Friday, August 29, 2008

తెలంగాణ అస్తిత్వమూ, ఆంధ్రమహాసభలూ! - - పి.రామకృష్ణ

రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో (ముఖ్యంగా శ్రీకాకుళం) సాహిత్య, కళారూపాల్లోనూ ప్రజలపరంగానూ ఉన్న ప్రాంతీయ స్ప­ృహ ప్రాంతీయ అస్తిత్వంగా ఎందుకు మారలేదు? వెనుకబడిన ప్రాంతమే అయిన తెలంగాణలో మాత్రమే ప్రాంతీయ అస్తిత్వం ఎందుకు ఏర్పడినట్టు? ఈ అంశంపై చర్చా, ఇందుకు సంబంధించి రాయలసీమ, శ్రీకాకుళం ప్రాంత రచయితల అభిప్రాయాలూ ఆ మధ్య 'వివిధ'లో వెలువడ్డాయి. రాయలసీమలో చెప్పుకోదగిన ఉద్యమాలేవీరాలేదు.

శ్రీకాకుళంలో వచ్చినా, ఆ తర్వాత అవక్కడ నిలబడలేకపోయాయి. తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటం ఆశించిన ఫలితాలను మిగిల్చకపోయినా, దాని ప్రభావం మిగిలింది. 'బాంచన్ కాల్మోక్తా' అన్న మనిషి ' ఊరు మనది, నీరు మనది, భూమి మనది' అనే అస్తిత్వానికి ఎదిగాడు. అక్కణ్ణుంచి వెలువడే సాహిత్య కళారూపాలు ఆ అస్తిత్వాన్నే ప్రకటిస్తున్నాయి. దాదాపుగా ఈ అభిప్రాయాన్నీ పై రెండు ప్రాంతాల రచయితలూ వ్యక్తం చేశారనుకుంటున్నాను.

సాయుధ పోరాటానికి ముందూ, ఆ తర్వాత అన్న రెండు దశలుగా తెలంగాణను చూడవలసి వుంటుందన్నదే ఇంతవరకూ వున్న సాధారణ అభిప్రాయం. సాయుధ పోరాటానికి ముందు ఆంధ్ర మహాసభ తెలంగాణను కొంత చైతన్యపరచినట్టు తెలిసినా, పూర్తి సమాచారం అందుబాటులోనికి రాలేదు. అందువల్ల ఆ భాగం మనకు తెలియని మన చరిత్రగానే వుండిపోయింది. ఇప్పుడు 'తెలంగాణలో చైతన్యం రగిలించిన నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు' అన్న పేరిట కె.జితేంద్రబాబు రెండు భాగాలు వెలువరించారు. ఇంకా మూడు భాగాలు రానున్నట్టు చెప్పారు. ఈ రెండు భాగాలలో వున్న సమాచారమే మనల్ని ఆశ్చర్యానందాల్లో ముంచెత్తుతుంది. వర్తమాన రాజకీయాల్లోనూ, సంస్థల్లోనూ, సంఘాలలోనూ నెలకొన్న పరిస్థితి చూస్తూ క్రుంగిపోతున్న హృదయాలకు ఊరటనీ, ఉత్తేజాన్ని కలిగిస్తుంది.

'అవునా! ఆంధ్ర మహాసభ అంతటి క్రమశిక్షణతో, అంతటి పారదర్శకతతో, అంతటి ప్రజాస్వామిక దృక్పథంతో, ఇప్పుడు ఊహించడానిక్కూడా వీల్లేనంత ఉన్నతస్థాయిలో నడిచిందా!' అని ఆశ్చర్యం కలుగుతుంది. సమాచారం ఎప్పటిదో అయినా ఇంత ఆశావహ సమాచారాన్ని అందిస్తున్నందుకు జితేంద్రకు అభినందనలూ, కృతజ్ఞతలూ చెప్పకుండా వుండలేము. 'ఈ గ్రంథంలో నేను రాసింది తక్కువ. సేకరించింది ఎక్కు వ. లభ్యమైన సమాచారాన్ని నేను దండలా కూర్చాను. తప్పితే, భాష విషయంలోనూ, భావం విషయంలోనూ, నేను చేసిన మార్పులేవీలేవు. ప్రచురించిన సమాచారమంతా ఆనాటి పత్రికల్లోనూ ముఖ్యంగా గోలకొండ పత్రిక ప్రచురించిన వ్యాసాల్లోంచి, ఉపన్యాసాల పత్రాల్లోంచి రిపోర్టులనుంచి యధాతథం గా సేకరించి ప్రచురించినదే' (రెండవ భాగం 'నామాట' లో జితేంద్ర).

'సమాచారం ఎప్పటిదో అయినా' అన్నాను కానీ ఒక రకంగా ఈ సమాచారం ఇప్పటిదేననీ అనవచ్చు. జితేంద్ర కూర్చిన ఈ దండలో వున్న పూలు (సమాచారం) అప్పటప్పటికి సహజంగా పూచినవే. అంటే, ఇప్పటికే తాజావే. ఒకరినుంచీ మరొకరికి అం దడంలో వుండే కాలుష్యం, లేదా కల్పన ఇందులో వుండేందుకు వీల్లేదు. కనుక, ఉన్నదంతా విశ్వసనీయ సమాచారమే. మొదటి భాగంలో నాలుగు చోట్ల....అంటే జోగిపేట, దేవర కొండ, ఖమ్మం, సిరిసిల్లాలో జరిగిన ఆంధ్రమహాసభల సమాచారమూ, రెండోభాగంలో షాద్‌నగర్, నిజామాబాద్‌లలో జరిగిన సభల సమాచారమూ ఉంది.

నిజాం పరిపాలనకు సంబంధించీ, ఆంధ్ర మహాసభ ఆవిర్భావానికి ముందటి పరిస్థితి గురించీ, మహాసభల నిర్వహణపై గోలకొండ పత్రికలో ఎప్పటికప్పుడు వెలువడిన సమీక్షలూ సలహాలకు సంబంధించీ ఎంతో సమాచారం మొదటి భాగంలో వుంది. ఆంధ్రమహాసభలోనూ ఆ తర్వాత సాయుధ పోరాటంలోనూ పాల్గొన్న ఎ.గురవారెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి చెప్పిన ఉద్యమ విశేషాలు మొదటి, రెండవ భాగాల్లో ముందు మాటలుగా వున్నాయి. మొదటి భాగం, 563 పేజీలతో ఉండగా, రెండవభాగం, 705 పేజీలతో ఉంది.

ఈ రెండు భాగాల్లో ఉన్న సమాచారమూ, రానున్న భాగాల్లో ఉన్న సమాచారమూ ఇప్పటికీ బతికి ఉండటమూ, దాన్ని సేకరించి ప్రచురించడమూ అంతా అద్భుతమనాలి. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయం ఇప్పటికీ హామీల్లోనే ఉండగా ఫ్యూడల్ తెలంగాణలో ఒకవైపున స్త్రీలు పరదాలు లేకుండా బయటికి రాలేని స్థితి ఉండగా, ఎందరో మహిళలు ఆంధ్రమహాసభల్లో పాల్గొనడం ఆశ్చర్యంగా లేదా? ఇప్పటికీ పురుషులు జరుపుకునే సభల్లో, ఆకర్షణ కోసమో, ప్రత్యేకత కోసమో అన్నట్టుగా మహిళలకు ప్రసంగించే అవకాశం ఇస్తుండగా, మహిళలు ప్రత్యేకంగా మహాసభలు జరుపుకోగలగడం ప్రశంసనీయమైన ప్రజాస్వామికం అనిపించదా?

సభల నిర్వహణకు పదిరూపాయల నుంచి రూపాయి వరకూ విరాళం ఇచ్చిన వారి పేర్లు ప్రకటించి, మిగిలిందెంతో, ఎక్కడుందో తెలియజేయడం...క్రమశిక్షణా, నిజాయితీ, పారదర్శకతా కాదా? వేదిక వద్ద మహిళలకు మరుగుదొడ్లూ, స్నా నాల సౌకర్యమూ, బస వసతీ కల్పించడం ఎంత బాధ్యతాయుతం అనుకోవాలి? మహాసభలకు వెళ్ళే వారికి మార్గమధ్యంలో ఆయా గ్రామాల ప్రజలు ఆహ్వానం పలికి ఆతిధ్యమిచ్చే వారంటే ఉత్తేజం కలిగించదా? తీర్మానాలలోనూ అస్ప­ృశ్యతా నివారణ, స్త్రీ వారసత్వపు హక్కు, నిర్బంధ విద్య, మాతృభాషలో ఉన్నతవిద్య, రైతుల విషయంలో కొన్ని డిమాండ్లూ లాంటివి ఉండటం చారిత్రక దృష్టితో చూస్తే విశేషాలే

వీటికంటే, మహిళల సభకు అధ్యక్షత వహించిన మహిళల ప్రసంగాలు స్త్రీ చైతన్యంతో నిండివున్నట్టు చెప్పితీరాలి. వ్యాసపరిధి మించుతుందేమోనన్న భయం వున్నా,మూడవ ఆంధ్ర మహిళాసభకు అధ్యక్షత వహించిన ఎల్లాప్రగ్గడ సీతాకుమారి ప్రసంగం ఎల్లాగైనా కొంత చెప్పాలనిపిస్తోంది. 'చాలా మంది స్త్రీలకు అనేక శతాబ్దముల నుండి స్త్రీ స్థిరచరాస్తులతో పాటు పురుషుల స్వాధీనమైయుండుటే అలవడిపోయినందున, తాము హీనదశయందున్నామని కానీ, తమకు కొన్ని సంస్కరణలు అవసరమని కానీ తెలియనే తెలియదు. స్త్రీలు కేవలము గృహనిర్వహణము, లలిత కళలు మాత్రమే. నేర్వవలయుననియు, పురుషలతో పాటు విద్య అనవసరమనియూ కొందరభిప్రాయ పడుతున్నారు.

కానీ, స్త్రీలకు విద్యా విషయమున రక్షణలు, మినహాయింపులేని సంపూర్ణ స్వాతంత్య్రము కావలెను. స్త్రీ సంఘమంతయు కేవలము ఈ యీ విద్యలను మాత్రమే నేర్వవలయునని శాసించుటకు ఎవ్వరికినీ అధికారము లేదు' 'ఈ విశాల ప్రపంచమున స్త్రీకి నాదియని చెప్పుకొనుట కేదియునుండదు. తండ్రి ఇంటినుంచికానీ, భర్త ఇంటినుంచి కానీ అమెకొక్కపైసా కూడా రాదు. ఉదారుడగు భర్తయు, విధేయురాలగు భార్య సమకూడిన యెడల భర్త దయదలచి నగలు చీరెలు కొని ఇచ్చుట కలదు. అందువలన స్త్రీల కేమియు లాభము లేకపోగా, పురుషులు ఇచ్చవచ్చినప్పుడు దాచుకొనుటకును, సమయము వచ్చినప్పుడు తీసుకొనుకును ఉపయోగించు ధనపు పెట్టెలుగా మాత్రము పనికి వచ్చుచున్నారు.

ఈ విశాల ప్రకృతిలో, ఇన్ని కోట్ల జీవరాసులలో ఒక్క భారత స్త్రీ తప్ప, మరి ఏ ప్రాణియు తమ జీవన భారమును పురుష జీవిపై మోపుట లేదు' ఇంతకు మించిన ఆత్మ గౌరవం ఫెమినిజమ్‌లోవుందా? రైతాంగ సాయుధ పోరాటానికి తెలంగాణ రైతులు సంసిద్ధపడకముందే ఆంధ్ర నాయకత్వం వాళ్ల నెత్తిన మోపిందన్న అంశం చర్చనీయం అనిపిస్తోంది. ఎవరో బయటివాళ్లు బలవంతంగా రుద్దితే, అంతటి మహత్తర సాయుధ పోరాటం సాధ్యమయ్యేదా.. అనిపిస్తుంది. సాయుధ పోరాటానికి అవసరమైన వాతావరణం తెలంగాణలో ఉండిందన్నది నిర్వివాదాంశం.

ఆంధ్రమహాసభ కృషిని వివరిస్తున్నట్టే, సాయుధ పోరాటం గురించి కూడా డాక్యుమెంట్లతో ఆధారాలతో జితేంద్రో, జితేంద్ర లాంటి మరొకరో తెలియజేస్తే, ఆంధ్ర నాయత్వం మీదున్న ఆరోపణ నివృత్తి కావడమో, నిర్ధారణ అవడమో జరగవచ్చు. మళ్ళీ వ్యాస ప్రారంభానికి, ప్రాంతీయ స్ప­ృహ, అస్తిత్వం దగ్గరికొస్తే, 'తెలంగాణలో చైతన్యం రగిలించిన నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు' గ్రంథాలలో ఉన్న సమాచారమూ, రానున్న సమాచారమూ తెలంగాణలో ఉన్న అస్తిత్వం మిగతా ప్రాంతా ల్లో ఎందుకేర్పడలేదో తెలుసుకోవడానికి సహాయపడవచ్చు... అనిపిస్తుంది.
ANdhra Jyothy (5-5-2008)

No comments: