Monday, October 20, 2008

అసదుద్దీన్ ఏం కోరుకుంటున్నారు?







తెలంగాణ వాదం బలపడి, సమైక్యవాదులు సైతం జై తెలంగాణ అంటున్న తరుణంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్పని సరిగా మారుతున్నది. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలు రెండూ తెలంగాణకు అనుకూలంగా తీర్మానించడంతో ఏకాభిప్రాయం లేదనే సాకులకు కాలం చెల్లింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సంక్లిష్టమైన ప్రక్రియ అనే రాజశేఖరెడ్డి వాదన పస లేనిదిగా ఢిల్లీ పీఠం ముందు తేలిపోయింది. దీంతో తెలంగాణ ఏర్పాటులో జటిలత్వాన్ని కృత్రిమంగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం మతాన్ని వాడుకునే ప్రమాదకర ఎత్తుగడను ప్రయోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ నాటకంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పోషిస్తున్న కీలుబొమ్మ పాత్రకు తోడుగా అసదుద్దీన్ మతం ముసుగుతో చేరారు.



బ్రిటీష్ వారు తమ ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి మత విద్వేషాలను రగిల్చి వాడుకున్నారు. ఇప్పుడూ అదే విధానం అమలవుతున్నది. తెలంగాణ నుంచి హైదరాబాద్‌ను విడదీయాలని కుట్ర సాగుతున్నది. తెలంగాణ ప్రజల నుంచి హైదరాబాద్ ముస్లింలను వేరు చేసే దారుణానికి ఒడిగడుతున్నారు. అక్కడితో ఆగకుండా ముస్లింల నుంచి హైదరాబాద్ ముస్లింలను విడదీసి చూపించే ఘాతుకానికి తెరలేపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలది మత సంఘర్షణల సంస్క­ృతిగా చిత్రీకరించే ఎత్తుగడ సాగుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముస్లింల మనుగడకు ముప్పు ఏర్పడుతుందనే భయాన్ని వారి మనసు లో నాటుతున్నారు. నిజానికి తెలం గాణది ఇరుమతాల మధ్య మమతానుబంధాలు పెనవేసుకుపోయిన చరిత్ర. కట్టు, బట్ట, తిండి, తిప్పలు అన్నీ ఒకటి గా బతుకుతారు. ఇక్కడి వీధుల్లో ఉర్దూ, తెలుగు కలిసి చెమ్మచెక్క ఆడుకున్నాయి. అన్ని ఆరాట పోరాటాల్లోనూ కలిసే ఉన్నారు.






ఇవాళ తెలంగాణ ఉద్యమం గొప్పగా చాటుకుంటున్న తుర్రెబాజ్‌ఖాన్ వంటి వీరుల చరిత్ర ఇటీవలి వరకు అణచివేతకు గురైంది. తెలంగాణ రైతాంగ పోరాటంలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భూమి పోరులో అమరుడైన బందగీ, పత్రికా స్వేచ్ఛకు ప్రాణమిచ్చిన షోయెబుల్లాఖాన్, భావుకతను, తిరుగుబాటు తీవ్రతను మేళవించిన కవియోధుడు మఖ్దూం వంటి వారినందరినీ ఈ నేల సగర్వంగా స్మరించుకుంటున్నది. తెలంగాణ ప్రజలు ఉర్దూని తమ భాషగానే భావిస్తారు. ఒకనాడు తౌరక్యాంధ్రులంటూ తెలం గాణ తెలుగు, ముస్లింలను కించపరచినవారే నేడు వారిని మతం పేర విభజింప చూస్తున్నారు. తమ పాలనలోనే ముస్లింలకు రక్షణ అని పరోక్షంగా పలికిస్తున్నారు. కానీ తెలంగాణ నాయకుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసేందుకు సృష్టించిన మతకలహాల్లోనే లెక్కకు మించిన ముస్లింలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ కొట్లాటల్లోనే అపురూపమైన తెలంగాణ కవి గులాం యాసిన్ బలైపోయారు. తనకు తాను ముస్లింల ప్రతిని«ధిగా చెప్పుకునే అసదుద్దీన్‌కు తెలంగాణ ముస్లింల బతుకుల పట్ల పట్టింపు లేదు.

నదీజలాల్లో వాటా దక్కక వ్యవసాయం కూలిపోయి ఎందరో ముస్లిం రైతులు కూడా ఆత్మహత్యల పాలయ్యారు. ఊళ్లో పూటగడవక గల్ఫ్ ఎడారుల్లో ఎందరో ముస్లిం యువకులు మెతుకులేరుకుంటున్నారు. కవి గోరటి ఎంకన్న పాడినట్టు 'పరక చాపలకు గాలాలేసే తురకల పోరలు యాడికోయిరి, లారీలల్ల క్లీనర్లయ్యిర? పెట్రోలు మురికిల మురికయ్యిన్రా? తల్లీ- దూదు సేమియకు దూరమయ్యినారో సాయబుల పోరలు, ఆ బేకరి కేఫుల ఆకలి తీరిందో ఆ పట్టణాలలో!' అని తెలంగానం చేస్తున్న ఆక్రందనలు, తెలంగాణ ఉద్యమం వేస్తున్న ప్రశ్నలు అసదుద్దీన్ చెవికెక్కినట్టు లేదు. హైదరాబాద్ రాష్ట్రంలో 40 శాతానికి పైగా ముస్లిం ఉద్యోగులు ఉంటే సమైక్య రాష్ట్రంలో నాలుగు శాతానికి కూడా నోచుకున్నది లేదు.

జాతీయ సమగ్రతా మండలి వేదిక మీద సచార్ కమిటీ అమలు గురించో, అమాయక ముస్లింల మీద అనుమానంతో జరుగుతున్న అమానవీయ దాడుల గురించి అసదుద్దీన్ అడిగి ఉంటే అర్థవంతంగా ఉండేది. కానీ ఒకరి చేతిలో చిలుకగా మారి, వారి పలుకులు వినిపించడం సరికాదు. హైదరాబాద్‌తో పేగు సంబంధంలేని పాలకులు తమ రియల్ ఎస్టేట్ ఆస్తుల అడ్డాగా మాత్రమే ఈ నేలను చూస్తున్నారు. వక్ఫ్ ఆస్తులను వాటాలుగా పంచుకుంటున్నారు. నాటి అసఫ్ జాహీ రాజులు, మరుగునపడ్డ అజంతా ఎల్లోరా గుహలను పరరిక్షించి ప్రపంచం ముందుంచారు.

రామప్ప దేవాలయం శిథిలం కాకుండా చర్యలు తీసుకున్నారు. తస్కరించిన శిల్పాల్ని కూడా వెతికి తెప్పించి యథా స్థానం లో అతికించారు. ఆబిడ్స్‌లో చారిత్రక ప్రాధాన్యం కలిగిన, తాను చదువుకున్న చాదర్‌ఘాట్ స్కూల్‌ని కూలగొట్టడానికి ప్రయత్నిస్తే చెన్నారెడ్డి అడ్డుకున్నారు. కాని నేడు అభివృద్ధి పేరుతో హైదరాబాద్‌లోని అపురూప నిర్మాణాలను కూలగొట్టి షాపింగ్ కాంప్లెక్స్‌లు కట్టుకున్నారు. ఎటువంటి భావోద్వేగాలు లేని కులాతీత, మతాతీత, ప్రాంతాతీత దోపిడీ తత్వమే పాలకుల సమానత్వం. అసదుద్దీన్ ఈ సమానత్వాన్నే కోరుకుంటున్నారా?



- దేశపతి శ్రీనివాస్



సంగిశెట్టి శ్రీనివాస్

No comments: