Thursday, May 21, 2009

మేలుకొలుపు ఎప్పుడు తండ్రీ! --అరుణ్‌సాగర్


తండ్రీ మూడున్నర దశాబ్దాలుగా కాపాడుకున్న చెట్టు మోడువారడం రిజిస్టర్ కావడం లేదు. గెలుపో పిలుపో జానేదేవ్. ఇప్పుడు కావాల్సింది మేలుకొలుపు. ఇప్పుడు కావాల్సింది స్వీయసమీక్ష...తండ్రీ నెపం కుట్రల మీద వేసి తప్పుకోకండి. కుట్రలకు లొంగిపోయే పరిస్థితి ఎందుకొచ్చిందో సమీక్షించండి. ప్రలోభాలకు లొంగిపోయేంత బలహీనులు ఎవరి నాయకత్వంలో తయారయ్యారో గుర్తించండి.
నా గుండె నిండా జెండా జ్ఞాపకాలు మోసుకు బతుకుతున్నాను. చెడిపోయిన వాడ్ని అని కోపగించకు. జేగురు రంగులో ముంచినా నా చిట్టి చేతులతో ముర్ల యర్రయ్యరెడ్డికే మీ ఓటు అని గోడమీద రాశాను. కానీ, ముప్ఫై ఏళ్ల పాటు గుండెలకు తగిలించుకున్న విజయపతాకం ఒక్కసారి ఊడిపోయే సరికి కూలిపోయాను. బాధతో కుమిలిపోతున్నాను. తండ్రీ ఇక్కడ ఏం జరుగుతోంది. వన్నాఫ్ సెవెం టీ నుంచి రెండువేల తొమ్మిది వరకూ ఏ గందరగోళం ఏ అలసత్వం ఏ అజ్ఞానం ఏ అహంకారం ఏ కృతజ్ఞతా రాహిత్యం నీ శ్రేణులను ఆవహించింది? ఎవరు ఎవరితో కాంప్రమైజ్ అయ్యారు.
ఏ వీరులు తెరమరుగ య్యారు. ఏ విల్లంబులు విరిగి శిథిలమయ్యాయి. నీ అడవి బిడ్డలు ఆటబొమ్మలై కీలు బొమ్మలై నీవే తెచ్చిపరిచిన మైదాన ప్రాంత పు ఇనుప కార్పెట్ కింద పడి నలిగిపోయారు. ఒకడు చెడిపోయి ఒకడు విసిగిపోయి ఒకడు తెరమరగై ఒకడు విశాలాకాశం వైపు ఆదివాసీ విముక్తి సంస్థవైపు...చివరకు కోయభాష వచ్చినోడే లేకుండా పోయాక లీడరెవరే తండ్రీ. కలప కాంట్రాక్టర్లూ కూపులు వేలం పాడేవాళ్లూ పగ్గాలు పట్టుకున్నాక స్వయం పత్రిపత్తి రుచి చూపే దయామయుడెవడు. నాయకులు పైనుంచి రుద్దబడిన చోటే ఎర్రబడే గుండెలకు జన్మస్థానం ఏదీ.
తండ్రీ క్షమించు విదేశీ కుట్రనూ చెడిపోయినోళ్ల నిర్వాకాలనూ క్షమించు. సమీక్షకు చోటివ్వని చోట నిన్ను శిక్షించడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయతలో పడిపోయిన ప్రజలనూ క్షమించు. పాపం వారేమి చేయుచున్నారో వారెరుగరు. తండ్రీ ఇది తొలిజెండా ఎగిరిన చోటు. అడవి హక్కులు, తునికిరేట్లు తప్ప మరేమి కోరని కోయలూ కొండరెడ్లూ నిను నమ్మి నీ వెంట నీ పాట పాడుకుంటూ కవాతు చేసిన నేల. సీధర సీతమ్మా ఇరపా అరుణమ్మా-ఎర్రజెండేరోరన్నా ఎర్రజెండేరా అంటూ గానం చేసిన తన్మయం పొందిన ఆకాశం. రెండు పార్టీలూ కలిసి ఎన్నెన్నో ఉప్పెనలను అధిగమించిన ఘనవారసత్వం.
తండ్రీ నువ్విక ఎంత మాత్రమూ చెడిపోయి న వారి మీద నింద వేయజాలవు. కొంత నిజమో సొంత వాదమో నువ్విక ఎంత మాత్రమూ అమెరికా కుట్రకూ అంతర్గత వైఫల్యానికీ ముడిపెట్టలేవు. చెడిపోయిన వాళ్లందరూ ఎలా చెడిపోయారో ఎందుకు చెడిపోయారో ఏ కాలక్రమంలో చెడిపోయారో ఎవరు చెడగొడితే చెడిపోయారో-అన్నిటికీ మించి ఏ పేరెంటింగ్‌లో చెడిపోయారో చెప్పకుం డా నువ్వు తప్పించుకుపోలేవు. అంతర్గత కుళ్లును కడిగివేయలేనితనం తో అంతర్జాతీయ ఎత్తుగడలను వేలెత్తి చూపి నీ బాధ్యతల నుంచి నువ్వు పారిపోలేవు. నీ దారి నిండా వెలిగే ప్రశ్నల తేజస్సును ఏ అరచేతినీ అడ్డుపెట్టి ఆపలేవు.
అయినప్పటికీ తండ్రీ నిన్ను తప్పుపట్టలేము. బహుశా నీకు కొందరి పేర్లు తెలియకపోవచ్చు. బహుశా నువ్వెప్పుడూ సొరకాయ బుర్రలో గంజి నీళ్ల రుచి చూసి ఉండకపోవచ్చు. బహుశా నీకు కుమ్మూరు నడిబొడ్డున ఓ జెండా దిమ్మకట్టిన వాడితో పరిచయం ఉండి ఉండకపోవచ్చు. బహుశా నీకు మార్త శ్రీరామ్మూర్తీ, భీమయ్యా, తమ్మయ్యా, గుండు ప్రసాదూ, ఇరపా శ్రీరాములూ బిఎస్ రామ య్యా వీళ్లెవరి పేర్లూ తెలిసి ఉండకపోవచ్చు. నీకు తెలిసి న చరిత్రంతా ఒకటి రెండు పేర్లచుట్టే తిరిగి ఉండొచ్చు.
భద్రాచలం కాలేజీలో జెండా నీడన వెలుగుపాట పాడుకున్న వారు శబరీ గోదారీ సీలేరు నీళ్లలో పాటలై కలగలిసి గిరిజన గ్రామాల్లో నీ కీర్తనలు చేసి వాటిని ఓట్లుగా మలచి ఎర్రపూల వనాలు సాగుచేసే వారన్న సంగతి గుర్తులేకపోవచ్చు. ఎర్రమందారాల నర్సరీని నిర్లక్ష్యం చేసి నలుగురు కాంట్రాక్టర్ల దయతో ఏసీ రూముల్లో కార్యదర్శి నివేదికలు తయారు చేసిన వైనం నీ దాకా చేరి ఉండకపోవచ్చు. ఒక మృతవీరుని స్మరణకు ప్రజల సొమ్ముకాక వ్యాపారుల చందాని విసిరేసిన వైనం నీకెవరూ చెప్పకపోవచ్చు.
పృ«థక్కరణం-అనగా ఐసోలేషన్. నీ అడవిబిడ్డలు వేరే అండ ఎందుకు చూసుకున్నారన్న బెంగ నీకు ఏనాడూ లేదు. ఏ సామాజిక సముదాయం నీ ఆదర్శాల నీడన సేదతీరాలో ఆ సమూహం మూకుమ్మడిగా నీకు దూరమైన వైనానికి నీ దగ్గర సమాధానం లేదు. సమగ్ర గిరిజానాభివృద్ధి పథకం ప్రభుత్వం చేసే పని. కానీ మహాసభల క్రెడిన్షియల్ రిపోర్టుల్లో దళిత గిరిజనుల సంఖ్యను చూపించి పేపర్లు దులుపుకోవడం ఎవరిపని?-స్వయం సంపత్తి లేని నాయకత్వ బాధ్యతలు ఏ అట్టడుగు వర్గానికి వికాసాన్ని ప్రసాదిస్తాయి. భూమి పుత్రులకు సింహాసన మిచ్చి కోట గుమ్మానికి తాళం వేసుకోవడం, సర్వసైన్యాన్ని గుప్పిటపెట్టుకోవడం ఏ నిర్మాణం, ఏ ఎత్తుగడల పంథా?
నిందించండి తండ్రీ నిందించండి. చెడిపోయిన కొందరూ విడిపోయిన కొందరూ జీవితంలో ఇతర ప్రాధాన్యాలను ఎన్నుకుని కొందరూ వేరు బాటలు ఎంచుకున్నందుకు నిందించండి. కానీ, జీవితం విశాలమైనది. ప్రపంచం బహుముఖమైనది. భిన్నాభిప్రాయంతో సహజీవ నం తప్పదని గుర్తించండి. మూసలు పగులగొట్టండి. సమాజ వికాసా న్ని కాంక్షించడమే ప్రమాణం. వారు లోపలున్నా బయట ఉన్నా నీ బిడ్డలే! ఓట్లు పెద్దగా తరగలేదని సంతోషపడతావో .. ఇన్ని పోరాటాల ఫలితంగా ఏ మాత్రం పెరగనందుకు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటావో నీ ఇష్టం! కానీ ..ఓట్ల కంటే పార్టీ ఆస్తులు పెరగటమే ఇక్కడ విప్లవ విషాదం. కానీ తండ్రీ మూడున్నర దశాబ్దాలుగా కాపాడుకున్న చెట్టు మోడువారడం రిజిస్టర్ కావడం లేదు.
గెలుపో పిలుపో జానేదేవ్. ఇప్పుడు కావాల్సింది మేలుకొలుపు. ఇప్పు డు కావాల్సింది స్వీయసమీక్ష. విప్పిన గొంతులను నులిమేయడమే ఈ పరాజయానికీ పరాభవానికీ కారణం. తండ్రీ నెపం కుట్రల మీద వేసి తప్పుకోకండి. కుట్రలకు లొంగిపోయే పరిస్థితి ఎందుకొచ్చిందో సమీక్షించండి. ప్రలోభాలకు లొంగిపోయేంత బలహీనులు ఎవరి నాయకత్వంలో తయారయ్యారో గుర్తించండి. వ్యాధి లక్షణాలను కాదు, శరీరంలో తిష్టవేసిన బ్యాక్టీరియాను తొలిగించండి.
కుట్రలను తిప్పికొట్టలేని వారు నిర్బంధకాండని ఎలా తట్టుకోగలరు? తండ్రీ మీ ఫాదరింగ్ పట్ల అనుమానమే లేదు. మీ చిత్తశుద్ధిపైన సందేహమే లేదు. మేము కోరుకునేది ఒక్కటే. చర్చకు తానివ్వండి. భిన్నాభిప్రాయాన్ని బహిష్కరించకండి. స్వాగతించండి. సమస్యలను నిర్మూలించకండి. పరిష్కరించండి. తండ్రీ వెనక్కు తిరిగి చూసుకోవడానికి నిరాకరించిన వైనమే స్థూలంగా ఈ అపజయానికి మూలం. అప్పుడప్పుడూ అంతశ్శోధన జరిపితే ఇక పట్టదు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన ఖర్మ.
(మూడున్నర దశాబ్దాల తర్వాత భద్రాచలంలో సిపిఎం తొలిసారి ఓడిపోయింది)
* * * * * * *
(ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుల ఆవేదన కూడ ఇందుకు విరుద్ధంగా ఏమీ లేదు. వందలాది మంది మెధావులు వేలాదిగా విద్యార్థులు ప్రచారమ లో ముందున్నా ఫలితాలు అంతంతమాత్రం గా ఉండడం, 400 మంది విద్యార్థి అమరుల త్యాగాలను ఒక రాజకీయ పార్టీ తన బలహీనతల కారణంగా నిర్వీర్యం చేసిందనే బాదతో ఇది ఇక్కడ ఉంచుతున్నా. కమ్యునిస్టు ఉద్యమ సానుభూతి పరుడైన సోదరుడు అరుణ్ సాగర్ కు ధన్యవాదాలు -నవీన్ ఆచారి )