Thursday, May 31, 2012

డిల్లీకి సీట్లిస్తే తెలంగాణ ఎండమావే


ఉప ఎన్నికల నామినేషన్ల పర్వంతో రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న ఒకేఒక నియోజకవర్గం పరకాల ప్రతీ ఉప ఎన్నిక లాగానే మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. ఐతే తెలంగాణ వాదుల్లో పరకాల లేవనెత్తుతున్న ప్రశ్నలు కొంత అయోమయం  సృష్టిస్తున్నాయి.  తెలంగాణకు స్పష్టంగా మద్దతు తెలిపిన తెరాస, భాజపాలు పోటీ చేస్తూండడంతో  ఈ పార్టీలుతెలంగాణ ప్రజల ఓట్లను చీల్చడం చివరికి సీమాంధ్ర  పార్టీలకు లాభం చేకూరుస్తుందేమో అనే భయం సగటు తెలంగాణ వాదిది. ప్రస్తుత పరిస్థితిని గత అనుభవాల నేపథ్యంలో అర్థం చేసుకొని రాజకీయ విజ్ణత ప్రదర్శించాల్సిన సమయమిది. తెలంగాణ ఉద్యమం మహోదృతంగా ముందుకుసాగి హిమాలయాల్ని స్పృషించిన ఈ చారిత్రాత్మక సందర్భంలో ఉద్యమ అవసరాల్ని గుర్తించక పోతే అది తెలంగాణ సాధనకు లాభం చేకూర్చకపోగా కోలుకోలేనంతగా నష్టపర్చే ప్రమాదం ఉంది. 1969లో వందల సంఖ్యలో రక్త తర్పణం చేసిన మృతవీరుల ఆకాంక్షల్ని అగాధం లోకి విసిరిందెవ్వరు.  విలీనం పేరుతో తెలంగాణ ప్రజాసమితి అనే ప్రాంతీయ పార్టీని కబళించి ఉద్యమ ఊసే లేకుండా చేసింది జాతీయపార్టీ కాదా.  తెలంగాణ మహోద్యమం భావ వ్యాప్తి, ఉద్యమ దశల తర్వాత కేవలం చట్టసభల మెట్ల దగ్గర ఆగిన ఈ కీలక సంధర్భంలో మన ఓట్లు ఎలా వాడుకుంటే ఉద్యమానికి మేలు జరుగుతుందన్నది మనకు మనం వేసుకోవాల్సిన అవసరమైన ప్రశ్న. జాతీయ పార్టీలకు ఓట్లేస్తేనే తెలంగాణ సాధ్యమన్న వాదనలో నిజమెంతో అబద్దమెంతో ఆలోచించాళ్సిన అవసరం ఉంది. ఇది ఒక పరకాలలో మొదలైనా అవసరమైన చర్చనే లేవనెత్తింది. తెలంగాణ అంశం చట్టసభల్లో విజయం సాధించడానికి అవసరమైంది జాతీయ పార్టీలా ఉద్యమ పార్టీలా అన్నదిప్పుడు ప్రశ్న.

 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడే నాటికి ముందున్న పరిస్థితులను ఒకసారి చూస్తే టీఆరెస్ ఇప్పటివరకు ఏం సాధించిందో తెలుస్తుంది. తెలంగాణ పదాన్నే నిషేధించిన చోట తెలంగాణే ఎజెండాగా చర్చలు సాగుతున్నాయి. లగడపాటివంటి కరడుగట్టిన సమైక్యవాదుల నుండి జగ్గారెడ్డివంటి కపట తెలంగాణ వాదుల వరకు అందరి కామన్ టార్గెట్ కేసీఆరె ఎందుకు అయ్యాడు. వారికి తెలుసు ఎవరి వల్ల తెలంగాణ సాధ్యమో. ఎత్తుగడలు ఏవైనప్పటికీ కాంగ్రేస్, తెలుగుదేశం, ప్రజారాజ్యంలతో జై తెలంగాణ అనిపించింది టీఆరెస్. ఇవ్వాళ సీపీఐ, న్యూ డెమొక్రసీ, బీజేపీ లు ఉద్యమం లోకి దిగడానికి ప్రేరణ టీఆరెస్సే. యూపీయే ప్రభుత్వ  "కనీస ఉమ్మడి ప్రణాళిక" తో పాటు రాష్ట్రపతి ఉపన్యాసం లో తెలంగాణ చేరేలా చేసింది టీఆరెస్. 2009 డిసెంబర్ తొమ్మిదిన భారత ప్రభుత్వం చే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన ఇప్పించింది టీఆరెస్.
ఫ్రీజోన్ నుండి నిధుల కేటాయింపులదాకా తెలంగాణకు జరిగిన అన్యాయాలపై ఎప్పటికప్పుడు స్పందించి నిరసన ఉద్యమాలు నడిపింది టీఆరెస్. తెరాస ఉద్యమ ప్రస్థానం మొదలు పెట్టినప్పుడు తెలంగాణ వడ్డించిన విస్తరి కాదు. అవసరమైన భావ వ్యాప్తి కోసం ప్రజా సంఘాలతో అనేక అంశాలపై పుస్తకాల్ని ముద్రింపచేసి,మండల స్థాయి వరకు వేలాదిగా సభలు సమావేశాలు ఏర్పాటు చేయించింది. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం అడగట్లేదన్న సమైక్యవాదుల నోళ్లు మూయించడానికి పదవులకు రాజీనమాలుచేసి మళ్లీ మళ్లీ ఎన్నికలకెళ్లింది
తెరాస. ఎప్పటికప్పుడు లక్షల మందితో సభలు నిర్వహించి డిల్లీకి, సమైక్య పార్టిలకు హెచ్చరికలు పంపింది టీఆరెస్. 35 లక్షల మందితో వరగల్లులో నిర్వహించిన మహాగర్జన దేశచరిత్రలోనే చెప్పుకోదగ్గదిగ ఉంది. ఇవ్వాళ తెలంగాణ ఉద్యమం సృష్టించిన చైతన్యం మరో మూడు తరాలకు సరిపడా నాయకుల్ని తయారు చేసింది. గ్రామ స్థాయి కార్యకర్తల నుండి ఇంటర్మీడియట్ విద్యర్థుల వరకు ఎవరిని కదిలించినా తెలంగాణకు జరిగిన అన్యాయాలను గూర్చి, ఉద్యమ స్వరూపం గూర్చి, ఎత్తుగడల గూర్చి అనర్గళంగా మాట్లాడగలరు. నిస్సందేహంగా ఈ చైతన్యం ముందుముందు తెలంగాణ జనజీవనంలోని రాజకీయ సామాజికాంశాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచగలదు. తెలంగాణ జేయేసీ ఏర్పడడానికి ముందు తెలంగాణలో వాడాన్ని నిలబెట్టింది తెరాస మాత్రమే. 2010 లో జేయేసి ఏర్పడ్డ తర్వాత కూడా జేయేసీ ఇచ్చిన అన్ని పిలుపులను గ్రామస్థాయిలో విజయవంతం చేసింది టీఆరెస్సే. ఉద్యోగులు, ప్రజాసంఘాలు వారి శక్తి మేరకు కృషి చేసినా సంస్థాగత నిర్మాణాల దృష్ట్యా హైదరాబాద్, జిల్లాకేంద్రాలను దాటి కిందికి చేరలేకపోయింది. గ్రామ స్థాయిలో ఉద్యమాన్ని రగిలించింది టీఆరెస్. ఈ పదేళ్లలో ఆస్థులన్ని అమ్ముకొని కోర్టుల చుట్టు తిరిగిన తెరాస నాయకులున్నారు. ఉద్యమంలో ఉన్నందుకు పోలీసులతో థర్డ్ డిగ్రీ అనుభవించిన కార్యకర్తలున్నారు.  ఇన్ని దశల్లొ ఎక్కడా కనిపించని బీజేపీ ఇవ్వాళ తెలంగాణ మాతోనే సాధ్యమని చెప్పుకోవడం హాస్యాస్పదం.


కాకినాడ తీర్మాణంతో 1998లోనే తెలంగాణకు మద్దతు తెలిపిన పార్టీగా తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొంది బీజేపీ. ప్రజల సానుభూతి పొందినప్పటికీ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర లేకపోవడంతో ఉద్యమ పార్టీగా ప్రజామోదం పొందలేకపోయింది. సొంత కార్యాచరణతో ప్రజల్ని సన్నద్ధం చేయాల్సిన జాతీయ పార్టీ ప్రతి దశలోనూ నామమాత్రంగానే స్పందించింది. మొన్నటి కిషన్ రెడ్డి పోరు యాత్రకు ముందు బీజేపీ కార్యాచరణ ఏమిటన్నది బహిరంగ సత్యం.   జేయేసీ ఆదేశంతో మిగతా ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా  తాను మాత్రం తప్పించుకొని విదేశీ యాత్రకు వెళ్లిన జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇపుడు కేసీఆర్ ను వెలెత్తి చూపడం ఈ యేటి ఉత్తమ జోక్. లెక్కలేనన్ని సార్లు రాజీనామా చేసి జనంలోకి వెళ్లింది టీఆరెస్. అసలు పార్టీ పుట్టుకే రాజీనామాలతో మొదలైంది. స్వయంగా కేసీఆరే 3 సార్లు రాజినామాచేసి ఎన్నికలకు వెళ్లాడు. మరి 2008లో ముషీరాభాద్ ఎమ్మెల్యే నాయిని నరసిహ్మ రెడ్డి కేవలం తెలంగాణకోసమే రాజీనామాచేసి పోటీకి దిగితే ఆయనమీద పోటికీ లక్ష్మన్ ను అభ్యర్థిగా నిలపడం జాతీయ పార్టీకి అనైతికం అనిపించలేదా.  ఇంత ఉధృతంగా సాగిన ఉద్యమంలో గ్రామ స్థాయిలో జేయేసీల కార్యక్రమాలనుండి దీక్షాశిభిరాల రోజువారీ నిర్వహణ వరకు బీజేపీ తీసుకున్న భాద్యత ఎంత.? తెరాస కార్యకర్తల మీదున్న కేసులెన్ని.? బీజేపీ కార్యకర్తల మీదున్న కేసులెన్ని.? ఉద్యమానికి ఎవరు ఏ స్థాయిలో తోడ్పాటు అందించినా అధి అవసరమే అవుతుంది. ఐతే భాజపా మేలు కన్నా కీడే ఎక్కువగా చేసింది. తెలంగాణ ఉద్యమానికి మతాల కుళ్లు అద్దడం క్షమించరాని చర్య. మహబూబ్ నగర్ ఎన్నికల్లో హైదరాబాదు నుండి వెళ్లిన ఆ పార్టీ రాష్ట్ర నాయకులు తెరాస మైనార్టీ అభ్యర్థి గెలిస్తే రజాకార్ల పాలన వస్తుందని ప్రచారం చేయడం భారతీయ జనతా పార్టీ భావదారిద్ర్యం మాత్రమే. తెరాస ముస్లీం అభ్యర్థి గెలిస్తే అల్లా గెలిచినట్టని భాజపా హిందూ అభ్యర్తి గెలిస్తే రాముడు గెలిచినట్టని ఎస్సెమ్మెస్ లలో హైటెక్ ప్రచారం చెయ్యడం ఉద్యమానికి మేలా కీడా..? అసలు ముస్లీం లను దూరం చేసుకొని తెలంగాణ సాధించగలమా. వారు తెలంగాణ వాదానికి దూరం ఐతే ఆ ఓట్లు  ప్రతికూలంగా మారవా.. పోనీ భాజపా అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డిని శ్రీరామచంద్రునితో పొల్చొవచ్చా అంటే అదీ లేదు. రాముని వంటి సదరు బీజేపీ అభ్యర్థి తెరాస నుండి వెళ్లి వైయెస్ దగ్గర కాంగ్రేస్ కండువా వేసుకొని సరిగ్గా మొన్న ఉప ఎన్నికలకు ముందు బీజేపీలో చేరకుండానే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడన్నది నిజం. ఇటు పరకాలలోనూ టీఆరెస్ నుండి ఎవరొస్తారోనని గాలం వేసీ వేసీ చివరివరకు మీనమేషాలు లెక్కించిన సంగతి మరో నిజం.  ఒక ఉపప్రాంతీయ పార్టీ అభ్యర్తిని ప్రకటించే వరకు ఆగి అక్కడ టికెట్ దొరకని అసంతుష్టుల్ని పిలుచుకొచ్చి పోటీకి దించే స్థాయికి ఒక జాతీయ పార్టీ దిగజారడం దురదృష్టకరం.  చిదంబరం మొన్న పార్లమెంటులో చెప్పినదాణి ప్రకారం 2004లో అద్వాని చిదంబరం ను కలిసి ఏం చెప్పాడొ ప్రజలకు చెప్పల్సిన భద్యత బీజేపీ పై ఉంది. ఎండియేలో టీడీపీ చేరితే స్వాగతిస్తామన్న బీజేపీ అగ్రనేతల వ్యాఖయలకు వివరణ ఇవ్వకుండానే పరకల పోటీకి సిద్దపడడం కూడా సరికాదు. ఎవరి సాకులు వారికున్నప్పటికీ తెలంగాణను వాయిదా వేయడంలో కాంగ్రేస్, బీజేపీలు రెండూ ఒకే దారిలో నడిచాయి. గతంలో తెదేపా కోసం తెలంగాణను పక్కకు పెట్టామంది బీజేపీ. రేపు ఇదే పరిస్థితి వచ్చి ఏ ఎండీయే భాగస్వామ్య పక్షమైనా ఒత్తిడి చేస్తే తెలంగాణ నినాదం "గుడి కడ్తాం" నినాదం లాగే అటకెక్కదా.? రానున్నవి సంకీర్ణ సర్కార్లే ఐనప్పుడు సహజంగానే తెలంగాణవాదులు అడిగే ప్రశ్న ఇది.


తెలంగాణ ఉద్యమానికి ఏది మంచో ఏది చెడో తెలంగాన జాతిపిత ఆచార్య జయశంకర్ గారు ఎప్పుడో చెప్పారు. స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్న వారి మాటలు అక్షర సత్యాలు. ఇటు మీడియాఐనా  అటు డిల్లీఐనా  తెలంగాణ వాదమే ఏకైక ఎజెండాగా  ఉన్న పార్టీలు గెలిస్తేనే తెలంగాణ వాదం గెలిచిందంటారు. తెలంగాణకు మద్దతిచ్చే ఇతరపార్టీలు గెలిస్తే ఆ క్రెడిట్ తెలంగాణకు దక్కదు. దక్కనివ్వరు. వారి ఎజెండాలోని ఇతర అంశాలే ప్రభావితం చేశాయంటారు కాని తెలంగాణ గెలిచిందనరు. తెరాస కు తెలంగాణ ఏకైక ఎజెండా. అదే బీజేపీకి అనేక అంశాల్లో ఇదొకటి. ఇంతకన్నా ఇతర అంశాలు ముఖ్యమైనవిగా వారు భావిస్తే తెలంగాణను పక్కన పెట్టొచ్చు కూడా. ఇటీవల పార్లమెంటును స్థంభింపచేసిన తెలంగాణ కాంగ్రేస్ తెలంగాణ ఎంపీలను కాంగ్రేస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు కలిసి సస్పెండ్ చేశాయి.  ఔను మరి వారివి జాతీయ ప్రయోజనాలు కదా. లోక్ సభలో సుష్మాజీ ప్రసంగాన్ని పదేపదే ఊటంకించే కమలనాథులు అదంతా కేసీఆర్ సభను స్థంభింప చేసిన సమవేశాల్లొనో, హైదరాబాదులో ఉదృతంగా ఉద్యమం చేసినప్పుడో మాత్రమె అన్నది గమనించాలి. జాతీయ పార్టీలకు మళ్లీ మళ్లీ గుర్తు చెయ్యడానికే ఉద్యమ పార్టీలు అవసరం అంటున్నాం మేము.   అసలు ఇన్నెందుకు బీజేపీ సభ్యులు అందరు కలిసి పార్లమెంటును  రెండువారాల పాటు అడ్డుకుంటే  తెలంగాణ రాదా.? కానీ అలా చేయరు. వారికి తెలంగాణ ఒక్కటే ఎజెండా కాదు. లక్షాతొంభై  అంశాల్లో ఇదొకటి మాత్రమే. తెలంగాణను ఎడారిగా మార్చే పోలవరం పై బీజేపీ వైఖరి ఏమిటి. సరే వారన్నట్టే జాతీయ పార్టిలతోనే తెలంగాణ వస్తుందనుకుందాం. అంతటా బీజేపీ గెలిచినా దేసం  మొత్తం కాంగ్రేస్ గెలిస్తే ఏంటి పరిస్థితి. మరో ఐదేండ్లు ఆగాల్సిందేనా. బీజేపీ కీ సీట్లిచ్చి కాంగ్రేస్ ను ఎలా అడిగేది. పోనీ బీజేపీ ఐన అడుగుతుందా అంటే వారికిదొక్కటే ప్రధానాంశం కాదు కదా. 1971లోనే "రానున్నవి కిచిడీ సర్కార్లే" అని వాజపేయి వ్రాసినట్టు ఈరొజు అది ఒక వాస్తవం.  వాజపేయి సర్కార్ రెండు సార్లు పడిపోయింది కూడా ప్రాంతీయ పార్టీలవల్లే.

ఓట్లేస్తేనే తెలంగాణ ఇస్తామన్న బీజేపీ వాదన వారు సీట్లు పెంచుకొవడానికే తప్ప తెలంగాణకు ఏరకంగానూ ఉపయోగపడదన్నది మనం గ్రహించాలి.  ప్రధానిపై అవిశ్వాస తీర్మాణం పెడితే  మమ్మల్ని మించిన మొనగాళ్లే లేరంటున్న కాంగ్రేస్ తెలంగాణ ఎంపీలు ముందు వరుసలో నిలబడి అధిష్టనం చెప్పినట్టు ఓట్లేయలేదా.? ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాల్లో ఉనికి కల్గిఉన్న ప్రాంతీయ పార్టీలే ప్రస్తుతం జాతీయ పార్టీలుగా చలామణి అవుతున్నాయి. నడుస్తున్నది సంకీర్ణాల యుగం. ప్రాంతీయ పార్టీలు డిల్లీని వణికిస్తున్న రోజులివి. మనసీట్లు మన దగ్గరుంటేనే జాతీయ పార్టీల్ని ఒప్పించగలం.   లేకుంటే ఇప్పుడు "జాతీయ పార్టీ" అంటున్నవాళ్లేరేపు "అధిష్టానం" అంటారు. బీజేపీలో తెలంగాణ తీర్మాణం ఎలా జరిగిందో దేవుడికెరుక. ఆపార్టీ అగ్రనాయకులు అద్వాని, మురళీ మనోహర్ జోషీలు ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకం. వెంకయ్యనాయుడి మీద తెలంగాణవాదుల అనుమానాలు ఇప్పటివికావు. ఇంకోవైపు మాకు ఓట్లేస్తేనే తెలంగాణ ఇస్తాం అనడానికి ఇది 2001 కాదు. ఇప్పుడు తెలంగాణ అడుక్కునే దశలో లేదు. డిమాండ్ చేసే స్థితిలో ఉంది. నిజంగా రేపు బీజేపీకి సీట్లే అవసరం ఐతే టీఆరెస్ మద్దతు తీస్కొని తెలంగాణ ఇవ్వండి. ఏమిటి అభ్యంతరం. జయశంకర్ సార్ చెప్పినట్టు ఎన్నికల్లో మనం చూపే రాజకీయ చతురతే మనకు తెలంగాణనిస్తుంది. స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణను సాకారం చేస్తుంది. డిల్లీకి సీట్లిచ్చి నిస్సహాయంగా ఎదురుచూసే బదులు ఉద్యమ పార్టీలకు ఓట్లేస్తే కేంద్ర ప్రభుత్వ మెడలు వంచగలం. జాతీయ పార్టీల్ని వాడుకోవాలే కాని మనం కరివేపాకులా మిగిలిపోవద్దు. తెలంగాణకు సంబంధించినంత వరకు ఏ జాతీయ పార్టీ ఐనా ఒకటె, ఏ జాతీయ నాయకులైనా ఓకటే.. అది సోనియాజీ ఐనా సుష్మాజీ ఐనా..


- నవీన్ ఆచారి.

No comments: