Tuesday, June 16, 2009

గాయపడిన తెలంగాణ



నిజమే. తెలంగాణ గుండె గాయపడింది. క్షతగాత్ర తెలంగాణ. మరోసారి నిలువునా మోసపోయిన తెలంగాణ. ఇంటి మనుషులు, పరాయి మనుషులతో రెండందాలా దగాపడింది తెలంగాణ. కకావికలై, ఛిద్రుపలైన గుండె గాయం పాతది. అది మాననిది. ఇప్పుడిక ఏలిక పూర్తి విద్వేషంతో, పూర్తి అసహనంతో, ఏమీ దాచుకోకుండానే ప్రకటించా డు.



అవునూ.. 'ఏమనుకుంటున్నారు మమ్మల్ని'.. 'మేము'గా ప్రకటించుకున్న ముఖ్యమంత్రి దాచుకున్నదేమీ లేదు. ఆయన కోస్తాంధ్ర, రాయలసీమ రియల్టర్ల, పెత్తందార్ల, పెట్టుబడిదారు ల ప్రతినిధిగా అహంకారాన్ని ప్రదర్శించడంలో కొత్తలేదు. వింతకూడా లేదు. తెలంగాణ ఆత్మమీద చివరాఖరి దెబ్బకొట్టడంలో ఏలిక విపరీతమైన ప్రాంతీయ దురభిమానమూ ప్రకటించడంలో ఆశ్చర్యమూలేదు. అంతా ఖుల్లమ్‌ఖుల్లా. ఉన్నదున్నట్టే. దాచుకున్నదీ లేదు. మరుగునపరిచిందీ లేదు. ఆ మాట కొస్తే ఏ మాటలు చెప్పి అయిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చా రో? ఆ మాటలు మింగాల్సిన పనికూడా లేదు.



తెలంగాణ ఆత్మాభిమానం గురించీ, తెలంగాణకు దక్కనివాటి గురించి, దక్కాల్సిన వాటి గురించి, తెలంగాణకు తరతరాలుగా అంతర్గత వలస ఆధిపత్యం వల్ల జరుగుతున్న అన్యాయాల గురించీ, సహేతుకంగా, స్పష్టంగా, కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతున్న, మాట్లాడాలనుకుంటున్న, వీధులకు ఎక్కాలనుకుంటున్న, ఉద్యమించాలనుకుంటున్న అచ్చ తెలంగాణవాదులందరికీ శాసనసభ సాక్షిగా వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒక స్పష్టమైన, సూటిగా ఉన్న సందేశం పంపించారు.



బహుశా అది తెలంగాణవాదులకు ఒక హెచ్చరిక. భయం పుట్టడానికి అది ఒక ముందు సూచిక. ఇక ముందు తెలంగా ణ, గిలంగాణ జాన్తానై. నేనే తెలంగాణ. తెలంగాణ నావెంట ఉంది అన్నారు వై.ఎస్ అదీ విషాదం. ఎవరైతే తెలంగాణను మాయజేసి, మోసంజేసి అయిదేండ్ల కిందట అధికారంలోకి రావడానికి ఒక పావుగా వాడుకున్నారో? ఎవరైతే మలి తెలంగాణ పోరాటానికి తుది పరిష్కారంగా తెలంగాణ కనుచూపుమేరలో కనబడ్తుందన్న ఆశలు రేపారో? ఎవరైతే తెలంగాణ మాటను అనీ అనకుండా, కనీ కనపడకుండా, వినీవినపడకుండా ఉచ్ఛరించి, తెలంగాణ ఓట్లతో అధికారంలోకి వచ్చారో ఆయన.



ఆ తర్వాత అదే తెలంగాణ ఆకాంక్షలపై అడుగులేసి తొక్కుకుంటూ, తోసుకుంటూ ఉల్టా బనాయించారో ఆయన ఇవ్వాల్టి తెలంగాణకు పెద్దదిక్కు కావడం మరీ విషాదం. ఎందువల్ల? తెలంగాణ ఆకాంక్షలను, ఉవ్వెత్తున లేచినిలబడిన ఆశల మోసులను అణగార్చిందెవరు? తెలంగాణను మళ్లీ ఒకసారి అంగడి సరుకుగా అమ్ముకుని త్యాగాల పునాదుల మీద స్వార్థాల బిల్డింగులు కట్టుకున్నదెవరు? జీవన్మరణ సమస్యలను, ఉద్వేగాలను, త్యాగాల వారసత్వాన్ని, నెత్తురునూ, కలికలి మనసులు పడిన దుఃఖపు కన్నీళ్లను అమ్ముకున్నదెవ రు? వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి అట్లా ఉండకుంటే ఆశ్చర్యపోవాలి. అయినా కొత్తేమీ లేదు.



సిగ్గులేకుండా, కించిత్ ఆత్మాభిమా నం లేకుండా చెప్పుకింద నలిగిన వాళ్లలా గా, బానిసల్లాగా, వెన్నెముకలు లేని వానపాములలాగా కనీస అభిజాత్యం లేని, కనీసం స్పృహలేని ఒక వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి అనుచర మంద గురించీ, మంత్రుల గురించీ, ఎమ్మెల్యేల గురించీ మాట్లాడడం లేదు. కానీ,..వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ పట్ల ద్వేషం వెళ్లగక్కడం, తెలంగాణకు అడ్డంపొడుగూ నిలబడి అడ్డుకోవడం, కాలికేస్తే మెడకేయడం, రక్తాలు పారిస్తానని చెప్పించడం, ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగి 'మేము ఎట్లా కనపడ్తున్నామనడంలో కొత్తేమీ లేదు.



నిజానికి వై.ఎస్. అట్లా మాట్లాడకపోతే ఆశ్చర్యపోవాలి. కానీ.. ఉధృతంగా, ఉవ్వెత్తున లేచిన తెలంగాణ మలిపోరాటాన్ని ఇంతటి క్షతగాత్ర చేసిందెవరు? మూడువందలా డెబ్భైమంది ప్రాణాలను అర్పించిన వీరు ల త్యాగాల ఫలితాన్ని అలనాడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి బంగారు పళ్లెంలో పెట్టి ఇందిరాగాంధీ పాదాల చెంతపెట్టా డు. నిజమే చెన్నారెడ్డి స్వయంగా తెలంగాణ ద్రోహిగా బదనా మ్ అయ్యారు. అది ఆయనకే పరిమితమయింది.


కానీ, మోసా లు చవిచూసీ చూసీ, ఒక్క ఒప్పందమూ అమలుగాక, రాసుకున్న ఒక్క సూత్రమూ పాటించక, తెలంగాణ వనరుల దోపిడి ఒక్కటీ ఆగక, ఉల్టా ఉనికికి, సంస్కృతికీ, భాషకు, యాసకు కూడా గడ్డురోజులొచ్చిన వివక్షారూపాల పరాకాష్ట నుంచి బుద్ధి జీవుల శ్రమ నుంచి లేచి నిలబడింది మలి తెలంగా ణ. చీమలు పుట్టలు పెట్టాయి. రెండో ఉద్యమంలో పామెట్లా చొరబారింది. ఆరెండు తలల పాము తెలంగాణ మలి ఉద్యమాన్ని ఎట్లా విచ్ఛిన్నం చేసింది.



అది తన స్వార్థ ప్రయోజనాల కోసం, కుటుంబ ప్రయోజనాల కోసం, దొర పోకడల కోసం, తన చిత్త చాపల్యాల కోసం, నోటి తో నిప్పులు కక్కే మాటలు చెబుతూ, నొసటితో తెలంగాణ ప్రజల భవిష్యత్తును వెక్కిరిస్తూ...తెలంగాణ ఉద్యమంమీద ఒక బలహీనతను చిమ్మింది. అదీ తేడా. రెండో విడత మోసకారి ఇప్పటికీ ఒక ఉద్యమకారుడు. ఇప్పటికీ అతను తలదీసి మొలేసే మొనగాడు.



ఇప్పటికీ అత ను తెలంగాణ మంత్రాలు వల్లించే మాయల మరాఠీ మంత్రకాడు. ఇప్పుడు మోసగాడు మరోరూపంలో తెలంగాణ గుండెకు గాయం చేసినాడు. ఏ మోసాల వల్ల తెలంగాణ అలనాడు క్షతగాత్ర అయిందో? అదే మోసం వల్ల ఇవ్వాళ్ల తెలంగాణ నడివీధిలో విద్వేషాలను, తిట్లనూ, దూషణలను భరి స్తూ దీనయై నిలుచున్నది. ఎవరిచ్చారీ సావకాశం.



నలభై ఏండ్ల తర్వాత చరిత్ర విషాదాంతంగానూ, వైఫల్యంగానూ ఎందుకు నిలబడింది. ఇప్పుడిక మొత్తం తెలంగాణను తాకట్టుపెట్టి ఇలాంటి అచేతన స్థితికి తెచ్చిన ఒక నాయకుడి గురించి మాట్లాడండి. శషభిషలు వద్దు. తెలంగాణ అంటే అతనికొచ్చిన పది సీట్లేనా? తెలంగాణ అంటే అతను వాగే నాలుగు మాటలేనా? తెలంగాణ అంటే అతను, అతను ప్రోది చేసిన అచేతన, అడుగు కదలని సిద్ధాంతాలేనా?



తెలంగాణ అంటే కాళ్లూపుకుంటూ బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకుంటూ, మైకుల ముందు వీరాలాపనలు, ప్రేలాపనలు చేస్తూ, బేరాలాడుతూ, సుఖభోగాలు, లాలసలు, అనుభవిస్తూ, కుటుంబా న్ని పెంచి పోషిస్తూ, ఇంత ఉద్వేగపూరితమైన అంశాన్ని తాకట్టుపెట్టిన ఆ నేత కాదా కారణం. ఇప్పుడిక తెలంగాణవాదాన్ని అమ్మి, అచేతనం చేసిన ఆ నేతను చరిత్ర చెత్తబుట్టలోకి విసరండి.



నిజమే తెలంగాణ గుండెగాయపడింది. అయితే అది రెండు విధాలుగా కోస్తాంధ్ర, రాయలసీమ పెత్తందారుల ప్రతినిధిగా 'మేము' అని ప్రకటించుకున్న ఒక ముఖ్యమంత్రి అంద రి అసెంబ్లీలో మాట్లాడిన మాటలవల్ల ఆయనకు గొడుగు పడ్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతల వల్లనూ మరోవైపు తెలంగాణను అమ్ముకుంటున్న ఒక నయవంచన నాయకత్వం వల ్లనూ... అవును తెలంగాణ గుండెగాయపడింది.



ఇది ఇంతటి తో ముగుస్తుంది? కానీ తెలంగాణ గుండెకయిన గాయం మాటో? అది ఎట్లా రేగుతుందో? ఎవరు చెప్పగలరు. మిస్టర్ చీఫ్ మినిస్టర్... మీరు మాకు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి అవునా? కాదా? ఇది ఒక తీరని సందేహం.


- అల్లం నారాయణ

7 comments:

Kathi Mahesh Kumar said...

తెలంగాణా రాకపోవడానికి కారణం వై.ఎస్. కాదు.కేసీఆర్.

Krishna K said...

"మమ్ములను ఏమ"నుకొంటున్నారు అంటూ, ఓ ముఖ్యమంత్రిగా శామ్యుల్ రెడ్డి మాట్లాడటం తప్పే. అందుకు తెలంగాణా వాళ్లె కాదు, ఆ అహంకారిని ఆ సీట్లో కూర్చోపెట్టిన ప్రతి ఒక్కరూ భాదపడాలసిందే

ఇక, చీమల పుట్టలో ఓ పామో, దొరో చేరింది అని నెత్తి నోరు బాదుకోవటమే నాకు నవ్వు తెప్పిస్తుంది. ఆ దొరకు కళ్లేలు ఇచ్చినప్పుడు తెలియలేదా, అతను కేవలం తనక మంత్రి పదవి రాక, ఈ వాదాన్ని భుజాన వేసుకొన్నాడు అని.

ఎంతో చదువుకొన్న, విదేశాలలో ఉన్న తెలంగాణా జనాలు, ఈ తాగుబోతు కంటే ఇంకెవరూ దొరకనట్లు, విరాళాలు వసూలు చేసి ఇచ్చినప్పుడు తెలంగాణా వాళ్ల తెలివితేటలు, ఒక సారి దెబ్బతిన్న అనుభవం ఏమయ్యింది?

ఇప్పుడు శామ్యుల్ రెడ్డి వాచాలత చూసి గుండెలు బాదుకొంటన్నవాళ్లెవరూ, ఆ దొర ఇంతకంటే దరిద్రమైన వాచాలత చూపినప్పుడు కనీసం, ఇలా వాగుతున్నాడేమిటి అని గొణగనైన గొణిగినట్ట్లు ఎక్కడా గుర్తుకు రావటం లేదే!!

సోనియమ్మను తెలంగాణా దేవత అన్నప్పుడెమీ, మరి మన సమ్మక్క సారెక్కలను ఏమి చెద్దాం అని ప్రశ్నించిన తెలంగాణా మేధావులు ఎవరైనా ఉన్నరా?

అంతెందుకు, నిజాం దురాగతాలకు బలయిన వాళ్లు ఇంకా మన మధ్యే ఉండగా, పోరాడి రక్తం చిందించిన వీరులు అక్కడక్కడ ఇంకా బ్రతికే ఉండగా, నిజాం ను కీర్తించినప్పుడు, రక్తం సలసలా కాగే తెలంగాణా వీరులు ఎక్కడ దాకున్నరబ్బా?

ఇప్పుడు మీరు విమర్శించాల్సింది ఆ దొరనా, లేక మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్న తెలంగాణా జనాలనా? తెలంగాణా జనాలు గోదావరి ఈదటానికి కుక్క తోక పట్టుకోవటమే మార్గం అనుకొన్నంత కాలం, మీ గాయాలకు తెలంగాణా బకరా, జనాలే కారణం అని మీ బాణాలు వాళ్ల మీద ఎక్కుపెట్టక, ఈ దొర మీదో, శామ్యెల్ రెడ్డి మీదో ఎక్కు పెట్టటం మాత్రం పెద్ద ఉపయోగం లేని పనేమో అలోచించండి.

Unknown said...

తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్టం పట్ల ఆసక్తి లేదనడానికి తె.రా.స. ఓటమే నిదర్శనం. తె.రా.స. /కేసీయార్ గెలిచినప్పుడేమో "అదిగో సెంటిమెంటు, ఇదిగో సెంటిమెంట్" అని ఊదరగొట్టారు. ఇప్పుడు తె.రా.స ఓడిపోతే మాత్రం అది సెంటిమేంటు ఓడినట్టు కాదంట. సెంటిమెంటు బలంగానే ఉందంట. నిరసనల్లా కేసీయార్ పట్లనే నంట. ఎవరు నమ్ముతారు ? ఆరోజు మీరంతా కేసీయార్ ని ఒక పోరాటయోధుడుగా చూసినోళ్ళే. అతని మీద ఈగ వాలకుండా కాసుకొచ్చినోళ్ళే. అతను విఫలమయ్యేసరికి "కేసీయార్ తెలంగాణ ద్రోహి, అతని నాయకత్వం వద్దు" అని ఘోష ! ప్రత్యేక తెలంగాణ రాష్టం వద్దన్న ప్రతివాణ్ణి తెలంగాణ శత్రువునీ, తెలంగాణ ద్రోహినీ చేసేశారు. ప్రత్యేకరాష్టం తప్ప ఆంధ్రావాళ్ళకి, తెలంగాణవాళ్ళకి మాట్లాడుకోవడానికి కామన్ ఐటేమ్స్ ఏమీ లేవా ?

తెలంగాణ ఉద్యమం పని అయిపోయింది. పడిపోయిన ఏనుగుని లేవదీయడం ఎవరివల్లా కాదు. ముగిసిపోయిన చిట్టచివరి తెలంగాణ ఉద్యమానికి ఇవే నా బాష్పాంజలులు.

naveen achari said...

తెలంగాణ రాష్ట్ర అకాంక్ష ను టీఆరెస్ కు వచ్చిన సీట్ల తో ముది పెట్టాడం మీ విషయ పరిజ్ఞానాన్ని చెప్తుంది. తెలంగాణ అవసరమా కాదా అన్నది చర్చించ్లేని మీ అసమర్ధత ను కప్పిపుచ్చుకోవడానికి మీరు పడే కష్టాలు చూస్తే నవ్వొస్తుంది. టీఆరెస్ అంటే మొత్తం టెలంగాణ కాదు అని మీవంటి 'చరిత్ర కారులకు ' తెలియకపోవడం మా దురదృష్టం. టీఆరెస్ ను వ్యతిరేకించే టెలంగాణ సంస్థలు మా దగ్గర చాలా ఉన్నాయి. టీఆరెస్ కు తక్కువ సీట్లు రావడానికి కారణం ఆ పార్టీ నేతల పనితీరు బాగా లేకపోవడమే. ఆ పార్టీలో కూడా పని చేసిన వారికి మంచి మెజరిటీ వచ్చింది. రాష్ట్రం లోనే అత్యంత మెజారిటీ తో గెలిచింది వైయస్. ఆయన పులివెందులకు/ఇడుపులపాయ కు ఎన్ని తరలించుకు పోయాడొ తెల్సు. ఆయన తర్వాత ఎక్కువ మెజారిటీ వచ్చింది ఎవరికో తెల్సా. తెరాస నాయకుడు హరీశ్ రావు కు. ఆయనకొచ్చిన మెజారిటీ చంద్రబాబు, చిరంజీవి, జేపీ లకు కూడా అంత మెజారిటీ రాలేదు. కేసీఆర్ కు 2 లక్షల మెజారిటీ వస్తే తెలంగాణ వాదం ఉన్నట్టా. తర్వాతి ఎన్నికల్లో అదే కేసీఆర్ కు 2 వేల మెజారిటీ వస్తే తెలంగాణ వాదం లేనట్టా.


ఒక టీఆరెస్ నాయకుడు తన పనితీరు బాగలేక జనం వోట్లేయకపోతే తెలంగాణ వాదం లేనట్టా. సీమ లో బాబు గెలిస్తే (తెదేపా తెలంగాణకు అనుకూలం కాబట్టి) రాయల సీమ ప్రజలంతా తెలంగాణ కు ఓకే అన్నట్టా. సిగ్గుపడాలి ఈ విశ్లేషనకు. ఎన్నికల ఫలితాలెప్పుడు ఒకే అంశం మీద ఆదారపడవు. అదే నిజమైతే డబ్బెందుకండీ పంచడం.

ఉప ఎన్నికల్లో నిజంగా తెలంగాణ వాదం కనుమరుగైతే ఆ తర్వాత కూడ ఆంధ్రా & సీమ నాయకుల ఆధిపత్యం లోని తెదేపా & ప్రజారాజ్యం లు ఎందుకు ప్రత్యేక తెలంగాణకు ఓకే అన్నాయి. కొంచెం ఆలోచించి మాట్లాడండి.

naveen achari said...

తెలంగాణ రాష్ట్ర అకాంక్ష ను టీఆరెస్ కు వచ్చిన సీట్ల తో ముది పెట్టాడం మీ విషయ పరిజ్ఞానాన్ని చెప్తుంది. తెలంగాణ అవసరమా కాదా అన్నది చర్చించ్లేని మీ అసమర్ధత ను కప్పిపుచ్చుకోవడానికి మీరు పడే కష్టాలు చూస్తే నవ్వొస్తుంది. టీఆరెస్ అంటే మొత్తం టెలంగాణ కాదు అని మీవంటి 'చరిత్ర కారులకు ' తెలియకపోవడం మా దురదృష్టం. టీఆరెస్ ను వ్యతిరేకించే టెలంగాణ సంస్థలు మా దగ్గర చాలా ఉన్నాయి. టీఆరెస్ కు తక్కువ సీట్లు రావడానికి కారణం ఆ పార్టీ నేతల పనితీరు బాగా లేకపోవడమే. ఆ పార్టీలో కూడా పని చేసిన వారికి మంచి మెజరిటీ వచ్చింది. రాష్ట్రం లోనే అత్యంత మెజారిటీ తో గెలిచింది వైయస్. ఆయన పులివెందులకు/ఇడుపులపాయ కు ఎన్ని తరలించుకు పోయాడొ తెల్సు. ఆయన తర్వాత ఎక్కువ మెజారిటీ వచ్చింది ఎవరికో తెల్సా. తెరాస నాయకుడు హరీశ్ రావు కు. ఆయనకొచ్చిన మెజారిటీ చంద్రబాబు, చిరంజీవి, జేపీ లకు కూడా అంత మెజారిటీ రాలేదు. కేసీఆర్ కు 2 లక్షల మెజారిటీ వస్తే తెలంగాణ వాదం ఉన్నట్టా. తర్వాతి ఎన్నికల్లో అదే కేసీఆర్ కు 2 వేల మెజారిటీ వస్తే తెలంగాణ వాదం లేనట్టా.


ఒక టీఆరెస్ నాయకుడు తన పనితీరు బాగలేక జనం వోట్లేయకపోతే తెలంగాణ వాదం లేనట్టా. సీమ లో బాబు గెలిస్తే (తెదేపా తెలంగాణకు అనుకూలం కాబట్టి) రాయల సీమ ప్రజలంతా తెలంగాణ కు ఓకే అన్నట్టా. సిగ్గుపడాలి ఈ విశ్లేషనకు. ఎన్నికల ఫలితాలెప్పుడు ఒకే అంశం మీద ఆదారపడవు. అదే నిజమైతే డబ్బెందుకండీ పంచడం.

ఉప ఎన్నికల్లో నిజంగా తెలంగాణ వాదం కనుమరుగైతే ఆ తర్వాత కూడ ఆంధ్రా & సీమ నాయకుల ఆధిపత్యం లోని తెదేపా & ప్రజారాజ్యం లు ఎందుకు ప్రత్యేక తెలంగాణకు ఓకే అన్నాయి. కొంచెం ఆలోచించి మాట్లాడండి.

naveen achari said...

తెలంగాణ ఉద్యమానికి సహేతుకమైన కారణాలున్నాయి. ఇవి తెలియని సోదరుడు అభిషేక్ కు నా సానుభూతి ప్రకటిస్తున్నా. సమస్య కు సమాధానం దొరికేవరకు ఆ సమస్య పట్ల పోరాటం ఉంటుంది. ఒక నాయకుడి వాచాలత్వం వల్లో కొందరు ద్రోహుల దిగజారుడు తనం తోనో ఒక గొప్ప ప్రజా ఉద్యమం అంతం కాదు అని ప్రపంచ చరిత్ర చెపుతుంది.


తెలంగాణ ఎందుకో అర్థం చేసుకోలేని మూర్ఖులు ప్రతీ సారి చర్చ ను అక్కన్నించి మళ్లించి తెలంగాణ వస్తుందా రాదా అన్న అంశం మీదికి మళ్లించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ పిరికి పందల వద్ద సమైఖ్యాంధ్రే ఎందుకు కావాలో చెప్పడానికి సమాధానాలుండవు. తెలంగాణ ప్రజల నిర్ణయం సబబే అని ఒప్పుకోడానికి వీరిలోపలి ఆంధ్రా రక్తం అంత ఈజీ గా ఒప్పుకోదు.

సమస్యకు సమాధానం వెతకని చేతకాని వాజమ్మల్లారా.. సమస్య ను ప్రస్తవించడానికి ఉన్న నాయకుడు ఆ పని సరిగ్గా చేయలేకపోయినంత మాత్రాన సమస్యలన్ని సద్దుమనిగినట్టూ కాదు. ఆ సమస్య కేవలం సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు మాత్రమే. ఈ రోజు కేసీఆర్ లేనంత మాత్రాన తెలంగాణ ప్రజలు సమైక్యాంధ్ర కోరుతున్నారనడం మీ అత్మ వంచన మాత్రమే. చదువుకున్న వారు ఎన్నుకునే కౌన్సిల్ ఎన్నికలను చూడండి. తెలంగాణ లో ఉన్న మూడు పట్టబద్రుల నియోజకవర్గాల్లో తెలంగాణ వాదులే విజయం సాధించారు. సమైక్య వాదులకు డిపాజిట్లు కూడా రాలేదు. చదువుకున్న వారి నుంది వచ్చిన ఏ ఉద్యమము వెనక్కు మళ్లదు. సమైక్యవాదులను.. ఇంకా తెలంగాణ పబడి దోచుకుందామనుకునే వాఋఇకి ప్రశ్నలు సంధిస్తూనే ఉంటుంది. కళ్లుండీ చూడలేని మీకు నా సానుభూతి ప్రకటిస్తున్నా.

AKVISHWA said...

అందరికి నమస్తే.. అందరూ ఈ మద్యన తెలంగాణ,తెలంగాణ అంటున్నరు..నాకైతె ఏమర్దమయిత లేదు. ఒకల్లేమొ కె.సి.ఆర్. ని చెప్పుతొతి కొట్టాలె అంటున్నరు.ఒకల్లెమొ కె.సి.అర్. మంచోడంటున్నరు.. ఇవన్నెమొ గని నాకు మాత్రం ఒక విషయంల కె.సి.అర్ ని మెచ్చుకోవాలె అనిపిస్తది. ఎందుకంటరా? గీ కె.సి.అర్ ఎ ఉద్దెశంతోటైతేంది.తెలంగాణ అనె అంశాన్ని పైకి దెచ్చిండు.. గా ఒక్క విషయంల నేను కె.సి.అర్ మంచిగ చేసిండని ఒప్పుకుంట.. కె.సి.అర్ జెసిన తప్పేంది అంటె ఉద్యమాన్ని బలహీనం జేసిండు, అంటె రెడ్డొచ్చె మళ్ళీ మొదలన్నట్టు. ఇప్పుడు కె.సి.ఆర్ మీద కొపానికచ్చెటొల్లు గీ పని చానా ముందు యేసేదుండె.. ఉద్యమం అనేది కొత్త ఊపుతోటి ఉండేది. ఇంగ ఉద్యమమంటరా కె.సి.ఆర్. ఉన్న ఉంటది లేకపొయినా ఉంటది..