Tuesday, October 07, 2008

నేత కళాకారుడు


నేతగాడు ఊరుండీ పేరులేనివాడు

నేత కాలేనివాడు

ఉత్తి కూలిజీతగాడు

లోకం పోకడ తెలీని

మగ్గం గోతిలోని చిరుకప్ప

నిలువుగా అడ్డంగా కదిలే

ఆ కాళ్లూ చేతులూ క్రాంకుషాఫ్టులు

మగ్గంగోతిలో లయబద్దంగా

పావలపై కదిలే ఆ కాళ్లు

రంగస్థలిపై నటరాజ పదయుగళీ

చటుల ప్రవృత్త నర్తన లీక్షించే

మా కళ్లకు కానరావు

వాటికి నోరులేదు

ఘల్లుఘల్లు మని వాగడానికి

నేస్తున్నప్పుడు ఎగిరే అతడి పక్కలు

అమృతాపహరణ వేళ గరుత్మంతుని రెక్కలు

నాడి విసురుతున్నప్పుడు కదిలే చేతులు

నాట్య మోహినీ ముద్రాంకితాలు

తనువంతా నర్తిస్తూనే వుంటుంది

అతడి ప్రతి అంగ విన్యాసం

ఒక కొత్త సృష్టి

అతని చేతిలో

యంత్రాలు కాపీ కొట్టలేని కళా సృష్టి

అతడు నేత కళాకారుడు

ఇన్నాళ్ల మానవ చరిత్రలో

ఒక్క నేతగాడి పేరైనా వినిపించిందా?

ఒక్క కంచు పతకమైనా గెలిచిన రుజువుందా?

నంది కాదు గంగిరెద్దునైనా యిచ్చారా?

బట్టను ఉత్పత్తి చేసే ఉత్తి కార్మికుడిగానే చూశారు

అపురూపమైన డిజైన్ల

జరీ అంచుల చీరలు

ఎగ్జిబిషన్ స్టాల్సులో రెపరెపలాడుతూ..

ప్రక్కనే అతడు నిలబడ్డా

నేసిందెవరని ఒక్కరుగూడ అడగరు

ఏ వూరి నేతని అడుగుతారు అతడినే

ఊరుండీ పేరులేని చేనేత కార్మికుడా !

కుంచ పట్టుకున్నా

తైలవర్ణ చిత్రం కింద పేరు రాసుకోవచ్చు

ఆపాత మధురంగా పాడు- పేరు మోగుతుంది

కవిత్వం రాసినా

పుస్తకంమీద పేరైనా వుంటుంది

నేతగాడా! నువ్వు కళాకారుడివే

గొప్ప గొప్ప కళాకారులంతా

అనుభవించే దరిద్రం దుఃఖం

నువ్వూ అనుభవిస్తున్నావు !


-డా. అల్లంసెట్టి

No comments: