Thursday, November 20, 2008

నాకేం భయం - సోదరి మాయావతి


కర్ణుడికి కవచ కుండలాల్లాగా ధైర్యం ఆమెకు సహజభూషణం.రాజకీయపుటెత్తుగడల్లో ఆరితేరిన ఆ ధీరవనిత... మాయావతి. అనుకున్నది సాధించేదాకా నిద్రపోని తత్వం, సమయానుకూలంగా వ్యూహాలు మార్చే నైపుణ్యం... ఈ లక్షణాలే ఆమెను దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన ముఖ్యమంత్రిని చేశాయి. అంబేద్కర్ కలలను సాకారం చేయడమే తన జీవితలక్ష్యమంటున్న ఆ 'బెహెన్‌జీ' జీవితవిశేషాలు ఆమె మాటల్లోనే!







చిన్నప్పటి నుంచీ నాలో ధైర్యం పాళ్లు ఎక్కువే. సమస్య వస్తే పారిపోయే తత్వం కాదు. దాంతో పోరాడుతాను. అలాంటి ఓ సంఘటన చెప్పాలంటే... చిన్నతనంలో మేమంతా అప్పుడప్పుడూ తాతయ్యా వాళ్ల ఊరికి వెళ్లేవాళ్లం. ఒకసారి అక్కడికెళ్లినప్పుడు తాతయ్యా మేమందరం కలిసి షికారుకు బయలుదేరాం. కొంతదూరం వెళ్లగానే... హఠాత్తుగా ఒక తోడేలు ఎదురైంది. పెద్దవాళ్లంతా నన్ను దూరంగా వెళ్లి నుంచోమన్నారు. దానికి అందితే కరుస్తుందని భయపెట్టారు. దానికి నేను 'అది నన్ను కరవడం కాదు, నేనే దాన్ని చంపి తినేస్తాను' అంటూ ఆ తోడేలును తరిమితరిమి కొట్టాను.

మరో సంఘటన... నాకప్పుడు పన్నెండు పదమూడేళ్లు. మా నాలుగో తమ్ముడు సుభాష్ పుట్టి కొద్దిరోజులే అయింది. అంతలో వాడికి చలివాతం కమ్మింది. అమ్మకు కూడా ఆరోగ్యం బాగాలేదు. హాస్పిటల్‌కు తీసుకెళ్దామంటే ఇంట్లో చిల్లిగవ్వ లేదు. నాన్న పనిమీద వేరే ఊరెళ్లారు. ప్రభుత్వాసుపత్రికి వెళ్దామంటే 6 కి.మీ. దూరం వెళ్లాలి. ఎంత దూరమైనా అంతకు మించి గత్యంతరం లేదు. ఆలస్యమైతే తమ్ముడు దక్కేలా లేడు. పెద్దగా ఆలోచించకుండానే ఒక నిర్ణయానికొచ్చా. ఒక మంచినీళ్ల సీసా తీసుకుని తమ్ముణ్ని భుజాన వేసుకుని బయలుదేరా. నిజంగా ఆ ప్రయాణం చాలా భయంకరమైనది. అసలే చీకటిపడింది. ఆ దారి మధ్యలో కొంతమేర చిక్కటి అడవి కూడా ఉంది. వెుత్తం నిర్మానుష్యంగా ఉంటుంది. అయినా వెుండికి పడి ఆరుమైళ్లూ నడిచాను. తమ్ముణ్ని ఒకభుజం మీద నుంచి మరోభుజానికీ అప్పుడప్పుడూ వీపుమీదకీ మార్చుకుంటూ! ఏడ్చినప్పుడల్లా వాడికి నాలుగుచుక్కలు నీళ్లు పట్టేదాన్ని. రెండు గంటలు పట్టింది ఆసుపత్రికి చేరడానికి. డాక్టర్లు నన్ను చూసి ఆశ్చర్యపోయారు. అడుగుతీసి అడుగెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను. అయితేనేం, తమ్ముడు దక్కాడు. అదే సంతోషం. వైద్యం అందడంతో వాడి పరిస్థితి కొంచెం మెరుగైంది. నాకూ ఓ గంట విశ్రాంతి దొరకడంతో... రాత్రి తొమ్మిదిన్నరకు తిరుగుప్రయాణమయ్యాను. మళ్లీ ఆరుమైళ్లూ రెండుగంటలూ! గుమ్మంలోనే కూర్చునుంది అమ్మ. అల్లంత దూరంలో నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చింది. కళ్లల్లో నీళ్లు. తమ్ముడు బాగానే ఉన్నాడన్న ఆనందం నేను క్షేమంగా ఇంటికి చేరుకున్నానన్న సంతోషం. ఆ ఉద్వేగాన్ని తట్టుకోలేక నన్ను గట్టిగా కౌగిలించుకుంది.

దళితులు ఎంత వివక్ష ఎదుర్కొంటారో ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు. అందుకు నేనూ మా కుటుంబం మినహాయింపూ కాదు. చిన్నప్పుడు... మేం బస్సులో వెళ్తుంటే పక్కన కూర్చున్నవాళ్లు మాట కలిపేవారు. మధ్యలో మీదే కులం అని అమ్మని అడిగి... మా కులం పేరు చెప్పగానే దూరం జరిగేవారు. 'ఎందుకిలాగ' అని అమ్మనడిగితే కులం అంటే ఏంటో చెప్పింది అమ్మ. అప్పట్నుంచీ ఆ మాటంటే అణువణువునా అసహ్యంతో పెరిగాన్నేను.

నాకు పద్నాలుగేళ్లు వచ్చేసరికి అంబేద్కర్ గురించి బాగా తెలిసింది. నేనూ ఆ స్థాయికి చేరుకోవాలంటే ఏంచేయాలి నాన్నా అని అడిగితే ఎప్పట్లాగా ఆరోజు నా మాటల్ని చిన్నపిల్లల మాటల్లాగా కొట్టిపారెయ్యలేదాయన. 'బాగా చదవాలి, డిగ్రీ పూర్తిచెయ్యాలి, ఐఏఎస్ అవ్వాలి. అప్పుడు నువ్వనుకున్నది సాధించగలవు' అన్నాడు. నేనామాటల్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాను. ఎంత తొందరగా కలెక్టర్ అవుతానా అన్నదానిపైనే నా దృష్టంతా. ఆ తొందరతో మూడు(9, 10, 11) క్లాసుల పరీక్షలు ఒకేసారి(1971లో) రాసి పాసయ్యాను. 1972లో పన్నెండో తరగతి పాసై బి.ఎ.లో చేరాను. తర్వాత బి.ఎడ్., అదవగానే ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ ఢిల్లీ యూనివర్సిటీలో 'లా'లో చేరాను. ఐ.ఎ.ఎస్. అనే కొండంత లక్ష్యం ఇంకా నా ముందుంది. అప్పటిదాకా ఆర్థికంగా వెనకబడకూడదనే ఉద్దేశంతో ఇలా ప్రతి అడుగూ ఆచితూచి ఎంతో జాగ్రత్తగా వేశాను. లక్ష్యం సాధించే రోజు మరెంతో దూరంలో లేదన్న భరోసా వచ్చింది. కానీ... అనుకున్నవి జరిగితే అది జీవితం ఎలా అవుతుంది! అది 1977 సెప్టెంబరు నెల. ఎమర్జెన్సీ ముగిశాక జరిగిన ఎన్నికల్లో ప్రభంజనంలా గెలిచిన జనతాపార్టీ ఢిల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. కులవివక్షను అంతం చేయడానికి అనుసరించాల్సిన మార్గాలు అనేది టాపిక్. ఇందిరాగాంధీని ఓడించిన రాజ్‌నారాయణ్(ఆనాటి కేంద్ర ఆరోగ్యమంత్రి) వేదికమీద మాట్లాడుతూ 'హరిజనులు' అనే మాట పదేపదే అనడం వెుదలుపెట్టారు. అక్కడే కూర్చున్న నా రక్తం సలసలా మరగడం వెుదలుపెట్టింది. అదేం పదం... 'హరిజనులు'! ఒకప్పుడు దేవదాసీల పేరిట మహిళల్ని దేవుడికిచ్చి పెళ్లిచేసి ఆమెను లైంగికంగా వాడుకునేవారు కులపెద్దలు. ఆ దేవదాసీలకు పుట్టిన బిడ్డలే హరిజనులు (దేవుడికి పుట్టిన పిల్లలు) అవుతారనేది నా ఉద్దేశం. నేనే కాదు, గాంధీ సృష్టించిన ఆ పదాన్ని చాలామంది వ్యతిరేకించేవారు. మరలాంటి పదాన్ని పదేపదే అంటే ఎలా ఊరుకోగలను? సమావేశంలో కొన్ని వందల మంది దళితులున్నారు. వాళ్లల్లో వాళ్లు గుసగుసలు పోయారే తప్ప ఒక్కరైనా అభ్యంతరం చెప్పలేదు. కానీ, నాకేం భయం? నా వంతు రాగానే ఉపన్యాసంలో రాజ్‌నారాయణ్‌ను కడిగిపారేశాను. 'హరిజనులు' అనే పదాన్ని పదేపదే ఉచ్చరించి దళితుల్ని అవమానించారని దుమ్మెత్తిపోశాను. అప్పటిదాకా నిశ్శబ్దంగా కూర్చున్న సభికులంతా పెద్దగా చప్పట్లు కొట్టి అభినందించడం వెుదలుపెట్టారు. అభిమానంతో చుట్టుముట్టేసి నా ధైర్యాన్ని పొగిడారు. ఆరోజు నన్ను అభినందించిన వారిలో 'బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (బీఏఎంసీఈఎఫ్)' సభ్యులు కూడా ఉన్నారు. ఆ సంఘానికి అధినేత కాన్షీరామ్.

ఆరోజు రాత్రి... తొమ్మిది దాటుతోంది. అమ్మావాళ్లంతా నిద్రకు ఉపక్రమిస్తున్నారు. నేను నా ఐ.ఎ.ఎస్. స్టడీ మెటీరియల్‌తో కుస్తీపడుతున్నాను. ఇంతలో తలుపు గట్టిగా చప్పుడైంది. ఎవరాని తెరిచి చూస్తే... ఆనాడు ఢిల్లీ సమావేశంలో నన్ను అభినందించిన బీఏఎంసీఈఎఫ్ సభ్యుడు. ఆయన వెనకాలే వారినేత కాన్షీరామ్! ఇక్కడ ఆ సంఘం గురించి కొంచెం చెప్పుకోవాలి. అందులో ఆరోజుల్లోనే 500మంది పీహెచ్‌డీ చేసినవారు, 15వేల మంది శాస్త్రవేత్తలు, మరో పదివేల మందికి పైగా వివిధరంగాల పట్టభద్రులూ ఉండేవారు. అందరూ దళితులే. కాన్షీరామ్ అంటే ఒక వ్యక్తి కాదు. శక్తి. అలాంటాయన ఇంటికి రావడం అంటే... అదో పెద్ద గౌరవం! ఆయన్ను చూడగానే ఇంట్లో అందరికీ ఆనందం, ఆశ్చర్యం, ఉద్వేగం. నిద్రమత్తులో విసుక్కుంటూ బయటికొచ్చిన నాన్న కూడా ఆయన్ను చూడగానే నిశ్శబ్దంగా ఒకపక్కన కూర్చున్నారు. వాళ్లల్లో ఎవర్నీ పట్టించుకోకుండా సూటిగా నన్నే చూస్తూ 'ఏవో చాలా పుస్తకాలే చదువుతున్నట్టున్నావే' అని అడిగారు కాన్షీరామ్. 'అవును, ఐ.ఎ.ఎస్. పరీక్షలకు సిద్ధమవుతున్నాను' అని సీరియస్‌గా చెప్పాన్నేను. 'నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావని నా ఉద్దేశం' అంతే పదునుగా అన్నారాయన. మళ్లీ తనే వెుదలుపెట్టి వ్యవస్థలో అధికారుల పరిమితుల గురించీ వారిని నడిపించేది నాయకులేనన్న విషయాన్నీ నా మనసుకు హత్తుకునేలా చెప్పారు. ప్రధానపార్టీల్లో అగ్రవర్ణాధిపత్యం గురించి చెప్పారు. ఒక్కగంట... ఒకే ఒక్కగంట! ఆయన నాతో మాట్లాడింది. నాలో ఏదో కొత్త చైతన్యం. నా లక్ష్యం మారింది!!

రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న నా నిర్ణయాన్ని మానాన్న అస్సలు ఒప్పుకోలేదు. రాజకీయంగా దళితులకు మంచిరోజులొచ్చే అవకాశమే లేదని బలంగా నమ్మేవారాయన. 'కాన్షీరామ్ చెప్పేదంతా ఒట్టి హంబక్' అంటూ కొట్టిపారేశారు. 'చేరితే కాంగ్రెస్‌లాంటి పెద్దపార్టీల్లో చేరు, అంతేకానీ ఇలాంటి వాళ్లను పట్టుకుని ఏ కార్పొరేటర్‌గానో మిగిలిపోకు' ...ఇలా రోజూ వెుండిగా వాదించేవారు. మా వాదనల టగ్ ఆఫ్ వార్‌లో చివరికి అనుబంధం అనే తాడు తెగిపోయింది. 'కాన్షీరామ్‌తో మాట్లాడ్డం మానేసి, బుద్ధిగా ఇంటిపట్టున ఉండి మళ్లీ ఐ.ఎ.ఎస్.కు ప్రిపేరవ్వు లేదా ఇంట్లోంచి వెళ్లిపో' అని అల్టిమేటం జారీచేశారు నాన్న. నేను బయటికొచ్చేశాను.

కరోల్‌బాగ్‌లోని బీఏఎమ్‌సీఈఎఫ్ ఆఫీసులో మకాం. పొద్దున్నే స్కూలుకెళ్లి పాఠాలు చెప్పడం, మధ్యాహ్నం ఆఫీసుపని, సాయంత్రం లా క్లాసులకు హాజరు కావడం ఇదీ నా దినచర్య. కొద్దిరోజుల తర్వాత... 'నేను ఎప్పుడూ ఊళ్లవెంట తిరుగుతుంటాను, నువ్వు నా గదిలో ఉండు' అన్నారు సాహెబ్(కాన్షీరామ్). సరేనన్నాను. మా తమ్ముడు సిద్ధార్థతో కలిసి ఉండేదాన్ని. కానీ తెలిసినవాళ్లూ తెలీనివాళ్లూ అంతా బుగ్గలు నొక్కుకున్నారు. అంతెందుకు... సహచరులే మా ఇద్దరి మధ్యా సంబంధం ఉందని పుకార్లు పుట్టించారు. మాటలు కావవి... మనసును తూట్లు పొడిచే ఈటెలు. కానీ నేనెప్పుడూ సాహెబ్‌ను ఓ పెద్దన్నలా తండ్రిలానే చూశాను.

విద్యాధికులైన దళితుల సమాహారంగా తాను ఏర్పాటు చేసిన బీఏఎంసీఈఎఫ్ వల్లే బహుజన సమాజం రాదని గ్రహించారు కాన్షీ. అందుకు రాజకీయ అధికారమే కీలకం అన్న అంబేద్కర్ నినాదాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించారు. పొలిటికల్ పవర్ కావాలంటే సామాన్యజనంలోకి వెళ్లాలి. అలా పుట్టిందే బీఎస్పీ. 1984 ఏప్రిల్ 14న మేం పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టాం. అసలు బీఎస్పీని ఒక రాజకీయ పార్టీగా కంటే సామాజిక విప్లవంగా భావించాలి.

పార్టీ పెట్టగానే అద్భుతమేం జరిగిపోలేదు. అందుకు కొంచెం సమయం పట్టింది. 1984లో జరిగిన ఎన్నికల్లో కైరానా లోక్‌సభ నియోజకవర్గం నుంచి నేను తొలిసారి పోటీ చేశాను. అప్పుడు మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరుసటేడాదీ బిన్‌జోర్ నుంచి పోటీచేసి ఓటమి మూటగట్టుకున్నాను. గెలుపు రుచి చూసింది 1989లో. ఆ ఏడాది బిన్‌జోర్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యాను. ఆ క్షణాలు నాకిప్పటికీ మరపురానివి. 1993 జూన్ 3న మనదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన క్షణాలు కూడా! అప్పటికి నాకు 39ఏళ్లు.

అధికారం చేపట్టగానే నేను చేసిన వెుదటిపని దళితుల జీవనానికి భద్రత కల్పించడం. ఇందుకోసం రాష్ట్రంలోని సగానికిపైగా జిల్లాల్లో దళిత అధికారులను మెజిస్ట్రేట్‌లుగా 25శాతానికి పైగా పోలీస్‌స్టేషన్లలో వెనకబడినవర్గాల వారిని ఇన్‌చార్జ్‌లుగా నియమించాను. దీనిపై నామీద సవాలక్ష కామెంట్లు వచ్చాయి. వేటినీ లక్ష్యపెట్టలేదు. దళితులు అధికంగా ఉన్న గ్రామాలకు నిధుల్ని ప్రవహింపజేశాను. తార్రోడ్లూ చేతిపంపులూ వైద్యశాలలూ పక్కా ఇళ్లూ... వందల ఏళ్లుగా సమాజంలో అట్టడుగున ఉండిపోయిన వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. ముస్లింలకూ అనేక అవకాశాలు కల్పించాను. వారికీ రిజర్వేషన్లను కల్పించాలన్న 'యూపీ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కమిషన్' నివేదికను అమలు చేశాను. వీటన్నిటినీ నేను గర్వంగా చెప్పుకొంటాను.

మా పాత నినాదం 'తిలక్ తరాజూ ఔర్ తల్వార్, ఇన్‌కో మారో జూతే చార్'. దాన్ని మార్చుకొని సమాజంలో అన్ని వర్గాల మధ్యా సమతను సాధించాలని(సమతా ముల్క్ సమాజ్) అనుకోవడమే 2007 ఎన్నికల్లో మాకు సంపూర్ణ ఆధిక్యతను కట్టబెట్టింది. కేరళ నుంచి జమ్మూకాశ్మీర్ దాకా అన్ని రాష్ట్రాల్లోకీ విస్తరించడం, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక శాసనసభ స్థానం గెలుచుకోవడం, అనేక ఇతర రాష్ట్రాల్లో ఓట్లశాతాన్ని పెంచుకోవడం ఇవన్నీ మేం సాధించిన విజయాలే. కేంద్రంలో దళితులు అధికారం చేపట్టాలన్న అంబేద్కర్ కలలను సాకారం చేయాలన్నదే నా అంతిమ లక్ష్యం. దానికి సమయం పట్టొచ్చు. కానీ... ఆ లక్ష్యాన్ని సాధించడం మాత్రం ఖాయం. దేశాన్ని బీఎస్పీ ఏలేరోజు మరెంతోదూరంలో లేదు!

అంతా 'మాయ'
మాయావతికి ఆ పేరు వాళ్ల నాన్న ముచ్చటపడి మరీ పెట్టుకున్నది. ఆమె పుట్టిన క్షణం నుంచే ఆయనకు బాగా కలిసొచ్చింది. ఆరోజే ఆయనకు ఉద్యోగంలో ప్రవోషన్ వచ్చింది. మంచి డిపార్ట్‌మెంట్‌కు బదిలీ అయ్యారు. ఇక వసూలు కాదనుకున్న పాత అప్పు వసూలై చేతి నిండా డబ్బులు ఆడాయి. ఆయనకు అంతా మాయగా అనిపించి కూతురుకు అదే పేరు పెట్టారు.

No comments: