Wednesday, August 27, 2008

తెలంగాణ కోరుతున్నది స్వపరిపాలన - వెలిచాల కొండలరావు

ఆర్థికాభివృద్ధి కంటే ఆత్మగౌరవం ముఖ్యం. ప్రత్యేక తెలంగాణ వాదం సారాంశమిదే. తెలంగాణ ప్రజలు కోరుతున్నది స్వేచ్ఛ, స్వపరిపాలన. వారి 'సెంటిమెంటు'కు ఉపశమనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికాభివృద్ధిని తాయిలంగా ముందుకు తోస్తున్నది! ఆర్థికాభివృద్ధి తెలంగాణ వాదులను సంతృప్తిపరచదని సమైక్యవాదులేకాదు విభజనవాదులు కూడా గుర్తించాలి. తెలంగాణ ప్రజలు తమకు జరిగిన అన్యాయాలను, తెలంగాణేతర పరిపాలకులు తమ పట్ల చూపిన వివక్షను మరిచిపోయే స్థితిలో లేరిప్పుడు. సమైక్య రాష్ట్రం పట్ల వారి మనసు విరిగిపోయింది.

అభివృద్ధి మాత్రమే అవమానాలను మరిపించగలదా? తెలంగాణ 'సెంటిమెంటు'కు అసలు సిసలైన కార ణం తెలంగాణేతర నాయకత్వం తెలంగాణ ప్రజల పట్ల చూపిన నిర్లక్ష్యం, చెలాయించిన పెత్తందారీ తనం. ఈ చేదు వాస్తవాలను పట్టించుకోకుండా అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడటం, అప్పుడు చేయనిది ఇప్పుడు చేస్తామని మభ్య పెట్టడం, మాటల గారడీతో మసిపూసి మారేడు కాయ చేయడమే అవుతుంది . నేను విద్యావేత్తను. తెలుగు భాషాభిమానిగా ' సమైక్యవాది'ని. ప్రత్యేక తెలంగాణ వాదం తొలుత నాకు విస్మయం కల్గించినా దశాబ్దాల వేర్పాటు ఉద్యమాల చరిత్ర నన్ను భిన్నంగా ఆలోచింపచేసింది.

ఆనాటి హైదరాబాద్ సంస్థా నంలో తెలుగులు, కన్నడిగులు, మరాఠీలు అన్నదమ్ముల్లా సహజీవనం చేశారు. సంస్థానం మూడు భాగాలుగా విడిపోయిన దరిమిలా కన్నడిగులు కర్ణాటకలో, మరాఠీలు మహారాష్ట్రలో కలిసిపోయాక, ఆంధ్రప్రదేశ్‌లో కలిసిపోయిన తెలంగాణ వారిలాగా మానసిక ఒత్తిళ్ళకు ఎందుకు గురికాలేదు? నాకు తట్టిన సమాధానాలు:

(అ) 1956లో ఏకమైన తెలుగువారు 1969 వరకు కూడా 'జోడి కుదరని దంపతుల్లాగా' మాత్రమే కలిసివున్నారు; (ఆ) ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య భావోద్వేగపరమైన పొంతన, సాంస్క­ృతిక సంఘీభావం కుదరలేదు; (ఇ) ఇది తెలంగాణుల్లో ' పరాయీకరణ భావాన్ని' కలుగజేసింది. న్యాయబద్ధమైన ప్రయోజనాలలో జరిగిన అన్యాయాలు, అవమానాలు వారిని విభజనోద్యమానికి నెట్టాయి; (ఈ) సొంత గడ్డపై 'పరాయీల'మవుతున్నామన్న అంతర్గత మనో కలవరం తెలంగాణవారిలో పరాకాష్ఠకు చేరింది. ప్రత్యేక తెలంగాణ మాత్రమే తమ సమస్యలకు పరిష్కారమనే దృఢ నిశ్చయానికి వచ్చేట్టుచేసింది; (ఉ) ఈ దృఢనిశ్చయమే 1969 నుంచి వారిని ఉద్యమింపచేస్తోంది; (ఊ) తెలంగాణలో వనరుల కొరత లేకపోయినా పరిపాలకులుగా ఉన్న ఆంధ్రనాయకులు వాటిని తెలంగాణ ప్రాంత అభివృద్ధికి వినియోగించలేదు; (ఎ) తెలంగాణేతర నాయకులు ఎప్పుడూ తమను తాము 'ఇచ్చేవారు'గా పరిగణించుకొని, తెలంగాణ వారిని 'అడుక్కునే' వారిగా చూచారు; (ఏ) తెలంగాణేతర నాయకత్వం చేతుల్లో తెలంగాణవారు అనుభవించిన పెత్తందారీ ఆరళ్ళు మహాష్ట్రులు, కన్నడిగులు తమరాష్ట్రాల్లో అనుభవించలేదు.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడక పూర్వమే తెలంగాణ వారికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆలోచన ఉందనడానికి ఫజల్ అలీ కమిషన్ నివేదికే నిదర్శనం. ఆ నివేదిక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాం ఛనే కాక దాని ఆచరణ సాధ్యాన్ని కూడా సూచించింది. ఒక్క తెలంగాణను మాత్రమేకాక మరికొన్ని చిన్న రాష్ట్రాలను కూడా ఏర్పాటుచేయాలని సిఫారసు చేసింది. వాటి ఆర్థిక సుస్థిరతకు కొన్ని మార్గదర్శక సూత్రాలను సూచించింది. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ఆయా ప్రాంతాల వారి ఆకాంక్షలతో పాటు ఆ ప్రాంతాల ఆర్థిక సుస్థిరతకు చెందిన అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఫజల్ అలీ కమిషన్ నివేదిక పేర్కొంది.

ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల 'మానసిక సంతులనం' లేని కలయికను ఆనాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ గుర్తించారు. ఆంధ్ర, తెలంగాణల విలీనం 'పొం తన లోపించిన పెళ్ళిలాంటి'దని, వారెప్పుడు విడిపోదలుచుకుంటే అప్పుడు విడాకులు పుచ్చుకోవచ్చని ఆయన బహిరంగంగానే సూచించారు. తెలంగాణవారు మున్ముందు 'ప్రత్యేక తెలంగాణ' కోరవచ్చని నెహ్రూ ఆనాడే పసిగట్టారు. అన్యాయాలకు అంతూ పొంతూ లేకపోవడంతో 1969 లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రజ్వరిల్లింది. ఆనాటి నుంచి తెలంగాణవారు కోరుకొంటున్నది స్వేచ్ఛే కాని అభి వృద్ధి కాదు.

అగౌరవం నుంచి, అవమానాల నుంచి, నిర ్లక్ష్యం నుంచి, వివక్షల నుంచి స్వేచ్ఛ, 'స్వేచ్ఛ'లో 'అభివృద్ధి' కూడా మిళితమయి ఉంటుంది. కాని సగటు ప్రజానీకం దానినలా అవగాహన చేసుకోలేరని తెలంగాణ నేతలు, మేధావులు ఆ మహోన్నత ఆశయానికి 'ఆర్థిక ప్రయోజనాలు' 'ఆర్థిక సమస్యలు' మున్నగువాటిని ఆలంబనగా జోడించారు. తెలంగాణవారికి జరిగిన అన్యాయాలను సాక్ష్యాధారాలతో ఎత్తిచూపారు. తెలంగాణ ప్రజలు 'ఆర్థికాభివృద్ధి' కన్నా తమ 'ఆత్మగౌరవాని'కే ఎప్పుడూ అమిత ప్రాధాన్యమిచ్చారు. అందుకే తెలంగాణ సెంటిమెంట్'కు 'ఆత్మగౌరవ' కాంక్షే తీవ్రమైనదిగా పరిగణించాలి.

'ఆర్థికాభివృద్ధి'ని కానే కాదు. (స్వేచ్ఛ లేనివారికి ఆర్థికాభివృద్ధిని ఎవ్వరూ దానంగా, ధర్మంగా సమకూర్చరు). తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోసమే ప్రత్యేక తెలంగాణను ఆకాంక్షిస్తున్నారు. అయితే రాజకీయవాదులు ఈ అంశాన్ని తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకొంటున్నారు. తెలంగాణ సమస్య ఇప్పుడు తెలంగాణ వారికెంత ఉపయోగపడుతున్నదో తెలంగాణేతర ప్రాంతాల సొంత రాజకీయ ప్రయోజనాలకు కూడా అంతే ఉపయోగపడుతున్నది. అందువలన దానిని ఇరు ప్రాంతాలవారూ తమ ప్రయోజనాలకు ఉపయోగించుకొంటూనే వున్నారు.

అయితే నలభై ఏళ్ళ నుంచి బలవుతున్నవారు మాత్రం తెలంగాణ విద్యార్థులు, యువకులు, సగటు ప్రజలే. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు 'స్వేచ్ఛ', 'స్వపరిపాలన' కారణం కాగా 'అభివృద్ధి'ని మాత్రమే ఉపశమనంగా చూప డం సమస్యకెలా పరిష్కారమవుతుంది? పాలకులు చెబుతున్న అభివృద్ధి మిథ్య కాక నిజమే అయినా కూడా అది ఆత్మగౌరవానికెలా ప్రత్యామ్నాయమవుతుంది? తెలంగాణ సమస్య ఒక ఆర్థిక సమస్యగానే కాక ఉద్వేగపరమైన సమస్యగా కూడా పరిణమించింది. 'భుక్తి'కి చెందిందే కాక 'ముక్తి' కి చెందిందిగా రూపొందింది.

అయితే ప్రభుత్వం దానిని కేవలం ఆర్థిక సమస్యగా నిర్ధారిస్తూ దానిని అలా పరిష్కారిస్తామని పదేపదే అనడం మరొకసారి తెలంగాణవారిని అవమానపరచడమే . తెలంగాణ ఆందోళనలో 'స్వేచ్ఛ', 'స్వపరిపాలనా ఇచ్ఛ' రెండు కీలకమైన అంశాలు. తక్కినవన్నీ వాటికి కేవలం ఆలంబనలు మాత్రమే. ఇది గుర్తించనివారు తెలంగాణ ఉద్యమం వెనక ఉన్న 'ఆత్మ'ను, 'ఊపిరి'ని గ్రహించలేరు. తెలంగాణవాదుల స్వేచ్ఛ, స్వపరిపాలన ఆకాంక్షల వెనుక ఉన్న 'తాత్విక దృక్పథం'ను విస్మరించిన వారు తెలంగాణ ఉద్యమపు 'నీతి'ని గ్రహించలేరు.

వారి 'స్వేచ్ఛకు చెందిన తాత్విక దృష్టే' తెలంగాణవారిని గతంలో విదేశీ ఆధిపత్యానికి, రజాకార్లకు, నిజాంకు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా పోరాడేట్లు చేసింది. ఆ తాత్విక దృక్పథమే అంటరానితనానికి, వెట్టిచాకిరీకి, దేవదాసి తనానికి, దొరతనానికి, ఇంకా ఎన్నో ఇతర పెత్తందారీ పోకడలకు వ్యతిరేకంగా పోరాడేట్లుచేసింది. అవును, ఆ తాత్విక దృష్టే వారినిప్పుడు ప్రాంతీయ పెత్తందారీతనానికి వ్యతిరేకంగా పోరాడేట్లుచేస్తున్నది. ఈ వాస్తవాన్ని గుర్తించాలి- ముఖ్యంగా వామపక్షాల వారు, అందులోనూ కమ్యూనిస్టు పార్టీలు.

ప్రత్యేక తెలంగాణ పోరాటం కూడా ఇతర పెత్తందారీ వ్యతిరేక పోరాటాల వలెనే ప్రాంతీయ పెత్తందారీ వ్యతిరేక పోరాటమని కమ్యూనిస్టులు గుర్తించాలి. ఇది బ్రిటిష్‌వారి వలసాధిపత్యానికి, ఉత్తరాదివారి భాషా పెత్తందారీ తనానికి, ఉత్తరప్రదేశ్ వారి రాజకీయ పెత్తందారీ తనానికి, ద్రవిడులపై ఆర్యుల సాంస్క­ృతిక పెత్తందారీతనానికి వ్యతరేకంగా జరిగిన, జరుగుతోన్న పోరాటాలకు చేరువలోనిదని గుర్తించాలి. కమ్యూనిస్టులకు సిద్ధాంతాలతోనే కాని ప్రాంతాలతో ప్రమేయముండకూడదు. సిద్ధాంతాలే వారికి ఎంతైనా ముఖ్యం. మరి వారి సిద్ధాంతాలలో అతి ముఖ్యమైనది 'పెత్తందారీ వ్యవస్థ వ్యతిరేకత' కదా.

ఆ పెత్తందారీ తనాన్ని ఎవరు, ఎచటివారు చెలాయించినా, కమ్యూనిస్టులు ఉండవలసింది పెత్తందారీతనం చలాయించే వారివైపు కాక, బాధితుల వైపే కాదూ? తెలంగాణవారు తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలకొరకు ఎన్నో పోరాటాలు చేశారు. ప్రత్యేక తెలంగాణ పోరాటం వారి పోరాటాల పరంపర లో మరొకటి మాత్రమే. తెలంగాణవారు చేపట్టిన పోరాటాలన్నీ సామ్యవాద పోరాటాలే. ఎందుకంటే అవన్నీ 'పెత్తందారీ వ్యవస్థ' ను వ్యతిరేకించిన పోరాటాలే. ఏవో కొన్ని స్వంత లాభాల కొరకు, స్వప్రయోజనాల కొరకు ఎవరో కొందరు వ్యక్తులు, కులాలు, మతాలు, పార్టీలు చేబట్టిన పోరాటాలు కావు.

అవి సమస్త ప్రజల కొరకు చేపట్టిన పోరాటాలు. వాటికి 'స్వేచ్ఛ', 'స్వాతంత్య్రం' 'స్వపరిపాలన' అతి ప్రధానమైన లక్ష్యాలు. అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి కోసం చేసిన పోరాటాలే అయినా వాటి వెనకాల అంతర్గతంగా ప్రవహించిన ఆరాటాలు మాత్రం 'ఆత్మగౌరవం', 'అస్తిత్వం'కు చెందినవే. ఏ సమాజమైనా, దేశమైనా, ప్రాంతమైనా వాటినే కదా కోరేది! తెలంగాణ ప్రజల్లో 'సెంటిమెంటు' బలంగా ఉందనడానికి ఇటీవల జరిగిన ఉపఎన్నికలలో ఇంచుమించు అన్ని పార్టీల అభ్యర్ధులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో 'తెలంగాణ వాదాన్ని' సమర్థించి గెలవడమే తార్కాణం.

రాబోయే సాధారణ ఎన్నికలలో 'తెలంగాణ సెంటిమెంటు' కు వ్యతిరేకంగా ఏ పార్టీ నిలిచినా అది దానికి ఆత్మహత్యాసదృశమే అవుతుంది. ఇది స్వయానా కాలమే చేస్తున్న హెచ్చరిక. కాలం కాస్త అటూ ఇటూ అయినా, తెలంగాణ వారు గతం లో అన్ని పోరాటాల్లో గెలిచారు. ప్రత్యేక తెలంగాణ పోరాటంలో కూడా తప్పక గెలుస్తారు. గతంలో చేసిన పోరాటాల చరిత్రే ఈ చారిత్రిక అనివార్యతను చాటుతోంది. (వ్యాసకర్త తెలుగు అకాడమీ మాజీ సంచాలకులు)

Andhra jyothy (8-20-2008)

No comments: