Monday, September 29, 2008

మావ్వ దుక్కాల్ని దున్నిపోసుకున్న తొక్కుడుబండ


మావ్వ దిగుట్లె దీపం గాదు

ఆకాశం గొంగట్ల ఆగమైన పొద్దు

నేలమ్మ కొంగున అంగిట బట్టిన ఆకలి

ఒక్కొక్క పువ్వుగాదు

వెయ్యేసి పూలేసినా

ఒక్క జాము నిండని సందమామ మా అవ్వ

సేతికి సెమటకు తీరని తెల్లారని గోస

రోట్లె తల్కాయ బెట్టి రోకటికి

ఎదురొడ్డిన తాలుగింజ బతుకు కోడికూత


పొద్దులన్ని అవ్వ కండ్లల్లనే కాపేస్తయి

సుక్క పొద్దుల్ని ఆకిలూడ్సి

అలుకు జల్లి లేపేది

అడివిల ఆవొర్రది

ఇంటికాడ ల్యాగొర్రది


గుర్తింపు లేని గులాపుది మా అవ్వ

బువ్వ వుడుక లేదని.. మెత్తగైందని

రాయొచ్చిందని.. యెంటికొచ్చిందని

కూలేది.. నాలేది.. పనేది.. పాటేదని

అయ్య కోపాల కొలిమిలబడి

ఎన్నిసార్లు బస్మమై పుట్టిందో...

మా అందరికి మావ్వ వండిన కుండ వాల్సిన మంచమే

నాగేటి సాల్లల్ల యిత్తునమై

మొలిసే మొలకంతా మా అవ్వే


మోకాటి బంటి మడుగుల

పొద్దంగినా నడుమెత్తని నాటై.. కలుపై

దిగే పచ్చని పైరంతా మా అవ్వే

పారబట్టి ఒడ్లు సెక్కినట్లు రాగాలు సెక్కి

పల్లెకు పాటలూదిందంతా మా అవ్వే

అవ్వ పనిల దిగితే సెమట తోడిన సెలిమయ్యేది

పొయిల సల్లారని పిడికె నిప్పయేది

నేనవ్వ కడుపును నడికట్టోలె సుట్టుకున్న

వెచ్చటి యాదులే లేవు


సేగబారి కాయలు గాసిన మా అవ్వ

సేతిల పాలబువ్వ దిన్న సందమామ

సంగతులే యెరుకలే..

పాలకేడ్సిన ఆకలి, సత్తుగిన్నెల రాత్రి బువ్వ కాన్నే

సల్లారిన యాదులు సద్దుమనగలే..

అవ్వ పక్కల ఆవులించి ఆడుకున్న పొద్దులే లేవు


పలిగిన దప్పు మీది దరువు మా అవ్వ

బూమికి కాత పూత పంట ఫలం నేర్పి

తోలుకు తొండమై దప్పై చెప్పైన సెమటల్ల

సేదకు నోచని నాదము

ఆసామి, అయ్య సేతుల్ల

తాడును తప్పించుకునే బొంగురం తండ్లాట


భూమాతకు చాతిచ్చి బువ్వ బెట్టినా

నాగలికి దూరం జేసిన నారాజులు

దుక్కాల్ని దున్నిపోసుకున్న తొక్కుడుబండ

మూటిడువని చరిత్రల ముల్లె

కొంగు నడుముకు సుట్టి కొడవలెత్తిన సవాల్ మావ్వ

గీ లోకములున్న అక్షరాలు పాడువడ

మావ్వ తిరుగాడిన అంచులకే రాకపాయె


-జూపాక సుభద్ర

(తెలంగాణలో తల్లిని అవ్వ అంటము)

Monday, September 22, 2008

తెలంగాణకోసం పోరాడితే పోయేదేమిటి కామ్రేడ్స్



ఔను కామ్రేడ్స్.దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది. ఒకటా రెండా.. నూటపదకొండు సమస్యలచిక్కుముడుల మధ్య చిక్కుపడిన దారపు ఉండలా ఉంది. దరిద్రంగా ఉంది. రైతులు నాగేటి చాళ్ళలో మృత్యుసేద్యం చేస్తున్నారు. పేదలు పేదలుగానే, ధనికులు మరింత ధనికులుగానే... ఉన్నో డు ఉన్నతికి,లేనోడు అధఃపాతాళానికి పోతానే ఉన్నారు. నిజమే కామ్రేడ్స్...కమ్యూనిస్టుపార్టీ పుట్టి దశాబ్దాలు గడిచిపోయినా, ఏదీరాలేదు. ఏదీపోలేదు. సోషలిజం వీధుల్లో మూర్ఛనలు పోతూనే ఉన్నది. వరల్డ్‌బ్యాంక్ తోలుబొమ్మలాటలో ఏలికలు తైతక్కలాడుతూనే ఉన్నారు. కొంత నెత్తుటి తర్పణా జరిగింది. కొన్నివేలమంది వీరులూ మరణించారు.

ప్రపంచం కదలని మెదలని నిశ్చలతలోనూ లేదు. అది ప్రవహిస్తూనే ఉంది. ప్రపంచకార్మికులు ఏకం కానేలేదు. పెట్టుబడిదారీ కోటగోడలు కూలిపోనూ లేదు. సామ్రాజ్యవాదం బలహీనమైన లింకూ తెగిపోలేదు.నిరామయ ప్రపంచం. ఒక బందగీ... ఒక దొడ్డి కొమరయ్య, ఒక చాకలి ఐలమ్మా, ఒక వీరుడు మరణించాడు. వేనవేల వీరు లూ ప్రభవించారు. ఒక తెలంగాణ నెత్తురోడింది. కానీ అది ఓడిపోయింది. అదొక అంతర్గత వలసయింది. ఔను నిజం కామ్రేడ్స్. దేశం క్లిష్టపరిస్థితుల్లోనే ఉంది. ఏదీ మారలేదు. తెలంగాణలోనూ సవాలక్ష సమస్యలున్నాయి. అనేకానేక సమస్యలతో సతమతం అవుతోంది. ఔను నిజమే కదా! కేసీఆర్‌కు ఆ సమస్యలు పట్టవు. ఆయనకు కావలసింది ఒక్కటే కదా! తెలంగాణ. అది సమస్యలున్న తెలం గాణ అయినా సరే ఆయనకొక తెలంగాణ కావాలె.

నిజమే. ఆయన కమ్యూనిస్టు కాదు గదా! నూటొక్క సమస్యలతో సతమతమయ్యే కామ్రేడ్ కాదు గదా! తెలంగాణల ఏమి జరుగుతున్న దో ఆయనకెందుకు? ఆయనకు మంచిదో, చెడ్డదో, లంగదో, దొంగదో? తెలంగాణ కావాలె. జై తెలంగాణ అందామంటే కుడి ఎడమల కమ్యూనిస్టులకూ సవాలక్ష సమస్యలాయె. తెలంగాణ అందామంటే విశాలాంధ్ర ఏమయిపాయె. అలవాటయిన ప్రాణం కదా. కార్యక్షేత్రం తెలంగాణాయె. నెత్తురుడొల్లాడింది తెలంగాణలనేనాయె. దేశమంతటా భాషా ప్రయుక్త రాష్ట్రాలు రెండో మూడో.. అయిదో అయినా పర్వాలేదు. కానీ ఇక్కడ మాత్రం కాకూడదు కదా! ఎందుకంటే తెలంగాణల ఒక మజా ఉంది. హైదరాబాద్‌ల కూడా ఒక మజా ఉంది. బిర్యానీలాంటి భూములు. రియల్ ఎస్టేట్.కళ్ళముందర రంగారెడ్డి కబ్జా అయింది. చూస్తూ ఉండగానే హైదరాబాద్ తెలంగాణకు మాత్రం పరాయిదైపోయింది.

భాషలేదు, యాసలేదు. మొత్తానికి కూలిపోయిన ఇరానీ హోటల్లో, విస్తరించిన రోడ్డుపక్క కుంచించుకుపోయిన అడ్డాల్లో తెలంగాణ ఆత్మ ఇరుక్కుపోయింది. అదే మజా. మాల్స్ మజా. ఫ్రెష్‌ల మజా. జీవీకేలూ, జీ ఎమ్మార్‌లూ, దర్శినీ లూ, మెస్‌లూ... ఆంధ్రభోజనం దొరకబడును. ఇడ్లీలు, దోసెలు, కర్రీపాయింట్లు... అంతా అమ్మబడును, కొనబడును. అమ్ముడుపోయి ఆగమైపోయింది తెలంగాణ. ఎవరి ఊరిలో వాడు పరాయి కావడం, ఎవడిభాష వాడి ఊరిలో అర్ధం కాకపోవడం, బిక్కుబిక్కుమంటూ ఒదిగి మూలకు ముడుచుకుపోవడం గదా అస లు తెలంగాణ సమస్య. ఏలికలెవరైనా, పాలితులు ఎవరైనా, పాలకులు ఎవరైనా తెలంగాణ మాట చెల్లని స్థితి కదా భాషాప్రయుక్తరాష్ట్రమంటే.

భాష ఆదాన ప్రదానాలు... ఒక ప్రాంతపు భాషను (యాసకూడా) పూర్తిగా కునారిల్లజేయడమే కదా విలీ నం అంటే. కాడిమోసం చేసింది.కాడెద్దు మోసం చేసింది. చెయ్యిచ్చింది కాంగ్రెస్. చెన్నారెడ్డి, మదన్ మోహన్, మల్లికార్జున్... ఎవరి పేరయితేనేం? తెలంగాణ నలభై ఏళ్ళకిందట దగాపడింది.చివరికి ఇవ్వాళ్ళ కాకా అదే పని చేస్తున్నడు. ఉప్పునూతలా, ఎమ్మెస్సార్, చిన్నారెడ్డి,జీవన్‌రెడ్డి... తెలంగాణ ఒక ప్రయోగశాల. ఒక ఓటు, రెండు రాష్ట్రాలన్న బీజేపీ ఒకసారి ధోకా ఇచ్చింది. ఇప్పుడు ఇక కండ్లు తెరిచింది. మా... కాదు కాదు మూర్క్సిస్టులు, 'నో' డెమోక్రసీలు సరే సరి. కానీ కామ్రేడ్స్...తెలంగాణ అంటున్న మీకు మాత్రం దేశంలోనూ, తెలంగాణలోనూ ఉన్న అనేక సమస్యలు గుర్తుకొస్తాయి. కానీ, ఆగమైన తెలంగాణ గుర్తుకురాదు.

పోలవరం కడ్తుంటే పోతున్న గిరిజన ప్రాంతాలు గుర్తురావు.పోతిరెడ్డి పాడు గుర్తుకురాదు. 610 జీవో అమలు కాకపోవడమూ గుర్తుకురాదు. సకల రక్షణల ఉల్లంఘనలూ గుర్తుకురావు.యాభై సంవత్సరాల దగా పోరాటానికి ఒక అంశమూ కాదు. ఎందుకు కామ్రేడ్స్ మొహమాటాలు. తెలంగాణ మీకోసం నెత్తురు ధారవోసిన నేల. కమ్యూనిజం కోసం కదనరంగాన దూకి నైజాం బూజు వదిలించిన నేల. మీ తుపాకులకు భుజమిచ్చిన నేల. ఊరూరా ఎర్రని స్థూపాలతో, వాడవాడనా తమ ప్రాణాలను పూచిక పుల్లల్లా అర్పించిన అమరవీరుల నేల. చరిత్రను శ్వాసించిన నేల. చరిత్రను శాసించిన నేల. కానీ... అది తల్లడిల్లుతున్నది. మూడువేల గ్రామాల్లో ఎర్రజెండాలెగరవేసి,నేలను విముక్తం చేసిన ఈ తెలంగాణప్రజలకు ఇదేమి దరిద్రం.

దేశమంతటా లేని నదీజలాల మళ్ళింపు, వనరుల మళ్ళింపు,భాష యాసలమీద, సంస్క­ృతిమీద పెత్తనం, ఉద్యోగాలు దొరకని వైనం. స్తన్యం దక్కని శిశువు తెలంగాణ. అవును కామ్రేడ్స్... దేశానికి సమస్యలున్నాయి. తెలంగాణకు అదనంగా అదనపు సమస్యలున్నాయి. అన్నింటికీ ఎర్రజెండాలెత్తి కదనరంగంలోకి దూకి, వీధులు ఎరుపెక్కించే కామ్రేడ్స్... ఈ ఒక్క తెలంగాణ కోసం మాత్రం అటుగాని, ఇటుగాని సందిగ్ధం ఏలకలిగినో చెప్పగలరా? పోరాడకుం డా తెలంగాణలో చోద్యం చూస్తామనడం న్యాయమా? పోరాడేవాళ్ళకు తెలంగాణ ఒక్కటే... పోరాట వారసత్వమూ ఒక్కటే. కానీ... మీరే అటు ఇటుగాని హృదయముతోనీ...కమ్యూనిస్టులుగా... తగునా? తెలంగాణకోసం పోరాడితే పోయేదేమిటో?
- అల్లం నారాయణ, సీనియర్ పాత్రికేయులు (published in Andhra Jyothy)

Friday, September 19, 2008

సాంకేతిక తెలంగాణ సృష్టించాలి - చుక్కా రామయ్య


భూమి, భుక్తి, విమక్తి పోరాటాల నుంచి చైతన్యం పొందిన తెలంగాణ సాంకేతికంగా అభివృద్ధి చెందేందుకు అందరూ తలా ఒక చేయి వేయాలి. కాళ్ల కింద భూమిని కోల్పోతున్న దశను గుర్తించి కొత్త సోయితో ఉద్యమించాలి.


ఆగస్టు 15 (1947)న భారతదేశం శతాబ్దాల వలస పాలననుంచి విముక్తి పొందింది. తెలంగాణ అప్ప టికింకా ఒకపక్క నిజాంకు, మరో పక్క భూస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. భూమి, భుక్తి, విముక్తి కోసం మూడంచెల పోరాటాన్ని ఒకేసారి నిర్వహించవల సివచ్చింది. బ్రిటిష్ ఆంధ్రాలో కాల్పులు జరిగితే బ్రిటిష్ పార్లమెంటులో చర్చించేవారు. తెలంగాణలో విచక్షణా రహితంగా నిజాం ప్రభువులు కాల్పులు జరిపితే అడిగే నాథుడు లేడు. 1948 సెప్టెంబర్17కు ముందు వేలాది ప్రజల ప్రా ణాలు గాలిలో కలిసిపోయాయి. వాళ్ళ త్యాగాలను ఏ చరిత్రకారుడు లిఖించలేదు.
కనీసం వీర తెలంగాణ సా యుధ పోరాటంలో 4000 మంది అసువులు బాసారు. వారిపేర్లు కూడా ఎవరూ రాయలేదు. ఇంతమంది ఇన్ని త్యాగాలు చేసినా ఇప్పటివరకుకూడా ఎవరి చరిత్ర పైనా పరిశోధనా జరగనేలేదు. అటువంటి శ్రద్ధ చూపేవాళ్ళు కనిపించడం లేదు. ఈ పోరాటాలు చేయటానికి వీళ్ళం తా ఎక్కడికో వెళ్ళి శిక్షణ పొంది వచ్చినవారు కాదు. దేశ దేశాలు తిరిగిన వారు అంతకన్నా కాదు.

చరిత్రను చదు వుకుని, త్యాగాల గురించి తెలుసుకొని యుద్ధరంగంలో దూకినవారు అంతకన్నాకాదు. తెలంగాణలో ప్రజలకు పుట్టుకతోటే బానిసత్వం వచ్చింది. జీవితాలంటే చాకిరి చేయటం కోసమేననే స్థితి నెలకొంది. వెట్టిచేస్తూనే వల్లకా టికి పోయినకాలమది. అందుకే తెలంగాణలో వెట్టికి వ్యతిరేక పోరాటం చేయటమే విముక్తి పోరాటం. దున్నే వానికి భూమి కావాలని పోరాడటమే స్వాతంత్య్ర పోరా టంగా మారింది. సెప్టెంబర్ 17 తెలంగాణ మదిలో ఎన్నో ఆశలను రేపింది. భూస్వామ్యం, రాచరికం, వెట్టిచా కిరి పోతాయని తెలంగాణ ప్రజలు ఆశించారు. స్వాతం త్య్రం అంటే నిజాం పోవాలి, దున్నే వానికి భూమి అన్న ది ఆనాటి మన తాతలు, తండ్రుల మనోగతం.

సెప్టెంబర్ 17 వచ్చింది. తెలంగాణ ప్రజల కలలన్నీ నిజం కాబోతున్నాయని చూశారు. నిజంగానే నిజాం పోయారు. భూస్వామ్య వ్యవస్థపోలేదు. భూమి తన చేతుల్లోంచి వదిలినట్లుగా నటించి ఆ భూమిని తిరిగి వారు కైవసం చేసుకున్నారు. భూపోరాటాన్ని నీరు కార్చ టానికి చేయని ప్రయత్నాలు లేవు. వేయని ఎత్తులు లేవు. పాలకుల కుట్రలు కూడా అందుకు దోహదం చేశాయి. ప్రభుత్వమే భూములు పంచుతామని ముందుకు వచ్చిం ది. భూస్వాములు తమ ఆస్తులను ఆసరా చేసుకొని తమ రూపాన్ని మార్చుకున్నారు. ప్రజలఅసమానతలను అడ్డు పెట్టుకొని నాయకులుగా చెలామణీ అయ్యారు. వారే దేశాధినేతలయ్యారు. వారే రాష్ట్ర రథ చక్రాలను నడిపే నాయకులయ్యారు. వాళ్ళే దేశభక్తులుగా చలామణి అయ్యి పార్లమెంటు, అసెంబ్లీలకి వెళ్ళి పీఠాలపై కూర్చు న్నారు. తెలంగాణ మళ్ళీ దిక్కులేనిదైంది.

త్యాగాలు చేసి నవారంతా కాలగర్భంలో కలిసిపోయారు. తెలంగా ణలో ప్రతి ఊరికొక చరిత్ర ఉంది. తెలంగాణలో ఏ ఊరు చూసినా త్యాగాల భైరాన్‌పల్లెలే. సెప్టెంబర్ 17 తెలంగా ణ విమోచన దినంగా ప్రకటించిన నాటినుంచి స్థానిక భూస్వామ్యవర్గం కొత్త రూపెత్తింది. భూమి కావాలంటే తొక్కి పెట్టారు. సంస్కరణలు వాళ్ళే తీసుకొస్తామన్నారు. భూపోరాట ఉద్యమాన్ని తూట్లు పొడిచారు. ప్రభుత్వమే భూదానమన్నది. తెలంగాణ ప్రజలకు త్యాగాలు చేయ టం మాత్రమే తెలుసు తప్ప రాజకీయద్రోహాలు చేయ టం తెలవదు. వారి త్యాగాలు భూస్వాముల కుట్రలకు వ్యర్ధమయ్యాయి. ఎన్ని త్యాగాలు చేసినా ఇంతేనా అన్న పరిస్థితి నెలకొంది. ప్రజలింకా విముక్తి కాలేదు. అందుకే ఈ తెలంగాణ మట్టినుంచి ఉద్యమాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. పోరాటయోధుల వారసత్వంతో తెలంగాణ ముందుకు సాగుతుంది.

ఒకనాడు దొరల గడీలంటే తెలంగాణ ప్రజలు హడలి పోయేవారు. అందుకే దొరల గడీలమీద ప్రజలు తిరగబ డ్డారు. పల్లెల్లో గడీలు పోయాయి. పట్టణాలలో కొత్త గడీ లు వెలిశాయి. ఇప్పుడు ఆ గడీలు ఆధునిక రూపాన్ని సంతరించుకున్నాయి. ఆ గడీల నుంచి వచ్చిన భూస్వా మ్య వర్గం పరిశ్రమలను నెలకొల్పింది. పెద్ద పెద్ద విద్యా సంస్థలను నెలకొల్పింది. అన్ని నియోజకవర్గాలను తమ చేతుల్లోకి తీసుకొని శాసనసభ్యులయ్యారు. పార్లమెంటు సభ్యులయ్యారు. అన్నిరకాల వ్యాపారాలను డబ్బున్న ఆ వర్గం చేతుల్లోకి పోయాయి. ఆధునిక దొరలు తెలం గాణలో వెలిశారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆధు నిక దొరల గడీలకు వ్యతిరేకంగా నూతన ప్రజా ఉద్యమా లు రావాల్సివుంది. అందుకనుగుణంగా మొత్తం ప్రజా ఉద్యమాల స్వరూపం మారాలి.

హైదరాబాద్ నగర పరిసరాల్లో భూముల ధర పెద్ద ఎత్తున పెరిగింది. మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి లేకుం డా కేవలం హైదరాబాద్ చుట్టుపక్కలే అభివృద్ధి జరిగిం ది. ఉన్నభూమి బహుళజాతి కంపెనీలకు దానం చేయ డం జరిగింది. అమెరికా వెళ్లినవారు ఇక్కడకు వచ్చి భూ ములు కొనడం మొదలుపెట్టారు. దీంతో రియల్ ఎస్టేట్ భూమ్‌పెరిగింది. మాఫియా గ్యాంగుల చేతుల్లోకి భూ ములు వెళ్లాయి. భూ అమ్మకాలకు ఆకర్షణ పెంచారు. వ్యాపారానికి రంగులు దిద్దారు. మాదాపూర్‌లోని ఇళ్ళకు పాతబస్తీలోని ఇళ్ళకు వ్యత్యాసం పెరిగింది. ప్రజలు ఇది చూస్తూ వచ్చారు.

గ్రామాలనుంచి బతకడానికి వచ్చిన వారిని అభద్రత వెంటాడుతోంది. ఈ వచ్చిన వాళ్ళ గ్రా మాల్లో ఉద్యమాలు చేసినవారు. ఈ అభద్రతను జయిం చటానికి పోరాటమే మార్గమనే నమ్మకం కలిగింది. ఇక నిలబడడానికి నీడ కోసం గూడుకోసం పోరాటపథం పట్టారు. ఆనాడు భూమికోసం నేడు నీడకోసం గూడు కోసం ఉద్యమం వచ్చింది. ఈ భూపోరాటం పట్టణాల్లో జరుగుతున్నది. ఆనాడు గ్రామాల్లో భూపోరాటం ఈనా టి ఇళ్ళ పోరాటానికి తేడాను గమనించాలి.ఈ పోరాటం ఎందుకొచ్చింది? ప్రపంచీకరణ వల్ల వచ్చింది. వలసలు పెరిగాయి. మధ్యతరగతి ప్రజలు, గ్రామీణ పేదలంతా వలస దారి పట్టారు.

రంగారెడ్డి జిల్లా బాగా అభివృద్ధిచెందిన ప్రాంతం. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా ఇక్కడ ప్రభుత్వ భూ ములు అధికంగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వం అమ్ముతు న్నది. బహుళజాతి కంపెనీలుకొంటున్నాయి. అంటే ఈ నాటి దృష్టంతా భూమి మీదకు మళ్లింది. ఇలాగే అయితే ఒక నిలబడేచోటు దొరకదని తెలిసి ప్రజలు నివేశన స్థలా లకోసం పోరాటాలకు దిగారు. దేశమంతటికీ ఈ పోరా టం కొత్త సందేశం ఇవ్వబోతుంది. సెప్టెంబర్ 17 స్ఫూర్తి కి నిదర్శనంగా ముందుకు సాగుతున్నది. తన ప్రాంతం పై ప్రేమను పెంచుకోవడమంటే ఇతర ప్రాంతాలను ద్వేషించడమని అర్థం కాదు. ఒక తల్లి తన పిల్లలను లేదా పిల్లలు తమ తల్లిని ప్రేమగా చూసుకోవడమంటే ఇతరు లను ద్వేషించటం ఎంత మాత్రంకాదు.

ఎవరైతే తన ప్రాంతంపై ప్రేమను పెంచుకుంటారో వారే ఆ ప్రాంతా న్ని అభివృద్ధిచేస్తారు. ఇలా ప్రాంతాలన్నింటిని అభివృద్ధి చేయడమంటే దేశాన్ని అభివృద్ధి చేయడమే. అపార సహజవనరులున్న తెలంగాణను వేగవంతంగా అభివృ ద్ధి చేయాలి. సాంకేతిక తెలంగాణను సృష్టించాలి. తెలం గాణ సాంకేతికంగా అభివృద్ధి చెందితే ఈ దేశానికి ఒక గొప్ప సంపదను అందించగలుగుతుంది. భూమి, భుక్తి, విమక్తి పోరాటాల నుంచి చైతన్యం పొందిన తెలంగాణ సాంకేతికంగా అభివృద్ధి చెందేందుకు అందరూ తలా ఒక చేయి వేయాలి. కాళ్ల కింద భూమిని కోల్పోతున్న దశను గుర్తించి కొత్తసోయితో ఉద్యమించాలి. భూమికోసం, నిల బడేజాగాకోసం జనం ఉద్యమజెండాగా మారకతప్పదు.

వ్యాసకర్త శాసన మండలిసభ్యులు. Andhra Jyothy 9-18-1008

ప్రత్యేక తెలంగాణ ఎందుకు? - సిహెచ్. హనుమంతరావు

'సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి'కి, 'తెలంగాణ రాష్ట్రాని'కి' మధ్య తమ అభిప్రా యాన్ని ఎంచుకునే పరిస్థితిని ప్రజలు ఎదుర్కొన్నారు. ప్రజా బాహుళ్యతీర్పు 'వేరు తెలంగాణ'కే నన్నది స్పష్టమైంది కూడా. ప్రజా తీర్పును కొన్ని రాజకీయ పార్టీలు కేవలం 'తెలంగాణ సెంటిమెంటు'కే ముడి పెడుతున్నాయి. ఇది ప్రాంతీయ భావనకు బలమైన నిదర్శనంగా, హేతుబద్ధమ యినదనికూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజల దృష్టిలో సమైక్య రాష్ట్రం లో అభివృద్ధి 'మిధ్య' మాత్రమేననేది అర్థమయింది. సాగునీటి వనరుల్లో, ఉద్యోగ నియామకాల్లో, వ్యాపారావకాశాల్లో, రాజకీయ నిర్ణయాత్మకతలో దేనిలోకూడా తమవాటా తమకుదక్కేఅవకాశం సమైక్యరాష్ట్రంలో సాధ్యం కాదనికూడా అర్థం చేసుకున్నారు.

తెలంగాణ ఉద్యమం వ్యాప్తి 1969 నాటి కన్న ఈ రోజు విశాల పరిధి కలిగివున్నది. రైతులు, యువజనులు, మహిళలు అందరు ఇవాళ ఇందు లో భాగస్వాములుగా వున్నారు. 1969 ఉద్యమం అందరు అనుకున్నట్లు ఆనాటి నాయకుల అవకాశవాద రాజకీయాలవల్లనో లేక రాజ్య నిర్బంధ చర్యలవల్లనో నీరుగారలేదు. అందుకు 1970ల్లో జరిగిన కొన్ని పరిణామా లు కారణంగా చెప్పుకోవచ్చు. 1970 దశకం ప్రారంభంలో ఇందిరాగాంధీ 'గరీబీహఠావో' నినాదంతో పేదప్రజానీకాన్ని ఆకట్టుకొన్నారు. ఆమె స మ్మోహనశక్తి ఎంత బలంగా ఉందంటే ఆ దశకం చివరలో జరిగిన ఎన్ని కల్లో, ఇందిరాగాంధీ కేంద్రంలో అధికారం కోల్పోయినప్పటికీ, రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగురవేయగలిగింది. ఆ తర్వాత 1980లో ఎన్.టి. రామారావుకూడా పేదలు, మహిళల సమస్యలను ఎజెండామీదకు తీసుకురాగలిగారు. పేదరికం నిర్మూలనకై ఈ ఇద్దరు నేత లు చేపట్టిన అనేక పథకాలు, కార్యక్రమాలవలన సామాన్య ప్రజలు వీరిపై చాలా ఎక్కువగానే ఆశలు పెట్టుకొన్నారు. ఈ నేతల నమ్మదగిన చర్యలు వల్లనే తెలంగాణప్రాంతంలో కూడా తాత్కాలికంగా వేర్పాటు ఉద్యమం వెనుకకు పోయింది. ఈ నేతల మరణాంతరం వీరి వారసులు వీరు చేప ట్టిన పథకాలను ముందుకు తీసుకుపోక పోవడంవల్ల పేద ప్రజలకను కూల విధానాలు మనలేకపోయాయి. అంతేకాక సామాజిక ఆర్థిక విధానా లు పూర్తిగా రూపాంతరం చెందాయి. తర్వాత వచ్చిన సరళీకరణ దశలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సామాజిక రంగాలు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో సంక్షోభ పరిస్థితి ఏర్పడిం ది. ప్రాంతీయ అసమానతలు ఇంకా బలంగా ముందుకొచ్చాయి.

ఏభై ఏళ్లనాడు మొదటి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సంఘం (ఎస్సార్సీ) తెలంగాణ ప్రాంతంలోని అసంతృప్తి జ్వాలల దృష్ట్యా రాష్ట్ర ఏర్పాటును సిఫారసు చేసింది. అసంతృప్తి ఇంకా తీవ్రంగా ఉన్న ఇవ్వాళ్టి పరిస్థితుల్లో రెండో ఎస్సార్సీకూడా మొదటి ఎస్సార్సీ చేసిన సిఫారసునే బలపరిచే అవ కాశాలు ఎక్కువగా ఉన్నాయి. వెనువెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమంచేస్తే వచ్చే ఆంధ్రప్రాంత ప్రజల వ్యతిరేకతను ప్రస్తుతా నికి నివారించి అనివార్యంగా తెలంగాణ రాష్ట్రావతరణ తప్పనిసరి అనే అంగీకారానికి తీరాంధ్రులను తీసుకురావడానికి రెండవఎస్సార్సీ వ్యూహా న్ని ఉపయోగిస్తున్నట్లయితే అది ఎంతో వ్యయంతో కూడుకున్నదే అవు తుంది. ఎందుకంటే దేశంలో ఇంకా అనేక చిన్నరాష్ట్రాల డిమాండ్లను (కొ న్ని న్యాయసమ్మతమైనవి, కొన్నికానివి) ఈ కమిషన్ ఎదుర్కోవలసి ఉం టుంది. ఇవన్నీ కాదనుకున్నా మొదటిఎస్సార్సీ సిఫారసులు అమలు బుట్ట దాఖలయిన నేపథ్యం, ప్రస్తుత ఉద్యమ నేపథ్యం దృష్ట్యా రెండవ ఎస్సార్సీ నియామకం తెలంగాణప్రజలను ఏవిధంగాకూడా తృప్తిపరచలేదు. ప్రత్యే క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఒప్పుకోని వర్గాలకు కొన్ని సంస్కరణలు చేపట్టడం సూత్రబద్ధమయిన, నిజాయితీతో కూడిన ప్రతిస్పందనగా వుం డవచ్చునేమో. ముఖ్యంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రజల బాగోగుల కోసం మళ్లా ఒకసారి భూసంస్కరణలు, ఇంకా వెనుకబాటును తగ్గించే పథకాలను చిత్తశుద్ధితో తీసుకు రావలసి ఉంటుంది. ప్రాంతీయ అవసరాల కనుగుణంగా నిపుణులతో ప్రజా ప్రతినిధులతో కూడిన ' ప్రాం తీయ ప్రణాళికా -అభివృద్ధి బోర్డుల'ను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. వనరుల పంపిణీని పారదర్శకంగా ఉంచవలసి ఉంటుంది. ప్రజాప్రతిని ధులకు జవాబుదారీగా వీటిని ఉంచవలసి ఉంటుంది. ఇదేకాక తెలంగాణ అభివృద్ధికోసం ఇస్తామంటున్న 10,000 కోట్లరూపాయల ప్యాకేజిని ఇఫ్పు డున్న వనరుల్లో తెలంగాణవాటాకు అదనంగాఉండాలి. ప్రాంతీయ ప్రణా ళికా ప్రక్రియలో ఈ ప్యాకేజీ అంతర్భాగంగా ఉండాలి. అయితే ఇవన్నీ కూడాగతంలో ప్రభుత్వాలు చేపట్టి త్వరలోనే విరమించడం వలన వ్యర్థ ప్రయోగాలుగానే మిగిలిపోయాయి. మళ్లీ ఇదే బాటలో ఎంతో ఆలస్యం గా పై విధమైన చర్యలుచేపడితే ప్రజలనుంచి అనుకూల స్పందన ఉండక పోవచ్చు.


మనరాష్ట్రంలో ప్రాంతీయప్రణాళిక కొత్త అంశమేమీకాదు. అయితే రాజ కీయంగా దీనిని ఎప్పుడూ చిత్తశుద్ధితో పట్టించుకోలేదు. కీలక సమాచారం ప్రజాప్రతినిధులకు అందుబాటులోఉంటుందని, అది ప్రాంతీయ తత్వాని కి దారితీస్తుందనే తప్పుడు ఆలోచనా సరళి మొత్తం ప్రాంతీయ ప్రణాళిక ప్రక్రియకే గొడ్డలిపెట్టుఅయ్యింది. ప్రజాప్రతినిధులతో ఏర్పాటయిన ప్రాం తీయ ప్రణాళికా సంస్థలను నిర్వీర్యం చేయడం వలన సమాచారాన్ని తొక్కి పెట్టడం వలన తెలంగాణ ప్రజల మనోభావాలు బాగా దెబ్బ తిన్నాయి. ఇది చరిత్ర నేర్పినపాఠం. మొదటి ఎస్సార్సీకి తెలంగాణ ప్రాంత భయా లు, ఆ ప్రజలు ఎదుర్కోబోయే పరిణామాల పట్ల స్పష్టమైన అవగాహన ఆనాడే ఉండినది. సమస్యస్వరూపాన్ని, తీవ్రతనూ అర్థం చేసుకొన్నందు వల్లనే ఈ కమిషన్ ఐదు సంవత్సరాల కాలంలో ప్రధానంగా సాధించా ల్సిన విషయాలు రెండు అని నొక్కిచెప్పింది. అవి: (అ) ఇతర ప్రాంతా లతో సమానంగా ఇక్కడ అవస్థాపన సౌకర్యాలను మెరుగుపరచగలగాలి; (ఆ)ఎలాంటి బలవంతంలేని ఒప్పందంద్వారా ఆంధ్రతో సమైక్యత సాధిం చేందుకు తెలంగాణ ప్రాంతప్రజలను తయారుచేయడం. అంతేకాక తెలం గాణకు చెందిన మూడింట రెండు వంతుల ప్రజా ప్రతినిధులు విలీనానికి అంగీకరిస్తేనే సమైక్య రాష్ట్రం ఏర్పడాలని స్పష్టంగా ఈ కమిషన్ చెప్పింది. అయితే పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫార్సులకు భిన్నంగా ఆచరణ కొన సాగింది. తెలంగాణవాసుల అభిప్రాయాలను పక్కనబెట్టి ఇతర ప్రాంతాల ప్రయోజనాలను మాత్రమే పరిగణించడం ఆచరణగా మారింది. ఇది శోచ నీయం. 1956లో పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతీ య కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో ప్రజాప్రతినిధులు సభ్యులు గా ఉండేవారు. తెలంగాణప్రాంతంలో అభివృద్ధి సాధించేందుకు వనరు లను గుర్తించడం, వీటిని వివిధ అవసరాలకు కేటాయించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. అయితే కొద్ది కాలానికి దీనిని రద్దు చేసినారు. 1973లో ఆరు సూత్రాల పథకం కారణంగా తెలంగాణ ప్రాంతీయ కమిటీకి స్వస్తి చెప్పారు. దాని స్థానంలో ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రాంతీయ కమిటీకి జవాబుదారీతనం ఉండెను. కాని ప్రాంతీ య అభివృద్ధి మండలి ఎవరికి జవాబుదారి కాదు. అయితే ఈ మండలిని కూడ రద్దు చేశారు. ప్రస్తుతం ప్రాంతీయ ప్రణాళిక ప్రక్రియకు ఎలాంటి సాధనాలు, వ్యవస్థలు లేవు.

ఫైనాన్స్ కమిషన్‌ద్వారా జరిగే కేంద్ర-రాష్ట్ర విత్త బదిలీలలో 25 శాతం జనాభా ఆధారంగాకాగా, 75శాతం తలసరి ఆదాయం, ఇంకా ఇతర వెనుకబాటు సూచికల ఆధారంగా జరగుతుంది. ఈ విధంగా తెలంగాణ లోని అత్యల్ప తలసరి ఆదాయంవల్లనే రాష్ట్రానికి విత్త బదిలీలు అధికం గా వచ్చాయి. ఈదృష్ట్యా తెలంగాణకై ఏర్పాటుచేసిన ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికకుగాని, లేక తెలంగాణ రాష్ట్రానికిగానీ ఏ విధమైన విత్తపరమైన అవరోధాలు ఉండే ఆస్కారంలేదు. ఇంత పెద్దది, వైవిధ్యం కలిగిన రాష్ట్రం లో అసలు ప్రాంతీయ ప్రణాళిక, అభివృద్ధి కమిటీలు ఇంకా భాగస్వా మ్యసంస్థల ద్వారా అభివృద్ధి జరగడానికి ఎంతమాత్రం అవకాశం ఉంది? రాష్ట్ర స్థాయిలో ఉండే ప్రణాళికా రాజకీయాలు మనకు ఈ రకమైన సాధ నాలు, సంస్థల ఏ ప్రయోజనం చేకూర్చవనే అనుభవాన్ని మిగిల్చింది. ఏక రూపత కలిగిన చిన్న రాష్ట్రాలలోనే ఆర్థికవృద్ధి, సమత్వంసమస్యలపై రాజ కీయ నిబద్ధత కనబడుతుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఈ విషయంలో మంచి ఉదాహరణ. ఉత్తరాఖండ్ అవతరించిన ఆరు సంవత్సరాల తర్వాత అక్క డ సాలీన స్థూలరాష్ట్ర ఉత్పత్తివృద్ధిరేటు ఎంతగానో పెరిగి రెండంకెల స్థాయిని కూడా దాటింది. తెలంగాణ రాష్ట్ర హోదాకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రాబల్య రాజకీయ నాయకత్వంనుంచి ఎక్కువగా ఆశించడం సరైందికాదమో. నిజానికి ఈ విషయంలో కేంద్ర నాయకత్వాన్ని అందునా పండిట్ నెహ్రూ వంటి నాయకులనుకూడా వీరు ప్రభావితం చేయగలి గారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఎస్సార్సీ ముందు చూపు, నెహ్రూ దార్శనికత ఇవాళ మనకు సవాలును విసురుతున్నాయి. జాతీయ నాయకత్వం ఈ విషయంలో వివేచనతో స్పందించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటారని ప్రజలుఆశిస్తున్నారు. ఇవాళున్న పరిస్థితుల్లో రాష్ట్ర విభజనకు ఆంధ్ర ప్రాంతంనుంచి కూడా పెద్ద గా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ప్రస్తుత అనిశ్చితపరిస్థితికన్నా రెండు తెలుగు రాష్ట్రాలు ఉండడం మంచిదనే అభిప్రాయం కలుగవచ్చు. అట్లాగే తెలంగాణ రాష్ట్రావతరణ ఇక్కడి ప్రజల సృజనాత్మకశక్తికి జీవం పోస్తుంది; ఈ ప్రాంతపు సామాజిక పరివర్తనను సుగమం చేస్తుంది. బడుగు, బల హీన వర్గాల ప్రజలకు సామాజిక న్యాయాన్ని చేకూరుస్తుంది. వారి ఆశలు, ఆశయాల కనుగుణంగా నాయకత్వంలోకి రాగలిగే అవకాశాన్ని కలిగిస్తుం ది. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి క్రియాశీలక భాగస్వామ్యంతో చిన్న రాష్ట్రాలు సుపరిపాలనకు మెరుగైన అవకాశాలు ఇవ్వగలుగుతాయి.

(వ్యాసకర్త 'సెస్' ఛైర్మన్, ప్రణాళికా సంఘం పూర్వ సభ్యులు)

Wednesday, September 17, 2008

తెలంగాణ రైతాంగ పోరాటం పాఠ్య పుస్తకాల్లో లేదెందుకు..? - నవీన్ ఆచారి


నిరంకుశ నిజాం మెడలు వంచిన రోజిది. దొరలు జమీందాఋలను పల్లెల నుండి తరిమిన రోజిది. యావత్ ప్రపంచాన్నే ప్రభావితం చేసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దెబ్బకు నిజాం వాడి తాతముత్తాతలు దిగొచ్చిన రోజిది.


ఒక ప్రకాశం గుండీలు విప్పితేనే ఆహ ఓహో అని పొగిడే సర్కారీ రచయితలకు నాలుగు వేలమందికి పై చిలుకు యోధులు నిజాం తుపాకులకు గుండెలెదురొడ్డి పోరాడడం ఏ పుస్తకాల్లో రాయరెందుకో. ఆ రోజు ప్రకాశం ఆ పని చేసినప్పుడు చుట్టు వేలాది మంది ఉన్నారు. ఇది నగరం మద్యలో జరిగింది. ఈయనను చంపితే ఆ అధికారి పై అధికారికి జవాబు చెప్పుకోవాలి. (అప్పటికే నైజాం ప్రాంతం లో 'బారాఖూన్ మాఫ్' అనె వాడుక ఉన్నది. అంటే పన్నెండు హత్యలవరకు నిజాం సైనికుడు చెయ్యొచ్చు. పై అధికారి అనుమతి అవసరం లేదు. ) మిగతా గుంపు హింసకు దిగొచ్చు. పేపర్లలో పెద్దగా రాస్తారు. ఇలాంటి secured environmentలో ప్రకాశం చేసిందీ గ్రేట్ ఐతే ఎవరికి జవాబు దారి కాని, ఎంతటి దారుణానికైనా తెగబడే నిజాం ను ఎదిరించిన వేలాదిమంది ప్రజలు ఎంతటి సాహసయోధులో ఒక్కసారి ఆలోచించండి.
ఈరోజు చైనా, రష్ష్యాల్లో కూడా విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్తులకు చెప్తూ ఉంటే ఇక్కడ మాత్రం ఆ విషయాలు పాఠ్య పుస్తకాల్లో పెట్టరు. చీరాల పేరాల పేరుతో దుగ్గిరాల గోపాల క్రిష్ణయ్య ఒక వారం రోజులు వూరవతల కాపురం పెడితే ఏదో గొప్ప సాహసం చేసినట్టు రాసేవాళ్లు ఆరుట్ల కమలాదేవి, రావినారాయణ రెడ్డి, కొమురయ్య, వంటి వేలాది యువకిశొరాలు ప్రాణాల్నిఫణంగా పెట్టి అజ్ఞాతం లో సంవత్సరాల తరబడి ఉన్న సంగతి గుర్తు చేసుకోరెందుకు. పార్లమెంట్లో బాంబులేసిన భగత్ సింగ్ అంతటి వీరుడు నిజాం మీద బాంబులేసిన మా నారాయణ్ రావు పవార్ పేరేది..?
ఏ ఆంధ్ర కేసరులకు తీసిపోని ప్రజా యోధులు మాకున్నారు. మేరునగధీరులు మాకున్నారు. బెజవాడ లో జరిగిన కాంగ్రేస్ సభల గురించి అకాడమీ పుస్తకాల్లొ కాకిగోల పెట్టే సర్కారు ప్రపంచ చరిత్ర కే పాఠాలు నేర్పిన తెలంగాణ సాయుధ రైతాంగ పొరాటం గురించి పెదవి కదపదెందుకు. పిల్లలకు చెప్పదెందుకు.
ఇది, ప్రజా కంటక నిరంకుశ నిజాం పై బాంబుల వర్షం కురిపించిన మా ప్రజా యోధులకు చరిత్ర పుటల్లో స్థానం దక్కనియ్యకుండా చేసే వలస పాలకుల సాంస్కౄతిక విధ్వంసం కాదా..? దీనికి ఒక ప్రాంతం వారి బానిసత్వం లో తెలంగాణ ఇంకా ఉండడమె కారణం కాదా..? అందుకే మా తెలంగాణ మాకు రావాలి. మన తెలంగాణ మనక్కావాలి.

భూమి కోసం భుక్తి కోసం స్వేచ్చా స్వతంత్రాల కోసం పోరాడి నియంతల గుండెల్లో నిదురించిన వేగు చుక్కల్లారా జాతి మీకు తలవంచి నమస్కరిస్తుంది. మీ త్యాగం నిరుపమానం.
మీ స్ఫూర్తి తో వలస పాలకులపై పోరాడుతం. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుతం.
జై తెలంగాణా జై జై తెలంగాణా

Tuesday, September 16, 2008

ప్రభుత్వానికి పట్టని మన పర్వదినం - బండారు దత్తాత్రేయ


నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రాంత విముక్తి జరిగి ఈ నెల 17వ తేదీతో 60 సంవత్సరా లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రాంత ప్రజలు అధి కారికంగా ఉత్సవం జరుపుకునే అదృష్టానికి నోచుకోకపోవ డం అత్యంత బాధాకరం. నాటి హైదరాబాద్ సంస్థానం విముక్తి తర్వాత భాషా ప్రాతిపదికన విడిపోయి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో విలీనమైన ప్రాంతాలలో అక్కడి ప్రజలు అధికారికంగా 1948 సెప్టెంబర్ 17వ రోజు స్వాతంత్య్రం లభించిన రోజుగా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు.


ప్రధానంగా విముక్తి పోరాటం జరిగిన తెలంగాణ ప్రాంతం లో మాత్రం కేవలం రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, స్వాతంత్య్ర సమరయోధులు జాతీయ జెండా ఎగురవేసి నామమాత్రంగా జరుపుకోవడం ఎంతవరకు న్యాయం? ఇదే నా మన ప్రాంత విముక్తికి పోరాడిన యోధులకు మనం అర్పించే నివాళులు? దేశానికి స్వాతంత్య్రం రాకముందే నిజాం నాటి బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్‌ను సంప్రదించి హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా కొనసాగించడానికి లాబీయింగ్ చేశాడు.
ఆనాడు ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉన్న 40 దేశాలకంటే హైదరాబాద్ సంస్థానం పెద్దదని, ఆర్థికంగా పరిపుష్టి కలిగిందనే వాదనను బాగా ప్రచారంలోకి తెచ్చారు. అయినప్పటికీ నిజాం దురాలోచనను మన పాలకులు గుర్తించలేకపోయారు. 1947 ఆగస్ట్ 15వ తేదీన యావత్ దేశం స్వాతంత్య్ర వేడు కలు జరుపుకుంటుంటే తెలంగాణ ప్రజానీకం మాత్రం ఇంకా నిరంకుశ ప్రభుత్వ ఉక్కు పాదాల కింద నలుగుతూ నిజాం ప్రైవేట్ ఆర్మీ రజాకార్ల దురాగతాలను అనుభవిస్తున్న ది. మన ప్రాంతంలో గృహ దహనాలు, మహిళలపై అత్యా చారాలు, గృహ నిర్బంధం, లూటీలు సాగడం మన దుర దృష్టం.

ఆనాడు గాంధీజీ పిలుపు మేరకు ఎవ్వరైనా ఉత్సా హంగా త్రివర్ణ పతాకం ఎగురవేస్తే ఇక వారి పని అయిపో యినట్లే. తెలంగాణ ప్రాంతంలోని 8 జిల్లాలలో జరిగిన ఈ సంఘటనలు ప్రజల మదిలో నుంచి ఇంకా తొలగిపోలేదు. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, ఆర్య సమాజ్, ఆర్ఎస్ఎస్ తదితర సంస్థలు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే వారి కుటుంబాలు ఆంధ్రప్రాంతానికి, మైసూ ర్, మహారాష్ట్ర ప్రాంతాలకు, ఇతర సరిహద్దు ప్రాంతాలకు వలస వెళ్ళి శరణార్థులుగా దుర్భరమైన జీవనాన్ని కొనసాగించారు.

లక్షలాది మంది వృద్ధులు, మహిళలు, పిల్లలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సరిహద్దు ప్రాంతాలకు వెళ్తుంటే వారిని తరిమి తరిమి హింసించిన సంఘటనలు కోకొల్లలు. నిజాం ప్రైవేట్‌సైన్యం, ఖాసీం రజ్వీ నాయకత్వం లో రజాకార్లు, వారి తాబేదార్లుగా ఉన్న జమీందార్లు, జాగీర్దార్లు, భూస్వాములు, వారికి వంతపాడే మనుషులు సామా న్య ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. 1947 ఆగస్ట్ 15 నుంచి 1948 సెప్టెంబర్ వరకు జరిగిన ఈ పోరా టం భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో సముచిత మైన స్థానాన్ని పొందలేకపోయింది.

నిజాం ప్రభువు ఈ ప్రాంతా న్ని భారతదేశంలో విలీనం చేయడానికి నిరాకరించడమే గాక, స్వతంత్ర దేశంగా కొనసాగడానికి ఇతర దేశాల సహకారం పొందాలని చేసిన ప్రయత్నాలు మనం గుర్తు తెచ్చుకోవాలి. దేశం యావత్తూ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటుంటే మన ప్రాంతంలో దుస్థితిని మార్చేందుకు స్వామి రామానం దతీర్థ సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. 1947 డిసెంబర్ 4న ఆర్య సమాజ్ కార్యకర్త నారాయణరావు పవార్ నిజాం కారుమీద బాంబు వేశారు. రజాకారులతో విముక్తి ఉద్యమకారు లు తలపడడంతో అంతర్యుద్ధం మొద లైంది.

1948 జనవరి 15న ఖమ్మం జిల్లా మీనబోలు దగ్గర ఆరుగురు యువకుల్ని రజాకార్లు చంపివేశారు. ఫిబ్రవరిలో వరంగల్ జిల్లా కోలుకొండ గ్రామంలో 13 మందిని హత్య చేశా రు. మార్చి 4న నల్లగొండ జిల్లా భువనగిరి తాలూకా రేణిగుంట గ్రామంలో 26 మందిని రజాకార్లు పొట్టనబెట్టుకున్నారు. జూలై 19న గుండ్రంపల్లిలో 21 మందిని ఊరి బయ టకు తీసుకెళ్ళి కాల్చివేశారు. ఆగస్టు 25న రజాకార్లు వరంగ ల్ జిల్లా కూటిగల్ గ్రామంలో 30 మందిని, ఆత్మకూరులో 11 మందిని కాల్చి చంపారు. అదేవిధంగా భైరాన్‌పల్లి గ్రామంలో 92 మందిని వరుసగా నిలబెట్టి కాల్చివేశారు.

పరకాల గ్రామంలో జెండా ఎగుర వేయడానికి వెళ్ళిన ఆ ప్రాంతవాసులను సుమారు 50 మందిని నిజాం సైనికులు, రజాకార్లు కలిసి కాల్చి చంపివేశారు. చౌటపెల్లి, కొంకపాక గ్రామాలలో 15 మంది రైతులను సజీవంగా గడ్డివాములో వేసి తగులబెట్టారు. ఈ దురాగతాలన్నీ ఇమ్రోజ్ పత్రికలో వ్రాసినందుకు జర్నలిస్టు షోయబుల్లాఖాన్ రెండు చేతులు నరికి చంపారు. 'తరతరాల స్వప్నాల సుందర ఫలమ్ము స్వైర భారత భూమి చూపేనో, లేదో విషము గుప్పించినాడు,
నొప్పించినాడు మా నిజాం రాజు జన్మజన్మాల బూజు' -దాశరథి మనకు స్వాతంత్య్రం ఎప్పుడు లభించిందని తెలంగాణ లోని ఏ పాఠశాలలో ఏ విద్యార్థిని మనం ప్రశ్నించినా నిస్సంకోచంగా 1947 ఆగస్ట్ 15వ తేదీ అని జవాబిస్తారు. కానీ 1948 సెప్టెంబర్ 17 అని జవాబివ్వడం చాలా అరుదు. సుప్రీంకోర్టులో 1948 సెప్టెంబర్ 17కు ముందు ఒక కేసు వేస్తే అది సుప్రీంకోర్టు పరిధిలోకి రాదని, నిజాం ప్రభుత్వం పరిశీలించాలని, ఆ ప్రాంతం భారతదేశంలో అంతర్భాగం కాదని వేరే దేశం అని తెలుపడాన్ని బట్టి ఈ పోరాటం ఎంత ప్రాముఖ్యత గలదో తెలుస్తున్నది.

జలియన్‌వాలాబాగ్ మారణకాండ వంటివి తెలంగాణ ప్రాంతంలో ఎన్నో జరి గాయి. పరకాల, భైరాన్‌పల్లి దురంతాలు వింటుంటే ఒళ్ళు జలదరిస్తుంది. మారుమూల పల్లె ప్రజలు ప్రాణాలకు సైతం తెగించి జరిపిన పోరాటాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవా న్ని దెబ్బతీస్తున్నది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సావాన్ని అత్యంత ఆర్భాటంగా జరుపుకునే రాష్ట్ర ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 17ను ఎందుకు అధికారికంగా జరుపదు?
దీని వెను క ఉన్న బలమైన కారణమేమిటి? తెలంగాణ ప్రాంత ప్రజల పోరాటప టిమపట్ల ఎందుకింత నిర్లక్ష్య వైఖరి? సాక్షాత్తు రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీ. కె జానారెడ్డి సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని ముఖ్యమంత్రిని కోరానని తెలిపారు. కాని నేటికీ అది వాస్తవ రూపం దాల్చలేదు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ఈ మహా పోరాటానికి కొంతమంది మతం రంగు పులమడం దురదృష్టకరం.

నిజాం రాజును వ్యతిరేకించడం అంటే ముస్లింలను వ్యతిరేకించినట్టుగా కొంతమంది అభిప్రాయపడడం సరైంది కాదు. నిజాంను వ్యతిరేకించిన వారిలో అనేక మంది ముస్లిం సోదరులు ఉన్నారనే విషయం మనం మరిచిపోకూడదు. చరిత్రకు మతం అంటగట్టడం ఎంతవరకు సబ బు? వందల సంవత్సరాల కుతుబ్‌షాహి, అసఫ్‌జాహి పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటం విజయవంతమైన 1948 సెప్టెంబర్ 17ను ఒక పండుగ రోజుగా భావించే హక్కు తెలంగాణ వాసులకు లేదా? హైదరాబాద్ విమోచన దినమైన సెప్టెంబర్ 17నాడు మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు అధికారికంగా ఉత్సవాలు నిర్వ హిస్తున్నాయని తెలుపుతూ, మన రాష్ట్రం ఎందుకు నిర్వ హించడం లేదంటూ బిజెపి శాసనసభ్యుడు శ్రీ జి. కిషన్‌రెడ్డి అడి గితే ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి స్పందించలేదు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఎంత ఒత్తిడి తెచ్చి నప్పటికీ స్పందించని శ్రీ చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోరిక బలపడడం గమనించి, వారి పార్టీ కార్యాలయంలో ఉత్సవం జరుపుతారు. కాని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండా ఎగురవేయాలని , అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవం నిర్వహించాలని అడగడానికి మాత్రం సంకోచిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఎన్నో త్యాగాలు చేసిన కమ్యూనిస్టులు సైతం తెలంగాణ విముక్తి జరిగిన రోజున అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహించాలని డిమాండ్ చేయరు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకై తామే చాంపియన్లమని చాటుకుంటున్న టిఆర్ఎస్ సైతం అధికారికంగా సెప్టెంబర్ 17 ఉత్సవాన్ని నిర్వహించాలని ఇంతవరకు అడిగిన దాఖలా లేదు. నాటి ఉప ప్రధాని హోం శాఖామాత్యులు, ఉక్కుమనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమా అని పోలీస్ చర్య తీసుకోకపోయి ఉంటే ఈ ప్రాంతం వేరే దేశంగా ఉండిపోయేదనే సంగతి అందరికి తెలుపాల్సిన బాధ్యత మన కు లేదా? గత దశాబ్దకాలంగా భారతీయ జనతా పార్టీ ప్రతీసారీ సెప్టెంబర్ 17ను విమోచన దినంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నది.

తెలంగాణ ప్రాంతం విడిపోవాలనే ఉద్యమానికి వెనుకబాటుతనం, అన్ని రంగాలలో కొనసాగుతున్న వివక్షతతో పాటు ఈ ఉత్సవం నిర్వహణ పట్ల చూపుతున్న ఉదాసీన వైఖరియే కారణాలు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితేనే ఈ విముక్తి పోరాటానికి గుర్తింపు వస్తుందనే భావన నానాటికి బలపడుతున్నది. 60 సంవత్సరాలు పూర్తికాగానే దేశ స్వాతంత్య్ర ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాం. రాష్ట్ర అవతరణ 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగానూ ఉత్సవాలు జరిగాయి.
వేలాది ప్రజల బలిదానం తర్వాత హైదరాబాద్ రాష్ట్ర విమోచన జరిగిన సెప్టెంబర్ 17న ప్రభు త్వం ఎందుకు అధికారికంగా ఉత్సవాలు నిర్వహించదు? సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధి కారికంగా జరపాలని, విద్యార్థుల పాఠ్యాంశంగా ఈ చారిత్రాత్మక ఉద్యమాన్ని చేర్చాలని, షోయబుల్లాఖాన్, కొమురభీం వంటి ప్రముఖుల విగ్రహాలు నెక్లెస్ రోడ్డులో ప్రతిష్ఠించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నది.
(వ్యాసకర్త బిజెపి రాష్ట్ర అధ్యక్షులు) in Andhra jyothy 2008 Sept 17.

విమోచన అంటే చరిత్ర నవ్వదా? - ఎన్. వేణుగోపాల్


సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందని ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చ గొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం , భారతీయ జనతా పార్టీ ఈ కట్టు కథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. 'మా వైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టే' అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ 'దీన్ని విమోచనం అనక పోతే రజా కార్ల వైపు ఉన్నట్టే' అని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చిన సంఘ పరివారం ఇప్పటికి చాలామందిని లొంగదీసింది. అలా లొంగిపోయిన వారి జాబితా ఇంకా పెరిగిపో తోంది.


మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఒక భావజాల పక్షం చేస్తున్న ప్రయత్నాల కు ఎవరెవరు ఏ ప్రయోజనాల కొరకు లొంగిపోదలచుకున్నారో వారి వారి ఇష్టం. కాని సెప్టెంబర్ 17, 1948 ని 'హైదరాబాద్ విమోచన దినం'అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలం గాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైద రాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన కిందికి తెచ్చిన రోజు. అలా తేవడం కోసం, పోలీస్‌చర్య పేరుతో జరిపిన సైనిక దాడి విజయం సాధించిన రోజు. విలీనం అనే మాట వాడడం కూడ కష్టం.


ఆ మాటలో కూడ విలీనమయ్యే వారి ఆమోదం ఉందనే అర్థం ఉంది. 1948 సెప్టెంబర్ 17 చర్యకు నిజంగా తెలంగాణ ప్రజామో దం ఉందా అనేది సందేహాస్పదమే. 'ముస్లిం పాలన కింద ఉన్న హైదరా బాదు హిందూ ప్రజలకు 1948 సెప్టెం బర్ 17న కేంద్ర ప్రభుత్వం విమోచన కలిగించిందని, అందువల్ల హైదరాబాద్ రాజ్యాధీశుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ లొంగిపోయిన ఆ తేదీని హైదరాబాద్ విమోచన దినంగా జరపాలని' సంఘ పరివారం వాదిస్తున్నది. అసలు హైదరా బాద్ ముస్లిం పాలన కింద ఉండేదనేదే అర్ధ సత్యం.

పాలకుల మత విశ్వాసం ఇస్లాం కావచ్చుగాని వారు ఆధారపడింది ఇటు 'హిందూ' భూస్వాముల మీద, అటు క్రైస్తవ' వలసవాదుల మీద. చివరకు మతోన్మాదులుగా పేరు పడిన రజాకార్ల సైన్యం కూడ హిందూ జాగీర్దార్ల, దేశ్‌ముఖ్‌ల, భూస్వాముల తరపున, వారి గడీలలో విడిది చేసి, తిని తాగి, పేద ప్రజల మీద, పోరాడుతున్న రైతుకూలీల మీద హంతక దాడులు చేసిం ది. అందువల్ల అసలు 1948 నాటి హైదరాబాద్ పాలనను రజాకార్ల దాడులను ముస్లిం పాలనగా, ముస్లిం మతదాడులుగా చిత్రించడం ఒక కుట్ర. అది ఒక నిరంకుశ పాలన అనే మాట, దాని నుంచి ప్రజలు విముక్తిని కోరుకు న్నారనే మాట నిజ మే.

కాని 1948 సెప్టెంబర్ 17 ఆ విముక్తిని కూడ సాధించలేదు. హైదరాబాద్ రాజ్యపాలన 1950 జనవరి 26 దాకా మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ పేరు మీదనే సాగింది. ఆ తర్వాత కూడా 1956 నవంబర్ 1 దాకా ఆయన రాజప్రముఖ్‌గా కొనసాగాడు. దుర్మార్గమైన భూస్వామ్య వ్యవస్థను నెలకొల్పి, ప్రజల గోళ్ళూడ గొట్టి పన్నులు వసూలుచేసి ప్రపంచంలోనే అత్యంత ధనికులలో ఒకడుగా పేరుపడ్డ నిజాం ఆస్తులను ఈ 'విమోచన' తర్వాత స్వాధీనం చేసుకుని ప్రజలకు అప్పగించ లేదు సరిగ దా, అయనకే ఎదురుగా రాజభరణం, నష్టపరిహారాలు అందజేశారు. ఆయన ఆస్తులలో అత్యధిక భాగాన్ని, ఆయన అధికారాలను Äధాతథంగా ఉంచారు.

ఎవరి నుంచి విమోచన సాగినట్టు? ఎవరికి విమోచన దొరికినట్టు? నిజాం పాలన నుంచి, భూస్వామ్య పీడన నుంచి విముక్తి కోరుతూ పోరాటం ప్రారంభించిన ప్రజలు ఆ పోరాటాన్ని 1948 సెప్టెంబర్ 17 తర్వాత ఆపివేయలేదు. ఆరోజుతో ఏదో మార్పు వచ్చిందని ప్రజలు భావించ లేదు. గొర్రెలు తినేవాడుపోయి బర్రెలు తినేవాడు వచ్చాడని ప్రజ లు చెప్పుకున్నారు. అందుకే ఆ తర్వాత మూడు సంవత్సరాలపాటు ప్రజలుసాయుధ పోరాటం కొనసాగించారు.


తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్ 18 నుంచి 1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతు కూలీలను, పోరాటయోధులను కాల్చి చంపింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 1946 జూలై 4 నుంచి 1948 సెప్టెంబర్17 దాకా నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్య ల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు, ఆకృత్యాలు ఎక్కువ. ప్రజలు సాధించుకున్న విజయాలన్నిటినీ నెహ్రూ-పటేల్ సైన్యాలు ధ్వంసం చేశా యి. ప్రజలు ఆక్రమించుకున్న భూములను మళ్లీ భూస్వాములకు కట్టబెట్టాయి.

రజాకార్లను అణచడం అనే పేరు మీద రెండు లక్షల మంది అమాయక ముస్లింలను ఊచకోత కోశాయి. ఆ బీభత్సకాండకు నాందిపలికిన సెప్టెంబర్ 17ను విమోచన దినంగా అభివర్ణించడం అర్థ రహితం. సమకాలీన చరిత్రకారులు, పరిశీలకులు ఆ తేదీని విమోచన దినంగా పేర్కొనలేదు. స్వయంగా ఆ సైనికదాడిని నడిపిన వాళ్లు, యంత్రాంగం నెరిపినవాళ్లు, సమర్థించినవాళ్లు కూడ దాన్ని విలీనం, పోలీసు చర్య వంటి మాటల తోనే సూచించారు గాని విమోచన అనలేదు. కొన్ని సంవత్సరాల కింద సంఘపరి వారం ప్రారంభించి న 'విమోచన' ఆలోచన ఇవాళ అన్ని రాజకీయపక్షాలకు అంటుకున్నట్టుంది.

అందరికన్న ఎక్కువ ఆశ్చర్యకరంగా ఆ తేదీన మొదలుపెట్టి తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు జరపాలని సిపిఐ, సిపిఎం నిర్ణయించుకున్నాయి. నిజానికి తెలంగాణ సాయుధ పోరాటానికి సంకేతాత్మక ప్రారంభమైన దొడ్డి కొమురయ్య అమరత్వ దినం (1946 జూలై 4) గాని, సాయుధ సమర ప్రారంభానికి రావి నారాయణ రెడ్డి , బద్ధం ఎల్లా రెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్‌లు పిలుపు ఇచ్చి న 1947 సెప్టెంబర్ 11 గాని, సాయుధ పోరాటాన్ని అధికారికంగా విరమించిన 1951 అక్టోబర్ 20 గాని సాయుధ పోరాట వార్షికోత్సవ సందర్భం అవుతాయి గాని, తమ కార్యకర్తల ను ఇతోధికంగా చంపడానికి కారణమైన, తాము అప్పుడు ఏ మార్పు లేదని భావిం చి పోరాటం కొనసాగించిన తేదీకి ఇవాళ ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారో ఆ పోరా ట అమరుల త్యాగాల సాక్షిగా వామపక్షాలు సంజాయిషీ ఇచ్చు కోవలసి ఉంటుంది.

ఇంకా విచిత్రంగా ప్రత్యేక తెలంగాణ వాదులలో కొందరు కూడా హైదరాబాద్ విమోచన దినాన్ని గుర్తిస్తున్నారు. నిజానికి 1948 సెప్టెంబర్ 17ను అందరికన్న ఎక్కువగా వ్యతిరేకించవలసిన వారు ప్రత్యేక తెలంగాణ వాదులు. ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక అస్తిత్వాన్ని రద్దు చేయడం ప్రారంభమైన చీకటి రోజు అది. హైద రాబాద్ రాజ్యం, అందులో భాగంగా తెలంగాణ చిత్రపటం చెరిగిపోయి, ఇవాళ తెలంగాణ వాదులు చెపుతున్న 'ఆంధ్ర వలస పాలకుల పాలన'కు నాంది పలికిన రోజు అది. ఆంధ్రప్రదేశ్ అవతరణతో 1956 నవంబర్ ఒకటిన స్థిరపడిన ప్రక్రియకు తొలి అడుగు పడినది 1948 సెప్టెంబర్ 17ననే.

చారిత్రక వాస్తవాలతోగానీ, జరిగిన చరిత్రతోగాని, సమకాలీన ఆధారాలతో కానీ, తదనంతర పరిణామాలను బట్టిగానీ ఎంత మాత్రం అంగీకరించలేని 'విమోచన దినాన్ని' జరపడానికి సంఘపరివారాని కి ఒక నిర్దిష్ట - సమాజాన్ని నిట్ట నిలువునా చీల్చే ప్రయోజనం ఉంది. కానీ చరిత్ర తెలిసిన వారు, తెలియని వారు, ఆ చరిత్రలో భాగమయిన వారు, ఆ చరిత్ర వల్ల ధ్వంసమయిన వారు అందరికందరూ ఆ సంబరాలకు పరుగెత్తి పోవడ మేనా? అవి ఎవరి సంబరాలో మనం పాల్గొనవచ్చునో లేదో కనీస ఆలోచన ఉండనక్కర లేదా?


Andhra jyothy 2008 Sept 17.

తెలంగాణ విమోచనదినోత్సవం - సెప్టెంబర్ 17 - naveen achari

నిరంకుశ నిజాం మెడలు వంచి గడీల నుండి దొరలను తరిమిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని గుర్తుకు తెచ్చుకుందాం. భూమి కోసం భుక్తి కోసం స్వేచ్చా స్వతంత్రాల కోసం పోరాడి నియంతల గుండెల్లో నిదురించిన మేరునగధీరుల్లారా జాతి మీకు తలవంచి నమస్కరిస్తుంది.

మీ త్యాగం నిరుపమానం. ప్రపంచ చరిత్రకే పోరాటాల పాటాలు నేర్పిన మా "సామాన్యుల" గుండె చప్పుల్లు మీరు.

మీ స్ఫూర్తి తో వలస పాలకులపై పోరాడుతం.తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుతం.

జై తెలంగాణా జై జై తెలంగాణా

Monday, September 15, 2008

కోటి విస్మరణల చరిత తెలంగాణ - డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి


ఆధునిక తెలంగాణ చరిత్రలో 1900-1956 మధ్యకాలం అత్యంత కీలకమైంది. తెలంగాణ ఆ ఐదున్నర దశాబ్దాల కాల వ్యవధిలో అనేక మార్పుల్ని చవిచూసింది. సాంస్క­ృతిక ఉద్యమాలు అంకురించాయి. రాజకీయపోరాటాలు విజృంభించాయి. నిజాం నవాబు పాలన అంతమైంది. కొంతకాలం మిలటరీ-పౌర అధికారుల పాలన తర్వాత ఎన్నికలు జరిగాయి. ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఈ సంక్లిష్ట పరిణామాల నేపథ్యంలో సాంస్క­ృతిక, సామాజిక, రాజకీయ రంగాలలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి.



ఇదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో నెలకొన్న సాహిత్య వాతావరణం, ఆధునిక ప్రక్రియల్లో ఇక్కడి వారి యోగదానాన్ని (కంట్రీబ్యూషన్) గురించిన సమాచారంమాత్రం విస్త­ృతస్థాయిలో ఆవిష్కరించబడలేదు. పాల్కురికి సోమన, బమ్మెరపోతన, పొన్నెగంటి వెలుగన్నల వంటి నాటి కవుల స్థాయి సమాచారం లభ్యం కావడం లేదు. అయితే ప్రాంతీయ అస్తిత్వ ఆకాంక్షలు విస్తరించిన ఈ తరుణంలోనైనా ఆనాటి విస్మ­ృత విషయాల్ని పరిశోధించడం అత్యవసరం. విశాలాంధ్ర అవతరణకు ముందుకాలపు తెలంగాణ సాహిత్య సమాచారం అక్షర జగత్తులోని వైవిధ్యాన్ని పరిచయం చేసేందుకు తోడ్పడుతుంది.

నిజానికి ఆనాటి తెలంగాణ విస్మ­ృత సాహిత్య విశేషాల్ని గురించిన పరిశోధన ఏనాడో వేగాన్ని అందుకోవలసింది. విశాలాంధ్ర ఏర్పడేనాటికి తెలంగాణలో తెలుగు సాహితీ వాతావరణం అంత బలంగా లేదని ఇప్పటికీ కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఈ అభిప్రాయంలో అణా వంతు నిజం కూడా లేదని నిరూపించేందుకు ఆనాటి హైదరాబాదు, వరంగల్లు సాహిత్య వాతావరణాన్ని అక్షరబద్ధం చేయాలి. 1938లో కె.సి.గుప్త ఆరంభించిన అణాగ్రంధమాల, వట్టికోట అళ్వార్‌స్వామి వంటి త్యాగధనుల కృషి కారణాలుగా 1940లలో తెలంగాణలో తెలుగు పాఠకుల సంఖ్య పెరిగింది.

ఉత్సాహవంతులైన యువరచయితల బృందం కూడా వెలిసింది. వీరికి తెలంగాణ రచయితల సంఘం వేదికగా మారింది. 'తెలంగాణలో సాహిత్యో ద్యమాన్ని విస్త­ృత ప్రాతిపదికన నడిపించడానికీ, యువ రచయితలలో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి తెలంగాణ రచయితల సంఘం స్థాపించబడింద'ని ఆ సంస్థ ప్రచురించిన 'మంజీర' చెబుతోంది. 'తెలంగాణ రచయితల సంఘం కొందరు రచయితల కూటమి కాదు. అది ఒక ఉద్యమం. సాహిత్య మహోద్యమం, దాశరథి దానికి నాయకుడు. నారాయణరెడ్డి అనుచరుడు, ఉపనాయకుడు' అని జనగామ ప్రాంతంలో ఆ సంఘ కార్యక్రమాలు నిర్వహించిన విపి రాఘవాచారి రాశారు.

'హైదరాబాద్ సంస్థానంలోని ఎనిమిది తెలుగు జిల్లాలవారిని ఒకే వేదిక మీది కి తీసుకొనిరావడం, యువ రచయితలను ప్రోత్సహించడం, తెలుగు భాషాసాహిత్యాల్లో ఆసక్తిని పెంపొందించడం, ముషాయిరాలకు దీటు గా తెలుగు కవి సమ్మేళనాల్ని నిర్వహించడం తెలంగాణ రచయితల సంఘం ప్రధాన సంకల్పాలని' దాశరథి 'యాత్రాస్మ­ృతి' ద్వారా స్పష్టపడుతోంది. 'నూతన సాహిత్య వాతావరణానికి తెలంగాణ రచయితల సంఘం దోహదం చేస్తూ ఉండేదని' ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య రాశారు. దాశరథి అధ్యక్షులుగా సినారె ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది.

డి.రామలింగం, కాళోజీ, బి.రామరాజు, దేవులపల్లి రామానుజరావు, వెల్దుర్తి మాణిక్యరావు, వట్టికోట ఆళ్వారుస్వామి వంటివారు ఈ రచయితల సంఘం పునాదుల్ని బలోపేతం చేశారు. హైదరాబాద్‌లోని ప్రతాప్‌గిరి కోఠిలో ఎంతో వైభవంగా సాగిన సంఘం సమావేశాల్లో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, ఆరుద్రలు పాల్గొన్నారు. 'అభినవ పోతన' వానమామలై వరదాచార్యులను సంఘం ఘనంగా సన్మానించింది. సంఘం కవిత్వ రచనలో పోటీల్ని నిర్వహించింది. ప్రవర్ధమాన కవుల్ని ప్రోత్సహించింది. 1953లో ప్రబంధ గోష్ఠులు నిర్వహించింది. 65 మంది కవుల రచనలతో 'ఉదయ ఘంటలు' అనే కవితా సంకలనాన్ని ప్రచురించింది.

ఇందులో అన్ని ప్రాంతాల కవుల రచనల్ని ప్రకటించింది. 1950'ల్లో సంఘంలో పనిచేసిన కవులు, రచయితలు హైదరాబాద్‌లోని ఆచార్య పల్లా దుర్గయ్య ఇంట్లో సమావేశమయ్యేవారు. 'దుర్గయ్యగారి ఇల్లు ఆ రోజుల్లో కవితా దుర్గం' అని సుప్రసన్నాచార్య అభివర్ణించారు. కనీసం ఐదేళ్ళపాటు సాహిత్య వసంతాల్ని నిర్మించిన 'తెరసం' విశాలాంధ్ర అవతరణ జరిగిన వెంటనే మోడువారిన మానుగా మారిపోయింది. నాటి 'సందిగ్ధ సందర్భం'లో తెరసం నిర్వహించిన చారిత్రక భూమికను గురించి ప్రముఖంగా ప్రస్తావించిన రచనలు తక్కువే. కోస్తాంధ్రలో భావ,అభ్యుదయ కవిత్యోద్యమాలు ఎంత కీలకమైనవో తెలంగాణలో తెరసం కొనసాగించిన సాంస్క­ృతిక ఉద్యమంసైతం అంతే కీలకమైంది. అయితే సంఘం ప్రాధాన్యత విస్మరణకు లోనైంది. కోవెల సుప్రసన్నాచార్య వెలువరించిన 'దర్పణం' సమర్పణ' సంకలనాలలోని కొన్ని వ్యాసాల ఆధారంగా అప్పటి ఓరుగల్లు సాహిత్య జాగృతిని లెక్కగట్టవచ్చు. 1951లో వరంగల్లు నగర యువ సాహితీ బృందం 'సుకృతి' పేరుతో ఒక లిఖిత మాస పత్రికను వెలువరించింది. కందుకూరి వీరేశలింగం ముఖచిత్రంతో వెలువడిన ఈ సంచికలో ప్రముఖ పరిశోధకుడు దూపాటి వెంకటరమణాచార్యులు 'పరశురామ పంతుల లింగమూర్తి'పై వ్యాసాన్ని రాశారు.




వరంగల్లులో పోతన జయంతులు జరిగాయి. విశ్వనాధ సత్యనారాయణ, భమిడి కామేశ్వరరావు, జటావల్లభుల పురుషోత్తం, దివాకర్ల వేంకటావధాని, సరిపల్లి విశ్వనాధశాస్త్రి వంటి ప్రసిద్ధులు పోతన జయంతి ఉత్సవాలలో ప్రసంగించారు. 1955 ఫిబ్రవరిలో వరంగల్లు యువకవులు 'సాహితీ బంధు బృందం' అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్థ పలువురి కవితలతో 'తొలికారు' అనే కవితా సంకలనాన్ని వెలువరించింది. ఇలా వరంగల్లు సాహిత్య సమాచారంతో ఒక ఉద్గ్రంధమే తయారవుతుంది. నాటి తెలంగాణలో సాహితీ చైతన్యాన్ని పెంపొందించిన మరో రెండు సంస్థలు కూడా ప్రధాన సాహిత్య చరిత్రల్లో విస్మరణకు లోనయ్యాయి. 'సాధన సమితి' అనే సంస్థ 1939లో ఆవిర్భవించింది. కథానిక ప్రక్రియను బాగా ప్రోత్సహించింది. 20 పుస్తకాలు ప్రచురించింది. ప్రత్యూష అనే లిఖిత పత్రికను నిర్వహించింది. నెల్లూరు కేశవస్వామి, భాగి నారాయణమూర్తి, బూర్గుల రంగనాధరావు, వెల్దుర్తి మాణిక్యరావు, జె.సూర్యప్రకాశరావు, పిల్లలమర్రి హనుమంతరావు ఇందులో ప్రముఖంగా పాల్గొన్నారు. 1955లో నవలల పోటీ నిర్వహించింది. దేవులపల్లి రామానుజరావు రాసినట్టు 'తెలంగాణలో తెలుగును మరింత తేజోవంతం చేయడానికి ఆవిర్భవించిన ఆంధ్ర సారస్వత పరిషత్తు' ఆలంపురం, మంచిర్యాలల్లో నిర్వహించిన కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది.

ఆలంపురంలో పరిషత్తు సభలకు 20,000 మంది హాజరయ్యారని గడియారం రామకృష్ణ శర్మ శతపత్రం చెబుతోంది. మంచిర్యాల సభలు కూడా మహా వైభవంగా జరిగినట్టు వయోవృద్ధ సాహితీవేత్తల జ్ఞాపకాలు తేటతెల్లం చేస్తున్నాయి. వేలూరి శివరామశాస్త్రి ఈ సభల్లో పాల్గొని పరిషత్తు పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారికి విజయపత్రాలు బహూకరించారు. తూఫ్రాన్ తదితర ప్రదేశాల్లో జరిగిన పరిషత్తు మహాసభలు ఆధునిక సాహిత్య ప్రక్రియల్ని విపులంగా చర్చించాయి. 1946 లో మహబూబ్‌నగర్‌లో జరిగిన కవిసమ్మేళనంలో మహాకవి దాశరథి తన తొలి కవితను వినిపించారు




ఇట్లా ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో 'సాధన సమితి', సారస్వత పరిషత్తు' ఉత్తమస్థాయి కృషి తగినస్థాయిలో నమోదు కావాలి. నిజాం కాలేజీలో తెలుగు విద్యార్థులు నిర్వహించిన ఆంధ్రాభ్యుదయోత్సవాల సమాచారం నమోదు కావాలి. 1912 నుంచి తెలంగాణలో కథాసాహిత్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడేనాటికే దాదాపు 1500 కథలు తెలంగాణ నుంచి వచ్చాయి. ఒకానొక బృహత్ కథా సంకలనకర్తలు 1980 తర్వాతే తెలంగాణలో తెలుగు కథ ఆవిర్భవించినట్టు లగుర్తించారు! '1975లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి కె.రామలక్ష్మి సంపాదకత్వంలో రచయిత్రుల సమాచారం అనే పుస్తకాన్ని వెలువరించింది

అయితే తెలంగాణ ప్రథమ కథా రచయిత్రి నందగిరి ఇందిరాదేవికి సంబంధించిన సమాచారమే ఇందులో లేదంటే మిగతావారి పరిస్థితిని ఊహించుకోవచ్చు' అని సంగిశెట్టి రాశారు. ఆయన 'దస్త్రం' పుస్తకం వెయ్యి తెలంగాణ కథల సమాచారాన్ని అందించింది. సురవరం ప్రతాపరెడ్డి యావత్ రచనలే ఇంకా లభ్యం కాలేదు. ఇంకా చాలామంది వివరాలు వెలుగులోకి రావలసివుంది. అప్పటి కథానికల అధ్యయనం ద్వారా నాటి తెలంగాణ జీవద్భాషను నాటి సంక్లిష్ట సామాజిక రాజకీయ సాంస్క­ృతిక పరిణామాల్ని అంచనా వేసేందుకు వీలవుతుంది.

తెలంగాణలో 1930 నాటికే నవలా రచన ఆరంభమైనట్టు గోల కొండ కవుల సంచిక ద్వారా తెలుస్తోంది. వరంగల్లు నుండి వెలువడిన 'ఆంధ్రాభ్యుదయం' పత్రికాసంపాదకులు కోకల సీతారామశర్మ 'పావని' పేరుతో ఒక నవల రాశారు. హితబోధిని (19) పత్రికా సంపాదకులు బి.శ్రీనివాసశర్మ రచించిన 'ఆశాలేశము' తెలంగాణలో రచించబడిన తొలి నవల అని పరిశోధకుల అభిప్రాయం. తొలినాళ్ళ తెలంగాణ నవలలు అంత సులువుగా దొరకవు. విశేష ప్రయత్నం జరగాలి. 1956 నాటికి తెలంగాణ ప్రాంతంలో వికసించిన వచన కవితా ప్రక్రియను గురించి నిశిత విశ్లేషణ జరగాలి.




తెలంగాణ కవులు అప్పటివరకు తమ సాధనలో ఉన్న పద్యాన్ని, అభ్యాసంతో నడిచిన గేయాన్ని ఒక్కసారిగా విడిచిపెట్టలేకపోయారు. ఈ రెంటితోపాటు వచన కవిత నూ సాధన చేశారు. దాశరథి వెలువరించిన 'పునర్నవం' ఇందుకొక ఉదాహరణ. ఆయన 'మస్తిష్కంలో లేబరేటరీ' తెలంగాణ తొలి వచన కవిత అంటారు. ఈ విషయంలో మరింత పరిశీలనలు జరగాలి. తెలంగాణలో యక్షగాన ప్రదర్శన సంస్క­ృతి బహుళంగా జనాదరణ పొందింది. అందువల్ల సాంఘిక నాటక రచన- ప్రదర్శనల్ని గురిం చి ఎవరూ పెద్దగా ఆసక్తిని కనబరచలేదు.

అయితే, పరిశోధన- విమర్శనారంగాల్లో మాత్రం 1956 నాటికే ఇక్కడి విద్వాంసులు గొప్ప పరిణతిని కనబరిచారు. విమర్శను, పరిశోధనను విడదీయలేని పద్ధతిలో వ్యాసాల్ని రచించడం ఇక్కడి విధ్వాంసుల ఆనాటి విధానం, దూపాటి వెంకట రమణాచార్యుల చొరవతో తెలంగాణలో తెలుగు సాహిత్య పరిశోధనారంగం కొత్త అడుగులు వేసింది. వెల్దండ ప్రభాకరామాత్య అనే పండితుడు అముక్త మాల్యదను విశ్లేషిస్తూ గొప్ప రచన చేశారు. అంబడిపూడి వెంకటరత్నం, ఆదిరాజు వీరభద్రరావు, సింగూరి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి విలువైన విమర్శా వ్యాసాలు రచించారు. ఇవి ఆనాటి పత్రికల్లో దర్శనమిస్తాయి.

తెలంగాణలో జన్మించి 1900-1956 సంవత్సరాలమధ్యకాలంలో కవితా రచన చేసిన కవుల పేర్లు ప్రధాన సాహిత్య చరిత్రలో కనిపించవు. అడ్లూరి అయోధ్యరామకవి, మేడిచర్ల ఆంజనేయమూర్తి, చెలమచర్ల రంగాచార్యులు, రంగరాజు కేశవరావు, గంగుల శాయిరెడ్డి, సిరిసిన హళ కృష్ణమాచార్యులు, కంభంపాటి అప్పన్నశాస్త్రి, బెల్లంకొండ నరసింహాచార్యులు, చిలకమర్రి రామానుజాచార్యులు, భాగి నారాయణమూర్తి వంటి ప్రతిభావంతులు చాలాకాలం క్రితమే విస్మ­ృత కవుల కోవలో చేరారు. వీరితోపాటు ఇక్కడి విస్మ­ృత కవులందరి రచనలకు సాహిత్య చరిత్రలో స్థానం దొరకాలి.

Saturday, September 06, 2008

గొప్ప ప్రజాస్వామ్యము - అల్లం నారాయణ


దీనినే ప్రజల సమస్యలు చర్చించే చట్ట సభ అందురు. ప్రజలు మాత్రం ధర్నాచౌక్‌లో తమ సమస్యల మీద ధర్నాలు చేయుచుందురు. పోలీసులు వారిని తన్నుచుందురు. ఇది మన ప్రజాస్వామ్యమని చాలా గొప్పగా ప్రకటించుకోవచ్చును.


గణ గణ గణ గంట మోగును (గంటలు...గంటలు... గణ గణ గంటలు... గంటలు...గంటలు అను 'అలెన్‌పో'కు శ్రీశ్రీ అనువాదము కాదని మనవి చేయుతూ).. ఉపాధ్యాయ దినోత్సవ ము సందర్భముగా... నిన్ననే తాజాగా రక్షక భటులతో ఈడ్చివేయబడి ('బడి' అనగా... పాఠశాల అను అర్థములోనే సుమా. నేను 'నార్ల' వారి 'బడు'ద్దాయిని కాను) తన్నులు తినిన గురువుల పట్ల భక్తితో... గంట మోతతో ఈ కాలమ్‌కు శ్రీకార ము చుట్టి... అప్పటిదాకా గొట్టముల ముందు (గొట్టముల వా రు నామీద కినుక వహించకూడదు.


వారికా నామధేయమును శ్రేష్టమైన, మేలి తెలుగు భాషా రాష్ట్ర అధిపతియైన ముఖ్యమం త్రియే స్వయంగా ఖరారుచేసి ఉన్నారు.) తమకు తోచిన రీతి తాము, వారికి తోచిన తీరు వారు ఇష్టము వచ్చినట్లుగా వాగ్యు ద్ధాల గారడీ చేసిన ఎమ్మెల్యేలు, వారి అనుంగు సహచరులు, గొట్టముల వారు (గొట్టంగాళ్లు కాదని మరొక విన్నపం) బిల బిలమని ఆ మహా రాజప్రాసాదము వలె ఉన్న శాసనసభయను భవనములో ప్రవేశింతురు.


చివరన రెడ్డి గల సభాపతి గంభీరముగా కూచొని ఉందురు. అంతలో ఒకపక్క ముఖాలు మాత్రమే ఉద్రే కపూరితముగా కనిపించే ఎర్రెర్రని ముఖము గల కామ్రేడ్‌లు, పసుపు రాసుకున్న ముఖ ములతో ఇటీవలే ఎర్ర ప్రేమ ప్రదర్శిస్తూ ఐక్య కదన రంగంలో కాలుదువ్వే ప్రతిపక్ష తెలుగుదేశము వారు. ఉన్న ఇద్దరిలోనూ ఒకరు 'దొరబాబు'లా కాంగ్రెస్ ధగధగలకు ఆకర్షితులై వెళ్లిపోగా, ఒంటరియైనా తుంట రిని నేననే భాజపా ఒకే ఒక్కడు. పక్క వాద్యములు పలుచనైన స్థితిలో కొంచెం ఇటీవలే పసుపు రాసుకుంటూ (కొత్త మిశ్రమ వర్ణం) గులాబీకి వన్నె తెస్తున్న తెరాస వారు, 'కాకిరి బీకిరి కాంజాతా' అని శాసనసభ అంతయూ తెల్లబోతున్నా లెక్కచేయ క ఉర్దూలోనూ, ఆంగ్లంలోనూ, (సగం మంది గౌరవ నీయ శాస నసభ్యులకు ఈ భాషయూ కొరుకుడు పడదు.


అది తప్పుయును కాదు. స్వభాషాభిమానము.) భీకరముగా మైకులు బద్దలయ్యి దద్దరిల్లేలా ప్రసంగము చేయు అక్బరుద్దీను, వారి సహచరులు (తస్లీమా నస్రీన్‌పై దాడి ఫేమ్. మరియు... నగర అధికారులను భౌతిక ప్రక్రియలతో దారిలో పెట్టిన బాపతు) ఒకే ఒక్కలకే రాజారావు యను వాకపల్లి పోరాటమును చేసిన 'బసపా' సభ్యు డును, బయట పేరుకుపోయి చర్చ అత్యవసరమని భావించిన తమతమ సమస్యలను వాయిదా తీర్మానములవలె ప్రతిరోజు నూ ప్రవేశపెట్టెదరు. ఆ మొత్తము తీర్మానములన్నియు వీలు కాదనియు ప్రతి తీర్మానమునూ ఒక కట్ట కట్టి టోకుగా సభాపతి పక్కన బెట్టెదరు.


అంత వాయిదా తీర్మానములు ప్రవేశపెట్టిన సభ్యులందరునూ లేచి యధాశక్తిగా అరుచుదురు. అరగంట పాటు సమయం రోజువారీగా వీటికి ఉండును. మీమీ వాయిదా తీర్మానములు తిరస్కరించినామని సభాపతి కొంచెము ఆంగ్లము (నో...ఐ కాంట్... ఐయామ్ సారీ) కొంచెము ఆంగ్ల వాసనలతో కూడిన కొంచెము కొంచెము 'బ్రేకింగ్ తెలుగులోనూ' విస్పష్టము గా మీరెంత అరచి గీపెట్టినా మీ వాయిదా తీర్మానముల గతి అంతేయని తేల్చును. కాలము గడుస్తూ ఉండును. ప్రభుత్వ పక్ష ముతో అంటకాగుతున్నారన్న పేరు ప్రఖ్యాతులు సాధించుకున్న తెరాస అసమ్మతి వారున్నూ, సమాజవాదులున్నూ, మరి కొందరున్నూ నిశ్శబ్దముగా ఈ తమాషాను రోజువారీ కళ్లప్పగిచ్చి చూతురు. కాలము గడుస్తూ ఉండును.


ఈలోపున ఒకించుక ఆవే శకావేశములకు లోనయిన తెలుగుదేశమువారు, అతి మామూ లుగా రాచదారి వలె సభాపతి ముందు గల బావి (ఇది 'వెల్'కు స్వేచ్ఛానువాదం) లోకి దూకి సభాపతి ముఖముపైకి చూపుతూ తీవ్ర వాగ్యుద్ధము చేతురు. సభాపతి ఏమాత్రము భాషా మార్పి డి లేకుండా పదేపదే వల్లెవేసినట్టుగా టీవీలలో వచ్చు సంకర భాషలో మళ్లీ మళ్లీ చెబుదురు. (టీవీల వారు మరొకమారు నన్ను క్షమించగలరు.) బహుశా సభాపతి భాష వల్లనే కొన్ని వార్తా చానళ్ల టీవీల వారు ఈ భాషను ప్రామాణికముగా తీసుకు ని వాడుతూ ఉండి ఉండవచ్చు.


ఇక 'వెల్'లో గొడవ తర్వాత అలసిపోయి వారు వెనక్కి తిరిగి వచ్చుటో, సభ వాయిదా పడు టో జరుగును. ఇక ఆ తర్వాత మళ్లీ గంట మోగును. సభాపతి వచ్చును. మళ్లీ వాయిదా తీర్మానముల గొడవ జరుగును. సభ వాయిదా పడును. అనంతరము ఒకానొక విరామము తర్వాత 'ప్రశ్నల' సమయం ప్రారంభమగును. సాధారణముగా ప్రశ్న వేయుదురు. మంత్రివర్యులు 'లేదండి', 'కాదండి', చర్చ తీసు కుందుము అని ముగిస్తురు. కానీ అత్యంత చరిత్ర గలిగిన మన శాసనసభలో ఒక ప్రశ్న ప్రారంభమవును. అప్పటి వరకును సభ లో ఇద్దరు అత్యంత ప్రముఖులు, మహా గొప్పవారు, ఒకేసారి రాజకీయ ములలోకి వచ్చిన ఉద్ధండులు, గత రాజకీయములో మంచి స్నేహితులు. ఒకే ప్రాంత మునకు చెందిన వారు.


ఆ ఇద్దరు చెరొకవేపు పరివేష్ఠి తులై తమ కాల్బలములు, అశ్విక దళముల లాంటి చతురంగ బలములను ప్రయోగించి చివరగా ఎవ రో ఒకరు రంగంలోకి దూకు దురు. అప్పుడు హఠాత్తుగా ప్రమాద ఘంటికలు మోగు ను. సభలో ఉద్రేకము, ఆవేశకావేశములు ఆవరిం చును. ముందుగా ప్రతిపక్ష నేత తెలియజేసుకుందురు. గత వైభవ మున ఆయన చేసిన పను లన్నియు పూసగుచ్చినట్టుగా, కొన్ని లెక్కలు, కొన్ని పత్రములు చదువుతూ వివరించును. (ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాక పోవడము సభ చేసుకున్న దురదృష్టము). చివరగా ఆయన తెలుగు ప్రజల కోసం ఏమిచేసెనో చెప్పును.


తుచ్ఛ, దుష్ట పాలన ఏవిధంగా సాగుతున్నదో తెలియ జేయును. అంత ఆవలి పక్క నుంచి తమ సహజ ధోరణిలో బొజ్జ నిమురుకుంటూ ఈయన చిన్ననాటి స్నేహితుడు లేచును. అధ్యక్షా! 'మామకు వెన్నుపోటు పొడిచిన ఈయనగారు... ఇక ప్రారంభమగును. మర్యాదకర సంభాషణము నుంచి, సరసముల నుంచి విరసము ప్రారంభమ గును. 'చంద్రబాబూ.. మీయమ్మ నిన్నెందుకు కన్నానా? అని చింతించేటట్టు చేస్తా' అనియు చంద్రబాబు పిచ్చివాడనియు, ఆషాఢభూతి అనియు, నీకు బుర్ర లేదనియు, బుద్ధి లేదనియు, వాగ్యుద్ధము చేసును. అంతకు ముందరి ప్రశ్న ఎక్కడో బిక్కు బిక్కుమని ప్రాణము కోల్పోవును.


రెట్టించిన ఉత్సాహముతో ప్రసంగము కొనసాగును. మధ్యలో ఇటు ఒకరు, అటు ఒకరు లేచి సభా నియమాలపైనను, కౌల్ అం డ్ షక్దర్ పైననూ కాసేపు కీచులాడుకుందురు. రోశయ్య ఒకించుక వ్యంగ్యముగా మాట్లా డును. నాగం జనార్దనరెడ్డి ఆవేశముగా ప్రసంగించి దొరికిపోవు ను, నోముల నరసింహయ్య పిట్టకథలు చెప్పును, చెన్నమనేని రాజేశ్వరరావు పెద్దమనిషిలా మాట్లాడే ప్రయత్నము చేయును. కన్నా లక్ష్మీనారాయణ ఆయనను దృత రాష్ట్రుడి న్యాయం అనును. ఆయన దీనిని కౌరవ సభ అనును. కిరణ్ కుమార్‌రెడ్డి ఏదో మాట్లాడును.


ఇట్లా మధ్యలో పుణ్యకాలము గడిచిపోతూ ఉండ గా, మళ్లీ రారాజు లేచును. అప్రతిహతంగా తనయొక్క వాక్చా తుర్యంతో చంద్రబాబును చీల్చి చెండాడుతూ... తీరిక సమయ ములో వికటాట్ట హాసం చేయును. అదే అదనుగా చంద్రబాబు మరోసారి 'మైకు దొరకబుచ్చుకుని తెలుగు జాతి కోసం మళ్లీ తెలి యజేసుకునును. ఈయన బాగాతింటున్నాడు. అందుకే నవ్వు తున్నాడు. అసెంబ్లీ అయినందున అట్లా ఉన్నాడు. బయటైతే కొట్టేట్టు ఉన్నాడు. (అనుమానం కూడా ఎందుకు) అని మ్రాన్ప డి, ప్రశ్నించును. అయినా తెలుగు జాతి కోసం ప్రాణమైనా ఇస్తా ను. చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారేమో. మీ ఆటలు సాగవు' అనును. సభ సభంతా ఈ ఇద్దరి వేపు మార్చి మార్చి చూసి అలిసిపోదురు. గుమ్మడి నర్సయ్య అనే విప్లవ శాసన సభ్యుడు రోజూ ఈ తంతు చూసి మరీ ఆలోచించును.



సభ రేప టికి వాయిదా పడును. రేపునూ సభ ఇట్లాగే జరగబోదని ఆ ఇద్దరూ ఇట్లా ప్రేమతో పలకరించు కోబోరని హామీ ఇచ్చువారు ఎవరూ లేరు. దీనినే ప్రజల సమస్యలు చర్చించే చట్ట సభ అందు రు. ప్రజలు మాత్రం ధర్నాచౌక్‌లో తమ సమస్యల మీద ధర్నాలు చేయుచుందురు. పోలీసులు వారిని తన్నుచుందురు. ఇది మన ప్రజాస్వామ్యమని చాలా గొప్పగా ప్రకటించుకోవచ్చును. 'ఈ గొప్ప ప్రజాస్వామ్య ప్రక్రియకు రోజూ కోట్లు ఖర్చగును. ఆ ఇద్దరికీ హెచ్చరిక : ఈ గొప్ప ప్రజాస్వామ్యంలో కొత్త పాత్ర లో జీవించుటకు చిరంజీవి పొంచి ఉన్నాడు జాగ్రత్త. నీతి : ఆ ఇద్దరిని జీవిత కాలంలో మళ్లీ శాసనసభకు గెలవ కుండా చూసే గురుతర బాధ్యత ప్రజలపైనున్నది. అట్లయినచో కొంతలో కొంత రోగ నిదానం జరుగును. అసెంబ్లీ కొంతైనా బాగుపడి దారిలో నడుచును

Thursday, September 04, 2008

హైదరాబాద్ తెలంగాణ ప్రజల సొత్తే - డి.కె. సమరసింహారెడ్డి




తెలంగాణ ప్రజల స్వేదసౌధం- హైదరాబాద్. భిన్న సంస్క­ృతులతో పరిమళించే కుసుమం. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ఈ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే ప్రతిపాదన ఒక దుర్మార్గమైన ఆలో చన. తెలంగాణ ప్రజలను మరోసారి దగా చేయడానికి ఆంధ్ర ప్రాంత నాయకులు పన్నుతున్న కుట్రగా దీనిని భావించ వచ్చు. హైదరాబాద్ నగరం ఈనాటిదా? 400 సంవత్సరా లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన అతి గొప్ప నగరమది. కుతు బ్‌షాహి నవాబులు నిర్మించిన ఈ నగరం తొలుత చించలం (ఇప్పుడు శాలిబండ) పేరుతో చిన్న గ్రామంగా ఉండేది. 1590లో కలరా మహమ్మారి సోకి గోల్కొండ నగరం అత లాకుతలమయింది. నవాబ్ కులీ కుతుబ్ షా అక్కడి నుంచి చించలం గ్రామానికి తరలి వచ్చి తాత్కాలికంగా బస చేశా డు. వ్యాధి బెడద తగ్గిన తరువాత తిరిగి గోల్కొండ వెళుతూ తన బసకు గుర్తుగా 1591లో చార్మినార్ నిర్మించాడు. ఆ తర్వాత 1594లో నాల్గవ ఖలీఫా హజరత్ హైదర్ అలీ పేరిట నగరం నిర్మించాడు. అప్పటినుండి కాలక్రమంలో అంచెలం చెలుగా ఎదిగి హైదరాబాద్‌గా పరిణతి చెందింది.
17వ శతాబ్దంలో హైదరాబాద్‌ను సందర్శించిన ఇటాలి యన్ యాత్రికుడు టావెర్నియర్ నగరంలోని ఉద్యానవన ముల శోభకు అమితంగా ముగ్ధుడయ్యాడు. హైదరాబాద్ నిజానికి 'బాగ్‌నగర్' అని శ్లాఘించాడు. అయితే చివరి నిజాం కాలంలో ఆంధ్రోద్యమం ప్రభవించినప్పుడు కొందరు 'బాగ్ నగర్' పదాన్ని 'భాగ్యనగర్'గా మార్చి వేశారు. అసలు భాగ్యనగర్ అనే పేరు హైదరాబాద్‌కు ఎప్పుడూ లేదని ప్రముఖ చరిత్రకారుడు హెచ్. కె. శేర్వాని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు వాస్తవంగా 'భాగ్యనగర్' అనే పేరు ఎప్పుడూ లేదు. ఉద్యాన వనాలకేకాక సరస్సులకు కూడా హైదరాబాద్ పెట్టింది పేరు. కనుకనే 'సిటీ ఆఫ్ లేక్స్'గా కొందరు విదేశీయాత్రికులు ప్రస్తు తించారు. భారతావనిలో కెల్లా ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, నిర్మలమైన నీటి వసతి, సారవంతమైన నేల లతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే నగరమనిప్రఖ్యా త పర్షియన్ చరిత్రకారుడు ఫెరిస్తా అభివర్ణించారు. ఇంతెం దుకు 'లండన్‌తో విసుగెత్తిన వారు జీవితంతో కూడిన విసు గెత్తినట్లేనని' ప్రముఖ ఆంగ్ల పండితుడు శ్యామూల్ జాన్సన్ చెప్పిన మాటలు హైదరాబాద్‌కు కూడా అక్షరాల వర్తిస్తాయి. దేశానికి స్వాతంత్య్రం లభించేనాటికే హైదరాబాద్ సకల వస తులు కల రాజధాని నగరం. శాసనసభా భవనం, ఉస్మాని యా విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, విమా నాశ్రయం, కంటోన్మెంటు, విశాలమైన కార్యాలయాలు, అతిథి గృహాలు, చక్కని డ్రైనేజి వ్యవస్థ, నిరంతరం ఉచిత మంచినీటి సరఫరా వ్యవస్థ, సిమెంట్ రోడ్లు, డబుల్ డెక్కర్ బస్సులు, డీజిల్ రైలు, కారు వ్యవస్థ, రేడియో స్టేషన్, టంకశాల, ఆర్డినె న్స్ ఫ్యాక్టరీలు మొదలైన సౌకర్యాలు అప్పటికే ఏర్పాటై ఉన్నా యి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కూడా హైదరా బాద్ నగర విశిష్టతకు ముగ్ధులయ్యారు. పార్లమెంటు భవనం లేకపోవడం మినహా దేశరాజధాని కావడానికి హైదరాబాద్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సంవ త్సరానికి ఒకసారైన పార్లమెంటు సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలని ఆయన సూచించారు. అది జరగకపో యినా అంబేద్కర్ సూచన మేరకే బొల్లారంలో రాష్ట్రపతి నిల యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
దక్షిణ భారతావనిలోని రెండు జంట నగరాలలో మొదటి ద్వయం ఎర్నాకుళం, కొచ్చిన్ కాగా, రెండో ద్వయం హైదరా బాద్, సికింద్రాబాద్. సముద్రం ఒక పాయగా వేంబనాడు పేరుతో ఎర్నాకుళం, కొచ్చిన్‌ల మధ్య పోతుండగా ఇక్కడ మానవనిర్మితమైన 'హూస్సేన్ సాగర్' అటు, ఇటు రెండు సుందరమైన నగరాలుగా హైదరాబాద్, సికింద్రాబాద్ రూపు దిద్దుకున్నాయి.
ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం అనంతరం జరిగినవి కావు కదా! ఇంతటి ఘనచరిత్ర కలిగిన హైదరాబాద్‌ను తామే అభి వృద్ధి చేశామని ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారు గొప్ప లు చెప్పుకోవడం హాస్యాస్పదం. వాస్తవం చెప్పాలంటే సమై క్య రాష్ట్రం ఏర్పడిన తరువాత వారిక్కడకు వచ్చింది హైదరా బాద్‌పై ప్రేమతో ఎంత మాత్రం కాదు. హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో చౌకగా భూములు కొని లాభపడాలనే వచ్చారు. భూములు కొని పరిశ్రమలు పెట్టారు. ప్రభుత్వం నుంచి రాయితీలు, సబ్సిడీలు గుంజి, ప్రయోజనం పొందా రు. ఆ పరిశ్రమలతో మాత్రం స్థానికులైన తెలంగాణ వారికి మొండిచెయ్యి చూపి తమ ప్రాంతం వారికే ఉద్యోగాలను ఇచ్చుకున్నారు. భూములు కబ్జా చేశారు. రియల్ ఎస్టేట్ వ్యా పారం చేసి కోట్లు గడించారు. కళ్లు చెదిరిపోయే భవంతులను నిర్మించుకుని హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం చూడండి అంటున్నారు! ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన కొందరు పలు కుబడిగల వ్యక్తులు, అక్కడి నుంచి వచ్చిన అధికారులు కుమ్మ క్కయి సొసైటీలుగా ఏర్పడ్డారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూములను చౌకగా కైంకర్యం చేసుకున్నారు. విలువైన స్థలాల ను నామమాత్రమైన ధరకే ఆంధ్ర ముఖ్యమంత్రులు ఈ సొసై టీలకు ధారదత్తం చేశారు. పర్యావరణ సమతుల్యతను పట్టిం చుకోకుండా ఈ స్థలాల్లో విచ్చలవిడిగా నిర్మాణాలు చేసి హైద రాబాద్‌ను కాంక్రీట్ జనారణ్యంగా మార్చేశారు. ఇందువల్ల నగరంలో ఒకప్పుడు రాజ్యమేలిన పచ్చదనం జాడ ఇప్పుడు లేకుండా పోయింది. సాయంకాలం పిల్లతెమ్మెరలతో గిలిగిం తలు పెట్టే హూస్సేన్‌సాగర్ పరిశ్రమల కాలుష్యకాసారమై విష వాయువులను విరజిమ్ముతున్నది. 'అభివృద్ధి' అని దీనినే అంటారా?
ఇక హైదరాబాద్‌లో చిత్రపరిశ్రమ అభివృద్ధి జరిగిందనే వాదం కూడ ఒకటుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రా సు నుంచి తరలివచ్చింది హైదరాబాద్‌లోని విలువైన భూము ల కోసమే. ఈ పరిశ్రమ హైదరాబాద్‌కు రావడం వల్ల కొత్తగా జరిగిన అభివృద్ధి ఏమీ లేదు. మరాఠీయుల రాజధానియైన బొంబాయిలో హిందీ సినిమాలు తయారవుతుండగా తెలు గు సినిమాలు మద్రాసులో తయారుకావడంలో తప్పేమీ లేదు. మహరాష్ట్ర ప్రభుత్వం బొంబాయిలో ఒక్క సెంటు భూమి కూడ ఇవ్వకపోయినా, అక్కడ హిందీ చలనచిత్ర పరి శ్రమ అభివృద్ధి ఆగిపోలేదు. హిందీ రాష్ట్రాల రాజధానులైన లక్నో, భోపాల్, జైపూర్ నగరాలకు తరలిపోలేదు. తమ స్వార్థ ప్రయోజనాలకోసం ప్రభుత్వ భూములు పొంది భవంతులు, స్టూడియోలు నిర్మించుకోవడం, పరిశ్రమలను, వ్యాపారాలను నిర్వహించుకోవడం హైదరాబాద్‌ను ఉద్ధరించడమవుతుం దా? 1956లో హైదరాబాద్ దేశంలో ఐదవ పెద్ద నగరంగా ఉండేది. ఇప్పుడు ఆరవ పెద్ద నగరంగా ఉంది. దీన్ని బట్టి అర్థమయేదిమిటి. హైదరాబాద్ అభివృద్ధి చెందిందా? దిగ జారిపోయిందా? సమాధానం స్పష్టమే.
చండీగఢ్ మాదిరిగా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడా నికి హైదరాబాద్ భారత ప్రభుత్వం నిర్మించింది కాదు. అవి భక్త పంజాబ్ రాజధానియైన లాహోర్ 'రెడ్‌క్లిఫ్ అవార్డు' ప్రకా రం దేశ విభజన సమయంలో పాకిస్థాన్ అధీనంలో గల భాగానికి వెళ్ళింది. దీనితో తీవ్రంగా నష్టపోయినా పంజాబ్ ప్రాంతానికి కొత్త రాజధాని గా చండీగఢ్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. 1966లో రెండ వసారి పంజాబ్ విభజన జరిగి నప్పుడు ఆ నగరం ఉభయ రాష్ట్రాలకు చెందుతుందని కొత్త రాష్ట్రమైన హర్యానా వాదించింది. ఈ కారణం వలనే చండీ గఢ్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారి, పంజాబ్, హర్యానాలకు అనుసంధానమయింది. హైదరాబాద్ విషయానికి వస్తే అది తెలంగాణ ప్రజల రెక్కల కష్టంతో రక్తతర్పణతో ఆవిర్భవిం చింది. ప్రత్యేకరాష్ట్రం కావాలనే కోర్కె ఆంధ్రులలో అంకురించ డానికి శతాబ్దాల ముందే నిర్మితమైన నగరమని గుర్తుంచు కోవాలి.
మహారాష్ట్ర నుండి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన గుజరాతీయులు బొంబాయిని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కోరలేదు. రాష్ట్రాల పునర్విభజన జరిగినప్పుడు హైదరాబాద్ రాష్ట్రం నుంచి కర్ణాటకకు మూడు జిల్లాలు, మహారాష్ట్రకు ఐదు జిల్లాలు బదిలీ అయ్యాయి. అప్పుడు కూడా వారెవరూ ఇలాంటి వితండవాదం చేయలేదు. తెలుగు మాట్లాడే వారందరికీ ఒకే రాష్ట్రం ఉండాలని పైకి ఎంతగా చెప్పుకున్నప్పటికీ కర్నూలు నుంచి రాజధానిని హైదరా బాద్‌కు మార్చడానికి ఇతర ముఖ్య కారణాలు కూడా ఉన్నా యి. విభజన తర్వాత కర్నూలులో తగిన వసతులు లేక ప్రభు త్వ కార్యాలయాలు చాలా భాగం మద్రాసులోనే ఉండిపో యాయి. అందువల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ అస్తవ్యస్త మైపోయింది. మద్రాసులో ఉన్న కార్యాలయాలకు అద్దె చెల్లిం చేందుకు ఆంధ్ర ప్రభుత్వానికి నిధుల కట కట ఏర్పడింది. కాబట్టి అన్ని వసతులు ఉన్న హైదరాబాద్‌ను రాజధానిగా సమైక్య రాష్ట్రం ఏర్పాటుకు మొగ్గుచూపారు. ఆంధ్ర అసెం బ్లీలో నీలం సంజీవరెడ్డి ప్రసంగాలు ఒకసారి చదివితే ఈ విష యాలు తేటతెల్లమవుతాయి.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత చాలామంది తెలుగు వారు మద్రాసులోనే ఉండిపోయారు. కేంద్ర పాలిత ప్రాంతం కాని బెంగుళూరు, బొంబాయిలలో కూడా లక్షల సంఖ్యలో తెలుగువారు నివసిస్తున్నారు. అందువల్ల దశాబ్దాలుగా ఇక్క డ ఉంటున్న ఆంధ్రులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెళ్లిపోవల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు 'స్వపరి పాలన'ను, 'ఆత్మగౌరవాన్ని' మాత్రమే కోరుకుంటున్నారు. ఆంధ్రులను దూరం చేసుకోవాలని అనుకోవడం లేదు. వారుం డాలనుకుంటే నిర్భయంగా ఉండిపోవచ్చు. తెలంగాణ భార త్‌లోనే అంతర్భాగంగా ఉంటుంది. వేరే దేశంగా ఉండాలని కోరుకోవడం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండాలని కోరడం రెచ్చగొట్టే చర్యే కాకుం డా పగటికల కూడా. అది నెరవేరడం అసాధ్యం.
from andhra jyothy - వ్యాసకర్త మాజీ మంత్రి.