Monday, October 13, 2008

నేతన్నా ! ఆత్మహత్య చేసుకోకు..

మేము కవులము, రచయితలము, కళాకారులం. మీ బతుకు ఆయసా యాలను కథలుగా, కవితలుగా పాటలుగా రాసెటోళ్ళం. మీ కాళ్ళకు దండం పెట్టి వేడుకుంటున్నం. మీరస్సలే సావకుండ్రి. బతికి కొట్లాడుండ్రి. మీ యెంట మేమున్నం. మీ గుండె గాయాన్ని ఈ గల్లీ నుంచి ఢిల్లీ దాన్క కైగట్టి ఇనిపిస్తం. నిన్ను అగ్గిల బొర్లిత్తున్నోళ్ళను జెండ కెక్కిత్తం. కూడులేక గూడులేక పుట్టెడు పుల్లెందలతో గుడ్డనిస్తున్న నువ్వు పాణంతో ఉండి కొట్లాడాలె గాని, సచ్చి సాధించేదేముంటది. నువ్వు ఒక్కరోజు సత్తవు సరే. నీ భార్యాపిల్లలు బతికినంత కాలం సావాల్సిందేనా. వాళ్ళకు నువ్వు లేని లోటు ఎవరు తీరుస్తరే!

నేతన్నా! అప్పు ఇయ్యల్ల గాకుంటే రేపు తీరుతది. పోయిన పాణం రాదు గదా! నీ సాంచ మూతవడి ఇల్లు గడవకపోవడానికి ఓ కుట్ర ఉంది. ముందు దాన్ని కనిపెట్టు. తర్వాత దాన్ని బద్దలుగొట్టు. ప్రభుత్వం మీద పోరాడు. నీ హక్కులు సాధించుకో. నువ్వు ఒంటరివి గాదు. నువ్వు నేసిన బట్టగట్టుకొని మానం గాపాడుకున్నోళ్లం. నీ పాణం గాపాడుతం. నీ తల్లికి బాగలేదు. పెండ్లికచ్చిన పిల్లలున్నరు. నీ సంపాదన అందుతలేదు. పొందుతలేదు. నీకు గూడా చాతనైతలేదు. ఉండవోతె ఇల్లు లేదు. పండవోతె తావు లేదు. ఇన్ని సమస్యలున్నయని బతుకు మీద విరక్తి తెచ్చుకోకు. పిరికివాళ్లు కష్టాలకు భయపడి పారిపోతరు. అష్టకష్టాలల్ల పుట్టినోనివి నీకు భయమెందుకే. రేపటికి రూపం లేదు. అయిందానికి అల్లరలేదు.

నువ్వు బయటకు రా! నీ కష్టాలను చెప్పుకో. ఒక పని గాకుంటే ఇంకోపని. ఈ ఊరు గాకుంటే ఇంకో ఊరు. అంతేగని నవ్వేటోళ్ల ముందట జారిపడ్డట్టు సచ్చుడెందుకే.. బతికి నిలవడాలెగని! కట్టం తెలిసినోనివి. కట్టపడే గుణం ఉన్నోనివి. మిద్దెలు మేడలు అడుగుతలెవ్వు. కడుపుకు తిండి వెట్టుమంటున్నవు. కష్టం చేస్తనంటున్నవు. నీ వెనుక మేమున్నం. నీతో కలిసి పోరాడుతం.. బెంగటిల్లకు. గుండె చెదరకు. నువ్వు ఆగంగాకు. నిను గన్నోళ్ళను, నువ్వు గన్నోళ్ళను ఆగం చేయకు. నిలవడు. బతుకుతో కలెవడు

- తెలంగాణ రచయితల వేదిక (సిరిసిల్లలో నేతన్నల సంఘీభావర్యాలీలో విడుదల చేసిన కరపత్రం నుంచి)

No comments: