగా కొమ్ముబూరా
ఇచ్చోటనే
చలువ పందిళ్లు
పొగాకు బేళ్లు
ఇచ్చోటనే
గలగల ఘల్లుమన్న
రేలారేలా పరవళ్లు
మరియూ ఇచ్చోటనే కదా
ఏడేడు తరాలు
ఎనకటెనకటి పాటలు
అనాది రాగాలు
ఆది పురాణాలు
విల్లంబులు ఎద్దుకొమ్ములు
తునికి చుట్ట పరిమళాల
గుప్పుగుప్పు గాలి గిరికీలు
తరతరాల పాదముద్రలు
హృదయాలు శిలాజాలు
పాయం బొజ్జిగాడు
లాస్ట్ ఆఫ్ ది కోయాస్
పెరిగి పెద్దయి
అలెక్స్ హేలీ అవుతాడా
ఆనకట్ట వెనుక ఆశ్రు జలధిలో
సీతమ్మ ముక్కుపుడక
వెతుకుతాడా
లేక అంతర్ధానపు అంచున వేలాడి
రామా పితికస్ వలె
ఆంత్రోపాలజీ పాఠమవుతాడా
పురాతన జనసమాధి
జన సంస్క­ృతి జల సమాధి
చెరిపేసిన పాటలు
మునిగిపోయిన మానవుని జాడలు
ఊరి మధ్య రావిచెట్టుకు
అమాయకంగా వేలాడుతున్న
కబోది పక్షులు
చివరకు మిగిలినది
ఛాతీ మీద చల్లుకున్న
పిడికెడు నల్లరేగడి
రామయ తండ్రీ
నీ అరణ్యాన్ని
ఆవాసాన్ని ఆవరణాన్ని
లేడి పిల్లల్నీ అడవి బిడ్డల్నీ
నీ పాదాలు ముద్దాడే పాపికొండల్నీ
రేపోమాపో
రెవెన్యూ రికార్డుల నుంచి తొలగిస్తారు
రామా
ఇలా రా
నా పక్కన కూర్చో
నాతో కలిసి
ఈ మట్టి మరణవాంగ్మూలం విను
దమ్మక్క పెడుతున్న శాపనార్ధాలు విను
వినరా విను!
సీలేరు ఒడ్డున విరుగుతున్న విల్లు
ఫెట ఫెటేల్ ధ్వానాల్ విను!
వినరా విను!

- అరుణ్‌సాగర్

ఆంధ్రజ్యోతి నుండి..
.

Thursday, December 25, 2008

ఆర్ద హృదయుడు జ్వాలాముఖి - నిఖిలేశ్వర్



'వెళ్తాను సెలవంటూ భౌతికంగా శాశ్వతంగా సెలవు పుచ్చుకు'తూరుపు ఎరుపు హోరు కోసం


నిర్మల నక్షత్రాలై పోరాడండి


వెళ్తాను సెలవు / విజయం మనకు తప్పదు


విప్లవాలు సుదీర్ఘ సాయుధ ప్రయాణాలు


చీకటితో పోరాటం ఆపవద్దు


రాత్రితో రాజీలేక పోవడమే తిరుగుబాటు


ఉజ్వల ఉదయానికి ఎడతెగని పోరాటమే విప్లవం'


(ఆకాశం ఎర్రబడుతూంది)









'వెళ్తాను సెలవంటూ భౌతికంగా శాశ్వతంగా సెలవు పుచ్చుకున్న ఆప్తమిత్రుడు జ్వాలాముఖి నా జ్ఞాపకాల్లో జ్వలిస్తూనే వుంటాడు. మా ఇద్దరి జీవితాలతో- అనేక ఉద్యమాలతో పెనవేసుకున్న మా కవితా యాత్రలో ఎన్నెన్నో మజిలీలు...





జ్వాల తొలి దశలో రచించిన 'మనిషి'ని 1958-59లోనే మేము విన్నాము. ముషీరాబాద్ బస్తీలో నేను నిర్వహించిన 'అభ్యుదయ యువక సంఘం' ప్రతినెలా ఏదో ఒక సామాజిక అంశంపై వక్త ృత్వ పోటీని నిర్వహించేది. నగరంలోని ఆయా ప్రాంతాల నుంచి యువకులు వచ్చి పాల్గొనేవారు. ఒకసారి సీతారామ్‌బాగ్ నుంచి వచ్చిన ఆకారం వీరవెల్లి రాఘవాచారి మా వేదికపై బల్లగుద్ది మాట్లాడి, తన 'మనిషి' కవిత వినిపించాడు. ఇక ఆనాటి నుంచి మా స్నేహయాత్ర అవిచ్ఛిన్నంగా సాగిపోయింది.





హైదరాబాద్ సాయం కళాశాల (నిజాం కాలేజ్)లో 1959-63 మధ్య మా డిగ్రీ చదువు. నేనూ, నగ్నముని బి.ఏ మొదటి సంవత్సరంలో వుండగా జ్వాల పి.యు.సి.లో వచ్చి చేరాడు. ఆయన రెండో భాష తెలుగు. నేనేమో హిందీ. ముని మాత్రం ఫ్రెంచి భాషలో! కాలేజీలో జరిగే డిబేటింగ్ ముఖ్యంగా తెలుగు శాఖలోని విద్యార్థుల మధ్య వాగ్వివాదాలలో జ్వాలాముఖి అప్పటికే ఆవేశంగా మాట్లాడేవాడు. నేనేమో తడబడుతూ గందరగోళపడిపోయేవాణ్ణి!





ఆ రోజుల్లోనే (1960) నేనూ, జ్వాల సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని ఏ.వో.సి (ఆర్మీ ఆర్డినెన్స్ కోర్) సెంటర్‌లో సి.ఎస్.యమ్ (సివిలియన్ స్కూలు మాస్టర్) ఉద్యోగాలు సంపాదించుకున్నాం. కొత్తగా చేరే ఆర్మీ రిక్రూట్లకు ఇంగ్లీషు-హిందీ జనరల్ నాలెడ్జి బోధించేవాళ్లం. జ్వాల ప్రతిరోజు ఉదయాన్నే 7 గంటలకే సైకిల్‌పై బయలుదేరి మల్లేపల్లిలోని సీతారామ్ దేవాలయం నుంచి దాదాపు పదిహేను మైళ్లు ప్రయాణం చేసి సెంటర్‌కు చెమటలు కక్కుతూ ఎనిమిది గంటలకల్లా చేరేవాడు.





నేనేమో ముషీరాబాద్ నుంచి సైకిల్ తొక్కుతూ రోజు 10 మైళ్లు అదే అవస్థలో ఉద్యోగానికి హాజర్! అప్పటికే రాఘవాచారిగా జ్వాల, నేనేమో కె.యాదవరెడ్డిగా కవితలు, వ్యాసాలు, కథలు రాస్తూ 'గోలకొండ పత్రిక' 'స్రవంతి' ఆ తర్వాత 'ఆంధ్రభూమి'లో ప్రచురించేవాళ్లం. ఈ రచనల నేపథ్యంలో మా దిగువ మధ్య తరగతి జీవన సమరం.. నిరంతరం వెంటాడిన ఆర్థిక ఇబ్బందులు.. అయినా పత్రికలు, గ్రంథ పఠనం మా వ్యసనం. అరిపిరాల విశ్వం, ఏ.మురళీధర్ లాంటి సీనియర్ కవుల సహచర్యంలో సాహిత్యంలో అడుగులు వేస్తూ కుందుర్తి ఆంజనేయులు వచన కవితా విశ్వవిద్యాలయంలో (ఫ్రీవర్స్ ఫ్రంట్) కవితాభ్యాసం చేస్తూ మా కుటుంబ సమస్యలను అధిగమిస్తూ.. 'రాత్రి' కవితా సంకలనం దాకా చేరుకున్నాము.





జ్వాలాముఖి పుట్టి పెరిగిన పరిసరాలు- వైష్ణవ సాంప్రదాయం గురించి ఇక్కడ ప్రస్తావించాలి. హైద్రాబాద్‌లోని సీతారామ్‌బాగ్‌లో వున్న సంస్కృ త కళాశాల, ప్రాచీన దేవాలయం, దేవాలయం చుట్టూ పేద వైష్ణవ కుటుంబాలు, తమిళ బ్రాహ్మణ పూజారులు, వారి నియమ నిష్టలతో కూడిన ఆచార వ్యవహారాలు- అక్కడే ఈ రాఘవాచారితోపాటు నివాసముంటు న్న కె.కె.రంగనాథాచార్యుల కుటుం బం- కె.కె.ఆర్ చిన్నాన్న సంస్కృత విద్వాంసులు, ఒక పీఠాధిపతి. నాన్నగారు అడ్వకేట్.





జ్వాల నివాసమున్న రెండు గదుల ఇరుకైన పెంకుటిల్లు- ఆవరణలో పెద్ద చింతచెట్టు- దేవాలయ ప్రాకారాల మధ్య, ప్రవేశ ద్వారం పక్కన కె.కె.ఆర్ రోజూ తాడు ఆసరాగా ఇరుకైన మెట్ల మీదుగా చేరుకునే చిన్నగది. అటు దూరంగా పెద్ద బావి.. పక్కనే పొలాలు.. ఈ వాతావరణంలో పురోహితులతో అక్కడి పేద వైష్ణవ కుటుంబాల నివాస గృహాల హక్కుల కోసం ఒక సుదీర్ఘ న్యాయపోరాటం!





మేము ఎ.ఒ.సి.లో ఉద్యోగం చేస్తున్నకాలంలో, సాయం కళాశాలలో డిగ్రీలో చివరి సంవత్సరం- అప్పుడే నా ప్రేమ వివాహం 1963లో! కులాంతర వివాహం, పైగా అమ్మాయి ఇంట్లో చెప్పకుండా వచ్చేసింది.. ఇక ఆ రహస్య వివాహానికి జ్వాలాముఖి అన్నివిధాలా తోడ్పడి యాకుత్‌పురాలోని ఆర్యసమాజ్ మందిర్‌లో వివాహం జరిగించాడు. విజయవాడ దాకా తోడు వచ్చి నన్ను-యామినిని బెంగుళూర్ హానిమూన్‌కు పంపించేసాడు.





ఆ తర్వాత మా కుటుంబాల ఆత్మీయ సంబంధాలు ఎంతో ఆప్యాయంగా సాగిపోయిన దశలోనే మా పిల్లల కులాంతర వివాహాలకు ఆయన నిర్వాహకుడు. ఆయన పిల్లల కులాంతర- మతాంతర వివాహాలకు నేను నిర్వాహకుడిగా..!





ఎ.ఒ.సి. నుంచి ఉద్యోగాలు మారిపోయిన తర్వాత మా జీవన పోరాటాలు అనేక రకాల వొడిదొడుకులకు లోనైపోయాయి. ఎమ్.హెచ్.కేశవరావు అనే నగ్నముని చొరవతో 'దిగంబర కవులు'గా మేమంతా పరిణామం చెందాము. ఎక్కడా నాయకత్వం గొడవ లేకుండా పరస్పరం నేర్చుకుంటూ విమర్శించుకుం టూ ఆబిడ్స్‌లోని మా సంచాలకుడు సుబ్రహ్మణ్యం సెంట్రల్ పాయింట్ గది లో, ఓరియంటల్ హోటల్, కింగ్ సర్కి ల్ స్థావరాలుగా మూడు సంపుటాల ఆవిర్భావం. మిత్రులు కె.కె.ఆర్ ఈ పరిణామాలన్నింటికి ప్రత్యక్ష సాక్షి. ఆయన జ్వాలకు బాల్య మిత్రుడు. 'దిగంబర కవుల' మూడో సంపుటి విశాఖలో ఆవిష్కరణ సందర్భం- ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల మధ్య జ్వాల ప్రసంగం.. డాక్‌యార్డ్‌లో కార్మికుల సమక్షంలో మా కవితా పఠనం మరచిపోలేని అనుభవాలు. అప్పుడే అనిపించింది వచన కవితా ప్రక్రియలో కూడా సరైన శైలీ విన్యాసంతో రాసి, గొంతెత్తి నాటకీయంగా కవితలను చదివి కార్మిక కర్షకులను కూడా మెప్పించవచ్చని!





ఇక 1969-70 మధ్య దేశవ్యాప్తంగా సాగిన లెనిన్ శతజయంతి ఉత్సవాలు, సభలు, సమావేశాలు ఒక పెద్ద మలుపు. 'దిగంబర కవుల' మూడు సంపుటాల చింతనలో ఈ దశలోనే మార్క్సిస్టు అవగాహన మరింత గాఢతను సంతరించుకుంది. మేము ఇటు హైద్రాబాద్ మొదలు కరీంనగర్, కాకినాడ, విశాఖ తదితర ప్రాంతాల్లో లెనిన్ శత జయంతి సభల్లో పాల్గొని, కవితలు చదివి ఉపన్యసించి తీవ్రమైన వాద వివాదాల, సందేహ సమాధానాల అనుభవాలతో ప్రజల నుంచి ఎంతో నేర్చుకున్నాము.



ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటిలో విప్లవ భావజాలంతో ముందుకొచ్చిన పిడిఎస్‌యు విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి ఆహ్వానం మేరకు ఓ.యు సైన్స్ కాలేజీలో జ్వాల ప్రసంగం విద్యార్థులను ఎంతో ఆకట్టుకుంది. మమ్మల్ని కాలేజీ ఉపన్యాసాలకు పిలిస్తే బాంబులతో వస్తారని ఆర్ఎస్ఎస్ అనుయాయులు (ఎబివిపి) కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసారు. అప్పుడు జ్వాల ప్రిన్సిపాల్ సమక్షంలోనే తనదైన శైలిలో ప్రసంగిస్తూ జేబుల్లోంచి కవితలు తీస్తూ, మేము బాంబులతో వస్తే పరిణామాలు మరో విధంగా వుండేవని చమత్కరించాడు.





నేనూ జ్వాల 1970 జనవరి తొలి రోజుల్లో అఖిల భారత ఒడియా (బరంపురం) యువ రచయితల మహాసభల్లో పాల్గొని విశాఖ చేరుకున్నాము. అప్పుడే శ్రీశ్రీ షష్టిపూర్తి ఉత్సవాల సంరంభం. ఆ శ్రీశ్రీ సన్మాన సభలో అంతకు మొదలు మేధావులకు విద్యార్థుల సవాల్ కరపత్రం సంచలనం కలిగించింది. అక్కడ ఉద్వేగంతో ప్రసంగించిన జ్వాలాముఖి వ్యాఖ్యానాలు తీవ్రమైన చర్చకు దారి తీసాయి. ఆ సాయంత్రం యూనివర్సిటీ ఆరుబయట రంగస్థలంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం (విద్యార్థి యూనియన్ ప్రారంభోత్సవం)లో శ్రీశ్రీ, కెవిఆర్, కొకు, రావిశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. మూడు తరాలమధ్య సాగిన ఒక సంభాషణగా ఆనాటి ప్రసంగాల్లో జ్వాల ఉత్తేజకరమైన ప్రసంగం మా కవితాపఠనం మరో సంచలనం. అధ్యక్షత వహించిన సీనియర్ ప్రొఫెసర్, అర్థ శాస్త్ర నిపుణుడు సర్వేశ్వరరావుగారితో అదే వేదికపై మా వివాదం!





విప్లవ రచయితల సంఘం ఆవిర్భావంలో మా పాత్ర ఏమిటో అం దరికీ తెలుసు. ఆ తర్వాత పౌర హక్కుల కోసం శ్రీశ్రీతో పాటు ఆంధ్రప్రదేశంతా తిరిగాము. కెవిఆర్ సంపాదకత్వంలో వచ్చిన 'ఝంఝ' కవితా సంకలనం నిషేధం.. వెనువెంటే పిడి ఆక్ట్ కింద జ్వాలాముఖి, చెరబండరాజు, నన్ను ఆనాటి ప్రభుత్వం అరెస్టు చేసి ముషీరాబాద్ జైలులో నిర్బంధించింది. ఆ నిర్బంధాన్ని మేము హైకోర్టులో సవాలు చేయగా, న్యాయమూర్తుల చారిత్రాత్మక తీర్పుతో విడుదలై వచ్చాము.





విరసం నుంచి మా రాజీనామా, జనసాహితి స్థాపన మొదలైనవన్నీ మరికొన్ని ఘట్టాలు. జ్వాల నాతోపాటు ఒపిడిఆర్, గ్రామీణ పేదల సంఘం, భారత చైనా మిత్రమండలి, ఆం.ప్ర. కుల నిర్మూలన సంఘం అగ్రస్థానంలో వుండి క్రియాశీలక పాత్రను నిర్వహించాడు. విప్లవ నాయకులు కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు ప్రభావం రాజకీయ స్పష్టతనిచ్చింది.





సభలు-సమావేశాలు- ఉపన్యాసాల మూలంగా తన పుస్తక ప్రచురణను నిర్లక్ష్యం చేసాడు. 1971లో వచ్చిన 'ఓటమి తిరుగుబాటు' తర్వాత మళ్లీ మరో సంపుటిని ప్రచురించలేదు. 'వేలాడిన మందారం' నవల, హైదరాబాద్ కథలు వున్నాయి. ఆయన నిశిత వివేచనతో రాసిన సాహిత్య వ్యాసాలు సంపుటిగా రావలసి వుంది. వ్యక్తిత్వ దృష్ట్యా స్నేహశీలీ, ఆర్ద్ర హృదయుడు, భోజన ప్రియుడు, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతిస్పందించిన సాహితీవేత్త.





సభలు - సమావేశాలు - ఉపన్యాసాల మూలంగా తన పుస్తక ప్రచురణను నిర్లక్ష్యం చేసాడు. 1971లో వచ్చిన 'ఓటమి తిరుగుబాటు' తర్వాత మళ్లీ మరో సంపుటిని ప్రచురించలేదు. 'వేలాడిన మందారం' నవల, హైదరాబాద్ కథలు వున్నాయి. ఆయన నిశిత వివేచనతో రాసిన సాహిత్య వ్యాసాలు సంపుటిగా రావలసి వుంది.





- నిఖిలేశ్వర్