Wednesday, August 27, 2008

నా కలల తెలంగాణ -

తెలంగాణ మట్టి బిడ్డల
పాదాలకు మొక్కి
వాళ్ల మనసులో జాగా పొందిన నేతలంతా ధన్యులు
ధోకా చేయటం తెలియని
మా గోసిగుడ్డల అవ్వల అయ్యలు దీవిస్తేనేగా
ఎవరైనా జాతి నేతలయ్యేది

మా సదానందమన్నట్లు-దేవేంద్రా-
ఎందరో విప్లవకారుల ప్రాణాలు
గాలిలోకి ఎగిరినప్పుడు
నీ చేతులకంటిన నెత్తుటి మరకలను తుడిచేసుకుని
ఆ కాల్పులన్నీ బూటకమని గొంతువిప్పు
ప్రజాస్వామ్య తెలంగాణ పాట పాడు
ప్రజాస్వామ్య తెలంగాణ ఆకాశంలో
పాలపిట్టల రెక్కలల్లార్తు

కెసీఆర్ రాజీనామాలన్నప్పుడల్లా
ఉద్యమ పొత్తిళ్లల్లోకి రా బిడ్డా అని పిలిచినోణ్ణి
ఇప్పుడు పాలపిట్టరంగు జెండాను నోరారా
పిలుస్తున్నా-

వాకిళ్ల ముందు తెలంగాణ ముగ్గేద్దాం
మా పెరళ్లలోని స్థానికతను తవ్వి బచ్చలాకు చేసి
ఊదారంగు పందిరేద్దాం
ఈ మట్టిది పోరు అక్షరమాల
మన తల్లులు జన్మనిచ్చి పోరాటం నేర్పిండ్రు
ఉగ్గుపాలల్లో ఆత్మగౌరవాన్ని నూరిపోసిండ్రు
బిగించిన పిడికిళ్ల నిచ్చిండ్రు
మన తండ్రులు కుట్రలు నేర్పలేదు
శత్రువులకు ఆసరా కావొద్దన్నరు
ఫికర్ లేదు-
విడివిడిగా విడిపోయి ఏకమౌదాం-
మన జెండా తెలంగాణ పటం
భావాలు ఎన్ని జెండాలైనా కానియ్
మనందరం తెలంగాణ చౌరస్తాలో కలుద్దాం
అన్నిదారుల్లోంచి
మహా తెలంగాణ రస్తాలో కలుద్దాం
ఇప్పుడు నేను ప్రాంతీయ దేశభక్తుల
జాబితా తయారు చేస్తున్న
ఉద్యమ గణాంకశాఖను

నీళ్లు, నిధులు, ఉద్యోగాలు
ముంబయ్, బొగ్గుబాయి, దుబాయ్
ఫ్లోరోసిస్‌తో పోరుభూమి వంకర్లు
బిడ్డల్ని అమ్ముకుంటున్న నా జొన్నరొట్టెలు
అడవిలో నెత్తుటి రంగేసుకున్న చెట్లు
హోలిర హోలీ చెమ్మకేళిర హోలీ
దేవేంద్రా ఇన్నాళ్లూ ఎక్కడ పాయె - నీ తెలంగాణ

ఇది కెసిఆర్, దేవేంద్రో పాడే పాట కాదు
ఆధిపత్యానికి తలకొరివి ఎవరు పెట్టినా
మన స్వపరిపాలన గేట్లు ఎవరు తెరిచినా
ఆత్మగౌరవ నినాదమై ప్రతిధ్వనిస్తాం-
నినాదాల నుంచి ఓట్ల జాతర్ల నుంచి
ఉద్యమబాటకొచ్చేవాళ్లందరికి వాలేకుమ్‌సలామలేకుమ్-
కెసిఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో
దేవేందర్ జెండా పట్టుడో
ఇవన్నీ మామూలు మాటల తూటాల వ్యూహాలు
తెలంగాణ వచ్చుడే నిజం
దాన్నాపటం ఎవనితరం కాదని చెపుదాం
వచ్చే తెలంగాణ ఎట్లుండాలో ఇపుడే గీసుకుందాం-
తెచ్చుకునే తెలంగాణ ఎట్లుండాలో
ఇపుడే రాసుకుందాం-
ఈ కన్నీళ్ల కొడవళ్లకు సమాధానాలు కావాలె
దొడ్డి కొమురయ్య నెత్తుటికి జవాబుకావాలె
ఐలమ్మల బతకు మారాలె
పూరుకు వాడకు మధ్య బెర్రలు చెరగాలె
ఇంతెందుకన్నా
బహుజన తెలంగాణ యాత్ర మొదలుకావాలె
పౌరహక్కులు గాయపడని నేల
చెట్లకు తుపాకులు పూయని నేల
మన సెరువుల నిండా కలువలు,
తామరలు విచ్చుకునే నేల
ఆధునిక దొరల పెత్తనాలు లేని అమ్మతనపు నేల
అన్నా అని పిలిస్తే
గుండెనిండా ఆత్మగౌరవం ఉప్పొంగే నేల
ఇది నా తెలంగాణ నేల
నేను కలలుకంటున్న తెలంగాణ నేల
అన్నా దేవేంద్రా
మనకు వూరికి
పిడికెడు మంది ప్రకాశం పంతుళ్లున్నరు
గల్లీగల్లీలో కొమురం భీమ్‌లున్నరు
ఉద్యమాలకే వన్నెతెచ్చినోళ్ళున్నరు
మనకు సావులు కొత్తకాదు
సమ్మక్క, సారక్కలమై పుడుతూనే ఉంటం-
ఉద్యమానికి జీవం పోసి
నిప్పుల ఉప్పెనలోకి ఒక్క ఉదిటిన దూకిన వాళ్లనే
ఈ నెల కౌగిలించుకుంటది
వాదాన్ని చీల్చకుండా
దయ్యాల వేదాలు వల్లించకుండా
ఉద్యమ గీతానికి తొలి పల్లవి అవుదాం రా
ఈ మట్టి మీద వొట్టు పెట్టి చెప్పు
దేశానికే ఎర్ర జెండానిచ్చింది ఈ నేలేగా
రాఘవులూ-
అమ్మతోడు సురవరం నిశాని ఏసిండు
నారాయణ ఎప్పట్నించో అరుస్తనే వుండు
రవ్వంత గోరంత కూసింత
మనసు మార్చుకోవా?
ప్రత్యేకతపై అస్తిత్వ సంతకం చేయవా?

మళ్ళీ మళ్ళీ చెబుతున్నా
సరైన సమయానికి సరైన నిర్ణయం దేవేంద్రునిది
కాదంటావా చెప్పు బాబూ!
చెన్నమనేని మొఖమాటం లేకుండా తెగేసి చెప్పిండు
తమ్ముడు సాగర్ ఎప్పట్నుంచో తనే యిస్తనంటున్నడు
పెద్ద మనుషులు కాకా, పురుషోత్తములు చెప్పినంక
గింతకంటె మంచి సమయమెప్పుడొస్తదే
సెప్పుండ్రి...
ఈ మట్టి మీద పుట్టిన నేతలారా!
జొన్న రొట్టెల మీదొట్టు
బతుకమ్మ మీదొట్టు
సమ్మక్క సారలమ్మ మీదొట్టు
దొడ్డి కొమరయ్య, ఐలమ్మల మీదొట్టు
ఎవరడ్డు పడినా తెలంగాణ రాకతప్పదు

-జూలూరు గౌరీశంకర్

No comments: