Saturday, November 15, 2008

బహిరంగ లేఖ - తెలంగాణను విస్మరిస్తున్న తెలుగు భాషా ఉత్సవాలు

ఎన్కట వ్యావహారిక భాష పేరుతో కోస్తాంధ్ర భాషను రుద్ది మా భాషను మంటగల్పిండ్రు. ఇప్పుడు 'తెలుగు' వైభవ ప్రాభవాల పేరుతో మా ప్రాంత అస్తిత్వాన్నే నాశనం చేయచూస్తుండ్రు. నవంబరు 15 నుంచి డిసెంబరు 15 వరకు హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో జరిగే భాషా 'ఉత్సవా'ల్లో, తొలి అచ్చ తెలుగు కావ్యాన్ని అందించిన తెలంగాణను అణచివేయచూస్తుండ్రు. తెలంగాణ అన్నప్పుడల్లా దాన్ని మరుగున పరచడానికి తెలుగు పేరుతో పన్నాగం పన్నిండ్రు. ఆఖరికి తెలుగు భాషకు ప్రాచీనతను సాధించడానికి తెలంగాణలోని తెలుగు మూలాలే మీకు కావలసివచ్చినవి. కాని మా ప్రాంత అస్తిత్వం అక్కర్లేనిదయింది.

ఈ 'ఉత్సవా'లు ఎవరి హోదాను నిలబెట్టడానికి? ఎవరి ఆధిక్యతను నిలబెట్టడానికి? 'తెలుగు' పేరుతో ఏ ప్రాంతంమీద ఆధిపత్యాన్ని కొనసాగించడానికి? ఏ సంస్కృ తి మీద ఎవరికి గుత్తాధిపత్యాన్ని కట్టబెట్టడానికి? 270మంది సాహితీ'వేత్త'లు పాల్గొంటున్న ఈ 'ఉత్సవా'ల్లో తెలంగాణ సాహితీపరుల సంఖ్య ఎంత? కరపత్రంలో వేసిన 31మంది వి'శిష్టు'ల ఫోటోల్లో తెలంగాణవాళ్లవి నాలుగేనా? ఈ వివక్ష చాలదా మేం తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకోవడానికి.

ఎ రాష్ట్రేతరాంధ్రుల భాష గురించి ఉపన్యాసాంశం పెట్టిన మీకు తెలంగాణ భాషా సంస్కృతుల అస్తిత్వం పెట్టాలన్న సోయి లేదా? ఎ బహుజన సాహిత్యం మీద ఉపన్యాసాంశం పెట్టాలనే స్పృహ ఉండనక్కరలేదా? ఎ తెలంగాణ దళిత సాహిత్య కారులను, దళిత స్త్రీ రచయితల్ని కానరా? ఎ హిందూత్వ భావజాలాన్ని ప్రచారం చేసే సాహిత్యకారులకు చోటు కల్పించి, లౌకిక భావజాలాన్ని, హిందూ-ముస్లింల ఉమ్మడి జీవనశైలిని ప్రతిబింబిస్తున్న ముస్లింల సాహిత్యానికి స్థానం కల్పించకపోవడంలో ఆంతర్యమేమిటి? ఎ తెలుగు వాగ్గేయకారులుగా నాజర్, సుద్దాల హనుమంతు, గద్దర్, గూడ అంజ య్య, అందెశ్రీలు సూపుకు ఆనలేదా? ఇదంతా తెలుగు సాహిత్య చరిత్రను వక్రీకరించడం కాదా? తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాన్ని, తద్వారా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని దెబ్బతీయడం కాదా ? ఈ అవమానకర పరిస్థితుల్లో ఈ 'ఉత్సవా'ల్లో పాల్గొంటున్న సాహితీకారులను అడుగుతున్నం- ప్రజాస్వామిక, న్యాయమైన తెలంగాణ రాష్ట్ర డిమాండ్ వైపు నిలబడతారా? సీమాంధ్ర ప్రభుత్వ సాహితీకారుల కుట్రలో భాగస్వాములవుతారా?

- 'సింగిడి' తెలంగాణ రచయితల సంఘం, 'హర్యాలి' ముస్లిం రచయితల వేదిక, మాదిగ కవుల కళాకారుల రచయితల వేదిక, తెరకమే ఐక్యవేదిక, దళిత స్త్రీ రచయితల వేదిక, తెలంగాణ సాంస్కృతిక సమా ఖ్య, తెలంగాణ పాటకవుల వేదిక, మంజీర రచయితల సంఘం, వివిధ తెలంగాణ విద్యార్థి సంఘాలు

ఆంధ్రజ్యోతి 15 నవంబర్ 2008
.

3 comments:

Unknown said...

భాషని పండితులే కనుగొనలేదు. ప్రజలు కనుగొన్నారు. ప్రజల నాలుకమీద ఆడేదే అసలైన భాష. ప్రామాణికమైన భాష. ఈ విషయాన్ని విస్మరిస్తున్న పండితులెవరైనా భషాలు తెలియనివారే. గద్దర్ ని, ప్రజాకవులను విస్మరించే భాషా పండితుల సభని తెలంగాణా కవులు ఆక్షేపించడం సరియైనదే. ఈ శిష్టులంతా గోడమీది పిల్లివాటం గాళ్ళే. ప్రజలే భాషకు నిజమైన వాహకులు.

ఈ సభలు కూడా చొప్పదంటు ముచ్చట్లే.

విరజాజి said...

తెలంగాణా మాండలికంలోనే అచ్చతెలుగు పదాలు ఎక్కువ ఉన్నాయండీ నవీన్ గారూ... ! కొన్ని సభలు / సమావేశాల్లో ప్రాతినిధ్యమే ప్రాతిపదిక గా మనం మన భాషని కించపరచుకోవద్దు. మన తెలుగు మాండలికాలన్నీ పైకి విభిన్నంగా కనపడ్డా అంతర్లీనంగా మనందరినీ ఏకం చేసే తెలుగు భాష మన తల్లి భాష.

ఊకే గట్ల బుగులు వడి మన మాటలని మనమె తక్కువజేసుకోవద్దు తమ్మీ....తెలంగాణా అన్న మాటలోనె "తెలుంగు" కూడ ఉన్నది... మర్సిపోకు మల్ల.

naveen achari said...

ఔను తెలంగాణ లోనే అచ్చ తెలుగు పదాలెక్కువ. తమదే నిజమైన తెలుగని చేతిలో ఉన్న మీడియా తో గగ్గోలు పెట్టించినా ఒరిగేదేం లేదు. "జోరుగా హుషారుగా షికారు పోదుమా..!!" ఇందులో తెలుగు పదాలెన్ని. మది అసలైన తెలుగు అని, మాదే సిసలైన తెలుగని, నిఖార్సైన తెలుగనీ చంకలు గుద్దుకునే సోదరులారా..!! అసలైన, సిసలైన, ఇఖార్సైన ఈ మూడు పడాలు ఉర్దూ పదాలే. తెలంగాణ లో ఉర్దూ పదాలు ఉన్నయి. ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారు. ఐతే అంతకన్నా ఎక్కువ పాళ్లలో ఉర్దూ ఆంధ్రా ప్రాంతం తెలుగులో ఉంది. ఐతే ఆ ఉందన్న విషయం కూడా తెలియకపోవడం, దాన్నే పట్టుకొని వాదించడం వారి విషయ పరిజ్ణానాన్ని తెలియజేస్తుంది.