Wednesday, October 15, 2008

మా నాన్న సుద్దాల హనుమంతు - సుద్దాల అశోక్ తేజ







స్టేజీ మీద సుద్దాల హనుమంతు గొల్లసుద్దులు 'వీర తెలంగాణ' చెబుతున్నాడు. అక్షరాలు రాని అరకలు పట్టే రైతుకూలీలు ఆయుధాలు పట్టి ఆడాళ్లు వడిసెలలు పట్టి ఎలా దొరలను రజాకార్లను నైజాం పోలీసులను, రౌడీలను తరుముతున్నారో హనుమంతు దళం వీరావేశంతో చెబుతుంది. 1947 నుండి 1951 దాకా సాగిన 'మహాగాధ'ను కళ్ళకు కట్టినట్టు చెబుతుంటే ఆ జనంలోనే ఎదురుగా జానకమ్మ తన మూడు నెలల బాబును ఎత్తుకొని చూపిస్తున్నది.
'పల్లవి గెరిల్లా ముట్టడిలా అట్టాక్ చేసినట్టు వుండాలి. పల్లవిలో మొదటి వాక్యమే శ్రోతల దిమ్మదిరిగేలా వుండాలి. ఆ పాట ఇతివృత్తం ఏ రసానికి చెందిందో అందులోకి పాటలోని మొదటి వాక్యమే ఈడ్చుకు రావాలి. మనం వాడే ప్రతీకలు, ఉపమానాలు, ఉత్ప్రేక్షలు శ్రోతలను మన పాట ఆవరణలోకి తీసుకవచ్చి కట్టిపడేయాలి. అలాగే పాటలో మనం ఇచ్చే ముగింపు శ్రోతలను వెంటాడాలి. కొన్నిరోజులదాకా గుర్తుండేలా, ఎప్పటికీ గుర్తుకొచ్చేలా ఉండాలి.'
ఆబాబుకు ఏం అర్ధమైందోకానీ సుద్దాల హనుమంతు వైపు రెప్పవాల్చకుండా చూస్తూ పిక్కలు బిగదీసుకొని పిడికిళ్లు బిగించి ఉద్విగ్నంగా చూస్తున్నాడు. అది చూసి పక్కన కూర్చున్న అమ్మలక్కలు ముక్కున వేలేసుకుని 'వేలెడంతలేడు. ఎట్ల చూస్తుండు తండ్రి దిక్కు!' అన్నారట. ఆ మూన్నెళ్ల బాబును నేనే. ఎత్తుకున్నది మా అమ్మ జానకమ్మ. ఎదురుగా మా నాన్న ప్రజాకవి- ప్రజా కళాకారుడు సుద్దాల హనుమంతు. ఈ సంఘటన నాకు జ్ఞాపకం ఉండే అవకాశం లేదు కానీ మా అమ్మ, మా మేనమామ చెప్తుంటే ఎన్నోసార్లు విన్నాను. బహుశా అప్పుడే నాన్న భావోద్వేగం నాలోకి ప్రవహించిందా.. ఆయన రక్తమే నాలో ప్రవహిస్తుంటే అప్పుడు ఇప్పుడు అనేదేముంది. ఇంకా నాన్నలోని ఆ సృజనాత్మక ఉద్యమ రచనాశక్తి ఇంకిపోకుండా నాలో ప్రవహిస్తూనే వుంది. నాలుగేళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు మరో సంఘటన- మా ఇంట్లో గోడలకు అనేకమంది దేశనాయకుల, వీర తెలంగాణ నాయకుల పటాలుండేవి. ఎలావచ్చిందో ఒక పటంపైకి పాము వచ్చి తొంగి చూసిందట.

దాన్ని ఎలాగో చంపారు. చనిపోయిన పామును సరదాగా మా నాన్న నాకు చూపించాడు. అది ఇంకా పూర్తిగా చావలేదు, కదులుతూ వుంది. అంతే పరుగెత్తి మా అమ్మ ఒళ్లో దాక్కున్నాను. ఎంత భయపడ్డానంటే వెంటనే 103 డిగ్రీల జ్వరం వచ్చి కలవరింత మొదలైంది. ఏది చూసినా పామే అంటున్నాను. అప్పుడు మా నాన్న బట్ట పేలికతో ఒక పామును తయారు చేసి మళ్లీ నాకు చూపించి నా ముందే దానిపై కిరోసిన్ నూనె పోసి తగులపెట్టి బూడిద చేశాడు. అంతే నా జ్వరం తగ్గిపోయిందట. ఇది నాన్నతో నాకు తెలిసిన తొలి జ్ఞాపకం. నాకు 'అఆ'లు రాయడం చదవడం రాకన్న ముందే నన్ను ఒళ్లో కూచోపెట్టుకుని మంత్రపుష్పం నేర్పించినట్టు నాకు శ్రీశ్రీ మహాప్రస్థానం పద్యాలు మొత్తం నోటికి వచ్చేదాకా చెప్పడం నాకు బ్రహ్మాండంగా జ్ఞాపకం వుంది. మా నాన్న ఎత్తయిన మనిషి. నేను మా అమ్మలాగా పొట్టి. చిన్నప్పుడు మా నాన్నతో 'నాన్న నేను నీలాగ ఎత్తు ఎప్పుడవుతాను' అంటే 'మన ఇంట్లో పుస్తకాలన్ని చదివేస్తే నాకన్నా ఎత్తు అవుతావు పెద్ద పేరు తెచ్చుకుంటావు' అనేవాడు. నాన్న అంత ఎత్తు కాలేదు కానీ ఆ పుస్తకాలు నాన్న గ్రంథాలయంలోని పుస్తకాలు చదివాను. ఇంకెన్నో పుస్తకాలు చదవడం మాత్రం నాన్న మాటవల్లనే జరిగింది. సరె, ఎంత పేరు తెచ్చుకున్నాను అనేది వదిలేస్తే వచ్చిన పేరు ఈ మాత్రమైనా అది నాన్న, అమ్మ వల్లే అనుకుంటాను. నాలుగవ తరగతిలో నేనో పాట రాశాను.
ధగ ధగ మెరిసే జండా- వినవే పేదలగాధ- చల్లారదు ఆకలి బాధ- ఇంతే జ్ఞాపకం వుంది. ఈ పాట మా అమ్మకు వినిపించా. అమ్మ నాన్నకు చెప్పింది. నాన్న తన సహచరులైన గుర్రం యాదగిరిరెడ్డి, పడకంటి రామస్వామి, దూడ పుల్లయ్య, బత్తిని లక్ష్మీనర్సయ్య- వీళ్లందరిముందు నాతో ఆ పాట పాడించాడు. పాట కాగానే మా నాన్నతో పాటు అందరు కొట్టిన చప్పట్లు.. ఆ శబ్దం నేను ఇప్పటిదాకా మరిచిపోలేదు. అయితే ఈ పాట వినిపించిన తెల్లవారి ఒక విచిత్రం చేశాడు నాన్న. ఒక పెద్ద గిన్నె తెప్పించి ఒక చిన్న గ్లాసు ఇచ్చి ఈ గిన్నెను నీళ్లతో నింపమన్నాడు. నేను ఒక గ్లాసు నీళ్లు పోసి మళ్లీ నీళ్లకోసం వెళ్తుంటే వద్దు ఈ గ్లాసుతోనే ఒక్కసారికే గిన్నె నిండాలి అన్నాడు. అదెలా, వీలుకాదు అన్నాను. మరి ఈ గిన్నె నిండాలంటే ఎట్లా అన్నాడు. బోలెడన్ని నీళ్లు కావాలి అన్నాను. అప్పుడు నాన్న చాలా ప్రేమగా- మరి ఏ మాత్రం చదువుకోకుండా పాటలు రాస్తే జ్ఞానం సరిపోదుగా.

బాగా చదువుకొని పాటలు రాస్తే బాగుంటుంది అని నా పాట రాసేతనాన్ని పుస్తకాలు చదివే అలవాటుకు అద్భుతంగా మలిచి నా మేధస్సులోని గ్రంథాలయాల దండయాత్ర ప్రారంభించాడు. మా ఇంట్లో ఏ కొత్త పుస్తకం వచ్చినా సాయంకాలం అందర్ని కూచోపెట్టి ఒకరు చదివితే అందరూ వినేలా అలవాటు చేశాడు (ఈ పఠనాలలో పడకంటి రామస్వామి, యాదగిరిరెడ్డి వుంటుండేవాళ్లు). మా అమ్మ చదివేది. నేను చదివేది. ఎవరు చదివినా ఆ వాక్యాలలో అద్భుతవాక్యం రాగానే అందరూ ఆ వాక్యంలోని రసానుభూతి గురించి ఎంతో మెచ్చుకుంటూ విశ్లేషించేవారు. అది వినివిని చదివి చదివి ఇప్పటికీ ఒక్క రసాత్మక వాక్యం చదవగానే ఆ రచయితకు ఫోన్ చేయడం నాకు అలవాటయ్యింది.

ఇలా శరచ్చంద్ర, ఠాగూ ర్, చలం, శ్రీశ్రీ, జంధ్యాల పాపయ్యశాస్త్రి, నిన్నటి హేమలత, ముప్పాల రంగనాయకమ్మ, సి.నారాయణరెడ్డి.. ఒక్కరా ఇద్దరా.. కావ్యాలు, నవలలు, వ్యాసాలు చిన్ననాడే నన్ను తడిపి పునీతుణ్ని చేశాయి. మా ఊరికి ఏ పెద్దనాయకుడు, కళాకారుడు వచ్చినా మా ఇంట్లోనే భోజనం. అరుట్ల రామచంద్రారెడ్డి, రావి నారాయణరెడ్డి, ధర్మభిక్షం, హరికథ భాగవతార్‌లు ఎవరితోనైనా మా నాన్నతో మాటామంతి జరుగుతున్నప్పు డు నన్ను దగ్గర కూచోబెట్టుకునేవాడు. నాకు తెలియకుండానే ఆ మాటలలోని ఫిలాసఫీ, అలంకారాలు, కవి త్వం, తార్కికం ఇలా ప్రాక్టికల్‌గా తెలుపకనే తెలిసేలా చేశాడు నాన్న. ఏంచేస్తే నాన్న రుణం తీరుతుంది.. నాకు ఇంతవరకు ఎన్ని లక్షలమంది ముందయినా మాటాడినా, పాడినా స్టేజ్‌ఫియర్ తెలియదు. కారణం నాకు ఊహ తెలియకన్నా ముందునుండే వేలాదిమంది ప్రజలముందు పాడించడం. నాకైనా చెల్లి భారతి కైనా తమ్ముళ్లకైనా స్టేజ్‌ఫియర్ తెలియదు.

దానికి కారణం మానాన్నే. ఇంటర్‌లో నేనున్నప్పుడు వేశ్యపైన పాట, మా ఊరి శకుని అంటూ ఒక గేయ కవిత రాశాను. నాన్న గొప్పగా వున్నాయని ప్రోత్సహించాడు. ఒక్కో పాటపైన ఒక్కో అభిప్రాయంపైనా రోజులకు రోజులు చర్చించేవాళ్లం. కట్కూరి రామచంద్రారెడ్డి చనిపోయినపుడు పాట రాయాల్సివస్తే మా అశోక్ రాస్తాడు అన్నాడు మా నాన్న. నేను రాశాను. ఆ పాట సంస్మరణసభలో వినిపించగానే హనుమంతూ నీ కొడుకును నీ అంత రచయితను చేశావని నాయకులు ప్రజలు మెచ్చుకుంటే మా నాన్న ఆ విషయం మా అమ్మకు ఎంతో గొప్పగా చెప్పుకున్నాడు.

'పాట ఎలా రాయాలి' అనే చర్చ ఎన్నోసార్లు జరిగేది. మా నాన్న చర్చకు ఇచ్చిన ముక్తాయింపు ఇలా వుండేది- 'పల్లవి గెరిల్లా ముట్టడిలా అట్టాక్ చేసినట్టు వుండాలి. పల్లవిలో మొదటి వాక్యమే శ్రోతల దిమ్మదిరిగేలా వుండాలి. ఆ పాట ఇతివృత్తం ఏ రసానికి చెందిందో అందులోకి పాటలోని మొదటి వాక్యమే ఈడ్చుకు రావాలి. మనం వాడే ప్రతీకలు, ఉపమానాలు, ఉత్ప్రేక్షలు శ్రోతలను మన పాట ఆవరణలోకి తీసుకవచ్చి కట్టిపడేయాలి. అలాగే పాటలో మనం ఇచ్చే ముగింపు శ్రోతలను వెంటాడాలి. కొన్నిరోజులదాకా గుర్తుండేలా, ఎప్పటికీ గుర్తుకొచ్చేలా ఉండాలి.' నా గొప్ప పాటలన్ని నాన్న చెప్పినవిధంగా రాయబడ్డవే. పాట ఒక శతఘ్ని, వంద ఉపన్యాసాలకన్నా పాట బలమైంది అని పదేపదే చెప్పటంవల్లనే నేను పాటల రచయితను అయ్యానేమో.. 'మా భూమి' సినిమాలో నాన్న పాటను బి.నర్సింగరావు తీసుకున్నపుడు అది నాన్న పాట అని తెలియక అజ్ఞాత రచయిత అని సితార పత్రికలో వేశారు. అప్పుడు నేను ఆ పాట నాన్నదంటూ నర్సింగరావుకు ఒక లేఖ రాశాను. అతని నుండి నాకు జవాబు రాలేదు. నేను సుద్దాలకు వెళ్లి నాన్నకు చెప్పి మీ పేరు వచ్చేలా చేయాలి నాన్నా అన్నాను.
అపుడు మా నాన్న ఇలా అన్నారు- ఆ పాట నేను రాశానని నాకు తెలుసు. ప్రజలకు తెలుసు. తెలుగు సినిమాలో వెండితెరపై నా పేరు లేనంత మాత్రాన 'పాలబుగ్గల జీతగాడా!' పాట నాది కాకుండా పోతుందా? అన్నారు. చివరికి 'మా భూమి'లో నాన్న పేరు వేయడానికి మా అమ్మ ప్రోద్బలమే కారణం. మా నాన్నకో తీరని కోరిక- తన పాటలు అచ్చు రూపంలో చూసుకోవాలని నేను సంపాదనాపరుడినా.. అప్పటికింకా ఎదగకపోవడం వలన ఆ కోరిక తీరకుండానే చనిపోయారు. పాట రచించే సమయంలో ఆ పాట ఏ ట్యూనులో రాయబోతున్నారో ఆ బాణీని సదా కూని రాగంగా పాడుకునేవాడు. పాటలోని కథావస్తువే మనకు బాణీని ఇస్తుంది అనడం నాకు బాగా గుర్తు. ఇప్పటికీ సినిమాలలో ట్యూన్ ఇవ్వకుండా నేను పాట రాయవలసివస్తే ఆ పాటలోని విషయమే నాకు కూడా బాణీ అందిస్తుంది. ఇది నాన్న అలవాటే నా అలవాటుగా మారింది.

నాన్న 75 ఏళ్ల వయసప్పుడు సుద్దాలలో మావూరి కె.వి.రంగారావు అనే దొరను ఓడించి సర్పంచ్‌గా గెలిచాడు. ఆ తర్వాత నాన్నకు క్యాన్సర్ వచ్చింది. డా.హబీబుల్లా చూసి చేయిదాటిపోయింది అశోక్. ఇంకో రెన్నెళ్ల కన్నా ఎక్కువగా బతకడు అని చెప్పారు. సుద్దాలకు వచ్చేశాం. ఆ గడచిన రెండు నెలలు మా ఇంట్లో ఎవరికీ మరపు రావు. నేను మా నాన్నను సరదాగా ఇలా అనేవాణ్ణి- 'నేను చచ్చిపోయాక ఎలా బతుకుతావు నాన్నా' అని. మా నాన్న ఆ మాటకు 'నేననాల్సిన మాట నువ్వంటావేంట్రా' అంటూ నవ్వేవాడు. నాన్నకు క్యాన్సర్ వచ్చి మంచంపై పడుకున్నపుడు- అప్పటికీ నాన్న మరణం సమయం అందరికీ తెలుసు- ఆ రోజు మా నాన్న ఏదో ఇంజక్షన్ చేయించుకోవడం మరచిపోతే నేను- 'ఇలా అయితే ఎలా నాన్న! నేను చనిపోయాక ఎలా బతుకుతావు' అన్నాను. అందరు ఏడ్చారు. నేను, నాన్న కూడా. ఆ రోజుల్లోనే నాకో ఆలోచన వచ్చింది- ప్రపంచంలో ఎంత మహానుభావుడికైనా చనిపోయాక కదా స్మ­ృతి గీతం రాస్తారు.

మావో, గాంధీ, లెనిన్, శ్రీశ్రీ ఎవరైనా తన స్మ­ృతి గీతం తను వినరు కదా, నాన్న స్మ­ృతి గీతం రాసి నాన్నకే వినిపిస్తే అనిపించింది. తప్పో-ఒప్పో నాకు తెలియదు. నేను మా నాన్న కనుమూయక ముందే నాన్న స్మ­ృతి గీతం రాశాను. నాన్నకి ఏడుస్తూ వినిపించాను. పాట వినిపించడం పూర్తయింది. నాన్న తప్ప ఇంట్లో అందరం ఏడుస్తు న్నాం. మా నాన్న రెండు చేతులు చాపి నన్ను పిలిచాడు. కౌగిలించుకున్నాడు.తన భుజంపై నా దు:ఖ బాష్పాలు.. నా భుజంపై నాన్న ఆనందబాష్పాలు.. నా వీపు నిమిరిన నాన్న చేతుల స్పర్శ.. భుజంపై నాన్న ఆనందబాష్పాల తడి ఇప్పటికీ ఆరిపోలేదు.. ఎప్పటికీ ఆరిపోదు.. ఆ తర్వాత మా అమ్మతో అన్నాడట. నీ కొడుకు నన్ను మించిన రచయితై పేరు తెచ్చుకుంటాడని.

బహుశా ప్రపంచంలో ఇలాంటి అనుభవం పొందిన కొడుకును నేనే మొదటివాణ్ణేమో అనుకుంటాను. ఆ తర్వాత మా నాన్న జీవితాన్ని నేను రాసి మా నాన్న చేత చదివిస్తూ మా చిన్నమ్మ కూతురు పద్మజ ఇచ్చిన టేప్ రికార్డర్లో నిక్షిప్తం చేశాను. అలాగే జయధీర్ తిరుమలరావు నాన్నచేత పాటలు రికార్డు చేయించారు. వారు నాన్న ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో చేశారు. నేను నాన్న జీవితాన్ని చివరి మూడు రోజుల ముందు చేశాను. ఇంకో రెండు రోజులలో మా నాన్నకు మాట ఆగిపోయి మరణిస్తాడనగా నేను మందుల కోసం హైద్రాబాదుకు వెళ్లాల్సివుండి పొద్దున్న 4 గంటలకు లేచి బయలుదేరబోతున్నాను.
నాన్న అన్నారు- 'నాన్న.. జాగ్రత్త! ఇంక అన్నీ నీవే చూస్కోవాలి. అమ్మ, తమ్ముళ్లు, చెల్లి..'
'నేను మళ్లీ వస్తాను నానా' అన్నాను. నవ్వాడు నాన్న. 'జాగ్రత్త' అన్నాడు అదే నాన్న చివరిమాట.. ఆ 'జాగ్రత్త' అనే మాట నన్ను జాగ్రత్త పరుస్తూనే వుంది. అన్ని వేళల్లో.. అన్ని మలుపుల్లో..!
-సుద్దాల అశోక్ తేజ
ఇది సుద్దాల హనుమంతు శతజయంతి సంవత్సరం

No comments: