Tuesday, June 16, 2009

గాయపడిన తెలంగాణ



నిజమే. తెలంగాణ గుండె గాయపడింది. క్షతగాత్ర తెలంగాణ. మరోసారి నిలువునా మోసపోయిన తెలంగాణ. ఇంటి మనుషులు, పరాయి మనుషులతో రెండందాలా దగాపడింది తెలంగాణ. కకావికలై, ఛిద్రుపలైన గుండె గాయం పాతది. అది మాననిది. ఇప్పుడిక ఏలిక పూర్తి విద్వేషంతో, పూర్తి అసహనంతో, ఏమీ దాచుకోకుండానే ప్రకటించా డు.



అవునూ.. 'ఏమనుకుంటున్నారు మమ్మల్ని'.. 'మేము'గా ప్రకటించుకున్న ముఖ్యమంత్రి దాచుకున్నదేమీ లేదు. ఆయన కోస్తాంధ్ర, రాయలసీమ రియల్టర్ల, పెత్తందార్ల, పెట్టుబడిదారు ల ప్రతినిధిగా అహంకారాన్ని ప్రదర్శించడంలో కొత్తలేదు. వింతకూడా లేదు. తెలంగాణ ఆత్మమీద చివరాఖరి దెబ్బకొట్టడంలో ఏలిక విపరీతమైన ప్రాంతీయ దురభిమానమూ ప్రకటించడంలో ఆశ్చర్యమూలేదు. అంతా ఖుల్లమ్‌ఖుల్లా. ఉన్నదున్నట్టే. దాచుకున్నదీ లేదు. మరుగునపరిచిందీ లేదు. ఆ మాట కొస్తే ఏ మాటలు చెప్పి అయిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చా రో? ఆ మాటలు మింగాల్సిన పనికూడా లేదు.



తెలంగాణ ఆత్మాభిమానం గురించీ, తెలంగాణకు దక్కనివాటి గురించి, దక్కాల్సిన వాటి గురించి, తెలంగాణకు తరతరాలుగా అంతర్గత వలస ఆధిపత్యం వల్ల జరుగుతున్న అన్యాయాల గురించీ, సహేతుకంగా, స్పష్టంగా, కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతున్న, మాట్లాడాలనుకుంటున్న, వీధులకు ఎక్కాలనుకుంటున్న, ఉద్యమించాలనుకుంటున్న అచ్చ తెలంగాణవాదులందరికీ శాసనసభ సాక్షిగా వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒక స్పష్టమైన, సూటిగా ఉన్న సందేశం పంపించారు.



బహుశా అది తెలంగాణవాదులకు ఒక హెచ్చరిక. భయం పుట్టడానికి అది ఒక ముందు సూచిక. ఇక ముందు తెలంగా ణ, గిలంగాణ జాన్తానై. నేనే తెలంగాణ. తెలంగాణ నావెంట ఉంది అన్నారు వై.ఎస్ అదీ విషాదం. ఎవరైతే తెలంగాణను మాయజేసి, మోసంజేసి అయిదేండ్ల కిందట అధికారంలోకి రావడానికి ఒక పావుగా వాడుకున్నారో? ఎవరైతే మలి తెలంగాణ పోరాటానికి తుది పరిష్కారంగా తెలంగాణ కనుచూపుమేరలో కనబడ్తుందన్న ఆశలు రేపారో? ఎవరైతే తెలంగాణ మాటను అనీ అనకుండా, కనీ కనపడకుండా, వినీవినపడకుండా ఉచ్ఛరించి, తెలంగాణ ఓట్లతో అధికారంలోకి వచ్చారో ఆయన.



ఆ తర్వాత అదే తెలంగాణ ఆకాంక్షలపై అడుగులేసి తొక్కుకుంటూ, తోసుకుంటూ ఉల్టా బనాయించారో ఆయన ఇవ్వాల్టి తెలంగాణకు పెద్దదిక్కు కావడం మరీ విషాదం. ఎందువల్ల? తెలంగాణ ఆకాంక్షలను, ఉవ్వెత్తున లేచినిలబడిన ఆశల మోసులను అణగార్చిందెవరు? తెలంగాణను మళ్లీ ఒకసారి అంగడి సరుకుగా అమ్ముకుని త్యాగాల పునాదుల మీద స్వార్థాల బిల్డింగులు కట్టుకున్నదెవరు? జీవన్మరణ సమస్యలను, ఉద్వేగాలను, త్యాగాల వారసత్వాన్ని, నెత్తురునూ, కలికలి మనసులు పడిన దుఃఖపు కన్నీళ్లను అమ్ముకున్నదెవ రు? వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి అట్లా ఉండకుంటే ఆశ్చర్యపోవాలి. అయినా కొత్తేమీ లేదు.



సిగ్గులేకుండా, కించిత్ ఆత్మాభిమా నం లేకుండా చెప్పుకింద నలిగిన వాళ్లలా గా, బానిసల్లాగా, వెన్నెముకలు లేని వానపాములలాగా కనీస అభిజాత్యం లేని, కనీసం స్పృహలేని ఒక వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి అనుచర మంద గురించీ, మంత్రుల గురించీ, ఎమ్మెల్యేల గురించీ మాట్లాడడం లేదు. కానీ,..వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ పట్ల ద్వేషం వెళ్లగక్కడం, తెలంగాణకు అడ్డంపొడుగూ నిలబడి అడ్డుకోవడం, కాలికేస్తే మెడకేయడం, రక్తాలు పారిస్తానని చెప్పించడం, ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగి 'మేము ఎట్లా కనపడ్తున్నామనడంలో కొత్తేమీ లేదు.



నిజానికి వై.ఎస్. అట్లా మాట్లాడకపోతే ఆశ్చర్యపోవాలి. కానీ.. ఉధృతంగా, ఉవ్వెత్తున లేచిన తెలంగాణ మలిపోరాటాన్ని ఇంతటి క్షతగాత్ర చేసిందెవరు? మూడువందలా డెబ్భైమంది ప్రాణాలను అర్పించిన వీరు ల త్యాగాల ఫలితాన్ని అలనాడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి బంగారు పళ్లెంలో పెట్టి ఇందిరాగాంధీ పాదాల చెంతపెట్టా డు. నిజమే చెన్నారెడ్డి స్వయంగా తెలంగాణ ద్రోహిగా బదనా మ్ అయ్యారు. అది ఆయనకే పరిమితమయింది.


కానీ, మోసా లు చవిచూసీ చూసీ, ఒక్క ఒప్పందమూ అమలుగాక, రాసుకున్న ఒక్క సూత్రమూ పాటించక, తెలంగాణ వనరుల దోపిడి ఒక్కటీ ఆగక, ఉల్టా ఉనికికి, సంస్కృతికీ, భాషకు, యాసకు కూడా గడ్డురోజులొచ్చిన వివక్షారూపాల పరాకాష్ట నుంచి బుద్ధి జీవుల శ్రమ నుంచి లేచి నిలబడింది మలి తెలంగా ణ. చీమలు పుట్టలు పెట్టాయి. రెండో ఉద్యమంలో పామెట్లా చొరబారింది. ఆరెండు తలల పాము తెలంగాణ మలి ఉద్యమాన్ని ఎట్లా విచ్ఛిన్నం చేసింది.



అది తన స్వార్థ ప్రయోజనాల కోసం, కుటుంబ ప్రయోజనాల కోసం, దొర పోకడల కోసం, తన చిత్త చాపల్యాల కోసం, నోటి తో నిప్పులు కక్కే మాటలు చెబుతూ, నొసటితో తెలంగాణ ప్రజల భవిష్యత్తును వెక్కిరిస్తూ...తెలంగాణ ఉద్యమంమీద ఒక బలహీనతను చిమ్మింది. అదీ తేడా. రెండో విడత మోసకారి ఇప్పటికీ ఒక ఉద్యమకారుడు. ఇప్పటికీ అతను తలదీసి మొలేసే మొనగాడు.



ఇప్పటికీ అత ను తెలంగాణ మంత్రాలు వల్లించే మాయల మరాఠీ మంత్రకాడు. ఇప్పుడు మోసగాడు మరోరూపంలో తెలంగాణ గుండెకు గాయం చేసినాడు. ఏ మోసాల వల్ల తెలంగాణ అలనాడు క్షతగాత్ర అయిందో? అదే మోసం వల్ల ఇవ్వాళ్ల తెలంగాణ నడివీధిలో విద్వేషాలను, తిట్లనూ, దూషణలను భరి స్తూ దీనయై నిలుచున్నది. ఎవరిచ్చారీ సావకాశం.



నలభై ఏండ్ల తర్వాత చరిత్ర విషాదాంతంగానూ, వైఫల్యంగానూ ఎందుకు నిలబడింది. ఇప్పుడిక మొత్తం తెలంగాణను తాకట్టుపెట్టి ఇలాంటి అచేతన స్థితికి తెచ్చిన ఒక నాయకుడి గురించి మాట్లాడండి. శషభిషలు వద్దు. తెలంగాణ అంటే అతనికొచ్చిన పది సీట్లేనా? తెలంగాణ అంటే అతను వాగే నాలుగు మాటలేనా? తెలంగాణ అంటే అతను, అతను ప్రోది చేసిన అచేతన, అడుగు కదలని సిద్ధాంతాలేనా?



తెలంగాణ అంటే కాళ్లూపుకుంటూ బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకుంటూ, మైకుల ముందు వీరాలాపనలు, ప్రేలాపనలు చేస్తూ, బేరాలాడుతూ, సుఖభోగాలు, లాలసలు, అనుభవిస్తూ, కుటుంబా న్ని పెంచి పోషిస్తూ, ఇంత ఉద్వేగపూరితమైన అంశాన్ని తాకట్టుపెట్టిన ఆ నేత కాదా కారణం. ఇప్పుడిక తెలంగాణవాదాన్ని అమ్మి, అచేతనం చేసిన ఆ నేతను చరిత్ర చెత్తబుట్టలోకి విసరండి.



నిజమే తెలంగాణ గుండెగాయపడింది. అయితే అది రెండు విధాలుగా కోస్తాంధ్ర, రాయలసీమ పెత్తందారుల ప్రతినిధిగా 'మేము' అని ప్రకటించుకున్న ఒక ముఖ్యమంత్రి అంద రి అసెంబ్లీలో మాట్లాడిన మాటలవల్ల ఆయనకు గొడుగు పడ్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతల వల్లనూ మరోవైపు తెలంగాణను అమ్ముకుంటున్న ఒక నయవంచన నాయకత్వం వల ్లనూ... అవును తెలంగాణ గుండెగాయపడింది.



ఇది ఇంతటి తో ముగుస్తుంది? కానీ తెలంగాణ గుండెకయిన గాయం మాటో? అది ఎట్లా రేగుతుందో? ఎవరు చెప్పగలరు. మిస్టర్ చీఫ్ మినిస్టర్... మీరు మాకు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి అవునా? కాదా? ఇది ఒక తీరని సందేహం.


- అల్లం నారాయణ

Thursday, June 04, 2009

ఆదాబ్ హైదరాబాద్ - లోచన్‌


ఎంతైనా నువ్వు గ్రేట్‌

నీ విజన్‌ గ్రేట్‌

హైద్రాబాద్‌ చుట్టూ అల్లుకున్న నీ అభిమానం గ్రేట్‌

మరి ఇప్పుడు నీ విదేశీగానంలో ఎన్ని గణాంకాలో

హైద్రాబాద్‌ అదబ్‌నీ

ఆత్మీయ హస్తాన్నీ అందుకోలేకపోయావ్‌

ఈ రంగుల గుల్‌దస్తాలో యిమడలేకపోయావ్‌

బాగె ఆమ్‌ పూలవనంలో పురుగులు చొరబడ్డాయా?

ఇక్కడి ఆబెహవాలో ఇంత కాలుష్యమెప్పుడూ లేదు

విశ్వాసం నిండిన యిక్కడి గాలిలో

విదేశీ బక్వాస్‌ నింపకు

అమ్మపాలు అమృతమౌతాయని తెలుసు

విషమై ద్వేషమై కుదరనిరోగమౌతుందని ఎవరికి తెలుసు?

ద్వేషం నాష్తా అయిన వాడికి

దోస్తానా రుచి ఏం తెలుసు

ఇక్కడి ఒక్క ఇరానీచాయ్‌ చుట్టూ

ఎన్ని స్నేహ సౌరభాలు

ఒక్క బిర్యానీ మనసునిండా

ఎంత బిరాదరీ ఘుమఘుమలు

ఆకాశం గుండెలు తాకే ఖవ్వాలీ

లుకమనీయ కవితా సాయంత్రాలూ..

షామె గజల్లూ.. భజనలూ

భాయీచారాలూ..

వేదనలు వైరుధ్యాలెన్నున్నా

అనుబంధాల నగరం హైద్రాబాద్‌

రంగుల హరివిల్లు యీ యిల్లు

మక్దూమ్‌ మల్లెపందిరి కింద

మంట పెట్టేవాడికి

మనసు మమకారాల

మాటేమి తెలుసు?

ఇక్కడి జీవధారలు

తరలించుకు పోయిన పైరేట్లెవ్వరు?

సహజ సంపన్న తెలంగాణ తల్లిని

చింపిరి గుడ్డల్లో నిలిపిన

వంచనా శిల్పులెవరు?

ప్రాణాన్ని మించిన

ఆమె అభిమానాన్ని అవహేళన చేసిందెవ్వరు?

నీవు తిన్నింటి వాసాలు లెక్కపెట్టవు

తగల బెడతావుద్వేషమే మాకు విదేశీయం

దోపిడీ యిక్కడ బహిషారం

ఇంకా కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల కాళ్ల కింద నలగని

ఈ గరీబ్‌ గల్లీల్లో గలత్‌ నడకలు నడవకు..

గందగీ నింపకు

దోస్తానా దారుల్లో వేర్పాటు ముళ్ల కంచెలు నాటకు

మనసున్న నగరమిది

మొహబ్బత్‌కి దునియాఁ యిది

ఇక్కడి చౌరస్తాలో నిలబడి ధృతరాష్ట్రుని చేతులు చాచకు

నువ్వెన్ని గొళ్ళాలు పెట్టినా

ఖులాదిల్‌ కా దర్వాజా మాది

ఆమ్‌ ఆద్మీ ఆత్మీయ సౌందర్యం హైద్రాబాద్‌

వేదనలు వైరుధ్యాలెన్నున్నా

వైవిధ్యాల హరివిల్లు యీ యిల్లు

ఇంత అందమైన ఆత్మీయ నగరంలో

అభివృద్ధికి అందని అన్‌టచెబుల్స్‌ ఎందరో

ఈ కూడళ్ళు ఆకలికళ్ళ నెగళ్ళు

చాచిన హస్తాలు యిక్కడి రస్తాలు

మూసీనది తీరం బురదలో కూరుకుపోతున్న బతుకులు

రాత్రుళ్ళు యీ నగరం ఫుట్‌పాత్‌ల మీద

ఆకలి ఆరేసిన అస్థిపంజరాలు

బడుగుల ప్రత్యేక బలివితర్దులు ఎన్నెన్నో భోలక్‌పూర్‌లు

బడుగు బతుకుల యీ బడబాగ్ని కడుపులో దాచుకుని

బంజారా గుదిబండను మోస్తున్న అమ్మ హైద్రాబాద్‌

అందరి ఆషియానా హైద్రాబాద్‌

అయ్యా! మళ్ళీ చెపుతున్నా

మఖ్దూమ్‌ చల్లని మల్లె పందిరికింద మంట పెట్టకు

తెలంగాణా తగ్దీర్‌తో ఆడుకోకు

తెలంగాణా కోపాన్ని తట్టి లేపకు

ఈ రతనాల వీణ తీగలు తెంచకు

రక్తగీతమై అంతా రాజుకొంటుంది

ఇక్కడ యీ బోనాల వీధుల్లో..

ఈద్‌ ముబారక్‌ ఇఫ్తార్‌ విందుల్లో

భోలాల, దిల్‌ వాలాల మనసుల్లో

వేరు బంధాల బీజాలు నాటకు

తెలంగాణా తెరువుకు రాకు

ఇక్కడి బతుకుల తెర్లు చేయకు

అన్నీ అమ్ముకొని సొమ్ము చేసుకునే వాడు

అమ్మను కూడా నమ్మడు కదా

అవును - తెలంగాణ తెర్లయింది

దొంగలు పడ్డ యిల్లయింది

తెలంగాణావాడు - నీకు దివానాగాడు

చీల్చడమే తప్ప కూర్చడం రాదు కొందరికి

హైద్రాబాద్‌ అందమంతా

ఆమ్‌ఆద్మీ ఆత్మీయతలో ఉంది

నీ నవ్వుల షార్ప్‌ వెపన్‌తో

అనుబంధాల అంతస్సూత్రాలు తెంచకు

హైద్రాబాద్‌ నీకు అతిపెద్ద ఆర్ధిక మండలి కదా

నీవేమైనా కొనగల వేమో కాని

తెలంగాణకి వెల కట్టలేవు

అబద్ధాల మీద ఆయుధాల మీద బతికేవాడు

అమెరికా వాడైనా అనంతపురం మనిఫైనా

మనిషి రక్తం రుచి మరిగిన వాడే కదా

విదేశీయం ఆహా!

ఇది ఎన్నికల ఎత్తుగడ అని లైట్‌గా తోసేయకు

నీ మనసు కక్కిన నిజమిది

నీ నరాల్లో పారే నైజమిది

ఆదాబ్‌ హైద్రాబాద్‌

అనురాగాల హైద్రాబాద్‌

వేదనలు వైరుధ్యాలెన్నున్నా

అనుబంధాల నగరం హైద్రాబాద్‌

-ఆంధ్రజ్యోతి సౌజన్యంతో