Friday, June 17, 2011

తెలంగాణ ఉద్యమంతో 'ఐటీ' కి నో లాస్



Read my version in news article "తెలంగాణ ఉద్యమంతో 'ఐటీ' కి నో లాస్" on Page 8 of today's Namasthe Telangana, 18 June.

Friday, April 29, 2011

కొత్త రాష్ట్రాల ఏర్పాటు - అంబేద్కర్ ఆలోచనావిధానం

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ పునర్నిర్మాణం కోసం, సామాజిక న్యాయం కోసం, రాజకీయ ప్రక్రియలో బడుగు బలహీన వర్గాల న్యాయమైన వాటా కోసం రచించిన వ్యూహాలపై చెరగని ముద్ర వేసిన మహనీయుడు, ఒక సమగ్ర రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు డా. బీఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ది ఒక మహోన్నత వ్యక్తిత్వం. ఆయన ఒక అసమాన మేధావి. ఆయన తపనంతా దేశ సమగ్రత పై, జాతి ఔన్నత్యం పై కేంద్రీకృతమై ఉండేది. అంబేద్కర్ చనిపోయి అర్దశతాబ్దం దాటినా సమకాలీన రాజకీయ అంశాలపై ఆయన దార్శనికత, దృక్పథం. అర్థం చేసుకోదగినవి, ఆచరించదగినవి. భిన్న సంస్కృతులు అనేక భాషలున్న మనదేశం లో ఆదిపత్య శక్తుల ప్రభావాన్ని ఎదుర్కొని అణిచివేయబడ్డ వర్గాలు స్వయం పాలన సాధించే దిశగా కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అంబేద్కర్ ఆలోచనా విధానమే ఏకైక మార్గం.

భారతదేశ రాష్ట్రాల స్వరూపం గురించి అంబేద్కర్ కు చాలా స్పష్టమైన అభిప్రాయాలున్నయి కేవలం భాషా ప్రాతిపదికనే రాష్ట్రాలు ఏర్పాటు చేయడం శ్రేయస్కరం కాదని ఆయన స్పష్టంగా చెప్పాడు ఒక భాష కు ఒకే రాష్ట్రం ఉండడం వల్ల భాషాదురభిమానం పెరిగి దేశ సమగ్రతకు భంగం కలిగే అవకాశం ఉందని భావించాడు. అందుకే రాష్ట్రాల ఏర్పాటులో ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించాడు. పరిపాలనా సౌలభ్యం కోసం ఒక రాష్ట్రం లో ఒక భాష ఉంటే మంచిదన్న అంబేద్కర్ ఒక భాష మాట్లాడే వాళ్లందరు ఒకే రాష్ట్రం లో ఉండాలన్న నిర్హేతుక వాదనను మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాడు. రాష్ట్రాల స్వరూప స్వభావాలలో వివిధ అంశాల మద్య సమతౌల్యం ఉండాలని ఆయన బలంగా అభిప్రాయపడ్డాడు. జనాభా, భౌగోళిక, మరియు ఆర్థిక స్వావలంబన అనే మూడు అంశాలు ప్రాతిపదికలుగా ఉండాలన్న ఆయన ఆర్థిక స్వావలంబనకు అధి ప్రాధాన్యం ఇచ్చాడు.

యాబై ఏళ్లుగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎంత న్యాయమైనదో అంబేద్కర్ తార్కిక ఆలోచనా విధానం తో ఆలోచించినపుడు తెలుస్తుంది. తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జనాభా పరంగా 16 రాష్ట్రాలకంటే, భౌగోళికంగా 17 రాష్ట్రాలకంటే పెద్దది కాగలదు. ఇక ఆర్థిక స్వావలంబన దృష్ట్యా తెలంగాణ స్వయం సమృద్దితో విలసిల్లగలదనేది నిర్వివాదం. ప్రస్తుత రాష్ట్రం లోని గోదావరి పరివాహక ప్రాంతం లో 79%, క్రృష్ణా పరివాహక ప్రాంతం లో 69% తెలంగాణలో ఉన్నవి. అంతేగాక అపారమైన ఖనిజ సంపద, అటవి సంపద, సారవంతమైన భూములను తెలంగాణ కలిగి ఉన్నది.

ఒక రాష్ట్ర ఏర్పాటులో ఎదురయ్యే అవాంతరాలకు, వివాదాలకు బాబాసాహెబ్ సూచించిన మార్గదర్శకాలు మాత్రమే పరిష్కారాన్ని ఇవ్వగలవు. ప్రస్తుతం కొందరు పెట్టుబడి దారులు హైదరాబాదు నగర ప్రతిపత్తి పై సృష్టిస్తున్న వివాదాలకు ఉమ్మడి బొంబాయి రాష్ట్రం విడిపోయినపుడు అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలు సరైన సమాధానాన్నిస్తాయి. బొంబాయి నగరం మహారాష్ట్రకే చెందుతుందని మిగతావారు అక్కడ అద్దెదారులు మాత్రమే అన్న ఆయన మహారాష్ట్ర లేకుండా బొంబాయి నగర మనుగడ అసాధ్యమన్నారు. అంబేద్కర్ దూరదృష్టికి అద్దంపట్టే మరో విషయం ఏంటంటే స్వయం పాలన కోరుకుంటున్న ప్రజల అకాంక్షలను ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆధిపత్య రాజకీయ వర్గాలు అడ్డుకునే అవకాశాలున్నయని రాజ్యాంగ కమిటీ చర్చల్లో స్పష్టం చేసాడు ఆయన. అందుకే కొత్త రాష్ట్రాల ఏర్పాటుబిల్లును రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయంతో సంబంధం లేకుండా పార్లమెంటులో ఆమోదింపచేస్తే సరిపోతుందని రాజ్యాంగంలోని ఆర్టికల్-3 లో ఆనాడే పొందు పర్చిన దార్శనికుడు అంబేద్కర్.

అణిచివేతకు గురైన వర్గాలనుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామిక విలువలే పునాదులుగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఇచ్చాడు. ఇటీవల శ్రీ కృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలోని ఎనిమిదవ అద్యయం లోని అంశాలు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేవిగా, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేవిగా ఉన్నాయి. ప్రజా ఉద్యమ అధ్యయనం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను రహస్యంగా ఉంచాలనడమే అప్రజాస్వామికం. అదికాక యాబై ఏండ్ల పోరాటం, ఇన్ని బలిదానాల తర్వాత కూడా సమస్యకు పరిష్కారం చూపకుండా అణచివేత దోరణితో అనైతిక పద్దతుల్ని ప్రోత్సహించడం సిగ్గుచేటైన విషయం. పదవులను ఎరవేసి ప్రజాప్రతినిధులను లోబర్చుకోవడం , ప్రకటనల ఆయుధాన్ని ఝళిపించి మీడియాను మచ్చికచేసుకోవడం వంటి దిగజారుడు విధానాలతో ఒక ప్రజా ఉద్యమాన్ని అడ్డుకోవచ్చని ఒక సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి నాయకత్వంలోని కమిటీ నివేదించడం జాతి సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన. ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే ఈ పెడధోరణులను పౌరసమాజం లోని ప్రతి ఒక్కరు ప్రతిఘటించవలసిన అవసరం ఉంది. అందుకే రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడానికి, ఇటువంటి అప్రజాస్వామిక దిగజారుడు దోరణులకు వ్యతిరేకంగా పోరాడుదాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విదానంతో ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ సాధించుకుందాం.


-నవీన్ ఆచారి
-పవన్ వెల్దండి
(తెలంగాణ ఐటీ ఫోరం)

Saturday, April 23, 2011

ఎవరిదన్నా విషాదం..?

ఎవరు తాలిబన్లు
ఏది సాంస్కృతిక విషాదం
ఇదే మాట తాలిబన్లను అంటే ఏం చేసేటోళ్లో కాని
హైదరాబాదు నడిబొడ్డున
ముగ్గురు నిలబడి కూడా మీరు అనగలరు
ఔను
ఈడ మట్టే అంత
స్వేచ్ఛగ బతకనిస్తది
ఒక్క మిమ్మల్ని అనేగాదు, ఎవ్వరినైనా
ఏం మంచితనమో ఏమో
పడుడేగాని అన్నదెర్కలేదు
వందల మంది అమరులై లక్షల మంది రోడ్డెక్కిన ఉద్యమం
ఏమేం చేయగలదో మీకు తెల్సు
ఐనా అంటరు
మేం తాలిబన్లమే

మమ్ముల రాజ్ థాకరేలు ముల్లాఒమర్ల లెక్కల కల్పి
మా తాతల్ని మా కట్ట మీదనే లేకుండ చేసిన
అన్నలూ ఒక్క మాట చెప్పుండ్రి
ఏది సాస్కృతిక విషాదం
ఈ విషాదం మొన్న మిలియన్ మార్చ్ నాడు జరిగిందొక్కటేనా
యాబై ఏండ్ల నుంచి మామీద నడుస్తున్న రుద్దుడు కార్యక్రమం కూడానా
కొంచెం చెప్పుండ్రన్నా
ఏది చారిత్రక విషాదం
ఈ నేలతో ఏ బంధమూ లేకపోయినా
30 ఏండ్లు హుస్సేన్ సాగర్ ఒడ్డున దర్జాగా నిలబడి
పాలాభిషేకాలు చేయించుకొని దండలేసుకున్న
కాటన్లు రాఘవలూ ఇయ్యాల కూలుడా
లేక
వట్టికోట, భాగ్యరెడ్డి, తుర్రెబాజిఖాన్, కొమురంభీంలెవరో
ఇప్పటికీ మన పోరగాండ్లకు తెల్వకపోవుడా
ఏది చారిత్రక విద్వంసం
మాట్లాడకుంటే ఎట్ల
ఏదో ఒకటి చెప్పాలెగదా
ఇద్దరి దగ్గరా మహానీయులున్నపుడు
ఈ వన్ వే ట్రాఫిక్ ఏంది.?
ఏందన్నా మాట్లాడరూ..
మనది ఒక్క జాతే కదా..
మనం ఒక్క తల్లి పిల్లలం కదా..
మీరే కదనే అన్నరు.. పాలునీళ్లు.. రెండుకండ్లు.. అమృతభాండం..



-నవీన్ ఆచారి

Monday, April 04, 2011

ప్రజాస్వామిక ఉద్యమం - ధృక్పథాల సమస్య _ వరవరరావు



ఆంధ్ర జ్యోతి, ఏప్రిల్ 4, 2011, సోమవారం, ఉగాది

Wednesday, March 30, 2011

నయ్యర్ గారూ, ఇది మీకు సబబేనా?


ఆంధ్ర జ్యోతి, ౩౧ మార్చ్ ౨౦౦౧

Saturday, March 26, 2011

విగ్రహాలు ఎందుకు కూలాయి?







ఆ సంఘటన అందరి హృదయాల్ని కలచి వేసింది. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవలసిన అవకాశాలు ప్రజలకంటే పాలకులకే ఎక్కువగా ఉన్నాయి. కానీ దాన్ని కూడా వదులుకుంటున్నారు. ఇలా జనం చీమల్లా ట్యాంక్‌బండ్ మీదకు కదలిరావటం ఇదే మొదటిసారి కాదు. ప్రతి బతుకమ్మ పండుగకు, వినాయక నిమజ్జనం సమయంలో ఆబాల గోపాలం కదలి ట్యాంక్‌బండ్ మీదకు రావడం జరిగేదే. కానీ, ఆ సందర్భంలో మాత్రం ఆ జనం మొఖాలపై నవ్వులు, కేరింతలు, ఉత్సాహాలు చూసేవాళ్లం. పోలీసులు కూడా కనపడేవారు. కానీ వారు లాఠీలను చూసి మురిసి పోయిందానికన్నా ప్రజల మధ్యన ఉండి, ప్రజల సంతోషాలతో లీనమౌతూ, తాము కూడా ఉన్నామని ప్రజలకు చెబుతూ ఉండేవారు. ప్రజలు ఈ 25 ఏళ్ల కాలంలో ట్యాంక్‌బండ్‌పై ఒక్క విగ్రహాన్ని కూడా ముట్టుకోలేదు. అది హైదరాబాద్ ప్రజల సంప్రదాయాన్ని, సహనాన్ని, నాగరికతను ప్రతిఫలించింది.

అకస్మాత్తుగా మిలియన్ మార్చ్ ఎందుకు ప్రజల ఆలోచనల్ని మార్చింది? సంతోషాలకు బదులుగా ఆ సమయంలో కక్షలు ఎందుకు రేగాయి? ప్రజల మనోభావాల్లో ఎందుకు ఈ మార్పు వచ్చింది? దీని వెనుక ‘రాజముద్ర’ కనపడుతున్నది. ప్రజలను ట్యాంక్‌బండ్‌కు రానివ్వకూడదని, జేఏసీ ఇచ్చిన పిలుపును విచ్ఛిన్నం చేయాలని, తెలంగాణ ప్రజల మనోభావాలు కనపడ కుండా చేయాలన్న ఎత్తుగడ పాలకులది. కేంద్రం మన్ననలను పొందాలన్న తహతహ రాష్ట్ర ప్రభు త్వానికి ఉంది. చిదంబరం మెప్పు పొంది అధికార పీఠంలో మరో మెట్టు ఎక్కా లన్న తపన ప్రభుత్వంలో ఉన్నట్లుగా కనిపించింది.

మార్చి 10వ తేదీన పిల్లల పరీక్షను తమ బలంతో రాయించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రజాబలంకన్నా అధికార బలం ఎక్కువని నిరూపించాలనుకున్నారు. ప్రజాస్వామిక ప్రభుత్వాలు అధికారంతో నడవవు. పోలీసుల పహారాలో పాలన ఎంతకాలమో సాగదు.

ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజల ఆకాంక్షను కాదనలేదు. ఈనాడు ప్రజలు తమ పిల్లలు చదువుకోవాలని, తమ పిల్లలు మానవ సంపదగా తయారు కావాలని, తమ ఆర్థిక ఎదుగుదలకు చేయూత నివ్వాలని ప్రజలు కాంక్షిస్తున్నారు. దాన్ని గమనించే బహుశా టీఆర్‌ఎస్, జేఏసీ తమ కార్యక్రమంలో మార్పులు చేసుకుని పిల్లల పరీక్షలకు అవకాశం కూడా కల్పించడం జరిగింది.

ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. ఉద్యమం చేసే నిర్వాహకులు ఒప్పుకున్నారు. పిల్లల్లో టెన్షన్ తగ్గిందని ఆనందించాను. ఇంటికొచ్చే సరికి టెలిఫోన్ కాల్స్ వచ్చాయి. సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ నుంచి వచ్చిన వందల మందిని అరెస్టు చేశారని చెప్పారు. నన్ను ఎందుకు మాట్లాడరని కొందరు అడిగారు. సహనం వహించండి! అరెస్టులు చేయరని చెప్పాను.

9వ తేదీ రాత్రి నేను కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాను. రాత్రి 12 గంటల సమయంలో అడుగడుగునా తనిఖీలు చేయటం కళ్లారా చూశాను. అది ఒక్కచోటనే కాదు, పదిచోట్ల నా కారును నిలువెల్లా సోదా చేయడం జరిగింది. నా కారునే కాదు మొత్తం తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి నెలకొని ఉంది.

తెల్లవారగానే మార్చి 10న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వాకింగ్‌కు వెళ్లాను. పరీక్షల రోజున కూడా విశ్వవిద్యాలయం చుట్టూ అవే ముళ్లకంచెలున్నాయి. పరీక్షలు సాఫీగా జరగాలని పిల్లల్లో భయోత్పాతం పోవాలని ఎంత ప్రయత్నం చేసినా ఈ భయంకర పరిస్థితి తప్పలేదు. ఇంటర్ పిల్లలు ఎన్నో ఇబ్బందులుపడ్డారు. కొందరు ఇంటర్ పిల్లల్ని కూడా అరెస్ట్ చేశారు. తల్లిదండ్రులను కూడా అనుమతించడం లేదని కొందరు ఫోన్లు చేశారు. ఏది కాకూడదని తలచానో అదే జరిగింది. పిల్లలు పరీక్ష రాశారు. కానీ 10 వేల పైచిలుకు విద్యార్థులు పరీక్ష రాయలేక పోయారు. పరీక్షకు ఒత్తిళ్లమధ్య హాజరైన విద్యార్థి ఏం రాయగలుగుతారో నాకు తెలుసు. ఏదో పరీక్షలు జరిపామని ప్రభుత్వానికి సంతోషమా? జేఏసీ, టీఆర్‌ఎస్ ప్రోగ్రాంలను జరగనీయకుండా ఆపగలిగామని అహంభావమా? పరీక్షలు ఎవరి కోసం? ప్రభుత్వ గౌరవం కోసమా? పిల్లల భవిష్యత్తుకా? పిల్లలు పరీక్షలు రాసి వచ్చామన్న సంతోషాన్ని చూడాలా? లేక పోలీసుల ప్రవర్తనతో వారి మొఖాల మీద అసహనం చూడాలా?

ఇంటర్ పరీక్ష అయిపోయింది. మధ్నాహ్నం 1 గంట నుంచి ట్యాంక్‌బండ్‌పై రెండవ అధ్యాయం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సాధన పరీక్ష మొదలైంది. ఆ సమయంలో నేనప్పుడు ఒక నవోదయ స్కూల్లో ఉన్నాను. పరీక్షకు ఎలా ప్రిపేర్ కావాలి! ఎంత ప్రశాంతంగా ఉండాలో వారికి చెబుతున్నాను. ఇంకోపక్క పిల్లలు పరుగెత్తుకుంటూ ట్యాంక్ బండ్ వైపుకు వస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ ప్రదర్శనలు జరుగు తున్నాయి. ప్రదర్శనలు చూసి తల్లిదండ్రుల సాయంతో ట్యాంక్‌బండ్ ఎక్కారు. పిల్లలు జమగూడితే వారి వెంబడి నడిచాను. ఒక్కొక్కరూ తమ బాధలను చెప్పుకుంటున్నారు. అవి వినుకుంటూ వారిని సముదా యించుకుంటూ ట్యాంక్‌బండ్‌పై ఆ మూల నుంచి ఈ మూలకు తిరిగాను. ఒక విద్యార్థి ఆత్మహత్యాప్రయత్నం చేసుకున్నాడని ఆ లేఖను చూపించి కొందరు విలపించారు.

విద్యార్థులను ఏం అనకండని పోలీసులను వేడుకున్నాను. దాని తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికొచ్చి టీవీ చూశాక మనస్తాపం చెందాను. ప్రజలకు, రాజకీయ పార్టీలకు మధ్య అగాధం ఏర్పడిందని అనిపించింది. రాజకీయ పార్టీలు విధినిర్వహణలో విఫలమయ్యాయి. అవి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ పౌరజీవనాన్ని కాపాడాలి. ఇలాంటి సంఘటనల నుంచి, ఇలాంటి క్షేత్రాల నుంచి రాజకీయ పార్టీలను దూరంగా ఉంచితే ఏం జరుగుతుందో అదే జరిగింది. ప్రభుత్వం డీజీపీతో సంప్రదించేకన్నా రాజకీయ పార్టీలతో సంప్రదిస్తే బాగుండేది. రాజకీయ పార్టీలు పౌరజీవనాన్ని కాపాడగలుగుతాయి. దానికి ప్రత్యామ్నాయం పోలీసులు కాదని ట్యాంక్‌బండ్‌పై జరిగిన ఘటనలు మరొకసారి తేల్చిచెప్పాయి. ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడుకోవటం కోసం భావితరానికి స్వేచ్ఛా వాతావరణం కల్పించటం కోసం ట్యాంక్ బండ్ సంఘటనపైన ఒక సమగ్ర విచారణ జరిపించండని కోరుతున్నాను. ఇది దోషులను పట్టుకోవడం కోసం కాదు ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడటం కోసం ఆ పని చేయాలి. ఆ విగ్రహాలను పడగొట్టింది కొందరు వ్యక్తులు మాత్రమే. వారు కావాలని వాటిని పడగొట్టలేదు.

ప్రజాస్వామిక భావాలను చెదరగొట్టింది ప్రభుత్వమే. చెదిరి పోయిన ఆలోచనల నుంచి తలెత్తే ఆగ్రహానికి ఎవరూ ఎదురు నిలవలేరు. సహనం బద్దలైతే సంభవించేది ఉపద్రవాలే. సరిగ్గా అదే జరిగింది. ఇందుకు మూలాలు ఇకనైనా ఆలోచిస్తారా?

చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు
Sakshi Daily 26th March 2011.

నిగ్రహం ఆగ్రహమైన వేళ !

కూలిన విగ్రహాలను చూసి ఆగ్రహంతో శివాలూగుతున్న సీమాంధ్ర నాయకులుగానీ, సాహిత్యకారులుగానీ 55 ఏండ్ల నుంచి ఏడుస్తున్న ‘తెలంగాణ తల్లి’ కన్నీళ్లు తుడిసిండ్రా అని అడుగుతున్నం. నోరులేని విగ్రహాలు ఏంజేసినయని అమాయకంగా అడుగుతున్నరు. ఆ విగ్రహాలేంజెయ్యలే. మా స్ఫూర్తి ప్రదాతలుండాల్సిన స్థలాన్ని కబ్జాచేసిండ్రు. ఖాళీ చేస్తలేరు. ఇది సాంస్కృతిక విషాదం అని వగచేముందు, ఆరు వందల మంది తెలంగాణ బిడ్డలు పాణాల్తీసుకున్నా ఎందుకు కనికరం చూపలేదన్నది గుర్తు చేసుకోవాలి. మరికొందరు చీకటిరోజు అంటున్నరు. అరవై ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజలు చీకట్లనే బతుకుతున్నరు. అయినా అదెన్నడు ఆళ్లకు కనబడలే.

శ్రీకాంతాచారి, యాదయ్య, వేణుగోపాలరెడ్డి, పోలీసు కిష్టయ్య సహా వందల సంఖ్యలో తెలంగాణ బిడ్డలు బతుకులు బలిపెడితే సంతాపం కూడా ప్రకటించలేదు. ఇది ‘దుర్మార్గ చర్య’ అంటూ రాష్ట్ర మంత్రులు మూకుమ్మడిగా ప్రకటన చేస్తరు! హైదరాబాద్ గల్లిగల్లిల ఇనుప కంచెలు, బార్బ్‌డ్ వైర్లతో రోడ్లన్నీ అష్ట దిగ్బంధం చేసి అడ్డుకోవడం దుర్మార్గ చర్య కాదా? నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలన్నింటిని మిలటరీకి అప్పచెప్పి, బార్డర్లో మాదిరిగా కాపలా కాయించి కనీసం ద్విచక్ర వాహనాలు కూడా కదలకుండా చేయడం దుర్మార్గం కాదా?
విగ్రహ విధ్వంసం తెలంగాణవాదుల మూర్ఖత్వానికి నిదర్శనం అని సీమాంధ్రులు గగ్గోలు పెడుతుండ్రు! ఇచ్చిన మాటకు కట్టుబడకుండా, తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైతదని ప్రకటించిన 24 గంటల్లోనే రాజీనామా డ్రామాలతో అలజడి సృష్టించి నోటికాడి బుక్కని కాలదన్నింది ఎవరు? ఇన్నిచేసి, ఇప్పుడు ఉద్యమంలో హింస చోటుచేసుకుందని వగల ఏడుపు ఏడుస్తుండ్రు! 2009 డిసెంబర్ 9 నుంచి 23 వరకూ సీమాంధ్రలో తగలబెట్టిన దాంతో పోలిస్తే, తెలంగాణలో జరుగుతున్నది లెక్కలోకే రాదు.

తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేకుండా, కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టుకుండ్రు. మరి తెలంగాణ కోసం కొసదనుక కొట్లాడిన జమలాపురం కేశవరావు, కొమురం భీం విగ్రహాలు ఎందుకు లేవు? ప్రథమాంధ్ర సంస్కర్త కందుకూరి వీరేశలింగం అంటరు! ఆయన్ని మించిన ప్రథమ సంస్కర్త వనపర్తి రాజేశ్వరరావు అని, ఆధారాలతో సహా సురవరం ప్రతాపరెడ్డి నిరూపించిండు. ఆయన ప్రతిమ ఎందుకు లేదు? మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యం ‘యయాతి చరిత్ర’ రాసి, తెలుగు భాషకు హారాన్ని అందించిన పొన్నగంటి తెలగనార్యునికి ట్యాంక్‌బండ్‌పై తావెందుకు లేదు? ‘భాష’ను దేశీ మార్గం పట్టించి, సామాన్యుల ‘సంభాషణ’లకు కావ్యగౌరవం కల్పించిన పాల్కురికి సోమనాథుడు ఎక్కడా కనిపించడెందుకు? సీమాం ధ్రుడు సీఆర్ రెడ్డికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విశ్వవ్యాప్త కీర్తి తీసుకొచ్చిన వైస్‌చాన్సలర్ అలీ యావర్‌జంగ్‌ని ఎందుకు విస్మరించిండ్రు?

తెలంగాణ మహిళల్లో చైతన్యం తీసుకొచ్చిన టీఎన్ సదాలక్ష్మి, జే ఈశ్వరీబాయి, సంగెం లక్ష్మీబాయి, సుగ్రా హుమాయూన్ మీర్జా, చాకలి ఐలమ్మ, మహాలఖా బాయిల విగ్రహాలు ఎక్కడని ప్రశ్నిస్తున్నం. నాటి ప్రభువులను గడగడలాడించిన తెలంగాణ రాబిన్‌హుడ్ సర్వాయి పాపన్న, తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి ప్రాణమిచ్చిన దొడ్డి కొమరయ్య, బ్రిటిష్ రెసిడెన్సీపై ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసిన తుర్రెబాజ్‌ఖాన్, గాయాల్ని గేయాలుగా మార్చిన సుద్దాల హనుమంతు, తెలంగాణ ఆర్తికి ప్రతీకలు కొత్వాలు వెంకటరామారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి కృష్ణమాచార్య, రావి నారాయణరెడ్డి, బత్తిని మొగిలయ్యగౌడ్, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డివంటి వారిని సీమాంధ్రుల పాలన పూర్తిగా విస్మరించింది. వారిని స్మరించుకోవాల్సిన సమయం ఆసన్నమయింది.

అన్ని రంగాలకు చెందిన సీమాంధ్రులంతా ఒక్కటై, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి కంకణం కట్టుకున్నరు. అందుకే, తెలంగాణ ఉద్యమంలోకి నక్సలైట్లు, సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డారని దుష్ర్పచారం చేస్తున్నరు. నిజానికి ‘మిలియన్ మార్చ్’ను శాంతియుతంగా జరుపుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చివుంటే, ప్రజల్లో భావోద్వేగాలు తీవ్రమయ్యేవి కావు. అనుమతి నిరాకరించిన ఫలితంగా ఉద్రిక్తతలు చోటుచేసుకుని విగ్రహాల విధ్వంసానికి తోవతీసింది. ప్రణాళికాబద్ధంగా విగ్రహాల కూల్చివేత సాగివుంటే, 1969 ఉద్యమంలో 369 మందిని బలితీసుకున్న కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం మిగిలేదా?

సంగిశెట్టి శ్రీనివాస్ తెలంగాణ హిస్టరీ సొసైటీ
Sakshi Daily, 26th March 2011.