Friday, August 29, 2008

తెలంగాణ అస్తిత్వమూ, ఆంధ్రమహాసభలూ! - - పి.రామకృష్ణ

రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో (ముఖ్యంగా శ్రీకాకుళం) సాహిత్య, కళారూపాల్లోనూ ప్రజలపరంగానూ ఉన్న ప్రాంతీయ స్ప­ృహ ప్రాంతీయ అస్తిత్వంగా ఎందుకు మారలేదు? వెనుకబడిన ప్రాంతమే అయిన తెలంగాణలో మాత్రమే ప్రాంతీయ అస్తిత్వం ఎందుకు ఏర్పడినట్టు? ఈ అంశంపై చర్చా, ఇందుకు సంబంధించి రాయలసీమ, శ్రీకాకుళం ప్రాంత రచయితల అభిప్రాయాలూ ఆ మధ్య 'వివిధ'లో వెలువడ్డాయి. రాయలసీమలో చెప్పుకోదగిన ఉద్యమాలేవీరాలేదు.

శ్రీకాకుళంలో వచ్చినా, ఆ తర్వాత అవక్కడ నిలబడలేకపోయాయి. తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటం ఆశించిన ఫలితాలను మిగిల్చకపోయినా, దాని ప్రభావం మిగిలింది. 'బాంచన్ కాల్మోక్తా' అన్న మనిషి ' ఊరు మనది, నీరు మనది, భూమి మనది' అనే అస్తిత్వానికి ఎదిగాడు. అక్కణ్ణుంచి వెలువడే సాహిత్య కళారూపాలు ఆ అస్తిత్వాన్నే ప్రకటిస్తున్నాయి. దాదాపుగా ఈ అభిప్రాయాన్నీ పై రెండు ప్రాంతాల రచయితలూ వ్యక్తం చేశారనుకుంటున్నాను.

సాయుధ పోరాటానికి ముందూ, ఆ తర్వాత అన్న రెండు దశలుగా తెలంగాణను చూడవలసి వుంటుందన్నదే ఇంతవరకూ వున్న సాధారణ అభిప్రాయం. సాయుధ పోరాటానికి ముందు ఆంధ్ర మహాసభ తెలంగాణను కొంత చైతన్యపరచినట్టు తెలిసినా, పూర్తి సమాచారం అందుబాటులోనికి రాలేదు. అందువల్ల ఆ భాగం మనకు తెలియని మన చరిత్రగానే వుండిపోయింది. ఇప్పుడు 'తెలంగాణలో చైతన్యం రగిలించిన నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు' అన్న పేరిట కె.జితేంద్రబాబు రెండు భాగాలు వెలువరించారు. ఇంకా మూడు భాగాలు రానున్నట్టు చెప్పారు. ఈ రెండు భాగాలలో వున్న సమాచారమే మనల్ని ఆశ్చర్యానందాల్లో ముంచెత్తుతుంది. వర్తమాన రాజకీయాల్లోనూ, సంస్థల్లోనూ, సంఘాలలోనూ నెలకొన్న పరిస్థితి చూస్తూ క్రుంగిపోతున్న హృదయాలకు ఊరటనీ, ఉత్తేజాన్ని కలిగిస్తుంది.

'అవునా! ఆంధ్ర మహాసభ అంతటి క్రమశిక్షణతో, అంతటి పారదర్శకతతో, అంతటి ప్రజాస్వామిక దృక్పథంతో, ఇప్పుడు ఊహించడానిక్కూడా వీల్లేనంత ఉన్నతస్థాయిలో నడిచిందా!' అని ఆశ్చర్యం కలుగుతుంది. సమాచారం ఎప్పటిదో అయినా ఇంత ఆశావహ సమాచారాన్ని అందిస్తున్నందుకు జితేంద్రకు అభినందనలూ, కృతజ్ఞతలూ చెప్పకుండా వుండలేము. 'ఈ గ్రంథంలో నేను రాసింది తక్కువ. సేకరించింది ఎక్కు వ. లభ్యమైన సమాచారాన్ని నేను దండలా కూర్చాను. తప్పితే, భాష విషయంలోనూ, భావం విషయంలోనూ, నేను చేసిన మార్పులేవీలేవు. ప్రచురించిన సమాచారమంతా ఆనాటి పత్రికల్లోనూ ముఖ్యంగా గోలకొండ పత్రిక ప్రచురించిన వ్యాసాల్లోంచి, ఉపన్యాసాల పత్రాల్లోంచి రిపోర్టులనుంచి యధాతథం గా సేకరించి ప్రచురించినదే' (రెండవ భాగం 'నామాట' లో జితేంద్ర).

'సమాచారం ఎప్పటిదో అయినా' అన్నాను కానీ ఒక రకంగా ఈ సమాచారం ఇప్పటిదేననీ అనవచ్చు. జితేంద్ర కూర్చిన ఈ దండలో వున్న పూలు (సమాచారం) అప్పటప్పటికి సహజంగా పూచినవే. అంటే, ఇప్పటికే తాజావే. ఒకరినుంచీ మరొకరికి అం దడంలో వుండే కాలుష్యం, లేదా కల్పన ఇందులో వుండేందుకు వీల్లేదు. కనుక, ఉన్నదంతా విశ్వసనీయ సమాచారమే. మొదటి భాగంలో నాలుగు చోట్ల....అంటే జోగిపేట, దేవర కొండ, ఖమ్మం, సిరిసిల్లాలో జరిగిన ఆంధ్రమహాసభల సమాచారమూ, రెండోభాగంలో షాద్‌నగర్, నిజామాబాద్‌లలో జరిగిన సభల సమాచారమూ ఉంది.

నిజాం పరిపాలనకు సంబంధించీ, ఆంధ్ర మహాసభ ఆవిర్భావానికి ముందటి పరిస్థితి గురించీ, మహాసభల నిర్వహణపై గోలకొండ పత్రికలో ఎప్పటికప్పుడు వెలువడిన సమీక్షలూ సలహాలకు సంబంధించీ ఎంతో సమాచారం మొదటి భాగంలో వుంది. ఆంధ్రమహాసభలోనూ ఆ తర్వాత సాయుధ పోరాటంలోనూ పాల్గొన్న ఎ.గురవారెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి చెప్పిన ఉద్యమ విశేషాలు మొదటి, రెండవ భాగాల్లో ముందు మాటలుగా వున్నాయి. మొదటి భాగం, 563 పేజీలతో ఉండగా, రెండవభాగం, 705 పేజీలతో ఉంది.

ఈ రెండు భాగాల్లో ఉన్న సమాచారమూ, రానున్న భాగాల్లో ఉన్న సమాచారమూ ఇప్పటికీ బతికి ఉండటమూ, దాన్ని సేకరించి ప్రచురించడమూ అంతా అద్భుతమనాలి. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయం ఇప్పటికీ హామీల్లోనే ఉండగా ఫ్యూడల్ తెలంగాణలో ఒకవైపున స్త్రీలు పరదాలు లేకుండా బయటికి రాలేని స్థితి ఉండగా, ఎందరో మహిళలు ఆంధ్రమహాసభల్లో పాల్గొనడం ఆశ్చర్యంగా లేదా? ఇప్పటికీ పురుషులు జరుపుకునే సభల్లో, ఆకర్షణ కోసమో, ప్రత్యేకత కోసమో అన్నట్టుగా మహిళలకు ప్రసంగించే అవకాశం ఇస్తుండగా, మహిళలు ప్రత్యేకంగా మహాసభలు జరుపుకోగలగడం ప్రశంసనీయమైన ప్రజాస్వామికం అనిపించదా?

సభల నిర్వహణకు పదిరూపాయల నుంచి రూపాయి వరకూ విరాళం ఇచ్చిన వారి పేర్లు ప్రకటించి, మిగిలిందెంతో, ఎక్కడుందో తెలియజేయడం...క్రమశిక్షణా, నిజాయితీ, పారదర్శకతా కాదా? వేదిక వద్ద మహిళలకు మరుగుదొడ్లూ, స్నా నాల సౌకర్యమూ, బస వసతీ కల్పించడం ఎంత బాధ్యతాయుతం అనుకోవాలి? మహాసభలకు వెళ్ళే వారికి మార్గమధ్యంలో ఆయా గ్రామాల ప్రజలు ఆహ్వానం పలికి ఆతిధ్యమిచ్చే వారంటే ఉత్తేజం కలిగించదా? తీర్మానాలలోనూ అస్ప­ృశ్యతా నివారణ, స్త్రీ వారసత్వపు హక్కు, నిర్బంధ విద్య, మాతృభాషలో ఉన్నతవిద్య, రైతుల విషయంలో కొన్ని డిమాండ్లూ లాంటివి ఉండటం చారిత్రక దృష్టితో చూస్తే విశేషాలే

వీటికంటే, మహిళల సభకు అధ్యక్షత వహించిన మహిళల ప్రసంగాలు స్త్రీ చైతన్యంతో నిండివున్నట్టు చెప్పితీరాలి. వ్యాసపరిధి మించుతుందేమోనన్న భయం వున్నా,మూడవ ఆంధ్ర మహిళాసభకు అధ్యక్షత వహించిన ఎల్లాప్రగ్గడ సీతాకుమారి ప్రసంగం ఎల్లాగైనా కొంత చెప్పాలనిపిస్తోంది. 'చాలా మంది స్త్రీలకు అనేక శతాబ్దముల నుండి స్త్రీ స్థిరచరాస్తులతో పాటు పురుషుల స్వాధీనమైయుండుటే అలవడిపోయినందున, తాము హీనదశయందున్నామని కానీ, తమకు కొన్ని సంస్కరణలు అవసరమని కానీ తెలియనే తెలియదు. స్త్రీలు కేవలము గృహనిర్వహణము, లలిత కళలు మాత్రమే. నేర్వవలయుననియు, పురుషలతో పాటు విద్య అనవసరమనియూ కొందరభిప్రాయ పడుతున్నారు.

కానీ, స్త్రీలకు విద్యా విషయమున రక్షణలు, మినహాయింపులేని సంపూర్ణ స్వాతంత్య్రము కావలెను. స్త్రీ సంఘమంతయు కేవలము ఈ యీ విద్యలను మాత్రమే నేర్వవలయునని శాసించుటకు ఎవ్వరికినీ అధికారము లేదు' 'ఈ విశాల ప్రపంచమున స్త్రీకి నాదియని చెప్పుకొనుట కేదియునుండదు. తండ్రి ఇంటినుంచికానీ, భర్త ఇంటినుంచి కానీ అమెకొక్కపైసా కూడా రాదు. ఉదారుడగు భర్తయు, విధేయురాలగు భార్య సమకూడిన యెడల భర్త దయదలచి నగలు చీరెలు కొని ఇచ్చుట కలదు. అందువలన స్త్రీల కేమియు లాభము లేకపోగా, పురుషులు ఇచ్చవచ్చినప్పుడు దాచుకొనుటకును, సమయము వచ్చినప్పుడు తీసుకొనుకును ఉపయోగించు ధనపు పెట్టెలుగా మాత్రము పనికి వచ్చుచున్నారు.

ఈ విశాల ప్రకృతిలో, ఇన్ని కోట్ల జీవరాసులలో ఒక్క భారత స్త్రీ తప్ప, మరి ఏ ప్రాణియు తమ జీవన భారమును పురుష జీవిపై మోపుట లేదు' ఇంతకు మించిన ఆత్మ గౌరవం ఫెమినిజమ్‌లోవుందా? రైతాంగ సాయుధ పోరాటానికి తెలంగాణ రైతులు సంసిద్ధపడకముందే ఆంధ్ర నాయకత్వం వాళ్ల నెత్తిన మోపిందన్న అంశం చర్చనీయం అనిపిస్తోంది. ఎవరో బయటివాళ్లు బలవంతంగా రుద్దితే, అంతటి మహత్తర సాయుధ పోరాటం సాధ్యమయ్యేదా.. అనిపిస్తుంది. సాయుధ పోరాటానికి అవసరమైన వాతావరణం తెలంగాణలో ఉండిందన్నది నిర్వివాదాంశం.

ఆంధ్రమహాసభ కృషిని వివరిస్తున్నట్టే, సాయుధ పోరాటం గురించి కూడా డాక్యుమెంట్లతో ఆధారాలతో జితేంద్రో, జితేంద్ర లాంటి మరొకరో తెలియజేస్తే, ఆంధ్ర నాయత్వం మీదున్న ఆరోపణ నివృత్తి కావడమో, నిర్ధారణ అవడమో జరగవచ్చు. మళ్ళీ వ్యాస ప్రారంభానికి, ప్రాంతీయ స్ప­ృహ, అస్తిత్వం దగ్గరికొస్తే, 'తెలంగాణలో చైతన్యం రగిలించిన నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు' గ్రంథాలలో ఉన్న సమాచారమూ, రానున్న సమాచారమూ తెలంగాణలో ఉన్న అస్తిత్వం మిగతా ప్రాంతా ల్లో ఎందుకేర్పడలేదో తెలుసుకోవడానికి సహాయపడవచ్చు... అనిపిస్తుంది.
ANdhra Jyothy (5-5-2008)

Wednesday, August 27, 2008

కంచికి చేరని తెలంగాణ కథ! - ఇనగంటి వెంకట్రావు

కేంద్రం పెంచిన వంటగ్యాస్ ధరను ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నాటకీయంగా తగ్గించారు. శుక్రవారం ప్రతిపక్షాలు తలపెట్టిన బంద్ ఇక కొద్ది గంటల్లో ప్రారంభమవుతుందనగా గుంటూరులో జరిగిన ఒక సభలో ఆయన ఈ తగ్గింపు ప్రకటన చేయడం విశేషం. పెట్రోలు లీటరుకు అయిదు రూపాయలు, డీజిల్ మూడు రూపాయలు, వంట గ్యాస్ సిలిండర్ యాభై రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మీడియాలో ఎంత ప్రచారం లభించిందో, వంట గ్యాస్ ధర తగ్గించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయానికీ మీడి యా అంతే ప్రాధాన్యం ఇచ్చింది.

పెట్రో, డీజిల్ ధరల పెంపు సయితం భారీగానే వున్నా, గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి యాభై రూపాయలు పెంచడం మధ్య తరగతికి మరీ భారంగా అనిపించింది. ఇది ఇంటింటా మహిళలలో చర్చనీయాంశం అయింది. అందుకే ధరల సెగ తక్షణమే ప్రభుత్వాలకు తాకడం! ఇంత వేగంగా వంట గ్యాస్ ధర తగ్గడం మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు పెద్ద రిలీఫ్! ఆ మేరకు ముఖ్యమంత్రి రాజకీయంగా తెలివయిన నిర్ణయం తీసుకున్నట్టే! కాకపోతే పెట్రోలు, డీజిల్ ధరల మంట అలాగే కొనసాగుతున్నది. దాని దుష్ప్రభావం రాబోయే వారాలలో ప్రజలపై మరింతగా పడడం తథ్యం.

ముఖ్యంగా డీజిల్ ధర పెంపు రవాణాపై అదనపు భారం గా పరిణమిస్తుంది. ఫలితంగా అన్నిరకాల వస్తువుల ధర లు పెరుగుదల. ఇప్పటికే ధరలు ఆకాశాన్ని అంటాయని, ద్రవ్యోల్బణం అదుపు తప్పిందని ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. పెట్రో ధరలతో ద్రవ్యోల్బణం మరింత రెక్కలు విచ్చుకునే ప్రమాదం పొంచి వుంది. యు.పి.ఎ. పాలనలో మొదటి నాలుగేళ్ళూ అంతా సవ్యంగానే వుందని, మన్మోహన్-చిదంబరం ద్వయం మార్గదర్శకత్వంలో దేశ ఆర్థిక వ్యవ స్థ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వికసిస్తున్నదన్న ఆనందోత్సాహాలు కాస్తా ఇటీవలి కాలంలో ఆవిరి అవుతున్న సూచనలు.

ఎన్నికల ఏడాదిలో ఇది కాంగ్రెస్ పార్టీకి ఎదురీత వంటిది. అందుకే కాబోలు, పెట్రో వస్తువుల ధర ల పెంపుపై ప్రధాని ఏకంగా జాతి నుద్దేశించి టి.వి. ప్రసం గం చేయడం! పెంపు ఎంత అనివార్యమైందో వివరించడం! కేంద్ర నిర్ణయాలకు విరుగుడుగా రాష్ట్ర స్థాయిలో మాత్రం రాజశేఖరరెడ్డి నష్ట నివారణ చర్యలను వెంటనే చేపట్టారు. పెంచిన గ్యాస్ ధరను భరించినట్టే, ఎంతో కొంత పెట్రోలు, డీజిల్ ధరలను కూడ తగ్గిస్తారేమో చూడాలి! ఎందుకంటె, ప్రతిపక్షాలు ఇప్పటికే రకరకాల ఆందోళనలు చేపట్టాయి. రాష్ట్రవ్యాప్త బంద్‌కు శుక్రవారం పిలుపు ఇచ్చా యి.

ధరల పెరుగుదల విషయంలో అధికార పార్టీకి ఎవ రూ సానుభూతి చూపరు. అదీకాక,కాంగ్రెస్ పార్టీకి దేశం లో ఇక మిగిలిన పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే! రాబో యే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ఫలితాలు- కేంద్రంలో కాంగ్రె స్ భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. ఆయా రాష్ట్రాలలో వరుసగా ఎన్నికలు ఓడిపోతున్న నిరాశాజనక పరిస్థితులలో మొన్నటి తెలంగాణ ఉప ఎన్నికల విజయాలు కాంగ్రెస్ పార్టీకి - ఎడారిలో ఒయాసిస్సు వంటివి. కర్ణాటకలో ఓడిపోయిన దిగులుకు ఇది ఒకింత వూరడింపు. ఉప ఎన్నికల ఫలితాలతో రాజశేఖరరెడ్డి ప్రతిష్ఠ రాష్ట్రంలో ఏమో కాని, కాంగ్రెస్ పార్టీలో మాత్రం అమాంతం పెరిగిపోయింది.

ఆపార్టీ నావకు చుక్కాని ఇప్పుడు ఆయనే! ఉప ఎన్నికల విజయాలతో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ధైర్యం ఇనుమడించింది. తన మార్గం సరయినదేనన్న నమ్మకం పెరిగింది. తన వ్యూహాలు ఫలిస్తాయన్న ఆశాభావం రెట్టింపు అయింది. మొన్నటి ఓటును ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి వ్యతిరేక ఓటుగా కంటె, తమ ప్రభుత్వ అనుకూల ఓటుగానే ఎక్కువగా పరిగణిస్తున్నారు. అదే ఆయన ఉత్సాహం! ఇదే బాటలో ముందుకు వెడితే ఎన్నికల నాటికి మరిన్ని మంచి ఫలితాలు సాధించగలమన్న నమ్మకం! వంటగ్యాస్ ధర తగ్గించడం కూడ ప్రతికూల ప్రభావాలను అదుపు చేసే ప్రక్రియలో భాగమే!

ఇదంతా ఎన్నికల సమయంలో ఎవరయినా చేసే పనే కాని రాజశేఖరరెడ్డి- పథకాల రూపంలో కాని, ఇతర రూపాలలో కాని అందిస్తున్న సహాయం మిగతా ప్రభుత్వాల కంటె భిన్నం. వాటిలో వూహించలేనంత భారీతనం, అదే సమయంలో నిర్ణయాలలో వేగం. తాయిలాలు అనండి, ఓట్ల కోసం వేస్తున్న ఎర అనండి, వ్యక్తుల పరంగా, కుటుంబాల పరంగా ఇంత భారీగా పరోక్ష, ప్రత్యక్ష సహాయాలు అందిస్తున్న ప్రభుత్వాలు తక్కువ. ప్రభుత్వ సహాయాలతోటే ఆయన ఆగిపోవడం లేదు. పోల్ మేనేజ్‌మెంట్‌లో సయితం అదే వేగం, అదే నైపుణ్యం, అదే భారీతనం!

రాజశేఖరరెడ్డి పోల్ మేనేజ్‌మెంట్‌లోని ప్రత్యేకత- మూడో కంటికి తెలియకుండా ముందస్తుగా జరిగిపోయే ఏర్పాట్లు! ప్రీ ఫైనల్ పరుగు పోటీలుగా పరిగణన పొందిన తెలంగాణ ఉప ఎన్నికలు కాంగ్రెస్‌తో పాటు, తెలుగుదేశం పార్టీకీ వూపిరి పోశాయి. తెలుగుదేశం పార్టీ ఆదినుంచీ ఈ ఎన్నికలలో తగినంత ప్రభావం చూపగలదని అనుకుంటున్నదే కాని సీట్ల పరంగా కాని, ఓట్ల పరంగా అది ఇంత ప్రాబల్యం ప్రదర్శించగలదని, ఇంతటి గట్టి ప్రత్యర్థిగా నిలబడగలదని చాలామంది అనుకోలేదు. అది గెలిచింది నాలుగు అసెంబ్లీ స్థానాలే అయినా, వాటితోపాటు వరంగల్ లోక్‌సభ స్థానాన్ని కూడ గెలుచుకోవడం దాని ప్రతిష్ఠను పెంచింది.

బహుశ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలవరపెట్టిన అంశం కూడ ఇదే కావచ్చు! ఎందుకంటె, తీవ్రస్థాయిలో జరిగిన ముక్కోణపు పోటీలో వరంగల్ వంటి ప్రతిష్ఠాత్మక స్థానాన్ని గెలుచుకోవడం అంటే చిన్న విషయం ఏమీ కాదు. మొత్తానికి ఇప్పటికే మండుటెండలో మీకోసం యాత్రను మూడవ వంతు ముగించుకున్న దశలో- తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ఇది కొండంత బలం. ఇప్పుడు తెలుగుదేశం నేతలు 2009 ఎన్నికలను గురించి ఉత్సాహంగా ఆలోచనలు చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతం ఇదివరకే అనేక ప్రయోగాలకు వేదిక అయింది. వాటిలో అధికం 1969 నుంచీ కాంగ్రెస్ పార్టీ చేసినవే.

ఇప్పుడు బహుశ తెలుగుదేశం వంతు. మరి దాని ప్రయోగాలు ఏ రూపంలో వుంటాయో చూడాలి! అయితే, విజయాలను గురించి ఎవరెన్ని గొప్పలు చెప్పుకుని పొంగిపోయినా, ఈ ఉప ఎన్నికలలో బయటపడిన వాస్తవం ఒకటి వుంది. అది- ఏ ఒక్క పార్టీ కూడ- తనంత తానుగా పోటీచేసి తెలంగాణలో ఎన్నికలు గెలవలేని పరిస్థితి. ఇది నిజానికి కొత్తదేమీ కాదు. ఇదివరలో వున్న పరిస్థితే! ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, ప్రతి కుటుంబానికి పదివేలో, పాతికవేలో ప్రయోజనాల వంటివి కల్పించినా కాంగ్రెస్ తనంత తానుగా మెజారిటీ స్థానాలు గెలుచుకోలేదన్న విషయం ఉప ఎన్నికలలో ధృవపడింది.

అదేవిధంగా కాంగ్రెస్‌కు ప్రబల ప్రత్యర్థిగా, అధికారానికి ప్రత్యామ్నాయంగా పరిగణన పొందుతున్న తెలుగుదేశం పార్టీకీ అలాంటి అవకాశం కనిపించడం లేదు. ఇక టి.ఆర్.ఎస్! తెలంగాణయే తాను, తానే తెలంగాణ అని భావించే తెలంగాణ రాష్ట్ర సమితికీ అలాంటి అవకాశాలు మృగ్యం. కాని ఈ ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అతి పెద్ద పార్టీగా- ఏడు స్థానాలను గెలుచుకున్న వాస్తవాన్ని విస్మరించకూడదు. పెద్ద పార్టీగా రుజువు చేసుకుని కూడ ఆ పార్టీ ఓటమి భారంతో కుంగిపోతున్నది. అదేవిధంగా ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు కూడ! కరీంనగర్‌లో 15 వేల ఓట్ల మెజారిటీతో మూడోసారి నెగ్గి కూడ ఆయనకు శిరోభారం తప్పలేదు.

ఆదినుంచీ అంచనాల బరువు ఎక్కువై తెలంగాణ ఉప ఎన్నికలలో టి.ఆర్.ఎస్. దెబ్బతిన్నది. ఆ మేరకు కాంగ్రెస్, తెలుగుదేశం లాభపడ్డాయి. వచ్చిన ఫలితాలతో సంబరపడ్డాయి. ఉప ఎన్నికల ఫలితాల తీరు చూసి తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఎంతగా దిమ్మెరపోయారో, రాజకీయేతర తెలంగాణావాదులూ అంతే దిమ్మెరపోయారు. కాకపోతే వారందరికీ ఒకటే వూరట! కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండూ కూడ- తెలంగాణ పేరు చెప్పుకునే ఈ మాత్రం సీట్లయినా గెలుచుకోగలిగాయని! తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు తెలంగాణ విషయంలో ఏదో ఒకటి తేల్చి చెప్పాలని ఆ పార్టీలను వారు డిమాండ్ చేస్తున్నారు.

కాని వీరికి ఉన్నంత తొందర ఆ పార్టీలకు ఎందుకు వుంటుంది! ఎన్నికల ప్రచారంలో కేవలం ఆత్మరక్షణ నినాదంగా తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకున్న ఆ పార్టీలు, తమకు ఆధిపత్యం తెచ్చిపెట్టిన రాజకీయ ఎత్తుగడలనే నమ్ముకుని ఆచితూచి ముందుకు సాగే అవకాశాలు అధికం. పైగా ఆగస్టులో చిరంజీవి కొత్త పార్టీ రానున్న సమయంలో అవి అసలే తొందరపడవు. ఆయన పార్టీ పెట్టి తెలంగాణపై ఏమి తేలుస్తారో, ఆయన పార్టీ పట్ల ఆయా ప్రాంతాల ప్రజలు ఏవిధంగా స్పందిస్తారో చూసుకుని కాని ప్రధాన పార్టీలు ఒక అంచనాకు, ఒక అభిప్రాయానికి రావు. అదేవిధంగా చిరంజీవికి కూడ మొన్నటి ఉప ఎన్నికల ఫలితాలు చేసిన కొత్త ఉపదేశం ఏదీ లేదు.

ఇప్పటికీ తెలంగాణపై ఇదమిత్థంగా ఏదీ నిర్ణయించుకోలేని స్థితి. ప్రీ ఫైనల్ అన్న పేరుకు తగ్గట్టుగానే ఈ ఉప ఎన్నికలు నిజంగానే రాబోయే ఎన్నికల ఫైనల్‌కు గట్టి హెచ్చరికలే చేశాయి. చంద్రశేఖరరావును ఉప ఎన్నికలు మానసికంగా గట్టిగానే దెబ్బతీశాయి. రెండు రోజులపాటు ఆయన బయటకు రాకపోవడంలోనే ఆ విషయం స్పష్టం. ఆ తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చిన తర్వాత ఆయనే ఆ విషయం స్వయం గా చెప్పుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేయడం అన్నది కేవలం నైతికం, లాంఛనప్రాయం.

వ్యక్తులు కేంద్రబిందువులుగా నడిచే ఏ పార్టీలోనయినా అధినేతలు రాజీనామా చేయడం కుదిరేపని కాదు. కష్టమో, నష్టమో ఆ బంధం విడేది కాదు. పార్టీ కార్యవర్గం చంద్రశేఖరరావు రాజీనామాను తిరస్కరించడం, వారి అభిమతానికి తలవొగ్గి ఆయన పార్టీ పగ్గాలు చేపట్టడం- ఇదంతా వూహించిన పరిణామమే. అధినేత కాని, పార్టీ కాని షాక్ నుంచి తేరుకుని తిరిగి క్రియాశీలం కావడానికి సహజంగా ఎక్కడయినా జరిగే తంతే ఇది! ఇదివరకు ఇతర పార్టీలలో జరిగిందే ఇప్పుడు టి.ఆర్.ఎస్.లోనూ జరిగింది.

కాకపోతే- ప్రత్యర్థి పక్షాలు ఎన్ని టక్కుటమార విద్యలు చేసినా, వాటినన్నిటినీ తోసిరాజని ప్రజలు ఉప్పెనలా వచ్చి తమకు ఎందుకు ఓటు వేయలేదన్న బాధ మాత్రం అధినేతను, ఆ పార్టీలోని ఇతర నేతలనూ వేధిస్తున్నది, వెంటాడుతున్నది. తెలంగాణలో ఏకపక్ష రాజకీయం కుదరదన్న వాస్తవం తేలిపోవడం ఆ పార్టీకి చేదు అనుభవం. అయితే, తెలంగాణ రాజకీయ సమీకరణలను బేరీజు వేసుకుంటే, ఆయనకు మరొక పార్టీ అవసరం ఎంత వుందో ఇతరులకూ ఆయన అవసరం అంతే వుందన్నది స్పష్టం. 30 శాతానికి పైగా ఓట్లు సంపాదించుకున్న పార్టీని కాదని ఏ ప్రధాన పార్టీ అయినా అధికార పీఠం కోసం ఎలా అర్రులు చాచగలదు!

Andhra jyothy (6-7-2008)

'కమలం'తో తెలంగాణ ఖాయం! - బండారు దత్తాత్రేయ

నాలుగు దశాబ్దాల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ నెరవేరాలంటే ప్రత్యేక రాష్ట్ర శక్తులన్నీ బిజెపిని సమర్థించక తప్పని పరిస్థితి. చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా విధానాన్ని ఆమోదించి అమలు చేస్తున్న బిజెపి 2009లో కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటు ఖాయం.

తెలంగాణ ఉప ఎన్నికలు రాష్ట్రంలో ఎన్నడూ లేనంత రాజకీయ ఆసక్తిని, ఒత్తిడిని సృష్టించాయి. ఫలితాల అనంతరం కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితికి, ఆమాటకొస్తే కెసిఆర్‌కు తప్ప ఎవరి కీ ఆసక్తి లేనప్పటికీ తెలంగాణ ఉప ఎన్నికలు రావడం దురదృష్టకరం. ఫలితాలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాయి. తెలంగాణవాదం తన గుత్త సొత్తు అన్నట్లుగా భావించి ఎన్నికలు తేవడంద్వారా మరింత బలోపేతం అవుదామని తెరాస ఎమ్మెల్ల్యేలు, ఎంపీలు రాజీనామా చేయడం వ్యూహాత్మక, చారిత్రక తప్పిదం.

ఉప ఎన్నికల ఫలితాలలో ఇటు కాంగ్రెస్‌కు అటు టిడిపికి తెలంగాణలో తాత్కాలిక రాజకీయ స్థానం లభించింది. ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఫలితాలు అధికార పార్టీకి కొంత అనుకూలంగానే వస్తాయి. తెరాస తర్వాత కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి అదొక కారణం. సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ తెలంగాణ అనుకూల వ్యక్తులు, శక్తులను కలుపుకొని పోవడంలో తెరాస విఫలమైంది. కరీంనగర్ ఎన్నికలో మాదిరిగా తెలంగాణ మేధావులు, కళాకారులు, తెరాసకు మద్దతుగా పనిచేయలేక మౌనంగా ఉండిపోయారు. తెరాస అధినేత కెసిఆర్ ఒంటెత్తు పోకడ, అహంకారం, నిరంకుశ అతిశయంతో కూడిన విధానాలు, ఏకపక్ష నిర్ణయాలు ప్రజల్లో అసంతృప్తిని రగిలించాయి.

ప్రజలు తెలివితో ఇచ్చిన తీర్పుతో ఒక్క కెసిఆరే కాదు, ఇటు అధికార పక్ష నేత వై.ఎస్.ఆర్, అటు ప్రతిపక్ష నేత చంద్రబాబుకూడా గ్రహించాల్సింది చాలావుంది. మొత్తం మీద ఉపఎన్నికల్లో ఎవరూ గెలిచినట్లుకాదు. అలాగని ఎవరూ ఓడినట్లు కాదు. ఎన్నికలను ఒకే ఒక అంశం ప్రభావితం చేయడం అనేది అరుదైన సందర్భాల్లో మాత్రమే సాధ్యం. 1977లో ఎమర్జెన్సీ వ్యతిరేకత, 1989లో బోఫోర్స్ కుంభకోణాల మాదిరిగా ఈ ఎన్నికలను తెలంగాణ సెంటిమెంటు ప్రభావితం చేయలేకపోయింది. అధిక ధరలు, అవినీతి, అస్తవ్యస్థ పాలన వంటి వివిధ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు పరిగణనలోకి తీసుకోవడంతో ఫలితాలు భిన్నంగా వచ్చాయి.

ఎమ్మెల్లేల పనితీరును కూడా ఓటర్లు బేరీజు వేశారు. తెరాస ఈ అంశాలను పట్టించుకోకపోవడంతో భారీ మూల్యమే చెల్లించాల్సివచ్చింది. సరిగ్గా ఇదే అం శంలో టిడిపి, కాంగ్రెస్‌లు పైచేయి సాధించాయి. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదంటూ టిడిపి, కాంగ్రెస్‌లు తెలంగాణకు అనుకూలమేనన్న సంకేతాలతో ప్రజల్లో అయోమయాన్ని కలిగించడానికి ప్రయత్నించారు. ఈ మేరకు ఆ రెండు పార్టీలు నిజాయితీగా వ్యవహరించలేకపోయాయి. ముఖ్యమంత్రి వై.ఎస్. ఈ ఉప ఎన్నికలను తన ప్రతిష్ఠకు సవాల్‌గా భావించారు.స్వతహాగా సమైక్యవాది, తెలంగాణ వ్యతిరేకి అయిన వై ఎస్ ఈ గెలుపుతో తన వైఖరిని మరింత స్పష్టంగా బహిరంగపర్చవచ్చు. అధిష్ఠానం కూడా ఆయని కచ్చితమైన అభిప్రాయాలను వ్యతిరేకించక పోవచ్చు. ఆయన నిర్ణయాలను వీటో చేయకపోవచ్చు.

భవిష్యత్తులో కూడా ఆయన మాటే నెగ్గవచ్చు. ఈ పరిణామాలన్నీ తెలంగాణకు ప్రమాదకర సంకేతాలను అందించేవే. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే ఒకింత గందరగోళ పరిస్థితులల్లోనే ఆ పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. తెలంగాణలో తన కంటే ఎక్కువ బలమున్న కాంగ్రెస్, తెరాసలను ఎదుర్కోక తప్పని పరిస్థితి. ఇది పార్టీ అస్తిత్వానికే పరీక్ష. కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై పార్టీ అధినేత చంద్రబాబు దృష్టి సారించి అదేపనిగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డా రు. ఈ విషయంలో తెరాస విఫలమయింది. దాంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా టిడిపి దక్కించుకోగలిగింది. తెరాస అధినేత కెసిఆర్ నాయకత్వ వైఫల్యం, వ్యూహాత్మక తప్పిదాల వల్లే ఉపఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలయిం ది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరి అధికారాలను అనుభవించిన తర్వాత తమకు పదవులు గడ్డిపోచలతో సమానమన్న, త్యాగాల పునాదుల మీద తమ పార్టీ ఏర్పడిందన్న వాదనలో పసతగ్గింది. ఉద్యమాన్ని కొనసాగించకుండా లాబీయింగ్ అంటూ ఢిల్లీలో కూర్చుని తెలంగాణ ఏర్పాటుకు డెడ్‌లైన్లు విధించుకుంటూ పోవడంతో ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. పార్టీని, ఉద్యమాన్ని సంస్థాగతంగా పటిష్టం చేయకుం డా, తెలంగాణ ప్రజల రోజువారీ సమస్యలపై పోరాటం చేయకుండా ఢిల్లీలో కూర్చుని రాష్ట్రం తెస్తామని బీరాలు పలుకుతుంటే ఇక్కడ పార్టీ పునాదులు కదిలిపోయాయి. నిజాం పాలనను కెసిఆర్ పొగడడంతో ప్రజల మనోభావా లు దెబ్బ తిన్నాయి.

తెలంగాణను కాంగ్రెస్ మోసం చేసింది, ద్రోహం చేసిందంటూ తీవ్ర విమర్శలు గుప్పించిన కెసిర్, తన దాడులు ముఖ్యమంత్రి వైఎస్ పై ఎక్కు పెట్టడం గమనార్హం. తెలంగాణ ఇవ్వడం- ఇవ్వకపోవడం ముఖ్యమంత్రి చేతిలో లేదని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా చేతిలో ఉందని తెలిసి కూడా కెసిఆర్ సోనియాను విమర్శించలేదు. దీంతో తన అజెం డా ఏమిటో కెసిఆర్ చెప్పకనే చెప్పారు. ఆయన తిరిగి సోని యా పంచన చేరే అవకాశం ఉందనేది ప్రజలకు అర్థమైంది. ఇటువంటి అస్పష్ట వైఖరులే ఇటు కెసిఆర్-అటు తెరాస పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోయేలా చేశాయి.

తెలంగాణకు కట్టుబడి ఉన్నామని జాతీయ స్థాయిలో తీర్మా నం చేసిన బిజెపి ఉప ఎన్నికలను అప్రధానమైనవిగానే భావించింది. (ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా జాతీయ స్థాయిలో తీర్మానం చేసి పార్లమెంటులో మాట్లాడిన ఏకైక పెద్ద పార్టీ బిజెపినే నన్నది మరచిపోకూడదు). రాజీనామాలు చేసి ఎన్నికలు రుద్ది, ఎన్నికలు తెలంగాణకు రెఫరెండం అనడాన్ని పార్టీ వ్యతిరేకించింది. 2009 ఎన్నికలపై దృష్టిసారించిన బిజెపి వ్యూహాత్మకంగానే ఉప ఎన్నికల్లో సీరియస్‌గా పాల్గొనలేదు. సార్వత్రిక ఎన్నికలపై జరుగుతున్న కసరత్తును ఆటంకపరచరాదని పార్టీ నేతలు భావించారు. అయితే తెలంగాణ వాదానికి కట్టుబడే ఉన్నామని చెప్పడానికి ఒక్క ముషీరాబాద్‌లో మాత్రమే ఆ పార్టీ పోటీ చేసింది.

తెలంగాణ అనుకూల ఓట్లు చీలిపోగూడదనే మిగిలినచోట్ల పోటీచేయకుండా ఒక్క ముషీరాబాద్‌లోనే బరిలోకి దిగితన సత్తాచాటింది. అధికార పక్ష అంగ, ఆర్థబలాన్ని హోరాహోరీ పోరాడింది. బిజెపి బలంగా ఉందనడానికి ముషీరాబాద్‌లో పొందిన ఓట్లే నిదర్శనం. నైతికంగా చూసినట్లయితే ఇక్కడ బిజెపి ఓడినా గెల్చినట్లే. ఈ నేపథ్యంలో తెలంగాణ విషయంలో చిత్తశుద్ధి ఉన్న పార్టీ లూ, వ్యక్తులు, శక్తులు అన్నీ ఆశయ సాధన కోసం ఏకంకాక తప్పదు. ఇప్పటికే జాతీయ స్థాయిలో తిరుగులేని విధంగా బలోపేతమైన బిజెపి పక్కా ప్రణాళికతో 2009 ఎన్నికలకు సన్నద్ధమవుతోంది.

యుపిఏ ప్రజా వ్యతిరేక పాలనతో విసిగి పోయిన ప్రజలు వివిధ రాష్ట్రాలలో బిజెపికి పట్టం కడుతున్నా రు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరి అద్వానీ ప్రధాని కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో మూడు చిన్న రాష్ట్రాలను ఏర్పాటుచేసిన ఘనత గల ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఖాయమనేది ప్రజల విశ్వాసం. సార్వత్రిక ఎన్నికలే తెలంగాణకు కీలకంకాబోతున్నాయి. నాలు గు దశాబ్దాల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ నెరవేరాలంటే ప్రత్యేక రాష్ట్ర అనుకూల శక్తులన్నీ కేంద్రంలో బలంగా ఉన్న బిజెపిని సమర్థించక తప్పని పరిస్థితి. చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా విధానాన్ని ఆమోదించి అమలు చేస్తున్న బిజెపి 2009 లో కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటు ఖాయం.

ఉప ఎన్నికలలలో ఏ పార్టీకి మెజారిటీ సీట్లు రాకపోవడాన్ని విశ్లేషిస్తే రాష్ట్రంలో కూడా సంకీర్ణ రాజకీయ శకం ఆరంభమవుతుందా అనే అభిప్రాయం కలుగక మానదు. రాబోయే కాలం లో కొత్త పార్టీలు వస్తున్నాయనే వదంతులు విస్త­ృతంగా ఉన్న సమయంలో ఉప ఎన్నికల ఫలితాలు ఈ అభిప్రాయాన్ని మరింత దృఢతరం చేశాయి. వచ్చే ఎన్నికలలో హంగ్ అసెంబ్లీ తప్పదని చెబుతున్న నేపథ్యంలో బిజెపి కీలక శక్తిగా ఎదుగుతుందనేది పరిస్థితులను బట్టి అర్థమవుతున్న వాస్తవం.

(వ్యాసకర్త బిజెపి రాష్ట్రశాఖ అధ్యక్షులు) ANdhra jyothy (6-18-2008)

నా కలల తెలంగాణ -

తెలంగాణ మట్టి బిడ్డల
పాదాలకు మొక్కి
వాళ్ల మనసులో జాగా పొందిన నేతలంతా ధన్యులు
ధోకా చేయటం తెలియని
మా గోసిగుడ్డల అవ్వల అయ్యలు దీవిస్తేనేగా
ఎవరైనా జాతి నేతలయ్యేది

మా సదానందమన్నట్లు-దేవేంద్రా-
ఎందరో విప్లవకారుల ప్రాణాలు
గాలిలోకి ఎగిరినప్పుడు
నీ చేతులకంటిన నెత్తుటి మరకలను తుడిచేసుకుని
ఆ కాల్పులన్నీ బూటకమని గొంతువిప్పు
ప్రజాస్వామ్య తెలంగాణ పాట పాడు
ప్రజాస్వామ్య తెలంగాణ ఆకాశంలో
పాలపిట్టల రెక్కలల్లార్తు

కెసీఆర్ రాజీనామాలన్నప్పుడల్లా
ఉద్యమ పొత్తిళ్లల్లోకి రా బిడ్డా అని పిలిచినోణ్ణి
ఇప్పుడు పాలపిట్టరంగు జెండాను నోరారా
పిలుస్తున్నా-

వాకిళ్ల ముందు తెలంగాణ ముగ్గేద్దాం
మా పెరళ్లలోని స్థానికతను తవ్వి బచ్చలాకు చేసి
ఊదారంగు పందిరేద్దాం
ఈ మట్టిది పోరు అక్షరమాల
మన తల్లులు జన్మనిచ్చి పోరాటం నేర్పిండ్రు
ఉగ్గుపాలల్లో ఆత్మగౌరవాన్ని నూరిపోసిండ్రు
బిగించిన పిడికిళ్ల నిచ్చిండ్రు
మన తండ్రులు కుట్రలు నేర్పలేదు
శత్రువులకు ఆసరా కావొద్దన్నరు
ఫికర్ లేదు-
విడివిడిగా విడిపోయి ఏకమౌదాం-
మన జెండా తెలంగాణ పటం
భావాలు ఎన్ని జెండాలైనా కానియ్
మనందరం తెలంగాణ చౌరస్తాలో కలుద్దాం
అన్నిదారుల్లోంచి
మహా తెలంగాణ రస్తాలో కలుద్దాం
ఇప్పుడు నేను ప్రాంతీయ దేశభక్తుల
జాబితా తయారు చేస్తున్న
ఉద్యమ గణాంకశాఖను

నీళ్లు, నిధులు, ఉద్యోగాలు
ముంబయ్, బొగ్గుబాయి, దుబాయ్
ఫ్లోరోసిస్‌తో పోరుభూమి వంకర్లు
బిడ్డల్ని అమ్ముకుంటున్న నా జొన్నరొట్టెలు
అడవిలో నెత్తుటి రంగేసుకున్న చెట్లు
హోలిర హోలీ చెమ్మకేళిర హోలీ
దేవేంద్రా ఇన్నాళ్లూ ఎక్కడ పాయె - నీ తెలంగాణ

ఇది కెసిఆర్, దేవేంద్రో పాడే పాట కాదు
ఆధిపత్యానికి తలకొరివి ఎవరు పెట్టినా
మన స్వపరిపాలన గేట్లు ఎవరు తెరిచినా
ఆత్మగౌరవ నినాదమై ప్రతిధ్వనిస్తాం-
నినాదాల నుంచి ఓట్ల జాతర్ల నుంచి
ఉద్యమబాటకొచ్చేవాళ్లందరికి వాలేకుమ్‌సలామలేకుమ్-
కెసిఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో
దేవేందర్ జెండా పట్టుడో
ఇవన్నీ మామూలు మాటల తూటాల వ్యూహాలు
తెలంగాణ వచ్చుడే నిజం
దాన్నాపటం ఎవనితరం కాదని చెపుదాం
వచ్చే తెలంగాణ ఎట్లుండాలో ఇపుడే గీసుకుందాం-
తెచ్చుకునే తెలంగాణ ఎట్లుండాలో
ఇపుడే రాసుకుందాం-
ఈ కన్నీళ్ల కొడవళ్లకు సమాధానాలు కావాలె
దొడ్డి కొమురయ్య నెత్తుటికి జవాబుకావాలె
ఐలమ్మల బతకు మారాలె
పూరుకు వాడకు మధ్య బెర్రలు చెరగాలె
ఇంతెందుకన్నా
బహుజన తెలంగాణ యాత్ర మొదలుకావాలె
పౌరహక్కులు గాయపడని నేల
చెట్లకు తుపాకులు పూయని నేల
మన సెరువుల నిండా కలువలు,
తామరలు విచ్చుకునే నేల
ఆధునిక దొరల పెత్తనాలు లేని అమ్మతనపు నేల
అన్నా అని పిలిస్తే
గుండెనిండా ఆత్మగౌరవం ఉప్పొంగే నేల
ఇది నా తెలంగాణ నేల
నేను కలలుకంటున్న తెలంగాణ నేల
అన్నా దేవేంద్రా
మనకు వూరికి
పిడికెడు మంది ప్రకాశం పంతుళ్లున్నరు
గల్లీగల్లీలో కొమురం భీమ్‌లున్నరు
ఉద్యమాలకే వన్నెతెచ్చినోళ్ళున్నరు
మనకు సావులు కొత్తకాదు
సమ్మక్క, సారక్కలమై పుడుతూనే ఉంటం-
ఉద్యమానికి జీవం పోసి
నిప్పుల ఉప్పెనలోకి ఒక్క ఉదిటిన దూకిన వాళ్లనే
ఈ నెల కౌగిలించుకుంటది
వాదాన్ని చీల్చకుండా
దయ్యాల వేదాలు వల్లించకుండా
ఉద్యమ గీతానికి తొలి పల్లవి అవుదాం రా
ఈ మట్టి మీద వొట్టు పెట్టి చెప్పు
దేశానికే ఎర్ర జెండానిచ్చింది ఈ నేలేగా
రాఘవులూ-
అమ్మతోడు సురవరం నిశాని ఏసిండు
నారాయణ ఎప్పట్నించో అరుస్తనే వుండు
రవ్వంత గోరంత కూసింత
మనసు మార్చుకోవా?
ప్రత్యేకతపై అస్తిత్వ సంతకం చేయవా?

మళ్ళీ మళ్ళీ చెబుతున్నా
సరైన సమయానికి సరైన నిర్ణయం దేవేంద్రునిది
కాదంటావా చెప్పు బాబూ!
చెన్నమనేని మొఖమాటం లేకుండా తెగేసి చెప్పిండు
తమ్ముడు సాగర్ ఎప్పట్నుంచో తనే యిస్తనంటున్నడు
పెద్ద మనుషులు కాకా, పురుషోత్తములు చెప్పినంక
గింతకంటె మంచి సమయమెప్పుడొస్తదే
సెప్పుండ్రి...
ఈ మట్టి మీద పుట్టిన నేతలారా!
జొన్న రొట్టెల మీదొట్టు
బతుకమ్మ మీదొట్టు
సమ్మక్క సారలమ్మ మీదొట్టు
దొడ్డి కొమరయ్య, ఐలమ్మల మీదొట్టు
ఎవరడ్డు పడినా తెలంగాణ రాకతప్పదు

-జూలూరు గౌరీశంకర్

తెలంగాణ కోరుతున్నది స్వపరిపాలన - వెలిచాల కొండలరావు

ఆర్థికాభివృద్ధి కంటే ఆత్మగౌరవం ముఖ్యం. ప్రత్యేక తెలంగాణ వాదం సారాంశమిదే. తెలంగాణ ప్రజలు కోరుతున్నది స్వేచ్ఛ, స్వపరిపాలన. వారి 'సెంటిమెంటు'కు ఉపశమనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికాభివృద్ధిని తాయిలంగా ముందుకు తోస్తున్నది! ఆర్థికాభివృద్ధి తెలంగాణ వాదులను సంతృప్తిపరచదని సమైక్యవాదులేకాదు విభజనవాదులు కూడా గుర్తించాలి. తెలంగాణ ప్రజలు తమకు జరిగిన అన్యాయాలను, తెలంగాణేతర పరిపాలకులు తమ పట్ల చూపిన వివక్షను మరిచిపోయే స్థితిలో లేరిప్పుడు. సమైక్య రాష్ట్రం పట్ల వారి మనసు విరిగిపోయింది.

అభివృద్ధి మాత్రమే అవమానాలను మరిపించగలదా? తెలంగాణ 'సెంటిమెంటు'కు అసలు సిసలైన కార ణం తెలంగాణేతర నాయకత్వం తెలంగాణ ప్రజల పట్ల చూపిన నిర్లక్ష్యం, చెలాయించిన పెత్తందారీ తనం. ఈ చేదు వాస్తవాలను పట్టించుకోకుండా అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడటం, అప్పుడు చేయనిది ఇప్పుడు చేస్తామని మభ్య పెట్టడం, మాటల గారడీతో మసిపూసి మారేడు కాయ చేయడమే అవుతుంది . నేను విద్యావేత్తను. తెలుగు భాషాభిమానిగా ' సమైక్యవాది'ని. ప్రత్యేక తెలంగాణ వాదం తొలుత నాకు విస్మయం కల్గించినా దశాబ్దాల వేర్పాటు ఉద్యమాల చరిత్ర నన్ను భిన్నంగా ఆలోచింపచేసింది.

ఆనాటి హైదరాబాద్ సంస్థా నంలో తెలుగులు, కన్నడిగులు, మరాఠీలు అన్నదమ్ముల్లా సహజీవనం చేశారు. సంస్థానం మూడు భాగాలుగా విడిపోయిన దరిమిలా కన్నడిగులు కర్ణాటకలో, మరాఠీలు మహారాష్ట్రలో కలిసిపోయాక, ఆంధ్రప్రదేశ్‌లో కలిసిపోయిన తెలంగాణ వారిలాగా మానసిక ఒత్తిళ్ళకు ఎందుకు గురికాలేదు? నాకు తట్టిన సమాధానాలు:

(అ) 1956లో ఏకమైన తెలుగువారు 1969 వరకు కూడా 'జోడి కుదరని దంపతుల్లాగా' మాత్రమే కలిసివున్నారు; (ఆ) ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య భావోద్వేగపరమైన పొంతన, సాంస్క­ృతిక సంఘీభావం కుదరలేదు; (ఇ) ఇది తెలంగాణుల్లో ' పరాయీకరణ భావాన్ని' కలుగజేసింది. న్యాయబద్ధమైన ప్రయోజనాలలో జరిగిన అన్యాయాలు, అవమానాలు వారిని విభజనోద్యమానికి నెట్టాయి; (ఈ) సొంత గడ్డపై 'పరాయీల'మవుతున్నామన్న అంతర్గత మనో కలవరం తెలంగాణవారిలో పరాకాష్ఠకు చేరింది. ప్రత్యేక తెలంగాణ మాత్రమే తమ సమస్యలకు పరిష్కారమనే దృఢ నిశ్చయానికి వచ్చేట్టుచేసింది; (ఉ) ఈ దృఢనిశ్చయమే 1969 నుంచి వారిని ఉద్యమింపచేస్తోంది; (ఊ) తెలంగాణలో వనరుల కొరత లేకపోయినా పరిపాలకులుగా ఉన్న ఆంధ్రనాయకులు వాటిని తెలంగాణ ప్రాంత అభివృద్ధికి వినియోగించలేదు; (ఎ) తెలంగాణేతర నాయకులు ఎప్పుడూ తమను తాము 'ఇచ్చేవారు'గా పరిగణించుకొని, తెలంగాణ వారిని 'అడుక్కునే' వారిగా చూచారు; (ఏ) తెలంగాణేతర నాయకత్వం చేతుల్లో తెలంగాణవారు అనుభవించిన పెత్తందారీ ఆరళ్ళు మహాష్ట్రులు, కన్నడిగులు తమరాష్ట్రాల్లో అనుభవించలేదు.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడక పూర్వమే తెలంగాణ వారికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆలోచన ఉందనడానికి ఫజల్ అలీ కమిషన్ నివేదికే నిదర్శనం. ఆ నివేదిక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాం ఛనే కాక దాని ఆచరణ సాధ్యాన్ని కూడా సూచించింది. ఒక్క తెలంగాణను మాత్రమేకాక మరికొన్ని చిన్న రాష్ట్రాలను కూడా ఏర్పాటుచేయాలని సిఫారసు చేసింది. వాటి ఆర్థిక సుస్థిరతకు కొన్ని మార్గదర్శక సూత్రాలను సూచించింది. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ఆయా ప్రాంతాల వారి ఆకాంక్షలతో పాటు ఆ ప్రాంతాల ఆర్థిక సుస్థిరతకు చెందిన అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఫజల్ అలీ కమిషన్ నివేదిక పేర్కొంది.

ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల 'మానసిక సంతులనం' లేని కలయికను ఆనాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ గుర్తించారు. ఆంధ్ర, తెలంగాణల విలీనం 'పొం తన లోపించిన పెళ్ళిలాంటి'దని, వారెప్పుడు విడిపోదలుచుకుంటే అప్పుడు విడాకులు పుచ్చుకోవచ్చని ఆయన బహిరంగంగానే సూచించారు. తెలంగాణవారు మున్ముందు 'ప్రత్యేక తెలంగాణ' కోరవచ్చని నెహ్రూ ఆనాడే పసిగట్టారు. అన్యాయాలకు అంతూ పొంతూ లేకపోవడంతో 1969 లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రజ్వరిల్లింది. ఆనాటి నుంచి తెలంగాణవారు కోరుకొంటున్నది స్వేచ్ఛే కాని అభి వృద్ధి కాదు.

అగౌరవం నుంచి, అవమానాల నుంచి, నిర ్లక్ష్యం నుంచి, వివక్షల నుంచి స్వేచ్ఛ, 'స్వేచ్ఛ'లో 'అభివృద్ధి' కూడా మిళితమయి ఉంటుంది. కాని సగటు ప్రజానీకం దానినలా అవగాహన చేసుకోలేరని తెలంగాణ నేతలు, మేధావులు ఆ మహోన్నత ఆశయానికి 'ఆర్థిక ప్రయోజనాలు' 'ఆర్థిక సమస్యలు' మున్నగువాటిని ఆలంబనగా జోడించారు. తెలంగాణవారికి జరిగిన అన్యాయాలను సాక్ష్యాధారాలతో ఎత్తిచూపారు. తెలంగాణ ప్రజలు 'ఆర్థికాభివృద్ధి' కన్నా తమ 'ఆత్మగౌరవాని'కే ఎప్పుడూ అమిత ప్రాధాన్యమిచ్చారు. అందుకే తెలంగాణ సెంటిమెంట్'కు 'ఆత్మగౌరవ' కాంక్షే తీవ్రమైనదిగా పరిగణించాలి.

'ఆర్థికాభివృద్ధి'ని కానే కాదు. (స్వేచ్ఛ లేనివారికి ఆర్థికాభివృద్ధిని ఎవ్వరూ దానంగా, ధర్మంగా సమకూర్చరు). తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోసమే ప్రత్యేక తెలంగాణను ఆకాంక్షిస్తున్నారు. అయితే రాజకీయవాదులు ఈ అంశాన్ని తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకొంటున్నారు. తెలంగాణ సమస్య ఇప్పుడు తెలంగాణ వారికెంత ఉపయోగపడుతున్నదో తెలంగాణేతర ప్రాంతాల సొంత రాజకీయ ప్రయోజనాలకు కూడా అంతే ఉపయోగపడుతున్నది. అందువలన దానిని ఇరు ప్రాంతాలవారూ తమ ప్రయోజనాలకు ఉపయోగించుకొంటూనే వున్నారు.

అయితే నలభై ఏళ్ళ నుంచి బలవుతున్నవారు మాత్రం తెలంగాణ విద్యార్థులు, యువకులు, సగటు ప్రజలే. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు 'స్వేచ్ఛ', 'స్వపరిపాలన' కారణం కాగా 'అభివృద్ధి'ని మాత్రమే ఉపశమనంగా చూప డం సమస్యకెలా పరిష్కారమవుతుంది? పాలకులు చెబుతున్న అభివృద్ధి మిథ్య కాక నిజమే అయినా కూడా అది ఆత్మగౌరవానికెలా ప్రత్యామ్నాయమవుతుంది? తెలంగాణ సమస్య ఒక ఆర్థిక సమస్యగానే కాక ఉద్వేగపరమైన సమస్యగా కూడా పరిణమించింది. 'భుక్తి'కి చెందిందే కాక 'ముక్తి' కి చెందిందిగా రూపొందింది.

అయితే ప్రభుత్వం దానిని కేవలం ఆర్థిక సమస్యగా నిర్ధారిస్తూ దానిని అలా పరిష్కారిస్తామని పదేపదే అనడం మరొకసారి తెలంగాణవారిని అవమానపరచడమే . తెలంగాణ ఆందోళనలో 'స్వేచ్ఛ', 'స్వపరిపాలనా ఇచ్ఛ' రెండు కీలకమైన అంశాలు. తక్కినవన్నీ వాటికి కేవలం ఆలంబనలు మాత్రమే. ఇది గుర్తించనివారు తెలంగాణ ఉద్యమం వెనక ఉన్న 'ఆత్మ'ను, 'ఊపిరి'ని గ్రహించలేరు. తెలంగాణవాదుల స్వేచ్ఛ, స్వపరిపాలన ఆకాంక్షల వెనుక ఉన్న 'తాత్విక దృక్పథం'ను విస్మరించిన వారు తెలంగాణ ఉద్యమపు 'నీతి'ని గ్రహించలేరు.

వారి 'స్వేచ్ఛకు చెందిన తాత్విక దృష్టే' తెలంగాణవారిని గతంలో విదేశీ ఆధిపత్యానికి, రజాకార్లకు, నిజాంకు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా పోరాడేట్లు చేసింది. ఆ తాత్విక దృక్పథమే అంటరానితనానికి, వెట్టిచాకిరీకి, దేవదాసి తనానికి, దొరతనానికి, ఇంకా ఎన్నో ఇతర పెత్తందారీ పోకడలకు వ్యతిరేకంగా పోరాడేట్లుచేసింది. అవును, ఆ తాత్విక దృష్టే వారినిప్పుడు ప్రాంతీయ పెత్తందారీతనానికి వ్యతిరేకంగా పోరాడేట్లుచేస్తున్నది. ఈ వాస్తవాన్ని గుర్తించాలి- ముఖ్యంగా వామపక్షాల వారు, అందులోనూ కమ్యూనిస్టు పార్టీలు.

ప్రత్యేక తెలంగాణ పోరాటం కూడా ఇతర పెత్తందారీ వ్యతిరేక పోరాటాల వలెనే ప్రాంతీయ పెత్తందారీ వ్యతిరేక పోరాటమని కమ్యూనిస్టులు గుర్తించాలి. ఇది బ్రిటిష్‌వారి వలసాధిపత్యానికి, ఉత్తరాదివారి భాషా పెత్తందారీ తనానికి, ఉత్తరప్రదేశ్ వారి రాజకీయ పెత్తందారీ తనానికి, ద్రవిడులపై ఆర్యుల సాంస్క­ృతిక పెత్తందారీతనానికి వ్యతరేకంగా జరిగిన, జరుగుతోన్న పోరాటాలకు చేరువలోనిదని గుర్తించాలి. కమ్యూనిస్టులకు సిద్ధాంతాలతోనే కాని ప్రాంతాలతో ప్రమేయముండకూడదు. సిద్ధాంతాలే వారికి ఎంతైనా ముఖ్యం. మరి వారి సిద్ధాంతాలలో అతి ముఖ్యమైనది 'పెత్తందారీ వ్యవస్థ వ్యతిరేకత' కదా.

ఆ పెత్తందారీ తనాన్ని ఎవరు, ఎచటివారు చెలాయించినా, కమ్యూనిస్టులు ఉండవలసింది పెత్తందారీతనం చలాయించే వారివైపు కాక, బాధితుల వైపే కాదూ? తెలంగాణవారు తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలకొరకు ఎన్నో పోరాటాలు చేశారు. ప్రత్యేక తెలంగాణ పోరాటం వారి పోరాటాల పరంపర లో మరొకటి మాత్రమే. తెలంగాణవారు చేపట్టిన పోరాటాలన్నీ సామ్యవాద పోరాటాలే. ఎందుకంటే అవన్నీ 'పెత్తందారీ వ్యవస్థ' ను వ్యతిరేకించిన పోరాటాలే. ఏవో కొన్ని స్వంత లాభాల కొరకు, స్వప్రయోజనాల కొరకు ఎవరో కొందరు వ్యక్తులు, కులాలు, మతాలు, పార్టీలు చేబట్టిన పోరాటాలు కావు.

అవి సమస్త ప్రజల కొరకు చేపట్టిన పోరాటాలు. వాటికి 'స్వేచ్ఛ', 'స్వాతంత్య్రం' 'స్వపరిపాలన' అతి ప్రధానమైన లక్ష్యాలు. అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి కోసం చేసిన పోరాటాలే అయినా వాటి వెనకాల అంతర్గతంగా ప్రవహించిన ఆరాటాలు మాత్రం 'ఆత్మగౌరవం', 'అస్తిత్వం'కు చెందినవే. ఏ సమాజమైనా, దేశమైనా, ప్రాంతమైనా వాటినే కదా కోరేది! తెలంగాణ ప్రజల్లో 'సెంటిమెంటు' బలంగా ఉందనడానికి ఇటీవల జరిగిన ఉపఎన్నికలలో ఇంచుమించు అన్ని పార్టీల అభ్యర్ధులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో 'తెలంగాణ వాదాన్ని' సమర్థించి గెలవడమే తార్కాణం.

రాబోయే సాధారణ ఎన్నికలలో 'తెలంగాణ సెంటిమెంటు' కు వ్యతిరేకంగా ఏ పార్టీ నిలిచినా అది దానికి ఆత్మహత్యాసదృశమే అవుతుంది. ఇది స్వయానా కాలమే చేస్తున్న హెచ్చరిక. కాలం కాస్త అటూ ఇటూ అయినా, తెలంగాణ వారు గతం లో అన్ని పోరాటాల్లో గెలిచారు. ప్రత్యేక తెలంగాణ పోరాటంలో కూడా తప్పక గెలుస్తారు. గతంలో చేసిన పోరాటాల చరిత్రే ఈ చారిత్రిక అనివార్యతను చాటుతోంది. (వ్యాసకర్త తెలుగు అకాడమీ మాజీ సంచాలకులు)

Andhra jyothy (8-20-2008)

తెలంగాణ చరిత్రకు అన్యాయం జరిగింది - పి. సత్యనారాయణ

నిజాం ఎందుకు క్రూరుడయ్యాడు? ఆయనను క్రూరుడుగా చేసిందెవరు? తెలంగాణ ప్రజల నెత్తురు తాగిందెవరు? నెత్తురు కార్చిందెవరు? తెలంగాణ పోరాటంలో పాల్గోని కీర్తి కిరీటాలు ధరించి అంతార్జాతీయ ఖ్యాతీ పొందిందెవరు? అసలు తెలంగాణ అప్పుడెట్ల తల్లడిల్లింది? ఇప్పుడెలా తల్లడిల్లుతుంది? 1948 సెప్టెంబర్ 17 న తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చినట్లు భావిస్తారు. కాని 1948 నుంచి 1951 వరకు ప్రజాస్వామ్య ముసుగులో కమ్యూనిస్టులు అణిచివేత పేరుతో తెలంగాణ ప్రాంతాన్ని మారణ హోమం చేసింది కాంగ్రేస్ ప్రభుత్వం కాదా! ప్రధానంగా నెహ్రూ, పటేల్‌ల నేతృత్వంలో జరిగిన దురాగతాలతో తెలంగాణ తల్లడిల్లింది. నిజాం నిరంకుశత్వం నుంచి కాంగ్రేస్ చేసిన రక్తపాతాన్ని మినహా యించి చూడడం చరిత్రకారులకు విజ్ఞత కాదు. ఇట్లా మాట్లాడితే మొత్తం నిజాం పాలనను సమర్దించినట్లు కాదు. నిజాం నవాబు చేసిన అకృత్యాలు ఎలాంటివో! కాంగ్రేస్‌జరిపించిన, జరిపిస్తున్న రక ్తపాతం ఎలాంటిదో తెలంగాణ ప్రజలకు తెలుసు. నవాబు హయంలో జరిగిన అభివృద్ధి పనులను చెప్పక పోవడం కొందరి దృష్టిలో చారిత్రక ద్రోహం కాకపోవచ్చు.

నిజాం కాలంలో స్త్రీలను చెరిచిన ఉదంతాలు దారుణమైనవి దానికి బలైనది తెలంగాణ. దాన్ని ఎదుర్కొన్నది తెలంగాణే. కమ్యూనిస్టులు అణిచివేత పేరుతో కాటూరు, ఎలమర్రెలో జరిగిన ఆకృత్యాలు చరిత్రకారులు లెక్కకట్టి చెప్పాలి. దానికి భాద్యులైనవారిని నిజాంతో పాటు ఎండగట్టాలి. తెలంగాణ ప్రాంతమంతా సాయుధ పోరాటంలో బలిదానాలు చేసింది. ఆ కుటుంబాల స్థూపాలు ప్రతి వూళ్ళలో కనిపిస్తాయి. నేటికి 60 ఏళ్ళు గడిచినా మీ ఆశయాలను కొనసాగిస్తాం కామ్రేడ్స్ అనడం తప్ప ఏ ఒక్కటైన ఇప్పటి వరకు సాధించగలిగారా? తెలంగాణ ప్రాంతంలో నిజాం పాలన తర్వాత ఈ పాలక వర్గాలు ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళందించారో చెప్పాలి? నిజాం తవ్విన చెరువులే ఇప్పటికీ దిక్కని ఎవరైన మాట్లాడితే వాళ్ళు చారిత్రక ద్రోహులా? నిజాం రాజ్యంలో స్వాధీనం చేసుకున్న భూములు ఎంత మంది పేద, బీద వర్గాల చేతుల్లో ఉన్నాయి. ఆనాడు ఎర్రజెండా పేరుతో తమ ప్రాణాలను అర్పించిన కుటుంబాల పరిస్థితి దీనాతి దీనంగా వుంది. ఆ కుటుంబాలకు కనీసం పెన్షన్ కూడా లేదు.

నేటి పాలకులు, ఎత్తుగడల పేరుతో వాళ్లతో కలిసి గెలిచిన కమ్యూనిస్టులు చేస్తున్న పని ఏమిటి? కేవలం వ్రామిక వర్గమే తమ వూపిరి అని తపించే కమ్యూనిస్టులు వీరుల కుటుంబాలకు పెన్షన్ ఇప్పించుటలో ఎందుకు విఫలమవుతున్నారు? 1947-48 వరకు నిజాం సర్కారు కిందనే తెలంగాణ వుంది. 1948 సెప్టెంబరు తర్వాత భారత ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. 1948-49లో ఆంధ్రాలో కాంగ్రేస్ ప్రభుత్వం భీభత్సకాండను విచ్ఛల విడిగా ప్రయోగించినప్పుడు ఆత్మరక్షణకోసం ఎదురుదెబ్బ తీయవలసిందిగా కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది.(వీర తెలం గాణ విప్లవ పోరాటం - గుణపాఠాలు, పుచ్చలపల్లి సుందరయ్య పేజి నం 98)ఇలాంటి పిలుపులు తెలంగాణలో కోకొల్లలుగా వచ్చా యి. కె.సి.ఆర్ నిజాంకు సలాం చేస్తే అల్లకల్లోలమై పోతున్న వారు, ఆనాటి వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని రక్తసిత్తం చేసి 4,000 మందికి పైగా వీరులను బలిడొన్న రాకాసి కాంగ్రేస్ గురించి ఎందుకు మాట్లాడం లేదు. అది కాక, అలాంటి కాంగ్రేస్‌తో అలాయ్ బలా య్ తీసుకొని అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోను ఫ్రంటు కట్టిన వామపక్షీయులు నిజాం ఒక్కడే క్రూరుడని చెప్పటం చరిత్రకే వదిలె య్యాలి.

ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖన్ సమాధి కె.సి.ఆర్ నమస్కరిస్తే వొంటికాలిపై కమ్యూనిస్టులు కాంగ్రేస్ చేసిన అరాచకా లపై నోరేందుకు విప్పరు. వారితో ఫ్రంటు ఎట్లా కడతారు. ఇలా కాంగ్రేస్‌తో కలిసి ఎన్నికల ఎత్తుగడల పొత్తు ప్రజా ఉద్యమాలకు ద్రోహం చేసినట్లు కాదా? నిజాం కాలంలో జరిగిన అభివృద్ధి పనులపై కె.సి.ఆర్. లేవదీసి చర్చతో తెలంగాణ చరిత్రను తిరగ రాయవలసి వుంది. అప్పటి వరకు వీరతెలంగాణ సాయుధ పోరా టానికి నేతృత్వం వహించిన వాళ్ళంతా తెలంగాణ ప్రాంతేతరులు కావడం, వీరే వీర తెలంగాణ చరిత్ర రాయటం వల్ల కూడా తెలం గాణ చరిత్రకు అన్యాయం జరిగింది. ఇకనైనా తెలంగాణేతరులు రాసింది కాకుండా మన తెలంగాణ చరిత్రను మనమే రాసుకుందాం. కె.సి.ఆర్. నిజంపై చర్చకు గేట్లెత్తడంతో అసలు తెలం గాణ చరిత్ర ఏమిటన్న అంశం ముందుకు వచ్చింది. మనకు తెలియని మన తెలం గాణ చరిత్రను రాసుకుందాం.మన సంస్క­ృతిని మనమే కాపాడు కుందాం. Andhra jyothy (12-11-2007)

బలిపశువులుగా మారుతున్న తెలంగాణ ప్రాజెక్టులు - ఆర్. విద్యాసాగరరావు

కృష్ణా బేసిన్‌లో ఉన్న జంటనగరాలకు గోదావరి జలాలను సరఫరా చేయడం సబబేనా? తెలం గాణ ప్రాంతానికి సాగునీటి సదుపాయం కల్పిం చేందుకు ఉద్దేశించిన ఒకటి రెండు ప్రాజెక్టులు ఇప్పటికే జంటనగరాలకు తాగునీటిని సరఫరా చేసే ప్రాజెక్ట్‌లుగా మిగిలిపోయాయి. ఇప్పుడు వాటికి ఎల్లంపల్లి తోడవ నుం ది! ఇదేమని ప్రశ్నిస్తే భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఏమన్నారో చూడండి: 'కృష్ణానదిలో నీళ్ళు లేవు ( మరి రాయలసీమకు ఇవ్వడానికి ఎందుకు హైరాన పడుతున్నారు? ).గోదావరిలో బోలెడు మిగులు జలాలు ఉన్నాయి ( తెలంగాణను అభివృద్ధి చేయకుండా అట్టిపెడితే బోలెడేం కర్మ, సమస్తం మిగులే కదా!). ఖర్చు గురించి ఆలోచించ కుండా పెద్ద మనసుతో అందరం ప్రభుత్వం చేస్తున్న మంచిపనికి సహకరించాలి'. జంట నగరాల త్రాగునీటికి బచావత్ ట్రిబ్యునల్ 3.9 టిఎంసిల నీటిని కేటాయించింది.

కాలక్రమేణ జంటనగ రాల అవసరాలు పెరగడంతో అదనపు నీటిని ఎక్కడనుం చి తేవాలన్న ప్రశ్న వచ్చింది. అప్పటికే కృష్ణా బేసిన్ నికర జలాలకు సరిపడా వివిధ ప్రాజెక్టుల కేటాయింపులు జర గడం మూలంగా ప్రభుత్వ దృష్టి నిర్మాణంలో ఉన్న పోచంపాడు ప్రాజెక్ట్‌పై పడింది. అయితే పోచంపా డు వద్ద లభించే గోదావరి జలాలు ఆ ఆయకట్టుకే సరిపో తాయి తప్ప మిగులు జలాలు లేవని నిర్దారించింది. దరి మిలా గోదావరి బేసిన్‌లో ఉన్న 'మంజీరా' ఉపనది పైన ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ నదీ జలాలను జంటనగ రాలకు తరలించడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించ డానికి 1972లో శ్రీనివాసరావు కమిటీని నియమించారు. 'మంజీరా నదిలో లభించే నీరు ఆ నదిపై కట్టిన ఘనపు రం ఆనకట్ట, నిజాం సాగర్ అవసరాలకు మించి లేదు కనుక మంజీరా నదినుంచి నీరు తీసుకు వచ్చే ప్రయ త్నాన్ని బేఖాతరు చేస్తూ కృష్ణానది నుంచే నీరు తీసుకురా వడం మేలని' ఆ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది.

' కృష్ణాజలాలను రాయలసీమకు తరలించాలనే కోరిక ప్రబలంగా ఉన్న' ఆనాటి నాయకులు ఆ నివేదిక త్రోసిపుచ్చి మంజీరాలో లేని నీటిని ఉన్నట్టుగా సృష్టించి, కృష్ణా జలాలను తీసుకువస్తే ప్రమాద ఘంటికలు మ్రోగు తాయనే కొత్త వాదనకు ప్రాచుర్యం కల్పించారు. నెమ్మ దిగా సింగూరు ప్రాజెక్టు నిర్మాణం తెరపైకి వచ్చింది. ఆ విధంగా సింగూరు జంటనగరాల తాగునీటి అవసరాల కు పరిమితం కావడంతో మంజీరా నీటిని నమ్ముకున్న మెదక్, నిజామాబాద్ రైతాంగం నోట్లో మన్ను పడింది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి 16.5 టి ఎంసిల నీరును మూడుదశలలో జంటనగరాలకు తరలించే లక్ష్యంతో 1978లో కృష్ణాజల పథకాన్ని రూపొందించా రు. ఈ పథకం ప్రకారం సాగర్ సమీపంలోని సుంకేసుల దగ్గర 16.5 టిఎంసిల నీరు తీయగల ఒక 'ఇంటేక్ వెల్' ను ఏర్పాటుచేసి, ఆ నీటిని ఎత్తైన ప్రదేశంలో కట్టిన జలా శయంలో భద్రపరుస్తారు. ఆ తర్వాత ఆ నీటిని కొండాపూ ర్ గ్రామంలో నిర్మించే 'శుభ్రపరిచే ప్లాంట్'కు తరలిస్తారు. అక్కడ శుద్ధి ప్రక్రియ పూర్తయిన తరువాత జంటనగరాల ప్రజలకు సరఫరా చేస్తారు.

పథకం ఇదయితే ఆచరణ మరోలా ఉంది! సుంకేసుల వద్ద 'ఇంటేక్ వెల్' నేర్పాటుచే యలేదు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి సాగర్ నీటిని ఎత్తిపోతల ద్వారా అందించే ఎస్ఎల్‌బిసి కాలువ పథకంలో అంతర్భాగమైన 'అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజ ర్వాయర్' నుంచి కృష్ణా జలాలను తరలించడం ప్రారం భించారు! మొదటి దశలో 5.5 టిఎంసిలను తరలించి రెండో దశను చేపట్టారు. తీరా మూడో దశకు వచ్చే సరికి ప్రభుత్వ వైఖరి మారిపోయింది. పోతిరెడ్డిపాడునుంచి వరదజలాల ముసుగులో నికర జలాలను రాయలసీమకు తరలించడానికి ప్రభుత్వం పూనుకొంది. ప్రతిపక్షాలు ఎంతగా అభ్యంతరం తెలిపినా ఈ తరలింపు పనులు నిర్విఘ్నంగా సాగిపోతున్నాయి. కృష్ణా జల పథకం మూడోదశను పూర్తిగా రద్దుచేసి ఆ దశ ద్వారా తరలించా ల్సిన 5.5 టిఎంసిల నీటిని కూడా శ్రీశైలం ద్వారా సీమకు తరలించాలనేది పాలకుల యోచనగా ఉంది. పాలకుల తాబేదార్లు మినహా ఎవరూ ఈ యోచనను సమర్థించ డంలేదని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.

ఇక గోదావరి మిగులుజలాల మాటకొస్తే అసలు ఆ నదీ జలాలను ఏ ఏ ప్రాజెక్టులకు కేటాయించారో బాహాటంగా ప్రకటించనేలే దు. అయితే పోలవరం పై జరిగిన అఖిల పక్ష సమావేశం లో మాత్రం వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన మొత్తాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత జరిగిన సమావేశం లో హామీ ఇచ్చిన విధంగా 'జల విధానం' ముసాయిదా ను రూపొందించడమయితే రూపొందించారు గాని కార ణాంతరాల వల్ల విడుదల చేయలేదు. అఖిల పక్ష సమా వేశంలో ఇచ్చిన లిస్టులో గానీ, ముసాయిదా జల విధా నంలో ఇచ్చిన లిస్టులో గాని ఎక్కడా జంటనగరాలకు గోదావరి జలాల కేటాయింపు లేదు. మరి హఠాత్తుగా ప్రభుత్వానికి ఈ ఆలోచన ఎందుకొచ్చినట్టు? ముందు ప్రాణహిత స్కీం నుంచి మళ్లించే 160 టిఎంసిలలో 80 టిఎంసిలను జంటనగరాలకు వాడతామని ప్రకటించింది. దానిమీద నిరసనలు వ్యక్తమయ్యేటప్పటికి పల్లవి మార్చి ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి 31 టిఎంసిలు అంటోంది! నిజంగా ఎల్లంపల్లిలో 31 టిఎంసిల జలాలు జంటన గరాల అవసరాలకు సరిపడా ఉన్నాయా? ఎల్లంపల్లి బ్యారేజి నిర్మాణం శ్రీరాంసాగర్ దిగువున ఉంది.

ఎల్లంప ల్లి దగ్గర నీటి లభ్యతను 63 టిఎంసిలుగా నిర్దారణ చేశా రు. ఎల్లంపల్లి నిర్మాణం ప్రస్తుతం విడిగా సాగుతున్నా అది అంతిమంగా ప్రాణహిత పథకంలో అంతర్భాగమ వుతుంది. అంటే ప్రాణహిత పథకం ద్వారా మళ్లించే 160 టిఎంసిలు, ఎల్లంపల్లి దగ్గర లభ్యమయ్యే 63 టి ఎంసిలు మొత్తం 223 టిఎంసిల నీరు ఏ ప్రాతాలకు ఎలా ఎలా ఖర్చు పెట్టాలో ఇదివరకే నిర్ణయమై పోయింది. అందులో జంటనగరాలకు 10 టి ఎంసిల నీరు కేటాయించబడింది. ప్రాణహిత స్కీం పక్కన బెట్టి దాని గురించి పట్టించుకో కుండా ఎల్లంపల్లి నుంచి 31 టిఎంసిల నీరు లాక్కుపోవ డానికి ప్రభుత్వం ఇప్పుడు చేపడుతున్న చర్య దుర్మార్గ మైనదిగానే భావించాలి. ఎల్లంపల్లినుంచి 31 టి ఎంసిల నీటిని తరలిస్తే ఆ మేరకు కరీంనగర్, మెదక్ జిల్లాల రైతాంగం నష్టపోవడం తథ్యం.

తాగు, సాగనీటి అవస రాలు ఒకే ప్రాజెక్టు నుంచి తీర్చవలసివస్తే తాగునీటి అవ సరాలకు ప్రాధాన్యం లభిస్తుందని ప్రత్యేకించి చెప్పవల సిన అవసరం లేదు. ఎల్లంపల్లిలో లభించే నీటిపై ప్రథమ ప్రాధాన్యం తాగునీటికి వస్తుంది. అంటే జంట నగరాల అవసరాలకు సరిపడానీరు తీసుకున్నాకే మిగిలిన నీటిలో ఎన్‌టిపిసి అవసరాలు తీరాక ఆ పైన సాగునీటికి వినియో గించటం జరుగుతుంది. అంటే ఎల్లంపల్లి మరో సింగూరు కావడమే! జంటనగరాలకు నీరు అందించే ప్రక్రియలో గతంలో సింగూరు, ఇప్పుడు అక్కంపల్లి, మున్ముందు ఎల్లంపల్లి ప్రాజెక్టులు బలిపశవులు కానున్నాయి. ఇది అన్యాయం. తెలంగాణకు ఈ అన్యాయం జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు తీసుకోవా లి. అవేమిటో పేర్కొంటాను: గతంలో తీసుకున్న నిర్ణ యాలకు లోబడి ముందుగా కృష్ణాపథకం మూడోదశను తక్షణమే అమలు చేయాలి.

రెండో పనిగా సాగర్‌నుంచి అక్కంపల్లికి బదులుగా సుంకేసుల ఇంటేక్ వెల్ నుంచి నీటిని విడిగా తరలించే పనులు ప్రారంభించాలి. అక్కం పల్లిని నల్లగొండకు ప్రయోజనాలు చేకూర్చే జలాశయం గా మాత్రమే ఏర్పాటు చేయాలి. మూడో చర్యగా సింగూ రును విముక్తం చేసే ప్రక్రియలో గోదావరి నుంచి నీరు తీసుకురావలసి వస్తే ఇటీవల 'ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజ నీర్స్' వారు ప్రభుత్వానికి సమర్పించిన 'కంచాల పల్లి' ప్రాజెక్టు గురించి ఆలోచించాలి. ఇవేవీ చేపట్టకుండా ఎల్లంపల్లినుంచి జంటనగరాలకు నీళ్ళు తీసుకువచ్చే టెండర్లు ఖరారు చేస్తే తెలంగాణ ప్రయోజనాలకు విరు ద్ధంమే కాక ప్రభుత్వం పూర్తిగా అప్రజస్వామికంగా వ్యవహరిస్తుందని భావించవలసివస్తుంది. దశాబ్దాలుగా ప్రభుత్వాలు తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షతతో తెలంగాణ ప్రజలు కోలుకోలేని విధంగా నష్టపోతున్నారు.

andhra jyothy (1-24-2008)

ఉద్యమాల ఉత్తర తెలంగాణ! - ఇనగంటి వెంకట్రావు

పోరాటాలకు ప్రసిద్ధి చెందింది తెలంగాణ. అందులోనూ ఉత్త ర తెలంగాణాది ఇటీవలి పోరాటాల చరిత్ర. నాలుగయిదేళ్ళ క్రితం వరకు అక్కడ పాగావేసింది వామపక్ష తీవ్రవా దం. చీమ చిటుక్కుమన్నా భయపడే వాతావరణం. ప్రభుత్వ అణచివేత తీవ్రతరం కావడం వల్ల కాని, ఉద్యమ వ్యూహాలలో వచ్చిన మార్పుల వల్ల కాని, పీపుల్స్‌వార్ - మావోయిస్టుల కార్యకలాపాలు క్రమంగా ఇటు కృష్ణను దాటి నల్లమలకు, అటు గోదావరిని దాటి చత్తీస్‌గఢ్‌కు తరలివెళ్ళాయి. కొంతకాలం స్తబ్దత. అలాంటి వాతావ రణంలో ఉత్తరాంధ్రను బలంగా ఆకర్షించినఉద్యమం ప్రత్యేక తెలం గాణ. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన ఈ ఉద్యమం తెలంగాణ అంతటికీ చెందినదే అయినప్పటికీ, దాని కేం ద్రీకరణ, కార్యాచరణ మాత్రం ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలోనే! కడచిన అయిదారేళ్ళుగా ఆ ప్రాంతపు రాజకీయ కార్యకలాపాలను, ప్రభుత్వ వ్యతిరేకతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది, విలీనం చేసుకుంటున్నది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. అందుకే ఆయా ఎన్నికలపై సయితం దాని ప్రభావం బలంగా వుండడం! అలా కడచిన అయిదారేళ్ళుగా అది సమైక్య రాష్ట్ర రాజకీయాలను, ఎన్నికల వ్యూహాలను సయితం కొంతవరకు ప్రభావితం చేస్తున్నది. వీటన్నిటికీ తోడు ఇప్పుడు మరో రకమైన ఉద్యమాలకు ఉత్తర తెలంగాణా వేదికగా మారింది. అన్ని పార్టీలకూ ఇప్పుడు అది ఒక కార్యక్షేత్రం, కదన రంగం. మొదట బీడీ కట్టలపై పుర్రె గుర్తు ముద్రణకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన ఉద్యమం ఆ ప్రాంతాన్ని కొంతకాలం కుదిపేసింది. ఆనాటి పుర్రెగుర్తు వ్యతిరేక ఉద్యమంలో రాజకీయ పార్టీల పాత్ర ఎంత వుందో, రాజకీయాలకు అతీతంగా బీడీ కార్మిక సంఘాలు, కార్మికుల పాత్రకూడ అంతే ఉంది. ముఖ్యంగా మహి ళలు. అందుకే ఆనాటి ఆ ఉద్యమం సెగ ఢిల్లీని తాకడం! అప్పటికీ ఇప్పటికీ- మరి ఈ మూడు నాలుగు నెలల విరామ కాలంలో బీడీ కార్మికుల జీవితాలలో ఎంతటి గుణాత్మక మార్పులు సంభవించా యో లేదా వారికి కల్పించిన ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు ఎలాంటివో తెలియదు కాని మళ్ళీ ఆ సమస్య తెరమీదికి వచ్చింది. జూన్ ఒకటి నుంచి పుర్రెగుర్తు ముద్రణ ప్రారంభం కానున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీనితో బీడీ కార్మికులలో అలజడి! రాజకీయ పార్టీలలో సయితం కదలిక! మరోసారి మరో ఉద్యమానికి ఊతం. ఈ సమస్యపై ఇప్పటికే తెలంగాణా రాష్ట్ర సమితి ఆ ప్రాంతంలో ధర్నాలు, బంద్‌లకు దిగితే, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం అఖిలపక్ష లేదా అఖిల ప్రతిపక్ష ఉద్యమానికి సమాయత్తం అవుతున్నది. మరోవైపు మరింత ఉధృతంగా సాగుతున్న మరో ఉద్యమం- మహారాష్ట్ర గోదావరి నదిపై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకం గా! దీనిపై కడచిన రెండేళ్ళుగా అసెంబ్లీ లోపల, వెలుపల చర్చోప చర్చలు, అడపాదడపా ఆందోళనలు సాగినా-ఈ ఉద్యమం ఉగ్రరూ పం దాల్చిందిమాత్రం కడచిన రెండు మూడు వారాలలోనే! విశేషం ఏమిటంటే రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంకూడ దీనిపై కేంద్రానికి ఫిర్యా దుచేయడం, సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అయినా ఫలి తం శూన్యం. ప్రభుత్వ ఉదాసీనత కారణంగానో ఏమో కాని, అంతిమంగా బాబ్లీ వ్యతిరేక ఉద్యమ నాయకత్వం తెలుగుదేశం చేతులలోకి వెళ్ళింది. సమైక్యవాద పార్టీగా చతికిలపడిన తెలుగుదేశానికి తెలంగాణ ప్రాంత సమస్యలపై పోరాడే హక్కు, శక్తి ఎక్కడివన్నది టి.ఆర్.ఎస్., కాంగ్రెస్‌ల అంచనా కావచ్చు. టి.ఆర్.ఎస్. అయితే 2009 ఎన్నికలకు సన్నాహంగా పూర్తిగా పార్టీ పునాదులను గట్టిపర చుకునే, విస్త­ృతపరుచుకునే పనిలో నిమగ్నమయింది. కాంగ్రెసుకేమో అధికార పార్టీకి సాధారణంగా వుండే అశక్తత. పైగా తీరిక తక్కువ. ప్రధాన ప్రతిపక్షం ఎప్పటికప్పుడు చేపట్టే ఆం దోళన కార్యక్రమాలకు దీటుగా రాజకీయంగా ప్రతిస్పందించడం తప్ప ఏ దశలోనూ అది స్వయంగా చొరవ చూపలేకపోయింది. ఆ శాఖ మంత్రిదే ఇటు ప్రభుత్వ ప్రతినిధిగా, అటు పార్టీ ప్రతినిధిగా ద్విపాత్రాభినయం! అధికార పార్టీగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు కేంద్ర ప్రభుత్వాన్ని తగిన మోతాదులో కాంగ్రెసు కదిలించలేకపోయింది. ఆఖరుకు మధుయాష్కి వంటి కాంగ్రెసు నేతలు చూపిన చొరవనుకూడ సొంత సంకుచిత రాజకీయకోణంలో చూసిందే కాని సకాలంలో సద్వినియోగం చేసుకోలేకపోయింది. పైగా పరిమాణం లో అల్మట్టితో ముడిపెట్టి, బాబ్లీని చిన్న సమస్యగా చూపెట్టి, తెలుగుదేశంపై రాజకీయఎదురుదాడికి ప్రయత్నించింది. పొరుగు రాష్ట్ర మైన మహారాష్ట్రలో, అటు కేంద్రంలో కాంగ్రెసు పార్టీయే అధికారం లో వుండడం ఆ పార్టీకి ఒక అవకాశం! అలా గే ఒక ఇబ్బంది! వీటన్నింటి పర్యవసానమే కాంగ్రెసు ఈ సమస్యపై వెనుకబడడం! ఆలస్యంగా అంతర్మథనంతో మేల్కొనడం! ఇటు ప్రత్యేక తెలంగాణ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితితో పోటీపడలేక, అటు తెలం గాణ ప్రాంత సమస్యలపై ప్రధాన ప్రతిపక్షం తో వేగలేక అది క్రమంగా బలహీనపడుతున్నదన్న భావన. ఈ విషయాన్ని ఇతరులే కాదు, కాంగ్రెసు నేతలే స్వయంగా అంగీక రించడం, ఆందోళన వెలిబుచ్చడం ఇటీవలి పరిణామం. జి.వెంకటస్వామి, వి.హనుమం తరావు, వి.పురుషోత్తమరెడ్డివంటి నేతలయి తే అదేపనిగా హెచ్చరికలు జారీచేస్తున్నారు. వీరిలో కొందరు ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు కూడ చేస్తున్నారు. ఇదంతా పెద్ద గుదిబండ వలె తయారై ఏదో ఒకటి చేయక తప్పనిపరిస్థితిలోకి కాంగ్రెసును నెట్టిం ది. అందుకే శనివారం ఉత్తర తెలంగాణ నేతలతో పి.సి.సి. భేటీని ఏర్పాటుచేయడం, బంద్‌కు ఆగమేఘాలమీద పిలుపు ఇవ్వడం! కాంగ్రెసు బంద్ పిలుపులోని ఒక ప్రత్యేకత- బాబ్లీ విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాసరావు దేశ్‌ముఖ్ ఢిల్లీలో చేసిన ప్రకటనకు నిరసన తెలుపడం! నిన్నటివరకు ప్రాంతీయం అనుకున్న బాబ్లీ సమస్య కాస్తా, విలాసరావు ప్రకటనతో తీవ్రస్థాయి అంతర్రాష్ట్ర సమస్యగా మారింది. మన రాష్ట్రానికి పోటీగా అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లి ప్రధానిని కలవడమే కాదు, అసలు కేంద్ర జలవనరుల మంత్రి సయిఫుద్దీన్ సోజ్ బాబ్లీ నిర్మాణాన్ని ఆపవలసిందిగా తమకు లేఖ రాయడాన్నే విలాసరావు ఏకంగా ప్రశ్నించారు. కేంద్రం లేఖను ఖాతరు చేయబోమని, సుప్రీంకోర్టు ఆదేశాలు వస్తే అప్పు డు ఆలోచిస్తామనికూడ ఆయన స్పష్టంచేశారు. ఇందులో ధ్వనిస్తు న్న ధిక్కారధోరణి స్పష్టం! ఒకేపార్టీ అధికారంలో వున్నా- కేంద్ర- రాష్ట్ర సంబంధాలు వికటించే పరిస్థితులు ఉత్పన్నం కావడం దేశం లో కొత్త చర్చకు దారితీసింది. చివరకు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు-లేఖలు, సలహాలతో సరిపెట్టకుండా ఆర్టికల్ 256 కింద మహారాష్ట్రకు కేంద్రం ఆదేశాలు ఇవ్వాలని, అప్పటికీ మాట వినకపోతే, ఆర్టికల్ 356 ప్రయోగించాలనే స్థాయి వరకు వెళ్ళారు. కేంద్రం ఆదేశాలు వినకపోవడం అంటే సమాఖ్య స్ఫూర్తికి విఘా తం కలిగించడం, రాజ్యాంగోల్లంఘనకు పాల్పడడం! అంటే అప్పు డు ఆర్టికల్ 356కింద రాష్ట్రపతి పాలన విధించక తప్పని పరిస్థితులు ఏర్పడినట్టు! కాంగ్రెసు నాయకులు కొందరు సయితం ఇలాంటిదే ఇంకో రకమైన డిమాండ్‌ను ముందుకు తెస్తున్నారు. అది ముఖ్య మంత్రి విలాసరావును మార్చాలనడం! అంటే రాష్ట్రపతి పాలన వర కు వెళ్ళకుండా- ముఖ్యమంత్రిని మార్చడం ద్వారా ఘర్షణను నివా రించాలని! అదీ జరిగే పనికాదు కాని, అంతర్రాష్ట్ర జల వివాదాల లో మనరాష్ట్రం ఎన్నడూ ఎదుర్కోనంత తీవ్ర సవాలును ఈ సమ స్యపై ఇప్పుడు ఎదుర్కొంటున్నది. ఇప్పటివరకు కృష్ణ ప్రాజెక్టులదే వివాదం అనుకుంటే ఇప్పుడు గోదావ రికీ ఆ సమస్య విస్తరించింది. ఇలాంటి పరిస్థితులలో వ్యూహాత్మకం గా కాంగ్రెసు నిర్వహిస్తున్న బంద్- ఈ వారం పది రోజులలో ఉత్తర తెలంగాణ లో జరుగుతున్న బంద్‌లలో మూడవ ది. ఇప్పటికే మహారాష్ట్ర పోలీసుల లాఠీచార్జికి వ్యతిరేకంగా తెలుగుదేశం ఒకసా రి బంద్ జరిపింది. దానికి కాంగ్రెసుతో సహా అన్ని పార్టీలూ మద్దతు ఇచ్చాయి. శుక్రవారం నాడు పుర్రెగుర్తు సమస్యపై బీడీ కార్మికులకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర సమితి బంద్ జరిపింది. ఇప్పుడు శనివారం నాడు ఆ వంతు కాంగ్రెసుకు వచ్చింది. ఇక తెలుగుదేశం- ఈనెల 24న శ్రీరామసాగర్ ప్రాజెక్టు వద్ద మహా ధర్నాకు సంకల్పించింది. ఈ ధర్నాలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ భాగస్వాములు. ఇటు బాబ్లీపైన కాని, అటు బీడీ కార్మికుల సమస్యపై కాని- తెలుగుదేశం తో వామపక్షాలు రెండూ చేయి చేయి కలిపి పోరాడుతున్నాయి. బి.జె.పి.తో సహా మిగతా పార్టీలది మాత్రం ఎవరిదారి వారిది. ఇది వరకే ఒకసారి సరిహద్దు వద్ద మహారాష్ట్ర పోలీసుల లాఠీ దెబ్బలు చవిచూసిన బి.జె.పి. సొంతంగానే ఉద్యమాలు నడుపుతున్నది. ఆ పార్టీ నేత ఇంద్రసేనారెడ్డి తలపెట్టిన నిరవధిక నిరశన దీక్ష ఇందులో ఒక భాగం. రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలతో ముడిపడిన అంతర్రా ష్ట్ర జలాల వివాదంలో అన్ని పార్టీల అభిప్రాయం, అంతిమ లక్ష్యం ఒకటే అయినా ఆందోళనలు మాత్రం వేరుగా వుండడం ఇతరులకు కొంత అలుసు అవుతున్నది. అంతిమంగా ఫలితాలు ఎలా వున్నా, బంద్‌లు, ఆందోళనల రూపంలో తెలంగాణ ప్రాంత సమస్యలపై కొత్తరకం పోరుకు కొత్తగా తెర లేచిందనిపిస్తున్నది. ఇందులో తెలు గుదేశానిది ముఖ్యమైన పాత్ర. ఒకవైపు తెలంగాణ సెంటిమెంట్, మరోవైపు తెలంగాణ ప్రాంత సమస్యలు. ఇదంతా రాజకీయం అని పూర్తిగా కొట్టిపారవేయలేని స్థితి. అందరూ కలిసి రాష్ట్ర శాశ్వత ప్రయోజనాలు కాపాడుకోవలసిన విధిలేని స్థితి! బాబ్లీపై రాష్ట్రంలో ఇంత రాద్ధాంతం జరుగుతున్నా, పార్టీలు ఎం త హైరానా పడినా, ఫలితం ఏమిటో కనుచూపు మేరలో కానరావ డంలేదు. ఈ పరిస్థితికికారణం ప్రధానంగా మహారాష్ట్ర ప్రదర్శిస్తు న్న మొండి వైఖరి. అదే విధంగా- కేంద్రం అనుసరిస్తున్న మెతక వైఖరి! సమస్య దానంతట అదే పరిష్కారమవుతుందని ఎదురు చూస్తున్న కేంద్రం కనీసం రిఫరీ పాత్రను కూడ పోషించలేకపోతు న్నది. అందుకే రాష్ట్రంలో ఆందోళనలు రోజురోజుకీ ఉధృతమవుతున్నాయే తప్ప ఉపశమించడంలేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే జరుగుతుందనుకుంటున్న నష్టం, మిన్నకుండి పోవడం వల్ల అంత కంటె ముందే జరిగిపోతున్నది. కేంద్రం దాటవేత ధోరణిని అనుసరి స్తున్న ఈ పరిస్థితిలో, ఇక అందరూ ఎదురు చూస్తున్నది సుప్రీంకోర్టులో ఏమి తేలుతుందనేది! బాబ్లీ విషయంలో ఆంధ్ర అభ్యంతరాలు ఏమిటో స్పష్టం. అస లు బాబ్లీ నిర్మాణం జరుగుతున్న స్థలమే ఆంధ్రకు చెందిందనేది ఒక టి. ఇంతకు ముందే ఆంధ్రప్రదేశ్ పరిహారం చెల్లించింది కాబట్టి ఆ స్థలంపై ఆంధ్రకు హక్కు ఏర్పడిందనేది దీనిలోని సారాంశం. బాబ్లీ నిర్మాణం వల్ల శ్రీరామసాగర్ ప్రాజెక్టు నిర్వీర్యం అవుతుందనేది మరొకటి! ఒక ప్రాజెక్టు జలాశయంలో మరొక ప్రాజెక్టు ఎలా కడతారనేది ఆందోళన కలిగించగల మరొక ప్రశ్న. ఈ ప్రాజెక్టు వల్ల శ్రీరా మ్ సాగర్ రిజర్వాయరులోని నీరు కొన్ని సందర్భాలలో వెనుకకు మళ్ళుతుందని, బాబ్లీలోకి వెళ్ళిపోతుందనేది ఆంధ్రప్రదేశ్ భయం. ఇందుకు అనుగుణంగా వెనుకకు తెరుచుకునే వీలుగల గేట్లను బాబ్లీలో అమర్చడం జరుగుతున్నదట. ఇవన్నీ వినడానికే భయాం దోళనలు కలిగించగల అంశాలు. బాబ్లీ కేవలం బరాజ్ అని, ఆనకట్ట కాదని, దానిలో భారీగా నీటి నిల్వ ఎలా సాధ్యమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి వాదిస్తున్నారు. అందుకు బదులుగా ఆంధ్రప్రదేశ్ కూడ దీటయిన వాదమే చేస్తున్నది. డెల్టా జిల్లాలలో ప్రకాశం బరా జ్, ధవళేశ్వరం బరాజ్‌ల కింద లక్షలాది ఎకరాలు సాగవుతున్న పుడు, బాబ్లీ కింద ఎందుకు సాధ్యం కాదనేది ఆంధ్ర వాదం. సమ స్య ఇంత తీవ్రంగా వున్నప్పుడు, న్యాయం దిగువ రాష్ట్రమయిన ఆంధ్ర వైపు వుందన్నప్పుడు- కేంద్రమే పూనుకుని ఇరు రాష్ట్రాల మధ్య రాజీ కుదిర్చితే అది ఒక పద్ధతిగా వుండేది! అలా జరగలేదు. అందుకే ఇప్పుడు ఇది ఇంత జటిలంగా మారడం! అందరికీ ఇప్పు డు సుప్రీంకోర్టే శరణ్యం అయింది. అక్కడ చివరకు ఏమి జరిగినా, ఒక్క విషయమయితే స్పష్టం. సమైక్య పోరాటాలతో తప్ప ఇతరత్రా ఏదీ సాధించుకోజాలమన్న నీతిని బాబ్లీ ఉదంతం మరోసారి మన కు గుర్తు చేస్తున్నది. అదే విధంగా- అత్యంత కీలక సందర్భాలలో మన ప్రజాస్వామ్య ప్రక్రియ ఎంత నిశ్చేతనంగా, నిస్సహాయంగా మిగిలిపోతున్నదో అర్థం అవుతున్నది. ఇదంతా ఆందోళన కలిగిం చగల ఒక పరిణామం. మార్గదర్శకత్వ లేమి మనకు పట్టిన అసలైన దౌర్భాగ్యాలలో ఒకటి. -ఇనగంటి వెంకట్రావు (andhra jyothy 4-20-2007)

Thursday, August 07, 2008

సత్యం పై దాడి - మా ఉనికి పై దాడి

మిత్రులారా..!

లాభాల్లో నడుస్తున్న ఒక బ్రాంచి ని ఆర్థిక లావాదేవీ లు నడుపుతున్న ఏ సంస్థ మూసివెయ్యడానికి ఇష్టపడదు. ఐతే రాష్ట్ర స్థాయి లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఈ బ్రాంచి ని ఒక ప్రైవేటు చిట్ ఫండ్ కంపెనీ మూసివేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.

తమిళనాడు కేంద్రం గా గల శ్రీరాం చిట్స్ కు ఇప్పుడున్న రాష్ట్రం లో ఆంధ్రా పెద్దలే పెద్దలుగా ఉన్నారు. అన్నీ కంపెనీల్లో లాగానే ఇక్కడా కూడా ఒకరొకరుగా పైకెగబాకి అన్ని పదవుల్లో తిష్ట వేసారు. ఇక్కడివరకు రొటీనే. ఆతర్వాతే కథ భిన్నం గా నడిచింది. ఇలా గద్దెనెక్కిన వారు 30 మంది సిబ్బంది & 10 మంది డెవలప్ మెంట్ అధికారులతో మొదట్నుంచి లాభాలతో నడుస్తున్న చిక్కడపల్లి బ్రాంచి ని మూసేద్దామనే నిర్ణయం తీసుకున్నారు. ఈ బ్రాంచి లోని మెజరిటీ ఉద్యోగులూ తెలంగాణ వాదులే. తెలంగాణ ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగుల సంఘం సభ్యులే. కొత్త కస్టమర్ల కోసం ప్రైవేటు కంపెనీలు రోజుకో స్కీము పెడుతున్న ఈ రోజుల్లో లాభాల్లో ఉన్న బ్రాంచి ని ఎందుకు మూస్తున్నారన్నదే ఎవరికీ అర్థం కాని ప్రశ్న. తమిళనాడులో ఉన్న కంపెనీ అధిపతులేమో చేరండి చేరండి అని జనాల్ని పిలుస్తుంటే ఇక్కది అంధ్రా అధికారులు మాత్రం తెలంగాణ వారు ఎక్కడెక్కడున్నారో వెతికి వెతికి మరీ ఆ బ్రాంచిల్ని మూసేస్తున్నారు. రాష్ట్రం లోనే మంచి ఫలితాలు సాధిస్తున్న ఈ బ్రాంచి ని మూసివేయడం ఈ పిచ్చి వారి పైత్యానికి మరో మచ్చుతునక.

ఇదే క్రమం లో అడగడానికి వెళ్లిన ఆ బ్రాంచి ఉద్యోగి, తెలంగాణ ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సత్యం పై ఎం డీ స్థాయి గూండాలు క్లోస్డ్ రూం లో దాడిచేయడం జరిగింది.

తెలంగాణ లోని లభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలకు నష్టాలు తెప్పించి మరీ మూసివేయడమె మనకు తెలుసు. NSF, azam jahi వంటి వందలాది కంపెనీల మూసివేత తో ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ లోకి వచ్చిన తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ చుక్కెదురైంది. తమ బందువులను కొలువుల్లోకెక్కించే ఆంధ్రులు అన్నింటా తెలంగాణ వారిని ద్వితీయ శ్రేని వారిగానే చూశారు. వాడు మారలేదు. వాడి దాడులూ ఆగలెదు. మారింది దాడుల తీరు మాత్రమే. నిన్న శ్రీరాం చిట్స్ లో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం.

ఆంధ్ర మథాన్ని నరనరాన జీర్ణించుకున్న కొందరు ఆంధ్రా అధికారులు సత్యం పై జరిపిన ఈ దాడిని తెలంగాణ ఐటి ఫోరం తీవ్రంగా ఖండిస్తుంది. తెలంగాణ వాదాన్ని ఎదుర్కోలేని పిరికి పందలు తెలంగాణ వాదులపై దాడులు కొనసాగిస్తున్నారు. దాడులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరు. సత్యం గెలిచి తీరుతాడు. సత్యం జయించి తీరుతుంది.


naveen achari,
Telangana IT Forum