Monday, October 20, 2008

భూమి కోసం

వామనుడు అలనాడు బలి చక్రవర్తిని మూడడుగుల భూమి మాత్ర మే అడిగాడు. అడిగే వరకూ వామనుడే. ఆ తరువాత ఇంతింతై... భూగోళాన్నంతా ఒక్క అడుగుతో ఆక్రమించాడు. ఎలాగైతేనేం ఎంత భూమిని ఆక్రమించుకుంటామనేదే ప్రధానం! కాలమేదైనా ప్రపంచ చరిత్ర అంతా భూమి చుట్టే తిరుగుతూ ఉంటుంది. చరిత్రలో ఎక్కువ పోరా టాలు భూమి కోసం, భుక్తి కోసం సాగినవే. అట్లాంటిక్ జలాలకు అటూ ఇటూ భూమి పుత్రులు తమ హక్కుల కోసం చేసిన తిరుగుబాట్లు- వారి అణచివేతలతో- భూగోళమంతా రక్తంతో లేదా కన్నీళ్ళతో తడిసి పోయింది. తెలంగాణ సాయుధ పోరాటం మన పెద్దలు వినిపించిన వీరోచిత గాథ- భూమి కోసమే సాగింది. స్వాతంత్య్ర సమరం పొడుగునా, అంతర్లీనంగా రైతాంగ పోరాటాలూ సాగాయి.



రైతుకూ భూమికి ఉండే అనుబంధం గాఢ మైనది. వ్యవసాయం సంక్షోభంలో పడినా, భూమి చేజారి పోయినా, సమా జం అతలాకుతలమై పోతుంది. భూ సంబంధాలు మారినప్పుడూ, భూగో ళం పురిటి నొప్పులు పడుతుంటుంది. అందుకే మధ్యయుగాలలో యూరప్ నిండా రైతుల పోరాటాలు. ఫ్రెంచి విప్లవానికి ముందే జర్మనీ రైతాంగంలో కదలిక వచ్చింది. పైకి మతం మేలి ముసుగు కనిపించినా, రైతాంగంలోని అసంతృప్తి బద్ధలై యూరప్‌లోని ఇతర దేశాలలోనూ ప్రతిధ్వనించింది. బంగారం లాంటి భూముల కోసమే కొన్ని దేశాలలో రైతుల తిరుగుబాట్లు ప్రభుత్వాలను కూల దోసి చరిత్రను మలుపు తిప్పాయి. అవి కొందరికి వేగు చుక్కలుగా కనిపిస్తే, మరికొందరికి తోక చుక్కలుగా తోచాయి! అన్ని దాహాల కన్నా భూ దాహమే ఎక్కువ ప్రమాదకారి. యూరప్ వల స వాదులు అడుగు పెట్టిన క్షణాన అమెరికా నేల రక్తసిక్తమైంది ఈ భూమి కోసమే.

అమెరికా భూములు శ్వేత జాతీయుల ఆక్రమణలోకి వచ్చే క్రమం లో లక్షలాది మంది భూమి పుత్రులు బలయ్యారు. మిసిసిపి నదిలో స్థానిక తెగల రక్తం ప్రవహించింది. 1637 నాటి పికాట్ వార్ కానీ, కింగ్ ఫిలిప్స్ వార్, కింగ్ విలియమ్స్ వార్, క్వీన్ అనీస్ వార్ అంటూ ముద్దు పేర్లు పెట్టు కున్న దాడులన్నీ తెల్లవారు విశాలమైన కొత్త భూముల కోసం సాగించిన స్థానిక తెగల ఊచకోతలే. యూరప్ దొరలు తమ అస్తిత్వం కోసం పోరాడిన భూమి పుత్రులను ఉరికంబాలు ఎక్కించారు. స్త్రీలు, పిల్లలనే విచక్షణ లేకుం డా గ్రామాల నుంచి ప్రజలను తరలించి అహోరాత్రులు నగ్నంగా చలిలో నిలబెట్టారు. నిర్బంధ శిబిరాలలో చిత్ర హింసలు పెట్టారు. వ్యాధులకు గురై ఎనభై శాతం స్థానిక తెగల జనాభా అంతరించి పోయింది. మశూచి వంటి ఈ రోగాలు స్థానిక తెగలలో వ్యాప్తి చేయడం వెనుక యూరప్ పాలకుల కుట్ర ఉందనే బలమైన ఆరోపణ ఉంది. స్థానిక తెగలను శాంతింప చేయడా నికి కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ నీటి మూటలే. 19 వ శతాబ్దంలో ఇండి యన్ రిమూవల్ అనేది అమెరికా ప్రభుత్వ విధానమే అయిపోయింది.

ఈ 19 వ శతాబ్దం చివరి దాకా భూమి పుత్రుల రక్తం చిందుతూనే ఉంది. స్థానిక తెగల వారిని నాగరీకులను చేయడం, విలీనం అంటూ ఏ పేరు పెట్టినా, చివరకు వలస వాదుల లక్ష్యం వారి భూములు కబళించి, వారి అస్తిత్వాన్ని హరించడమే అనేది చారిత్రక సత్యం. ఇదీ అమెరికా వంటి నాగరిక దేశపు భూమి చరిత్ర. అమెరికన్ కంపెనీల అభివృద్ధిలో భాగంగా లాటిన్ అమెరికా భూములు ఎడారులైన నేపథ్యంలోనే, నేడు అక్కడ కొత్తగా అమెరికా వ్యతిరేక ప్రభు త్వాలు మళ్ళీ మొగ్గదొడిగాయి. జింబాబ్వేలో సంక్షోభానికి కారణం ఆ దేశ నేత రాబర్ట్ ముగాబేనని పాశ్చాత్య దేశాల వాదన. దేశంలో తిష్ఠవేసిన పది శాతం తెల్లదొరల చేతిలో తొంభై శాతం నల్ల భూములుండడం అసలు సమ స్య అనేది మరో బలమైన వాదన. తన ఆకలి తాను తీర్చుకోగలిగేదే గొప్ప దేశమని డీగాల్ ఫ్రెంచి ప్రజలకు ఎప్పుడో చెప్పాడు. ఆ ఆకలి తీరాలంటే, ఎవరి భూములు ఎవరి చేతిలో ఉంటాయనేది ముందు తేలాలి. భూమి సమస్య ఇప్పుడు మన దేశాన్నీ తాకింది. అదీ సెజ్‌ల రూపంలో. భూమి విలువ మొదటి సారిగా పశ్చిమ బెంగాల్ పెద్దలకు తెలిసి వచ్చింది.

ఇప్పుడు మన రాష్ట్రాన్నీ భూ కంపం తాకుతున్నది. ఎస్ఇజడ్‌లకు, కోస్టల్ కారిడార్‌కూ వ్యతిరేకంగా ఆందోళన ఊపందుకుంటున్నది. ప్రత్యేక ఆర్థిక మండళ్ళు (ఎస్ఇజడ్) పెట్టిన చోటల్లా స్థానికుల ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. అయితే అధికార పార్టీ, దాని మిత్రపక్షాలు మినహా రాష్ట్రంలోని ప్రధాన పక్షాలన్నీ ఒక ఉమ్మడి వేదిక పైకి వచ్చి ఉద్యమిస్తున్న ప్రజలకు రాజ కీయ ఛత్రంగా మారాలని నిర్ణయించడం అసాధారణం. ఈ ఉద్యమం ఉభ య కమ్యూనిస్టు పార్టీలతో పాటు, టిఆర్ఎస్, టిడిపి, ప్రజారాజ్యం పార్టీల ను, ఎంబిటి వంటి చిన్న పార్టీలను ఒకే వేదికపైకి తేవడం గమనార్హం. ఎస్ఇ జడ్‌లను ప్రశ్నించడమంటే అభివృద్ధిని వ్యతిరేకించడమనే ఆరోపణలకు స్థానం లేకుండా పోయింది. అభివృద్ధిని అందరూ కోరుకుంటారు. కానీ అభి వృద్ధి ఫలాలు ఎవరికి దక్కుతాయి, త్యాగాలు ఎవరు చేయాలనేదే సమస్య.

ఎస్ఇజడ్‌లలో వ్యాపారావసరానికి మించి భూమి కేటాయింపులు జరప డం, నిర్వాసితుల ప్రయోజనాలు కాపాడక పోవడం అనేవి విమర్శలకు తావిస్తున్నాయి. నర్మద నదిపై ఆనకట్ట వల్ల నిర్వాసితులైన వారు సాగించిన ఆందోళన దేశ వ్యాప్తంగా గుర్తింపునకు వచ్చింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన వారికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. అందు వల్లనే నిర్వాసితులు సమైక్యంగా ఉద్యమించే పరిస్థితి ఏర్పడింది. ఎస్ఇ జడ్‌లు రాష్ట్రవ్యాప్తంగా నిర్వాసితులను కదిలిస్తున్నాయి. మరోవైపు కోస్టల్ కారిడార్ ఒక్కటే మొత్తం కోస్తా సమాజాన్ని కలవర పెడుతున్నది. లక్షలాది ఎకరాలు అభివృద్ధి పేరిట చేతులు మారుతుంటే ఆ ప్రభావం సమాజంపై ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే రాజకీయ పక్షాలను రంగంలోకి దింపింది. వచ్చే ఎన్నికలలో ఈ భూమి సమస్యనే ప్రధానాంశం గా మారినా ఆశ్చర్యం లేదు.



ఆంధ్రజ్యోతి సంపాదకీయం, 21 October 2008

No comments: