Saturday, November 15, 2008

భౌగోళిక, సామాజిక తెలంగాణ

తెలంగాణ, సామాజిక న్యాయ అంశాలు ప్రధాన రాజకీయ అంశాలుగా మారటం వల్లనే కాంగ్రెస్, టిడిపి మొదలైన పార్టీల అధినేతల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. ఈ నూతన రాజకీయ శక్తుల దెబ్బ కాచుకోవటం కోసం ఆ పార్టీలు తీసుకొంటున్న ఆత్మరక్షణా చర్యలే అందుకు నిదర్శనం.
తెలంగాణ, సామాజిక న్యాయం- ఇవీ, ప్రస్తు తం రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు లు. రాబోయే ఎన్నికలలో ప్రధానాంశాలు. రాజకీయ ప్రాధాన్యమున్నవే కాదు, అశేష ప్రజల ఆకాంక్షలకు సంబంధించిన అంశాలు. ప్రజల ఈ ఆకాంక్షలను తిరస్కరించే వారెవరూ ఎన్నికలలో విజయం పొందలేని గడ్డు పరిస్థితి ఏర్పడింది. తెలంగాణకు తాను వ్యతిరేకి ని కానని చిరంజీవి, సామాజిక న్యాయానికి వ్యతిరేకిని కానని కెసిఆర్ ప్రకటించారంటే ఆ గడ్డు పరిస్థితిని దృష్టిలో ఉంచుకొనేనన్నది స్పష్టం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏకకాలంలో ఈ రెండు అంశాలు రాష్ట్ర రాజకీయాలను ఇంతగా ప్రభావితం చేయడం ఇదే మొదటిసారి. అయితే ఈ అద్భుత పరిణామం అనేక మంది భావిస్తున్నట్లు కేవలం తెరాస, నవ తెలంగాణ, ప్రజారాజ్యం వంటి కొత్త పార్టీల వల్ల వచ్చింది కాదు. ఇంతవరకూ ఏ తెలంగాణ రాజకీయ సంస్థా సామాజిక న్యాయం గురించి మాట్లాడలేదని, చిరంజీవి, దేవేందర్ గౌడ్‌లతోనే కొత్త చరిత్ర ఆరంభమయిందనీ ఆదివాసీ, దళిత, బహుజన వర్గాల నుంచి వచ్చిన కొందరు విశ్వవిద్యాలయ మేధావులు సైతం మాట్లాడటం విస్మయం కల్గిస్తోంది.

చిరంజీవికి తెలంగాణ కొత్త కావచ్చు కాని ఆయన ఇచ్చిన సామాజిక న్యాయ నినాదం తెలంగాణకు కొత్త కాదు. రాష్ట్రానికీ కొత్త కాదు. సామాజిక ఎజెండాతో తెలంగాణలో పర్యటించిన చిరంజీవిని అడ్డుకోవడానికి కోడిగుడ్లతో దాడిచేసి మళ్ళీ తెలంగాణలో తిరగబోనివ్వమని హుకుం జారీచేయడానికి తెలంగాణ కెసిఆర్ వంటి వారి జాగీ రేం కాదు. అంతేకాదు కొందరు అంటున్నట్లు తెలంగాణలోను, రాష్ట్రంలోను సామాజిక న్యాయం విశ్వవిద్యాలయాల తరగతి గదులకు, మేధావుల సదస్సులకే పరిమితమై లేదు.

1994 ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ', 1999 ఎన్నికల్లో 'మహాజన ఫ్రంట్', 2004 ఎన్నికలలో 'సామాజిక న్యాయ ఫ్రంట్' ద్వారా, 2006లో ఏర్పడి న ప్రజా ఫ్రంట్ ద్వారా 15 ఏళ్ళుగా రాష్ట్ర రాజకీయా ల్లో సామాజిక న్యాయం ముఖ్యాంశంగా ప్రభావం చూపుతూనే ఉంది. 'ఓట్లు మావి సీట్లు మీవా? ఇక పై సాగదు రాజ్యాధికారంలో అగ్రకుల పెత్తనం' 'మావెన్ని ఓట్లో మాకన్ని సీట్లు', 'మేమెంత మందిమో మా కంతా వాటా' 'పెత్తందార్ల రాజ్యం కాదు ప్రజారాజ్యం' 'రాయితీలు కాదు రాజ్యాధికారం' 'ఆత్మగౌరవం-సామాజిక న్యాయం-రాజ్యాధికారం'అనేనినాదాలు రాష్ట్రమంతటా మార్మోగేలా సామాజిక ప్రజాస్వామిక రాజకీయ ఉద్యమాన్ని నిర్మించిన చరిత్ర రాజకీయ ప్రజా ఉద్యమ శక్తులదే తప్ప చిరంజీవిదీ కాదు, దేవేందర్ గౌడ్‌ది అంతకన్నా కాదు. 2001లో తెరాస ఏర్పడక ముందే 1996 నుంచి (ఇంకా వెనక్కి వెళితే 1989, 1993 నుంచీ)అయిదేళ్ళపాటు ఉధృతస్థాయిలో తెలంగాణ ఉద్యమం వార్తల్లో ఉంది.

1996-97 నాటికి 'తెలంగాణ జనపరిషత్', 'తెలంగాణ (దళిత బహుజన) మహాసభ', 'తెలంగాణ జనసభ' లాంటి ప్రధాన ప్రజా ఉద్యమ సంస్థలు ఏర్ప డి తెలంగాణ ఆకాంక్షలకి ప్రజా ఉద్యమరూపమిచ్చా యి. 1997 ఆగస్టులో 'బహుజన రిపబ్లిక్ పార్టీ', అలాగే 'తెలంగాణ మహాసభ'ల ఆధ్వర్యంలో వరంగల్‌లో, భువనగిరిలో జరిగిన తెలంగాణ ప్రభంజన సభల్లో 'ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం', 'తెలంగాణ రాష్ట్రంలో దళిత బహుజన ప్రజారాజ్యం' స్థాపనకోసం పిలుపునిస్తూ ఆనాడే భౌగోళిక తెలంగాణకు సామాజిక న్యాయాన్ని జోడించడం జరిగింది. 1997 డిసెంబర్‌లో వరంగల్ సభ 'తెలంగాణ డిక్లరేష న్', 1998 జూలైలో హైదరాబాద్‌లో జరిగిన 'తెలంగా ణ జన సభ', తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షని ప్రజాస్వామిక ఆకాంక్షగా పరిగణించి ప్రజల 'ప్రజాస్వామిక తెలంగా ణ' ఏర్పాటుకు, 'తెలంగాణలో ప్రజారాజ్యం' స్థాపనకు పిలుపు నివ్వడం జరిగింది.

అలాగే 2000 మార్చిలో హైదరాబాద్‌లో జరిగిన 'సామాజిక న్యాయ ఉద్యమ వేదిక' ఆవిర్భావ సదస్సు లో భౌగోళిక బహుజన ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షలకు ఉమ్మడి సిద్ధాంత భూమికను సమకూర్చ డం జరిగింది. అంతే కాదు 'రెండు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాల్లో మహాజన రాజ్యం' స్థాపన లక్ష్యంతో, సామాజిక న్యాయం ప్రధాన ఎజెండాతో 2002 ఏప్రిల్‌లో మహాజన పార్టీని స్థాపించడం జరిగింది. అయితే 2001లో కరీంనగర్‌లో కెసిఆర్ నేతృత్వంలో ఏర్పడిన తెరాస తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయంగా మలుపు తిప్పటమే కాక మరో మలుపు కూడా తిప్పింది. 'భౌగోళిక తెలంగాణ ముందు, సామాజిక తెలంగాణ తర్వా త' అనే రెండు దశల ఎత్తుగడతో ఏర్పడిన రెండు నెలలకే 2001 జూలైలో అదే కరీంనగర్‌లో తెలంగాణ సద స్సు నిర్వహించి 'దొరల తెలంగాణ కాదు, ప్రజల తెలంగాణ' కావాలని, భౌగోళిక తెలంగాణకి సామాజి క న్యాయం అంశాన్ని జోడించక తప్పదని తీర్మానించింది.

తెరాసకు సమాంతరంగా సామాజిక తెలంగాణ ఎజెండాని తెలంగాణ అంతటా విస్త­ృతంగా ప్రచారం జరిపింది. చివరకి తెరాస తెలంగాణ ఉద్యమాన్ని కూడా కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టడంతో 2005 జూన్‌లో హైదరాబాద్‌లో జరిగిన 'తెలంగాణ యునైటెడ్ ఫ్రం ట్' ఆవిర్భావ సభ భౌగోళిక తెలంగాణకి సామాజిక తెలంగాణ అంశాన్ని జోడిస్తూ తీర్మానించింది. అదే కోవలో 2006 నవంబర్ 1న హైదరాబాద్‌లో జరిగిన 'తెలంగాణ మహాజన సమితి' సదస్సు 'తెలంగాణ రాష్ట్రాన్ని సాధిద్దాం, తెలంగాణలో మహాజన రాష్ట్రాన్ని స్థాపిద్దాం' అని పిలుపునిచ్చింది. ఇలా దశాబ్దంనర కాలానికి పైగా, ఈ ఉమ్మడి ఎజెండాతో అశేష ప్రజల ఆకాంక్షల్ని తృతీయ ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమంగా మలవడమైంది.

ఈ ప్రజా ఉద్యమ శక్తుల నిరంతర నిస్వార్థ కృషి ఫలితమే నేటి రాజకీయ పరిణామం. అంతే తప్ప ఇది కేవలం ఉద్యమేతర శక్తుల ప్రతాపం కాదన్నది ఓ చారిత్రక వాస్తవం. ఎజెండా ప్రజా ఉద్యమాలది జెండా మాత్ర మే వారిది. అయితే ఈ ప్రజా ఉద్యమశక్తులు రాజకీయ శక్తులుగా మారకపోవటం, మారిన శక్తులు అంతగా రాణించకపోవటం జరిగింది. రాజకీయరంగంలో ఏర్పడిన ఈ తృతీయ ప్రత్యామ్నాయ రాజకీయ శూన్యాన్ని భర్తీ చేసి లబ్ధిపొందే రాజకీయ ఎత్తుగడలతో డబ్బు-పలుకుబడి ఉన్న ఉద్యమేతర శక్తులు రాజకీయ రంగ ప్రవేశం చేశాయి. తెరాస, నవతెలంగాణ, ప్రజారాజ్యం లాంటి నూతన పార్టీలు ఆవిర్భవించాయి. తెలంగాణ, సామాజిక న్యాయ అంశాలు ప్రధాన రాజకీయ అంశాలుగా మారటం వల్లనే కాంగ్రెస్, టిడిపి మొదలైన పార్టీల అధినేతల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయన్నది కూడా కాదనలేని వాస్తవం.

ఈ నూతన రాజకీయ శక్తుల దెబ్బ కాచుకోవటం కోసం ఆ పార్టీలు తీసుకొంటున్న ఆత్మరక్షణా చర్యలే అందుకు నిదర్శనం. అయి నా వాటిని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఈనూతన రాజకీయ పార్టీలు రాజకీయరంగంలో ఇంత బలం గా ఉనికిలో లేకుంటే పై పార్టీలు తెలంగాణ సామాజిక న్యాయం గురించి ఇంతగా పట్టించుకొనేవే కావు. అయితే ఈ నూతన రాజకీయ శక్తులు భౌగోళిక, సామాజిక, ప్రజాస్వామ్య తెలంగాణ ఎజెండాని ఉమ్మ డి ఎజెండాగా సమన్వయం చేసుకోకపోతే గత 15 ఏళ్ళ నుంచి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిర్మించిన ఈ ఉద్యమాల ఫలాలు ప్రజలకు దక్కవు. అరుదైన ఈ చారిత్రక సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రజ ల ఆంకాక్షల్ని నెరవేర్చటానికి, రాజకీయాల్లో మౌలికమై న మార్పు సాధించడానికి ఈ రెండు ఎజెండాలకి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజకీయ శక్తులే తృతీయ ప్రత్యామ్నాయ రాజకీయ సమీకరణకు పూనుకోవాల్సి ఉంది.

- ఉ.సా (సత్యశోధన సామాజిక అధ్యయన వేదిక)
ఆంధ్రజ్యోతి 15 నవంబర్ 2008

1 comment:

mahboob said...

Hi, I am trying to contact ఉ.సా.

If you have can you pl let me know his mobile number or email id?

Best Regards,
-- Mahboob