Thursday, October 30, 2008

తెలంగాణ స్వయం అవతరణ - టి. దేవేందర్ గౌడ్


జయహో తెలంగాణ! నవంబర్ 2వ తేదీన ఒక ప్రతీకాత్మక ప్రక్రియ- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ ప్రజల స్వీయ పురోగతి- ప్రారంభమవుతుందని 'నవ తెలంగాణ పార్టీ' ఆవిర్భవించిన రోజునే హామీ ఇచ్చింది. మనం చాలాకాలం వేచివున్నాము. మన సొంత రాష్ట్రాన్ని మనమే ఏర్పాటు చేసుకొనే సమయమాసన్నమయింది. మన కర్తవ్యాన్ని మనం నెరవేరుద్దాం. ఆ పిమ్మట రాజకీయ ప్రక్రియ ప్రారంభమవగలదు.


తెలంగాణ ఏమి టి? తెలంగాణ ప్రజలకు దాని పరమార్థమేమిటి? ఇత్యాది వివరాలలోకి వెళ్ళే ముందు త్యాగధనులకు నివాళి అర్పించడం మన విధి. ప్రత్యేక తెలంగాణ కోసం 370 మందికి పైగా ప్రజలు ప్రాణాలు త్యాగం చేశారు. అది 40 ఏళ్లనాటి మాట. ప్రస్తుతం మూడు కోట్ల కుపైగా ఉన్న తెలంగాణ జనాభాలో సగంమంది 1969 సంవత్స రం నాటి ఊచకోతల అనంతరం జన్మించిన వారే.
ఆ తరువాత తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను ఎవరూ అణచివేయలేకపోయారు. ఇప్పుడు ప్రజాభిప్రాయసేకరణ నిర్వహిస్తే 90 శాతానికి పైగా తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం వైపు మొగ్గు చూపుతారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో తెలంగాణ ప్రజలు భాగస్వాములు కానేకారు. ఆ సమైక్య రాష్ట్ర ఏర్పాటు నిర్ణయానికి భాగస్వాములు కావడానికి కూడా వారు ఎన్నడూ ఇష్టపడలేదు.
ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన నాటి నుంచి ముల్కీ నిబంధనలు, ఆరు సూత్రా ల పథకం, తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధికారాలు, భూముల విక్రయంపై నిషేధం మొదలైన రాజ్యాంగబద్ధమైన రక్షణలను ఆంధ్ర నాయకత్వం ఆధిపత్యంలోని ప్రభుత్వాలు ఉల్లంఘించాయి. తెలంగాణ దోపిడీ చేయబడింది. అవహేళనల పాలైంది. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి, వారి ఆకాంక్షను నెరవేర్చడానికి తెలంగాణ రాజకీయ నాయకులు సమైక్యంగా పూనుకోవాలి.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ప్రజాస్వామిక తీర్పు. చారిత్రిక కర్తవ్యం. నైతిక బాధ్యత. ప్రజాతీర్పును గౌరవించి, తెలంగాణను ఏర్పాటుచేస్తున్న ప్రజల ప్రకటనను పండగ చేసుకొంటున్నాము. 2008 నవంబర్ 1న తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉనికి అంతమయినట్టే. నిజానికి ఆంధ్రప్రదేశ్ అవతరించిన రోజునే అది అంతరించింది. సకల ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఆ సమైక్యరాష్ట్రం ఆవిర్భవించింది.

తొలుత, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు విరుద్ధంగా జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ సిఫారసు ఉల్లంఘన జరిగిం ది. తెలంగాణ ప్రజలు, నాయకులను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి, బలవంతంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కు అంగీకరింప చేశారు. కనుక తెలంగాణ ఏర్పాటును ప్రకటించడం ద్వారా మన నిజమైన ఆకాంక్షను పునరుద్ఘాటిస్తున్నాం. తెలంగాణ ఏర్పాటు ప్రకటన పట్ల కొంతమంది రెండు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. అవి:
(అ) అధికారిక ప్రక్రియ లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మనమెలా ప్రకటిస్తాం?
(ఆ) ఏ లక్ష్యానికి ఈ ప్రకటన తోడ్పడుతుంది?
ఈ రెండూ సహేతుకమైన ప్రశ్న లే. వాటిపై సుదీర్ఘ చర్చ ఎంతైనా అవసరం. అయితే క్లుప్తంగా సమాధానమిస్తాను. ప్రత్యేక తెలంగాణ పోరాటచరిత్ర సుదీర్ఘమైన ది; స్వతంత్ర భారతదేశంలో మరే పోరాటంకంటే తెలంగాణ పోరా టమే సుదీర్ఘమైనది. ఈ ప్రత్యేక రాష్ట్రోద్యమానికి ఆది నుంచీ ప్రజల మద్దతు ఉంది.
అయితే రాజకీయ యంత్రాంగమే ప్రజల డిమాండ్ ను తప్పుదోవ పట్టించింది. ప్రజల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రజాస్వామ్యాలు గౌరవిస్తాయి. వాటిని నెరవేర్చడానికి అవసరమై న ప్రక్రియలకు చొరవ తీసుకుంటాయి. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రంలో నివసించదలిచారు. పాలకులు వారి న్యాయబద్ధమైన ఆకాంక్షను పట్టించుకోనప్పుడు దానిని నెరేవేర్చడానికి పౌర సమాజమే పూనుకోవాలి. అవసరమైన ప్రక్రియను ప్రారంభించాలి. కను క తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం ఆ ప్రకియను ముందుకు తీసుకుపోవడమే. ఇలా ప్రకటించడం చరిత్రలో ఇదే మొదటిసారి కాదు. భారత స్వాతంత్య్ర సమరంలో లాహోర్‌లో (1930 జనవరి 26న) జరిగిన జాతీయ కాంగ్రె స్ మహాసభ 'పూర్ణ స్వరాజ్'ను లక్ష్యంగా ప్రకటించింది. ఆ మహాసభలోనే త్రివర్ణ పతాకాన్ని తొలిసారి ఆవిష్కరించారు.
ఆ చరిత్రాత్మక ప్రకట న జరిగిన రోజునే ఇప్పుడు మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకొంటున్నాము. నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ 1943లో భారతజాతీయ సేన అధిపతిగా భారత స్వాతంత్య్రాన్ని ప్రకటించారు. సింగపూర్ లో తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కొనసాగడం ఇష్టం లేక ఆంధ్ర నాయకులు 80 ఏళ్ల క్రితం 'స్వరాష్ట్ర' నినాదంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి ఉద్యమించలేదా? ఇటువంటి ఉదంతాలు ప్రపంచ చరిత్రలో చాలా ఉన్నా యి. వాటి నుంచి ఉత్తేజం పొంది తెలంగాణ ఏర్పాటును ప్రకటిస్తున్నాము. ఈ ప్రత్యేక రాష్ట్రం త్వరలోనే అధికారికంగా ఆవిర్భవించ డం ఖాయం. కనుక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం ద్వారా మన దేశంలోనూ, ప్రపంచంలోనూ ఒక సువ్యవస్థితమైన చారిత్రిక సంప్రదాయాన్నే మేము అనుసరిస్తున్నాము. ఆ నేపథ్యంలోనే ఈ ప్రకటనను కూడా చూడాలి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళడం ద్వారా ప్రజలలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్నాము. ఆత్మగౌరవోద్దీప్తులను చేస్తున్నాము. సమైక్యరాష్ట్ర పాలకులకు చారిత్రిక అనివార్యతను గుర్తుచేస్తూ గట్టి హెచ్చరిక చేస్తున్నాము.
ఇక రెండో ప్రశ్న- ఏ లక్ష్యానికీ ఈ ప్రకటన తోడ్పడుతుంది? ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు మద్దతు తెలుపడానికి ప్రజలు ధైర్యం చేస్తారు. నిండు ఆత్మవిశ్వాసంతో ఉద్యమంలో పాల్గొంటారు. దీంతోపాటు వారు తమ వాహనాల నెంబర్ ప్లేట్లకు కొత్త రాష్ట్రం పేరును టిఎల్ అనే అక్షరాలతో లిఖించాలి. సైన్ బోర్డులను మార్చాలి. తెలంగాణ సరిహద్దు చిహ్నాలు ఆ బోర్డ్‌లపై రాయాలి. తెలంగాణ పతాకాలను ఎగురవేయాలి. ఇత్యాది మూక్ముమడి ప్రతీకాత్మక చర్యలద్వారా ప్రత్యేక తెలంగాణకు సానుకూల వాతావరణాన్ని సృష్టించిన వారవుతారు. ఉద్యమం పట్ల సందేహంతో ఉన్నవారిని సుముఖులుగా చేయడానికి ఈ చర్యలు విశేషంగా తోడ్పడుతాయి. ఒక లక్ష్యానికి మద్దతుగా ప్రజలను సమీకరించడంలో ప్రతీకాత్మక చర్యలు చేసే దోహదం అంతా ఇంతా కాదు. ఉద్యమకారు లు ప్రజాస్వామ్యబద్ధంగా తమ శక్తిని వ్యక్తం చేయడానికి ఇవి ఎంతైనా తోడ్పడతాయి.
సరే, ఆ తరువాత ఏమిటి? ప్రజలు చేయవలసిందేమిటి? వారు చాలా చేయవచ్చు. ఈ విషయంలో కొత్త భావాలను ఆహ్వానిస్తు న్నాం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఒక కొత్త, నిర్ణయాత్మక దశలోకి ప్రవేశించిందని మాకు బాగా తెలుసు. మాతో సంఘీభావాన్ని ప్రకటించే కొత్త ప్రజాస్వామిక ఆలోచనలను ఆహ్వానిస్తున్నాము.
ప్రజల లో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి రాజకీయవేత్తలు ఎంతైనా చేయగలరు. తెలంగాణ ఏర్పాటును ప్రకటిస్తున్న ఈ పవిత్రదినాన తెలంగాణ రాజకీయవేత్తలందరికీ, వారు చేయవలసిన వాటిలో కొన్నిటిని సూచిస్తాను:
(అ) మనమందరమూ, అన్ని పార్టీలకు చెందినవారమూ ఎప్పుడో ఒకసారి ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌కు ప్రతిస్పందించడంలో విఫలమయినవాళ్ళమే. తెలంగాణ ఉద్యమాన్ని నీరుకార్చివేయడానికి మనలో విభేదాలు సృష్టించడంలోను, బెదిరింపులతో లొంగదీసుకోవడంలోను, అపహాస్యం చేయడంలోను ఆంధ్రనాయకత్వం సఫలమయింది. అయితే ఎప్పుడూ కొంత మం ది వ్యక్తులు, కొన్ని సంస్థలు తెలంగాణ ఆకాంక్షను సజీవంగా నిలుపుతూ వచ్చాయి. ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాలు ఒక వాస్తవాన్ని గుర్తించాయి. ప్రత్యేక రాష్ట్రం ద్వారా మాత్రమే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం కాగలవనేదే ఆ వాస్తవం. కనుక తెలంగాణ లక్ష్యాన్ని సాధించడానికి సమైక్యంగా కృషి చేస్తామని శపథం పూను దాం. సమైక్య కృషి ద్వారా మాత్రమే తెలంగాణ ఏర్పాటుకు ఆమోదించేలా ఢిల్లీ పాలకులపై విజయంవంతంగా ఒత్తిడి చేయగలం.
(ఆ) మన ఉమ్మడి లక్ష్య సాధనకు సమైక్యమవుదాం. మన తప్పుల ను మరచిపోదాం. అయితే ఆత్మ విధ్వంసకపథంలో కొనసాగడాన్ని ఇక వదిలివేద్దాం. పరస్పరం నిందించుకోవడం, దూషించుకోవడం మానివేద్దాం.ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిద్దాం. ఆంధ్ర లాబీకి న్యాయబద్ధత సమకూర్చే చర్యలకు పాల్పడకుండా మనం జాగ్రత్త వహిద్దాం.
(ఇ) కలిసికట్టుగా ముందుకు సాగాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నాం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఏ పార్టీ, ఏ సంస్థ ప్రతీక అనే చర్చకు పోవద్దు. లక్ష్య సాధనకు తోడ్పడే ప్రతీకాత్మక చర్యలకు దోహదం చేయాలి. మనలో ఉన్న విభేదాలను మరింతగా పెంచి తెలంగాణ వ్యతిరేక శక్తులు లబ్ధి పొందకుండా మనం జాగరూకత వహించాలి. అందరికీ తెలిసివచ్చేలా అనేక విధాలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ ప్రజల కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
తెలంగాణ ఏర్పాటు మహా లక్ష్య సాధనకు మీ వంతు సహకారం అందించడానికి ఇది ఒక అవకాశం. ప్రతీకాత్మక చర్యల ద్వారా గమ్యాన్ని చేరడం కష్టమని కొందరు ఆక్షేపణ చెప్పవచ్చు. అయితే మన సొంత చరిత్రను, మన పోరాటాల చరిత్రను చదవమని వారిని నేను అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్రం నవంబర్ 2న ఏర్పాటవుతుంది. ప్రజల ప్రకటనను అనుసరించి అధికారిక ప్రక్రియ ప్రారంభమవుగాక.
(వ్యాసకర్త 'నవ తెలంగాణ పార్టీ' అధ్యక్షులు)
ఆంధ్రజ్యోతి 31 అక్టోబర్ 2008.
.

No comments: