Friday, April 29, 2011

కొత్త రాష్ట్రాల ఏర్పాటు - అంబేద్కర్ ఆలోచనావిధానం

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ పునర్నిర్మాణం కోసం, సామాజిక న్యాయం కోసం, రాజకీయ ప్రక్రియలో బడుగు బలహీన వర్గాల న్యాయమైన వాటా కోసం రచించిన వ్యూహాలపై చెరగని ముద్ర వేసిన మహనీయుడు, ఒక సమగ్ర రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు డా. బీఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ది ఒక మహోన్నత వ్యక్తిత్వం. ఆయన ఒక అసమాన మేధావి. ఆయన తపనంతా దేశ సమగ్రత పై, జాతి ఔన్నత్యం పై కేంద్రీకృతమై ఉండేది. అంబేద్కర్ చనిపోయి అర్దశతాబ్దం దాటినా సమకాలీన రాజకీయ అంశాలపై ఆయన దార్శనికత, దృక్పథం. అర్థం చేసుకోదగినవి, ఆచరించదగినవి. భిన్న సంస్కృతులు అనేక భాషలున్న మనదేశం లో ఆదిపత్య శక్తుల ప్రభావాన్ని ఎదుర్కొని అణిచివేయబడ్డ వర్గాలు స్వయం పాలన సాధించే దిశగా కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అంబేద్కర్ ఆలోచనా విధానమే ఏకైక మార్గం.

భారతదేశ రాష్ట్రాల స్వరూపం గురించి అంబేద్కర్ కు చాలా స్పష్టమైన అభిప్రాయాలున్నయి కేవలం భాషా ప్రాతిపదికనే రాష్ట్రాలు ఏర్పాటు చేయడం శ్రేయస్కరం కాదని ఆయన స్పష్టంగా చెప్పాడు ఒక భాష కు ఒకే రాష్ట్రం ఉండడం వల్ల భాషాదురభిమానం పెరిగి దేశ సమగ్రతకు భంగం కలిగే అవకాశం ఉందని భావించాడు. అందుకే రాష్ట్రాల ఏర్పాటులో ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించాడు. పరిపాలనా సౌలభ్యం కోసం ఒక రాష్ట్రం లో ఒక భాష ఉంటే మంచిదన్న అంబేద్కర్ ఒక భాష మాట్లాడే వాళ్లందరు ఒకే రాష్ట్రం లో ఉండాలన్న నిర్హేతుక వాదనను మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాడు. రాష్ట్రాల స్వరూప స్వభావాలలో వివిధ అంశాల మద్య సమతౌల్యం ఉండాలని ఆయన బలంగా అభిప్రాయపడ్డాడు. జనాభా, భౌగోళిక, మరియు ఆర్థిక స్వావలంబన అనే మూడు అంశాలు ప్రాతిపదికలుగా ఉండాలన్న ఆయన ఆర్థిక స్వావలంబనకు అధి ప్రాధాన్యం ఇచ్చాడు.

యాబై ఏళ్లుగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎంత న్యాయమైనదో అంబేద్కర్ తార్కిక ఆలోచనా విధానం తో ఆలోచించినపుడు తెలుస్తుంది. తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జనాభా పరంగా 16 రాష్ట్రాలకంటే, భౌగోళికంగా 17 రాష్ట్రాలకంటే పెద్దది కాగలదు. ఇక ఆర్థిక స్వావలంబన దృష్ట్యా తెలంగాణ స్వయం సమృద్దితో విలసిల్లగలదనేది నిర్వివాదం. ప్రస్తుత రాష్ట్రం లోని గోదావరి పరివాహక ప్రాంతం లో 79%, క్రృష్ణా పరివాహక ప్రాంతం లో 69% తెలంగాణలో ఉన్నవి. అంతేగాక అపారమైన ఖనిజ సంపద, అటవి సంపద, సారవంతమైన భూములను తెలంగాణ కలిగి ఉన్నది.

ఒక రాష్ట్ర ఏర్పాటులో ఎదురయ్యే అవాంతరాలకు, వివాదాలకు బాబాసాహెబ్ సూచించిన మార్గదర్శకాలు మాత్రమే పరిష్కారాన్ని ఇవ్వగలవు. ప్రస్తుతం కొందరు పెట్టుబడి దారులు హైదరాబాదు నగర ప్రతిపత్తి పై సృష్టిస్తున్న వివాదాలకు ఉమ్మడి బొంబాయి రాష్ట్రం విడిపోయినపుడు అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలు సరైన సమాధానాన్నిస్తాయి. బొంబాయి నగరం మహారాష్ట్రకే చెందుతుందని మిగతావారు అక్కడ అద్దెదారులు మాత్రమే అన్న ఆయన మహారాష్ట్ర లేకుండా బొంబాయి నగర మనుగడ అసాధ్యమన్నారు. అంబేద్కర్ దూరదృష్టికి అద్దంపట్టే మరో విషయం ఏంటంటే స్వయం పాలన కోరుకుంటున్న ప్రజల అకాంక్షలను ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆధిపత్య రాజకీయ వర్గాలు అడ్డుకునే అవకాశాలున్నయని రాజ్యాంగ కమిటీ చర్చల్లో స్పష్టం చేసాడు ఆయన. అందుకే కొత్త రాష్ట్రాల ఏర్పాటుబిల్లును రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయంతో సంబంధం లేకుండా పార్లమెంటులో ఆమోదింపచేస్తే సరిపోతుందని రాజ్యాంగంలోని ఆర్టికల్-3 లో ఆనాడే పొందు పర్చిన దార్శనికుడు అంబేద్కర్.

అణిచివేతకు గురైన వర్గాలనుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామిక విలువలే పునాదులుగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఇచ్చాడు. ఇటీవల శ్రీ కృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలోని ఎనిమిదవ అద్యయం లోని అంశాలు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేవిగా, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేవిగా ఉన్నాయి. ప్రజా ఉద్యమ అధ్యయనం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను రహస్యంగా ఉంచాలనడమే అప్రజాస్వామికం. అదికాక యాబై ఏండ్ల పోరాటం, ఇన్ని బలిదానాల తర్వాత కూడా సమస్యకు పరిష్కారం చూపకుండా అణచివేత దోరణితో అనైతిక పద్దతుల్ని ప్రోత్సహించడం సిగ్గుచేటైన విషయం. పదవులను ఎరవేసి ప్రజాప్రతినిధులను లోబర్చుకోవడం , ప్రకటనల ఆయుధాన్ని ఝళిపించి మీడియాను మచ్చికచేసుకోవడం వంటి దిగజారుడు విధానాలతో ఒక ప్రజా ఉద్యమాన్ని అడ్డుకోవచ్చని ఒక సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి నాయకత్వంలోని కమిటీ నివేదించడం జాతి సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన. ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే ఈ పెడధోరణులను పౌరసమాజం లోని ప్రతి ఒక్కరు ప్రతిఘటించవలసిన అవసరం ఉంది. అందుకే రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడానికి, ఇటువంటి అప్రజాస్వామిక దిగజారుడు దోరణులకు వ్యతిరేకంగా పోరాడుదాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విదానంతో ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ సాధించుకుందాం.


-నవీన్ ఆచారి
-పవన్ వెల్దండి
(తెలంగాణ ఐటీ ఫోరం)

No comments: