Thursday, November 13, 2008

హైదరాబాద్ ఎవరిది?


తెలంగాణ నుంచి హైదరాబాద్‌ను వేరు చేసి ప్రత్యేక ప్రాంతంగా చేయడమంటే తల్లి నుంచి బిడ్డను వేరుచేయడమే. ఇదెంత అమానుషం! సభ్యతా సంస్క­ృతి లేని వారు మాత్రమే ఇలా చేస్తారు.
మన ముఖ్యమంత్రి ఎన్నికలను ఎప్పుడూ ఒక క్రీడగా పోల్చుతారు. క్రీడా స్ఫూర్తితో పాల్గొంటే వచ్చే ఎన్నికలలో 'బంగారు పతకం' పొందడం ఖాయమని ఆయన పదే పదే అంటున్నారు. అయితే ఏ ఆటలోనైనా గెలవాలంటే ఆ ఆటలో విధిగా అనుసరించాల్సిన కొన్ని నియమాలు, ఒక క్రమ శిక్షణ ఉంటాయన్న వాస్తవాన్ని ఆయనగాని , ఎవరుగాని మరచిపోకూడదు. సరే, ఇటీవల గెలవడం ఒక్కటే క్రీడాకారులకు పరమ లక్ష్యం అయిపోయింది కదా. ఫుట్‌బాల్ వరల్డ్‌కప్- 2006లో గెలవడమే ఏకైక లక్ష్యంగా ఇటలీ జట్టు ఆడిం ది. ప్రధాన ప్రత్యర్ధి ఫ్రెంచ్ జట్టును రెచ్చగొట్టి ఇరుకునపెట్టే వ్యూహాన్ని అనుసరించి విజయా న్ని కైవసం చేసు కొంది.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడటం ఖాయమైతే హైదరాబాద్ నగర ప్రతిపత్తి విష యమై మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ కాంగ్రెస్ నేత, రాయలసీమ నాయకులు ప్రారంభించిన చర్చ కూడా ఫ్రెంచ్ జట్టును ఓడించడానికి ఇటలీ జట్టు అనుసరించిన వ్యూహం వంటిదే. ఏదో ఒక విధంగా అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడం, కాదూ అంటే జాప్యం చేయడమే ఆ చర్చ లక్ష్యం. హైదరాబాద్‌పై చర్చ ఇప్పుడు రియల్టర్లు, భూమి మాఫియా, పేదల వ్యతిరేకుల స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా జరుగుతోంది! కనుక హైదరాబాద్ ఎవరికి చెందిందో అర్థం చేసుకోవడానికి తెలంగాణ, ఆంధ్రల చరిత్రను ఒక సారి పునరావలోకన చేయ వలసిన అవసరమెంతైనావుంది.
హైదరాబాద్ సంస్థానంలో మొత్తం 16 జిల్లాలు (8 తెలంగాణ , 5 మరఠ్వాడ, 3 కర్ణాట క) ఉండేవి. నిజాం ప్రభుత్వ ఆదాయంలో అధిక భాగం తెలంగాణ నుంచి సమకూరేదనడం లో ఎటువంటి సందేహం లేదు. నిజాం ఏజెంట్లు అయిన ఫ్యూడల్ భూస్వాములకు వ్యతిరేకంగా తెలంగాణ జిల్లాల్లో తిరుగుబాటు ప్రజ్వరిల్లింది. ప్రజల తిరుగుబాటు నెదుర్కొనే క్రమంలో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎమ్ఐఎమ్) ఆవిర్భవించింది. 1944లో ఔరంగాబాద్‌కు చెందిన ఖాసిం రజ్వి మజ్లిస్ నాయకత్వాన్ని చేపట్టారు. పోలీసుచర్య అనంతరం రజ్వీని బీబీనగర్ దోపిడీ కేసులో విచారణ జరిపి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. 1955లో విడుదలైన అనంతరం పాకిస్థాన్‌కు రజ్వీ పరారయ్యాడు.
పోతూ పోతూ మజ్లిస్ నాయకత్వాన్ని గుల్బర్గాకు చెందిన వహా బుద్దీన్ ఓవైసీకు అప్పగించి మరీ వెళ్ళిపోయాడు. హైదరాబాద్, తెలంగాణ ముస్లింలకు మజ్లిస్ పార్టీ నిజమైన ప్రతినిధేనా? ఇరవై సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరంలో బస్సు డ్రైవర్లు, పోలీస్ కానిస్టేబుళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలలో క్లర్క్‌లు 50 శాతంకు పైగా మైనారిటీ మతస్తులే ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య కనీసం 15 శాతంగా కూడా లేదు! ఆ ఉద్యోగాలన్నిటినీ ఎవరు కైవసం చేసుకున్నారు? ఉర్దూ హైదరాబాద్‌లో ప్రధాన భాషగా ఉండేది. ఇప్పుడు దాని పరిస్థితి ఏమిటి? ముస్లింలైన యువతీయువకులు సైతం ఉర్దూను రాయడం, చదవలేక పోతున్నారే? ఈ పరి స్థితికి ఎవరు కారణం? తెలంగాణ ఏర్పడితే ముస్లింలకు భద్రత ఉండదని అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు.
ఏమి టి ఈ ప్రకటనకు అర్థం? హైదరాబాద్, తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఓవైసీపై ఉంది. తెలంగాణలోని ఫ్యూడల్ శక్తులకే కాక మతోన్మాద శక్తులకు కూడా కాంగ్రెస్ మద్దతునిచ్చిందన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో ముస్లింల పాలన పునరుద్ధరణ అవుతుందని తెలంగాణ ప్రజ లను ఆంధ్రనాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని మజ్లిస్ అధినేత గమనం లోకి తీసుకున్నారా? ఇక హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి నగర అభివృద్ధికి తోడ్పడ్డామన్న ఆంధ్ర నాయకుల వాదనను పరిశీలిద్దాం. ఇదెంతటి అసంబద్ధ వాదన! అసలు రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు మార్చాల్సిన అవసరమేమిటి? హైదరాబాద్‌కు వచ్చి ఈ నగరాన్ని అభివృద్ధి చేయమని ఆంధ్ర నాయకులను ఎవరు అడిగారు? 400 సంవత్సరాల క్రితమే సకల హంగులతో నిర్మాణమైన నగరమొకటి ఉందనేకదా మీరు హైదరాబాద్‌కు వచ్చింది.

నిజం చెప్పాలంటే గత 40 ఏళ్ళుగా హైదరాబాద్ నగరం వికృతమయిపోతోంది. సరస్సులు, చెరువులు అన్నీ ఏమై పోయాయి? మధుర ఉర్దూ విన్పించడం లేదేమి? హైదరాబాద్, తెలంగాణలలో మతోన్మాద రాజకీయాలకు కారణమెవ్వరు? వక్ఫ్ భూములను కైవసం చేసుకొన్నదెవరు? తెలంగాణ భాషా సంస్క­ృతులను ధ్వంసం చేసిందెవరు? ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న మొత్తం 50 సెజ్‌లలో 40 ని కేవలం తెలంగాణ జిల్లాల్లోనే ఏర్పాటు చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? వీధి దీపాలనే సక్రమంగా నిర్వహించలేని వారు గ్రేటర్ హైద రాబాద్‌ను ఏర్పాటు చేయడం సబబేనా? దాని వలన ప్రయోజనమేమి టి? మన దేశంలో ఏ పౌరుడైనా ఎక్కడికైనా వెళ్ళి స్థిరపడవచ్చు. జీనవోపాధి పొందవచ్చు.

హైదరాబాద్, తెలంగాణలలో తాము ఎలాంటి పాపాలకు పాల్పడకపోతే ఆంధ్ర నాయకు లు భయపడవలసిన అవసరమేముంది? మహారాష్ట్ర ఏర్పాటయినప్పుడు కూడా బొంబా యిని గుజరాత్‌కు ఇవ్వాలని గుజరాతీ వ్యాపారవర్గాలు వాదించాయి. నిర్దిష్ట ప్రాథమిక విషయాలు ఎప్పుడూ ప్రాథమిక విషయాలే. ప్రజలు వాటిని అర్థంచేసుకోకపోతే భగవంతుడే వారికి తోడ్పడాలి. హైదరాబాద్, రాయలసీమకు దక్షిణంగా 170 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఆంధ్రకు తూర్పుగా 200 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌ను ఏప్రాతిపదికన కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారు? ఎవరి ప్రయోజనాల కోసం? తెలంగాణ ఏర్పాటుకు కలతచెందవలసిన అవసరం దోపిడీదారులకు మాత్రమే ఉంది.

సామాన్య ప్రజలకు ఎటువంటి చింత ఉండనవసరం లేదు. ఐడిపిఎల్, ప్రాగా టూల్స్, ఆల్వి న్ మొదలైన కంపెనీల మూసి వేతకు కారకులైన వారు మాత్రమే భయపడతారు. వారే మైక్రోసాఫ్ట్ కంపెనీకి వందలాది ఎకరాలను కట్ట బెట్టారు (ఆ కంపెనీకి అమెరికాలో 50 ఎకరాల ప్రాంగణం ఎక్కడా లేదు మరి! ). ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లను కబ్జా చేస్తున్నవారు, మెట్రో, రింగ్ రోడ్డు పేరిట హైదరాబాద్ ప్రజలకు ఉరికంబాలు నిర్మిస్తున్నవారు మాత్రమే ప్రత్యేక తెలంగాణ విషయమై భయపడాలి. సామాన్య ప్రజలకు ఎటువంటి కలవర పాటు అవసరం లేదు.

తెలంగాణ, హైదరాబాద్‌లలో ఆ మాటకొస్తే ఎక్కడైనా ప్రజలలో 90 శాతం మంచివారే. తెలంగాణకు ఒక ప్రత్యేక సంస్క­ృతి ఉంది. గత 500 సంవత్సరాలుగా ఇక్కడ మతసామరస్యం నెలకొనివుంది. అన్ని మతాలు, వర్గాల ప్రజలు పరస్పరం గౌరవించుకొంటూ కలిసిమెలసి బ్రతుకుతున్న చరిత్ర ఉంది. ఈ వాస్తవాలను గమనించకుండా హైదరాబాద్‌ను ప్రత్యేక ప్రాంతంగా ఏర్పాటు చేయాలని కొంత మంది డిమాండ్ చేయడం విచిత్రంగా ఉంది. తెలంగాణ నుంచి హైదరాబాద్‌ను వేరుచేసి ప్రత్యేక ప్రాంతంగా చేయడమం టే తల్లి నుంచి బిడ్డను వేరుచేయడమే. ఇదెంత అమానుషం! సభ్యతా సంస్క­ృతి లేని వారు మాత్రమే ఇలా చేస్తారు.
-కడెంపల్లి సుధాకర్
ఆంధ్రజ్యోతి - 13 నవంబర్, 2008
.

No comments: