Wednesday, October 01, 2008

ప్రజల భాగస్వామ్యంతోనే 'సిరి'సిల్ల


అత్యాధునిక జౌళి కేంద్రంగా రూపొందడానికి అవసరమైన సహజ, మానవ వనరులు సిరిసిల్లలో పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులందరూ ఏకీభవిస్తున్నారు. ఇది ఆచరణలోకి రావాలంటే రెండు సవాళ్ళను మనం అధిగమించవలసివుంటుంది. ఒకటి- ప్రజల భాగస్వామ్యంతో ఆ వనరులను అభివృద్ధి చేయడం; రెండోది ప్రజలే యజమానులుగా ఉండే సమ్మిళిత అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించడం.


నేత మగ్గాలు యుముని మహిషపు లోహ ఘంటల ను విన్పిస్తున్నాయి! సరళీకృత ఆర్థిక విధానాల ఫలితమిది. నేత పరిశ్రమకు పేరుగాంచిన సిరిసిల్ల లో వందలాది నేత కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయాయి. రెండు రోజుల క్రితం ముగ్గురు నేత కార్మికుల ఆత్మహత్యల తో ఆ ఊరిలో 1997 నుంచి చోటుచేసుకొన్న ఈ విషాద మరణాల సంఖ్య 500కి మించిపోయింది. 'ధరలు పెరిగిపోతోన్నాయి. మా జీతాలేమో గొర్రె తోక బెత్తెడుగా ఉండిపోయాయి. రోజుకు 12 గంటలు పనిచేస్తాము. నేసిన బట్ట ను బట్టి రోజుకు 80 నుంచి 100 రూపాయలు మాత్రమే ఇస్తారు. అనారోగ్యంతో పనికి వెళ్ళకపోతే పైసా కూడా ఇవ్వరని' ఆర్. శంకర్ అనే మరమగ్గం కార్మికుడు వాపోయాడు. 'తమిళనాడు, మహారాష్ట్రలలో జెట్, ఆటో మగ్గాలు వచ్చిన తరువాత సిరిసిల్లలో చేనేత కార్మికులకు సమస్యలు పెరిగిపోయాయి.
కనీస అవసరాలు తీర్చుకోవడానికి అవసరమయిన ఆదాయం కూడా కరువయిందని' అతను పేర్కొన్నా డు. సామల మల్లేశం (నేత కార్మికుల సంఘం నాయకుడు) ఇలా ఆరోపించారు: 'నేత కార్మికులు అసంఘటితరంగం లో ఉన్నందున వారికి కనీస వేతనాలు కూడా చెల్లించడం లేదు. పి.ఎఫ్, ఆరోగ్య బీమా మొదలైన సదుపాయాల గురించి అసలు మాట్లాడనక్కర లేదు. మగ్గాల యజమానులు నేతన్నలను బానిసలుగా పని చేయించుకొంటూ బాగా దోపిడీ చేస్తున్నారు'. హైదరాబాద్‌లోని 50 మంది వ్యాపారస్తులు రాష్ట్రంలోని చేనేత వస్త్రాల వ్యాపారంపై గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ వ్యాపారులు మాస్టర్ వీవర్స్‌కు ఆర్డర్స్ ఇస్తారు. మాస్టర్ వీవర్స్ ఆ మేరకు నేత కార్మికులకు పని కల్పిస్తారు. నేటి చేనేత కుటుంబాల జీవిత వాస్తవమిది. మరి దశాబ్దాలుగా చేనేత కార్మికుల బతుకులు అంతులేని విషాదంతో కృంగిపోతున్నాయంటే ఆశ్చర్యమేముంది? సిరిసిల్ల నేత కార్మికులకు ఆశావహమైన భవిష్యత్తు లేదా? 'ఇందిరమ్మ రాజ్యం' స్థాపించడానికి కంకణం కట్టుకున్న పాలకులు ఈ బక్క జీవుల సంక్షేమం లక్ష్యంగా అభివృద్ధి విధానాలు రూపొందించి అమలుపరచేదెన్నడు? చేనేత రంగంలో సంక్షోభానికి మూడు ప్రధాన కారణా లు ఉన్నాయి.


(అ) కేంద్ర ప్రభుత్వం 1991లో ప్రవేశపెట్టిన సరళీకృత విధానం. దీనివలన నూలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నూలుపై 9.25 శాతం ఎక్సైజ్ పన్ను విధించడంతో ఆ ధరలు మరింతగా పెరిగిపోయాయి. దీని కి తోడు పత్తి ఎగుమతులుపెరిగాయి. ఐదు కిలోల నూలు ధర 300 నుంచి 600 రూపాయలకు పెరిగిపోయింది. ఈ పెరుగుదల చేనేత పరిశ్రమలోని అన్ని వర్గాల వారిని ప్రతికూలంగా ప్రభావితం చేసింది. జీవనోపాధిని రక్షించే లక్ష్యా న్ని పాలకులు త్యజించారు. పరిశ్రమను పూర్తిగా విపణి శక్తు ల బారిన పడవేశారు. గోరుచుట్టుపై రోకటి పోటులా ప్రపంచీకరణ విధానాలు వచ్చి పడ్డాయి. ప్రపంచ వాణిజ్య ఒప్పందం కింద దిగుమతులపై పరిమాణాత్మక ఆంక్షలను ఎత్తివేయడంతో చైనా, థాయిలాండ్ నుంచి చౌక వస్త్రోత్పత్తులు దేశం లోకి వెల్లు వెత్తాయి. దీంతో చేనేత పరిశ్రమ కుదేలైపోయింది. (ఆ) చిన్న తరహా పరిశ్రమల రంగం నుంచి మర మగ్గాలను తొలగించడం. కేంద్ర ప్రభుత్వ సరళీకృత విధానాల క్రింద ఎవరైనా మర మగ్గాలను ఏర్పాటు చేయడానికి అనుమతి లభించింది. దీంతో రిలయన్స్, మఫత్‌లాల్ మొదలైన పారిశ్రామిక సంస్థలు కూడా జెట్, ఆటో మగ్గాలతో ఈ రంగంలోకి ప్రవేశించాయి. సెకండ్ హ్యాండ్ యంత్రాలను దిగుమతి చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు.

అధునాతన మర మగ్గాలపై దిగుమతి సుంకాల లో రాయితీ కల్పించారు. సాంకేతికత నవీకరణ నిధి పథకం కింద వాటిని దిగుమతి చేసుకోవడానికి 50 శాతం ఆర్థిక సహాయం కూడా కల్పించారు. ఈ అధునాతన మగ్గాలతో పాటు ఆధునిక ఉత్పత్తి ప్రక్రియలను కూడా పారిశ్రామిక వేత్తలు అవలంబించారు. దీంతో అప్పటివరకు మన దేశంలో ఉపయోగిస్తున్న మర మగ్గాలు మూల న పడే పరిస్థితి ఏర్పడింది. (ఇ) విద్యుత్ చార్జీలు, ఎక్సైజ్ సుంకాలు, రసాయనాలు, రంగుల ధరలు పెరగడం. ఈ పరిణామం చేనేత పరిశ్రమ నడ్డి విరిచేసింది. సిరిసిల్ల చేనేత కుటుంబాలు ఈ పరిస్థితిని తట్టుకోలేక పోయాయి. 2001 నాటికి సంక్షోభం మరింత తీవ్రమయింది. లాభాలు పూజ్యం కావడంతో 70 శాతం చిన్నతరహా, మధ్య తరహా సంస్థలు మూతపడ్డా యి. వేలాది నేతన్నలకు జీవనోపాధి కరువయింది. ఆకలి మరణాలు పెరిగిపోయాయి. పలువురికి ఆత్మహత్యలే గత్యంతరమయ్యాయి. ఈ దయనీయ పరిస్థితులకు ఎక్కువగా బలయింది మహిళలే.

వారిలో బండి కనకవ్వలు ఎందరో? (ఈమె విషాదగాథపై గత మే 9న 'ఆంధ్రజ్యోతి' లో ఒక వార్తా కథనం వెలువడింది). చేనేత కార్మికులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టకపోలేదు. చిన్న తరహా, మధ్యతరహా సంస్థలను ఆదుకోవడానికి విద్యుత్ చార్జీలపై 50 శాతం సబ్సిడీని ప్రకటించింది. అయితే ఇది ప్రతికూల ఫలితాన్ని ఇచ్చింది. విద్యుత్ సబ్సిడీ సాకు చూపి వ్యాపారులు చేనేత ఉత్పత్తులను తక్కువ ధరకు కొన్నారు. అంతేకాక బట్ట కొనుగోలు ధరను మీటరుకు 10 పైసలు చొప్పున తగ్గించారు. (ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ మీటరుకు 7 పైసలు మాత్ర మే). సిరిసిల్ల వద్ద టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేయడం రాష్ట్ర ఫ్రభుత్వం తీసుకొన్న మరో ముఖ్యమైన చర్య. 500 మీటర్ల బట్టను ఉత్పత్తి చేయగల హై స్పీడ్ మర మగ్గాల యూనిట్లను ఈ టెక్స్‌టైల్ పార్క్‌ల్లో ఏర్పాటు చేయవలసివుంటుంది. ఇందుకు 25 లక్షల రూపాయల పెట్టుబడి అవసరం. ఇంత స్థోమతకలవారు సిరిసిల్ల చేనేతన్నలలో ఎవరూ లేరు. 2001 సంవత్సరం తరువాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యలేవీ సిరిసిల్ల నేత కార్మికుల ను సమస్యల నుంచి బయటపడ వేయలేకపోయాయి.

ఈ నేపథ్యంలో సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవడానికి విధాన నిర్ణేతలు చేయవలసినదేమిటి? ప్రజలకు ప్రాధాన్యమిచ్చే అభివృద్ధి నమూనాను అనుసరించడమే. ఈ విషయమై నా అభిప్రాయాలను నివేదిస్తున్నాను. అత్యాధునిక జౌళి కేంద్రంగా రూపొందడానికి అవసరమైన సహజ, మానవ వనరులు సిరిసిల్లలో పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులందరూ ఏకీభవిస్తున్నారు. ఇది ఆచరణలోకి రావాలంటే రెండు సవాళ్ళను మనం అధిగమించవలసివుంటుంది. ఒకటి- ప్రజల భాగస్వామ్యం తో ఆ వనరులను అభివృద్ధి చేయడం; రెండోది ప్రజలే యజమానులుగా ఉండే సమ్మిళిత అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించడం. ఐదు అంశాలతో కూడిన సమగ్ర అభివృద్ధి పథకాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. దాన్ని అమ లు పరిస్తే ఆ రెండు లక్ష్యాలను సాధించడం కష్టతరమేమీ కాదని నేను భావిస్తున్నాను. సిరిసిల్లను అత్యాధునిక జౌళి కేంద్రంగా రూపొందించడానికి తోడ్పడే ఆ పథకంలోని ఆ ఐదు అంశాలను క్లుప్తంగా వివరిస్తాను. (అ) 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో సిరిసిల్ల పట్టణాన్ని 'చిన్న తరహా జౌళి ప్రత్యేక ఆర్థిక మండలం'గా ప్రకటించుట: ప్రజలే యజమానులుగా ఉండే సంస్థలను ప్రోత్సహించడానికి, ఉత్పత్తులను పూర్తిగా కొనుగోలుచేసే హమీతో ఈ చిన్న తరహా జౌళి సెజ్‌ను ఏర్పాటు చేయాలి.

ఈ సెజ్‌లో జరిగే ఆర్థిక కార్యకలాపాలన్నిటిలో ప్రభుత్వం 50 శాతం పెట్టుబడి పెట్టాలి. ప్రాథమిక ఉత్పత్తే ఈ సెజ్ కార్యకలాపాలకు లక్ష్యంగా ఉండాలి. కొత్త ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించాలి. జౌళి కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు దీర్ఘకాలంలో ఈ పట్టణం లో సేవల రంగం కూడా అభివృద్ధి చెందేలా పథకాలను రూపొందించాలి. అధునాతన మగ్గాలపై పనిచేసేందు కు కార్మికులకు అవసరమైన శిక్షణ సదుపాయాలను కల్పించాలి. ఇటువంటి చర్యలను చేపట్టినప్పుడు సిరిసిల్ల 2020 సంవత్సరం నాటికి తక్కువ విలువ కలిగిన పెటీకోట్‌ల తయారీ జౌళి కేంద్రం స్థాయినుంచి పూర్తి స్థాయి 'జౌళి రాజధాని'గా అభివృద్ధి చెందగలదు. (ఆ) సెస్‌ను ఆదర్శంగా తీసుకొని స్వావలంబన నేర్చుకోవడం: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) మన దేశంలోనే కాక వర్ధమాన దేశాలన్నిటా గత నలభై సంవత్సరాలుగా ఒక విజయవంతమైన సహకార సంఘంగా వెలుగొందుతోంది. ప్రస్తుత సిరిసిల్ల శాసనసభ్యులు చెన్నమనేని రాజేశ్వరరావు 1960 దశకంలో ఈ సహకార సంఘాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించారు. ప్రజల ప్రయోజనాలే ప్రాధాన్యంగా పనిచేస్తో న్న సంస్థలకు సెస్ ఒక చక్కని తార్కాణం. ఈ ప్రపంచీకర ణ యుగంలో కూడా అది విజయవంతమైన సహకార సంఘంగా ఉండటం గమనార్హం. విద్యుత్ సరఫరాలో సెస్ సాధించిన విజయాలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవససరమెంతైనా ఉంది.

సిరిసిల్ల జౌళి సెజ్‌కు అవసరమయ్యే విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు సెస్ ఆధ్వర్యంలో ఒక విద్యుత్కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. (ఇ) సిరిసిల్ల సెజ్ ప్రమోషన్ కౌన్సిల్: సిరిసిల్లను అత్యాధనిక జౌళి కేంద్రంగా రూపొందించడానికి సిరిసిల్ల సెజ్ ప్రమోషన్ కౌన్సిల్ ఒకదాన్ని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ, పౌర సమాజ ప్రతినిధు లు ఇందులో సభ్యులుగా ఉండాలి. ఈ కౌన్సిల్‌కు నిర్దిష్ట అధికారాలు కల్పించాలి. కీలక నిర్ణయాలు తీసుకొనే అధికారం కూడా సభ్యులకు ఉండాలి. (ఈ) మహిళా ఉపాధి మిషన్: మహిళల సాంప్రదాయక కౌశాలాలను పూర్తిగా వినియోగించుకోవాలి తద్వారా వారి ఆదాయ మార్గాలను మెరుగుపరచాలి. మహిళల పరిస్థితులను మెరుగుపర్చడం ద్వారా సిరిసిల్లలో సామాజిక, ఆర్థిక మార్పులను సమష్టిగా సాధించాలి.

ఈ లక్ష్యాలను సాధించడానికి స్వతంత్ర అధికారాలతో కూడిన మహిళా ఉపాధి మిషన్ నొకదాన్ని నెలకొల్పాలి. సెజ్ ప్రమోషన్ కౌన్సిల్‌కు మాదిరిగానే దీనికి కూడా స్పష్టమైన అధికారాలు, హక్కులు, విధులు నిర్దేశించాలి. (ఉ) మానవ వనరుల అభివృద్ధికి ఒక సమగ్ర పథకా న్ని రూపొందించి అమలుపరచాలి. అభివృద్ధి, సామాజిక న్యాయం పరస్పరం విరుద్ధమైనవికావు. సామాజికన్యాయం కొరవడిన అభివృద్ధి సుస్థిరమైనదికాదు. ఈ సత్యాన్ని విసమించడం వలనే ఆర్థిక సంస్కఱనలు సామన్యాల సంక్షేమానిక విఘాతంగా పరిణమించాయి. ప్రత్యామ్నాయ అభివ ఋద్ధి నమూనాలను అనుసరించాల్సిన అవసరమెంతైనా ఉంది. సిరిసిల్లను అత్యాధునిక జౌళి కేంద్రంగా రూపొందించడానికి నేను ప్రతిపాదించిన పథకం ఆ అవసరాన్ని తీర్చగలదని విశ్విసిస్తున్నాను.

-రమేష్ చెన్నమనేని
(వ్యాసకర్త హంబోల్ట్ విశ్వవిద్యాలయం (జర్మనీ)లో ఆచార్యులు)

No comments: